భారతదేశంలోని బొగ్గు, లిగ్నైట్ వనరులు ఉన్న ప్రాంతాల్లో బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ- భూగర్భంలోని బొగ్గును సింథటిక్ గ్యాస్‌గా మార్చే ప్రక్రియ) విధాన కార్యాచరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. సంప్రదాయ మైనింగ్ పద్ధతుల్లో ఆర్థికంగా లాభదాయకం కాదనుకునే పరిస్థితుల్లో యూసీజీ పద్ధతి ద్వారా బొగ్గు, లిగ్నైట్ నుంచి ఇంధనాన్ని ఈ యూసీజీ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు.
ఆదాయం పంచుకోవటానికి వీలు కల్పిస్తున్న ప్రస్తుత సీబీఎమ్ (కోల్ బెడ్ మీథేన్) విధానం తరహాలోనే దాదాపుగా ఈ కొత్త విధానం కూడా ఉంటుంది. పోటీ బిడ్డింగ్ ద్వారానే గనులను కేటాయిస్తారు.
ఇంధన భద్రత కోసమని ఈ యూసీజీని చేపడుతున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ సారథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖల సభ్యులతో కూడిన కమిటీ గనులు, ప్రాంతాలను ఎంపిక చేస్తుంది. ఈ బ్లాకులను బిడ్డింగ్ కు పెట్టాలా లేక నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ లకు) ఇవ్వాలా అనేది కూడా ఈ కమిటీనే నిర్ణయిస్తుంది.
ఒప్పంద పత్రం తయారు చేయటానికి ఓ కన్సల్టెంట్ ను బొగ్గు మంత్రిత్వ శాఖ నియమించుకుంటుంది. బిడ్ పత్రాల రూపకల్పన, బిడ్డింగ్ నిర్వహణ, వాటి మూల్యాంకనం, ప్రాధాన్యతల పర్యవేక్షణ పనులకు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐ ఎల్) నోడల్ సంస్థగా పనిచేస్తుంది.
వచ్చే రెండేళ్ళ కోసం కొన్ని గనుల బ్లాకులను ఎంపిక చేస్తారు. తరువాత దీర్ఘకాలం కోసం మరికొన్నింటిని ఎంపిక చేస్తారు.