Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్లూమ్ బ‌ర్గ్ ఇండియా ఎక‌న‌మిక్ ఫోరం-2016 లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

బ్లూమ్ బ‌ర్గ్ ఇండియా ఎక‌న‌మిక్ ఫోరం-2016 లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం


మిస్ట‌ర్ మిక్లె త్వెయిట్‌,
అతిథులారా,
లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌.

భార‌త‌దేశంలో బ్లూమ్ బ‌ర్గ్ కార్య‌కలాపాల‌కు 20 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో ఈ రోజు నేను పాలు పంచుకొంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 20 ఏళ్లలోను బ్లూమ్ బ‌ర్గ్ భార‌త‌దేశ ఆర్థిరంగంపైన విజ్ఞాన‌దాయ‌క‌ వ్యాఖ్యానం, ప‌దునైన విశ్లేష‌ణలను అందించింది.

దేశ ఆర్ధిక‌ రంగంలో ఈ సంస్థ ఒక ముఖ్య‌మైన భాగంగా మారిపోయింది.

అంతే కాదు, మా స్మార్ట్ సిటీల కార్య‌క్ర‌మానికి కావ‌ల‌సిన ఆకృతి విష‌యంలో శ్రీ మైఖెల్ బ్లూమ్ బర్గ్ ఇచ్చిన అమూల్య‌మైన స‌ల‌హాకు నా ధన్యవాదాలు. ప్ర‌పంచంలోని గొప్ప న‌గ‌రాలలో ఒక నగరానికి మేయ‌ర్‌గా శ్రీ బ్లూమ్ బర్గ్ కు ఏదైనా నగరం ఎలా పేరు తెచ్చుకొంటుందో బాగా తెలుసు. ఈ విష‌యంలో ఆయ‌న ఆలోచ‌న‌లు మా స్మార్ట్ సిటీల కార్య‌క్ర‌మ డిజైన్ ను ప‌రిపుష్టం చేశాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వంద న‌గ‌రాల‌ను తీర్చిదిద్దాల‌ని మేం భావిస్తున్నాం. దేశంలో ప‌ట్టాణాభివృద్ధికి ఈ న‌గ‌రాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయ‌ని ఆశిస్తున్నాం.

ప్ర‌పంచ వృద్ధికి దోహదం చేయ‌డంలో భార‌త‌దేశ పాత్ర అధికంగా ఉండాల‌ని ప్ర‌పంచం ఆశిస్తోంది. ఈ స‌వాల్ ను భార‌త‌దేశం ఎలా ఎదుర్కోబోతున్న‌ద‌నే విష‌యంపైన నా ఆలోచ‌న‌లను నాకు ఉన్న కాల‌ ప‌రిమితిలో మీ ముందు ఉంచడానికి ప్ర‌యత్నిస్తాను.

నేను మూడు ప్ర‌ధాన అంశాల‌ను ప్రస్తావిస్తాను. వీటిలో మొద‌టిది .. భార‌త‌దేశ ఆర్థిక అభివృద్ధి. రెండోది.. ఈ అభివృద్ధికి కార‌ణ‌మై, దానిని సుస్థిరం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ప‌రిపాల‌న‌, విధాన సంస్క‌ర‌ణ‌ల్లో కొన్ని. మూడోది.. నేను ఎంతో ప్రాధాన్య‌త‌నిస్తున్న‌, ఆర్ధికాభివృద్ధి ల‌క్ష‌ణంగా ప‌రిగ‌ణించబ‌డే ఉద్యోగ క‌ల్ప‌న.

ప్ర‌పంచ ఆర్థిక రంగంలో ఉజ్జ్వల‌మైన భ‌విష్య‌త్‌ గ‌ల దేశాలలో ఒక దేశం భార‌త‌దేశమని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మాకు ద్ర‌వ్యోల్బ‌ణం త‌క్కువ‌గా ఉంది, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క‌రెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తక్కువగానే ఉంది, అంతే కాకుండా వృద్ధి రేటు అధికంగా ఉంది కూడా. మంచి విధానాల‌ ఫలితం ఇది. అంతే గాని ఏదో అదృష్ట‌వ‌శాత్తు సమకూరినది ఏమీ కాదు.

దీనిని గురించి నన్ను ఇక వివరించనివ్వండి..

• 2008 నుంచి 2008 మ‌ధ్య‌ ముడి చ‌మురు ధ‌ర‌లు వేగంగా ప‌త‌న‌మ‌య్యాయి. పీపా ధ‌ర 147 డాల‌ర్ల‌ నుంచి 50 డాల‌ర్ల కన్నా త‌క్కువ‌కు ప‌డిపోయింది. 2014నుంచి 2015 మ‌ధ్య‌ ప‌డిపోయిన ధ‌ర‌ల‌తో పోలిస్తే అప్ప‌టి ప‌త‌నం మ‌రింత ఎక్కువ‌. అయిన‌ప్ప‌టికీ 2009-10లో భార‌త‌దేశ ఆర్థిక లోటు, క‌రెంట్ అకౌంట్ లోటు, ద్ర‌వ్యోల్బ‌ణ రేటు…అన్నీ గ‌ణ‌నీయమైన రీతిలోనే అధ్వానంగా ఉన్నాయి. మంచి అధిక సంఖ్య స్థాయి నుంచి ఈ మూడూ ప‌త‌న‌మ‌య్యాయి. కానీ 2015-16లో ఈ మూడూ త‌క్కువ స్థాయి నుంచి పుంజుకున్నాయి.

• ప్ర‌పంచంలో అభివృద్ధి చెందుతున్న‌ ప‌లు ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లు చ‌మురు దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డి ఉన్నాయి. ఆర్ధిక వ్య‌వ‌స్థ విజ‌యానికి చ‌మురు ధ‌ర‌లే కార‌ణ‌మ‌ని భావిస్తే ఆయా దేశాల ఫ‌లితాలు ఒకే విధంగా ఉండాలి. కానీ అవి అలా లేవు.

• ప్ర‌పంచ వాణిజ్యం లేదా ఆయా వృద్ధి రేట్లు మాకు క‌లిసి రావడం లేదు. ప్ర‌స్తుతం అవి రెండూ త‌క్కువ‌గానే ఉన్నాయి. అయినా వాటి వ‌ల్ల మా ఎగుమ‌తుల రంగానికి ల‌బ్ధి చేకూర‌డం లేదు.

• రుతుప‌వ‌నాలు, వాతావ‌ర‌ణం మాకు క‌లిసి రావ‌డం లేదు. 2015, 2014.. ఈ రెండు సంవ‌త్స‌రాలు క‌ర‌వు సంవ‌త్స‌రాలే. అంతే కాదు అకాల వ‌డ‌గ‌ళ్ల వ‌ర్షాల కార‌ణంగా క‌ర‌వు క‌ష్టాలు మ‌రింత అధిక‌మ‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ 2009-10 క‌ర‌వు సంవ‌త్స‌రంతో పోలిస్తే ఆహార‌ధాన్యాల ఉత్ప‌త్తి అత్య‌ధిక స్థాయిలో ఉంది. ద్ర‌వ్యోల్బ‌ణం త‌క్కువ‌గా ఉంది.

ప్ర‌పంచం వృద్ధి ప‌ట్టిక‌ల్లో భార‌త‌దేశంలో అగ్ర‌భాగాన నిల‌వ‌డ‌మ‌నేది ఒక అసాధార‌ణ‌మైన ప‌రిస్థితి. స‌హ‌జంగానే దీన్ని కొంద‌రు జీర్ణించుకోలేదు. ఈ విజ‌యాన్ని త‌క్కువ చేసి చూప‌డానికి త‌మ చేత‌నైన క‌ల్ప‌న‌ల‌తో ప్ర‌య‌త్నిస్తుంటారు. నిజం చెప్పాలంటే, భార‌త‌దేశ ఆర్థికరంగ విజ‌యానికి కార‌ణం ఎంతో క‌ష్ట‌ప‌డ్డంద్వారా ఈ రంగంలో మాకు స‌మ‌కూరిన జ్ఞానం. ప‌టిష్ట‌మైన విధానం, మ‌రింత ప‌టిష్టంగా దాన్ని నిర్వ‌హించ‌డం కార‌ణంగానే ఇది సంభ‌వించింది. మేం అనుసరించిన కొన్ని విధానాల గురించి త‌ర్వాత విశ‌దీక‌రిస్తాను. ఇప్పుడు మాత్రం న‌న్ను ఒక‌టి ప్ర‌త్యేకంగా చెప్ప‌నీయండి. అదే ద్ర‌వ్య నియంత్ర‌ణ‌. గ‌డిచిన రెండు ఆర్ధిక సంవ‌త్స‌రాల‌లో మేము చ‌క్క‌టి ఆర్ధిక ల‌క్ష్యాల‌ను అందుకున్నాం. లోటును త‌గ్గించుకుంటూ మ‌రో వైపు పెట్టుబ‌డి వ్య‌యాన్ని పెంచుకుంటూ వ‌చ్చాం. ప‌న్నుల్లో కేంద్రం వాటాను గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా భారీగా త‌గ్గిస్తూ 14వ ఫైనాన్స్ క‌మిష‌న్ చెప్పిన‌ప్ప‌టికీ లోటును త‌గ్గించ‌గ‌లిగాం. 2016-17కుగాను జిడిపిలో ఆర్థిక లోటును జి డి పి లో 3.5 శాతం ఉండేలా ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. గ‌త 40 సంవ‌త్స‌రాల‌లో చూసిన‌ప్పుడు ఈ ల‌క్ష్యం రెండ‌వ అతి త‌క్కువ స్థాయిది కాగ‌ల‌దు.

ప్ర‌పంచంలోని ప్ర‌ధాన‌మైన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌ను తీసుకున్న‌ప్పుడు భార‌త దేశ వృద్ధి రేటు అత్య‌ధికంగా ఉంది. ఇది చూసి కొంత‌మంది ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. భార‌త‌దేశ వృద్ధి రేటు స‌రైన‌ది కాద‌ని అనుకుంటున్నారు. వారి సందేహాల‌ను నివృత్తి చేయ‌డానికిగాను నేను కొన్ని నిజాల‌ను పేర్కొన‌ద‌లిచాను.

మొద‌ట రుణాల సంగ‌తి చూద్దాం. 2015 సెప్టెంబ‌ర్ త‌ర్వాత దేశంలో రుణ వృద్ధి జోరందుకుంది. 2015 ఫ్రిబ‌వ‌రి, 2016 ఫిబ్ర‌వ‌రికి మ‌ధ్య‌ రుణాల వృద్ధి 11.5 శాతం చొప్పున పెరిగింది. కార్పొరేట్ రంగానికి నిధుల ల‌భ్య‌త పెరిగింది. ఈక్విటీలు, దేశీయంగాను, మధ్య రుణాల విదేశీయంగాను తీసుకున్న ప‌లు ర‌కాల రుణాల ద్వారాను నిధుల ప్ర‌వాహం పెరిగింది. ఈ పెరుగుద‌ల 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలోని మొద‌టి మూడు త్రైమాసికాల్లో 30 శాతం.

క్రెడిట్ రేటింగుల‌పైన కొన్ని ప్ర‌ధాన‌మైన సంఖ్య‌లను మీ దృష్టికి తీసుకొస్తాను. 2013, 2014 సంవ‌త్స‌రాల‌లో క్రెడిట్ రేటింగులు ఎక్కువ‌గా ఉన్న సంస్థ‌ల‌కంటే త‌గ్గిపోయిన కంపెనీలు ఎక్కువ‌గా ఉండేవి. అయితే ఆ ప‌రిస్థితి నేడు నిర్ణ‌యాత్మ‌కంగా మారిపోయింది. పెరుగుతున్న‌వి పెరుగుతున్నాయి..త‌గ్గిపోతున్న‌వి త‌గ్గిపోతున్నాయి. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో క్రెడిట్ రేటింగు త‌గ్గిపోతున్న ప్ర‌తి ఒక కంపెనీకిగాను రెండింటికంటే ఎక్కువ కంపెనీలు రేటింగును పెంచుకున్నాయి. ఇది ఈ మ‌ధ్య‌కాలంలో ఉత్త‌మ‌మైన స్థాయి.

త‌క్కువ స్థాయిల్లో రుణాలు క‌లిగిన కంపెనీల ప‌రిస్థితి మ‌రింత మెరుగైంది. డౌన్‌గ్రేడ్స్‌కు, అప్‌గ్రేడ్స్‌కు మ‌ధ్య‌ తేడా భారీగా ఉంది. త‌క్కువ లెవ‌రేజ్‌తో ఉన్న పెద్ద కంపెనీల విష‌యంలో వాటి డౌన్‌గ్రేడ్స్‌కంటే అప్‌గ్రేడ్స్ 6.8 రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగే మ‌ధ్య‌త‌ర‌హా కంపెనీల విష‌యంలో ఈ నిష్ప‌త్తి 3.9, చిన్న త‌ర‌హా కంపెనీల విష‌యంలో ఇది 6.3. ఈ సంఖ్య‌ల‌న్నీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యేకంగా ఊపునిచ్చే ప‌టిష్ట‌మైన‌ సంఖ్య‌లే.

డౌన్‌గ్రేడ్ల‌లో పెరుగుద‌ల క‌నిపిస్తున్న విభాగం ఒకే ఒక‌టి ఉంది…అది అత్య‌ధిక లెవ‌రేజ్ క‌లిగిన కంపెనీలకు సంబంధించిన డౌన్‌గ్రేడ్లు. బ్యాంకు రుణాల ఎగ‌వేత‌దార్ల‌నుంచి వారు చెల్లించాల్సిన మొత్తాల‌ను వ‌సూలు చేయ‌డానికి ప్ర‌భుత్వం, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. బ‌హుశా ఈ విభాగంనుంచి వినిపిస్తున్న లుక‌లుక‌లు మీడియా భావ‌న‌ల్ని ప్ర‌భావితం చేస్తున్నాయి.

ఇక రుణాల‌నుంచి పెట్టుబ‌డుల‌ వైపు వెళ‌దాం. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను మూడో త్రైమాసికంలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల మొత్తం ఎన్న‌డూ లేనివిధంగా పెరిగింది. నేను గ‌మ‌నించిందేమిటంటే కొన్ని ప్రాముఖ్య‌త‌గ‌ల రంగాల‌లో అనూహ్య‌మైన పెరుగుద‌ల ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 2014 అక్టోబ‌ర్ నుంచి 2015 సెప్టెంబ‌ర్ వరకు స‌మ‌యాన్ని తీసుకుంటే ఈ మ‌ధ్య‌కాలంలో ఎరువుల రంగంలో ఎఫ్‌డిఐ మొత్తం 224 మిలియ‌న్ డాల‌ర్లు. ఇదే విష‌యంలో 2013 అక్టోబ‌ర్ నుంచి 2014 సెప్టెంబ‌ర్ మధ్య కాలాన్ని తీసుకుంటే ఎఫ్‌డిఐ మొత్తం విలువ‌ కేవలం 1 మిలియ‌న్ డాల‌ర్లు ఉంది. పై రెండు కాలాల‌కుగాను చ‌క్కెర రంగాన్ని తీసుకుంటే 125 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు వ‌స్తే అంత‌కు మందు సంవ‌త్స‌రానికిగాను 4 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే వ‌చ్చాయి. వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల త‌యారీ రంగాన్ని తీసుకుంటే 57 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి…అంత‌కు ముందు సంవ‌త్స‌రంలో వ‌చ్చిన పెట్టుబ‌డుల మొత్తం 28 మిలియ‌న్ డాల‌ర్ల‌తో పోలిస్తే వ్య‌వ‌సాయ ప‌రికాల త‌యారీ రంగంలో పెట్టుబ‌డులు రెట్టింప‌య్యాయి. భార‌తీయ గ్రామీణ ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌తో ద‌గ్గ‌ర సంబంధంగ‌ల రంగాలు ఇవి. ఈ రంగాల్లోకి విదేశీ పెట్టుబ‌డులు రావ‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

ఈ ఆర్థిక‌ సంవ‌త్స‌రంలో సెప్టెంబ‌ర్ 2015 నాటికి నిర్మాణ‌రంగంలో ఎఫ్‌డిఐ 316 శాతం వృద్ధిని చూపుతోంది. కంప్యూట‌ర్ సాప్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ రంగంలో 285 శాతం వృద్ది న‌మోద‌యింది. ఆటోమొబైల్ రంగంలో ఎఫ్‌డిఐ 71 శాతం వృద్దిని చూపుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ అనే మా విధానం ఉపాధి క‌ల్ప‌న రంగంపైన ప్ర‌భావం చూపుతోంద‌డానికి ఇది ప్ర‌బ‌ల‌మైన నిద‌ర్శ‌నం.

ఎగుమ‌తుల విష‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణం అంత బాగా లేదు. దాంతో త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల ఉత్ప‌త్తులు కిందా మీదా అవుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ త‌యారీ రంగంలోని ప‌లు ఉప రంగాలు త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి చెందుతున్నాయి. మోటార్ వాహ‌నాల ఉత్ప‌త్తి 7.6 శాతం వృద్ది చెందింది. అంటే అది వినియోగ‌దారుల్లో కొన‌గ‌లిగే సామ‌ర్థ్యానికి, ఆర్ధిక‌ రంగ కార్యకలాపాలకు నిద‌ర్శ‌నంగా ఉంద‌న్న‌మాట‌. దుస్తుల త‌యారీరంగం ఉపాధి క‌ల్ప‌న‌కు అధికంగా ఆస్కార‌మున్న రంగం. ఈ రంగంలో 8.7 శాతం వృద్ధి న‌మోదైంది. ఫ‌ర్నిచ‌ర్ త‌యారీలోను 57 శాతం వృద్ధి న‌మోదైంది. ఫ్లాట్లు, ఇళ్ల అమ్మ‌కాల్లో పెరుగుద‌ల నమోదైనట్లు ఇది సూచిస్తోంది.

ఒక‌సారి భ‌విష్య‌త్‌వైపు చూద్దాం..ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ‌రంగం ప‌రిస్థితి చూద్దాం. గ‌తంలో ప్ర‌భుత్వాలు వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టేవి. రైతుల ఆదాయాల గురించి ప‌ట్టింపు ఉండేది కాదు. 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు కావాల‌నే ల‌క్ష్యాన్ని నేను నిర్దేశించాను. దీన్ని ఒక స‌వాల్ గా తీసుకుందామ‌ని నేను చెప్పాను….కానీ ఇది కేవ‌లం స‌వాల్ మాత్ర‌మే కాదు. చ‌క్క‌టి వ్యూహంతో చ‌క్క‌టి రూప‌క‌ల్ప‌న క‌లిగిన ప‌థ‌కాల‌తో త‌గిన‌న్ని వ‌న‌రుల సాయంతో, అమ‌లు చేయ‌డంలో ప‌రిప‌క్వ‌మైన పాల‌న ఆధారంగా ఈ స‌వాల్‌ను అధిగ‌మిస్తాం. భార‌త‌దేశంలో జ‌నాభాలో అత్య‌ధికులు వ్య‌వ‌సాయంమీద‌నే ఆధార‌ప‌డ‌తారు కాబ‌ట్టి, రైతుల ఆదాయాలు రెట్టింపయితే అది ఆర్థిక‌రంగంలోని ఇత‌ర విభాగాల‌కు కూడా ల‌బ్ధిని చేకూరుస్తుంది.

మా వ్యూహం ఎలా ఉంటుందో ఇప్పుడు విశ‌దీక‌రిస్తాను.

• మొద‌ట మేం నీటి పారుద‌ల రంగంపైన దృష్టిని పెట్టాం. ఇందుకుగాను బ‌డ్జెట్లో నిధుల కేటాయింపులు భారీగా పెంచాం. ఇక్క‌డ మేం స‌మ‌గ్ర‌మైన దృక్ప‌థంతో ముందుకు పోతున్నాం. నీటి సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను, సాగునీటి రంగాన్ని విడివిడిగా చూడ‌డ‌డం లేదు. మా ల‌క్ష్యం ఒక‌టే ప్ర‌తి బిందువు నీటితో అధిక పంట‌.

• రెండ‌వ‌ది నాణ్య‌త‌గ‌ల విత్త‌నాల‌ను రైతుల‌కు అంద‌జేయ‌డంపైన దృష్టిపెట్టాం. అలాగే పోషకాల అంద‌జేత కూడా. వ్య‌వ‌సాయ భూముల ఆరోగ్యాన్ని తెలిపే మ‌ట్టి ప‌రీక్ష‌ల కార్డుల‌ను రైతుల‌కు అంద‌జేస్తున్నాం. దీనివ‌ల్ల ఏ పొలానికి ఎంత మోతాదులో ఎరువులు అందించాల‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. త‌ద్వారా ఉత్ప‌త్తి వ్య‌యం త‌గ్గిపోయి నిక‌ర ఆదాయం పెరుగుతుంది.

• ఇక మూడో అంశం రైతులు పండించే పంట‌లో ఎక్కువ భాగం వినియోగ‌దారుని చేర‌క‌ముందే పాడ‌యిపోతోంది. తొంద‌ర‌గా పాడ‌యిపోయే పంట‌ల విష‌యానికి వ‌స్తే ర‌వాణాలోనే ఎక్కువ న‌ష్టం జ‌రుగుతోంది. చాలా కాలం నిల్వ వుండ‌గ‌లిగే పంట‌ల విష‌యంలో ఈ న‌ష్ట‌మ‌నేది స్టోరేజీ ద‌గ్గ‌ర జ‌రుగుతోంది. పంట చేతికి వ‌చ్చిన త‌ర్వాత సంభ‌విస్తున్న న‌ష్టాల‌ను త‌గ్గించ‌డానికిగాను గిడ్డంగుల రంగంలో ఎక్కువ పెట్టుబ‌డుల‌ను పెడుతున్నాం. వ్య‌వ‌సాయ‌రంగ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కుగాను బ‌డ్జెట్లో నిధుల్ని గ‌ణ‌నీయంగా పెంచాం.

• ఇక నాలుగోది ఆహార త‌యారీ రంగంలో అద‌న‌పు విలువకోసం మేం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాం. దీనికి ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే ఈ మ‌ధ్య‌ నేను కోకకోలా కంపెనీకి ఫోన్ చేసి వారు త‌యారు చేసి శీత‌ల పానీయాల్లో కొన్నింటిలో పండ్ల రసం క‌లప‌మ‌ని కోర‌గానే వారు ఒప్పుకున్నారు.

• ఇక ఐద‌వ‌ది మేం జాతీయ వ్య‌వ‌సాయ మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నాం. త‌ద్వారా మార్కెట్ రంగంలోని అడ్డంకులు తొల‌గుతాయి. దేశంలోని 585 నియంత్రిత హోల్ సేల్ మార్కెట్ల‌న్నిటిలో ఉమ్మ‌డిగా ఒకే ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంటుంది. దీని ద్వారా పంట‌ద్వారా వ‌చ్చే ఆదాయంలో అత్య‌ధిక భాగం రైతుల‌కు ద‌క్కుతుంది. ద‌ళారుల‌కు నామ‌మాత్రంగానే చేరుతుంది. దేశీయ ఆహార ఉత్ప‌త్తుల మార్కెటింగ్ రంగంలోకి ఎఫ్‌డిఐల‌ను అనుమ‌తించ‌డం వెనుక ఉన్న ల‌క్ష్యం కూడా కచ్చితంగా ఇదే.

• ఇక ఆరోది మేం ఈ మ‌ధ్య‌నే ‘ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ ను ప్ర‌వేశ‌పెట్టాం. దీనికి ద్వారా దేశ‌వ్యాప్తంగా రైతుల‌కు ప్ర‌యోజ‌నం జ‌రుగుతుంది. వారి పంట‌ల‌కు స‌మ‌గ్ర‌మైన పంట‌ల బీమా వ‌ర్తిస్తుంది. ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా పంట‌ల్ని న‌ష్ట‌పోయే రైతుల‌కు వెంట‌నే ల‌బ్ధి చేకూరుతుంది. అది కూడా త‌క్కువ ఖ‌ర్చుతోనే. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ రైతుల ఆదాయాలు ఎటూ పోవ‌నే భ‌రోసా వారికి ల‌భిస్తుంది.

• ఇక ఏడోది వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌నుంచి రైతుల‌కు ఆదాయాలు పెంచ‌డంపైన దృష్టి పెట్ట‌డం. కోళ్ల పెంప‌కం, తేనెటీగ‌ల పెంప‌కం, వ్య‌వ‌సాయ కుంటల ఏర్పాటు, మ‌త్స్య ప‌రిశ్ర‌మల‌ద్వారా రైతుల ల‌బ్ధి పొంద‌డానికి కృషి చేస్తున్నాం. రైతులు త‌మ పొలాల్లో బీడుగా ఉంచిన ప్రాంతాల‌ను గుర్తించి, ముఖ్యంగా పొలాల‌కు పొలాల‌కు మ‌ధ్య‌ ఉండే వెడ‌ల్పాంటిగ‌ట్ల‌పైన చెట్ల‌ను పెంచుకోవాలంటూ ప్రోత్స‌హిస్తున్నాం. అంతే కాదు సౌర విద్యుత్ ప‌రిక‌రాల‌ను ఇలాంటి బీడు ప్రాంత‌ల్లో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నాం.

• ఉత్ప‌త్తిలో అభివృద్ధి సాధించాలి, ఇన్‌పుట్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవాలి, పంట‌ల కోత అనంత‌రం న‌ష్టాల‌ను త‌గ్గించుకోవాలి, అత్య‌ధిక అద‌న‌పు విలువ‌, మార్కెట్‌లో మంచి రేటు ల‌భించేలా చూడాలి, అనుబంధ రంగాల‌ద్వారా ఆదాయాలు…మొద‌లైన ఇలాంటి చ‌ర్య‌ల క‌ల‌యిక‌తో వ్య‌వ‌సాయ‌రంగంలో ప్ర‌గ‌తి సాధించి రైతుల ఆదాయాల‌ను రెట్టింపు చేయ‌వ‌చ్చ‌నే విశ్వాసం నాకు ఉంది.

భార‌తీయ వ్య‌వ‌సాయ‌రంగ మార్గ‌ద‌ర్శి ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ఎం.ఎస్. స్వామినాథన్ కూడా ఈ విషయంలో మాతో ఏకీభ‌వించ‌డం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రైతును కేంద్రంగా తీసుకొని కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టినందుకుగాను ఆయ‌న మ‌మ్మ‌ల్ని అభినందిస్తూ ఉత్త‌రం రాశారు. వ్య‌వ‌సాయరంగానికి ఆదాయ దిశ‌ను చూప‌డాన్ని ఆయ‌న స్వాగ‌తించారు. ఆయ‌న చెప్ప‌నిదాన్ని ఇక్క‌డ‌నేను ఆయ‌న మాట‌ల్లో మీకు చెబుతాను. ఆయ‌న ఏమ‌న్నారంటే…

“మొత్తం మీద చూసిన‌ప్పుడు బ‌డ్జెట్టులో వ‌న‌రుల ప‌రిమితుల‌ను దృష్టిలోపెట్టుకోవాల‌ని సూచిస్తూనే రైతుల‌కు మేలు చేసే విధంగా బ‌డ్జెట్టును రూపొందించారు. వ్య‌వ‌సాయ‌రంగంలో మార్పుకోసం మీరు విత్త‌నాలు వేశారు..త‌ద్వారా ఈ రంగంలోకి యువ‌త‌ను ఆక‌ర్షించ‌డ‌మే కాకుండా వారు ఇక్క‌డే సుస్థిరంగా ఉండేలా చూస్తున్నారు. సేద్య‌ రంగంలో నూత‌న ఉషోద‌యానికి ఎంతో కాలం ప‌ట్ట‌దు.”

భార‌త‌దేశ వృద్ధికి భ‌రోసాగా నిలిచే కొన్ని ప‌థ‌కాల‌ను, విధానాల గురించి ఇప్పుడు వివ‌రిస్తాను. ఇదివ‌ర‌కు నేను చెప్పిన‌ట్టుగానే నా ల‌క్ష్యం ఒక‌టే. మార‌డానికిగాను సంస్క‌ర‌ణ చేపట్ట‌డ‌మే నా ల‌క్ష్యం. సంస్క‌ర‌ణ అంతిమ ల‌క్ష్యం సాధార‌ణ ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తేవ‌డ‌మే. మేం చేప‌ట్టిన ప‌రిపాల‌నా ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల గురించి వాటి నిర్వ‌హ‌ణ‌కోసం చేస్తున్న‌కృషి గురించి వివ‌రిస్తాను.

భార‌త‌దేశంలాంటి దేశాల్లో వ‌న‌రులు ప‌రిమితంగా ఉంటాయి. స‌మ‌స్య‌లు మాత్రం అప‌రిమితం. వ‌న‌రుల‌ను చ‌క్క‌గా వినియోగించుకోవాలంటే తెలివైన వ్యూహం కావాలి. అంతే కాదు దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌గ‌లగాలి. కేవ‌లం విధానాల ప్ర‌క‌ట‌న‌ల‌తోను, విధానాల‌పేరుతో మొక్కుబ‌డిగా పిలుచుకునేలాంటి వాటి ప్ర‌క‌ట‌న‌ల‌తోను మ‌నం సాధించేంది ఏమీ ఉండ‌దు. సంస్క‌రణ‌కు గురైన విధానాల‌కంటే వాటి నిర్వ‌హ‌ణలో వ‌చ్చిన మార్పే మ‌న‌కు ముఖ్యం కావాలి. ఈ విష‌యంలో ఒక ఉదాహ‌ర‌ణ చెబుతాను. జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం 2013లో అమ‌లులోకి వ‌చ్చింది. అయితే అది చాలా రాష్ట్రాల్లో అమ‌లు అయ్యేది కాదు. మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తీసుకుంటే, ఇందులో చేస్తున్న వ్య‌యంలో ఎక్కువ భాగం ద‌ళారుల‌కు, పేద‌రికంతో సంబంధం లేనివాళ్ల‌కు చేరుతుండేది. చేసిన వ్య‌యం మాత్రం పుస్త‌కాల్లో న‌మోదవుతుండేది.

మేం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆహార‌భ‌ద్ర‌త చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్నాం. ఉపాధి హామీ ప‌థ‌కంలోని లీకేజీల‌ను చాలావ‌ర‌కు అరిక‌ట్ట‌గ‌లిగాం. ఇందుకోసం కేటాయించిన నిధులు ఎవ‌రికి ఉద్దేశించిన‌వో, వారికి చేర‌డానికి చ‌ర్య‌లు చేప్ట‌టాం. ఎక్కువ‌కాలం మ‌న్నిక ఉండే ఆస్తుల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ప్రాధాన్య‌తనిస్తున్నాం..త‌ద్వారా సామాన్య‌ప్ర‌జ‌లు ల‌బ్ది పొందుతారు. ద‌ళారుల పాత్ర త‌గ్గుతుంది. ఆర్థిక‌సేవ‌ల్ని అంద‌రికీ క‌ల్పించాలంటూ వాటి స‌ద్గుణాల గురించి ప‌దే ప‌దే మాట్లాడ‌టం కాకుండా మేం అమ‌లు చేసి చూపించాం..200 మిలియ‌న్ కు పైగా మందిని బ్యాంకింగ్ రంగం ప‌రిధిలోకి కొత్త‌గా తీసుకురాగ‌లిగాం.

ప‌థ‌కాల అమ‌లులో మేం సాధించిన రికార్డు, ముఖ్యంగా అవినీతిని త‌గ్గించ‌డానికి మేం చేసిన కృషి అంద‌రికీ అవ‌గాహ‌న అయి ఉంటుంది. కాబ‌ట్టి నేను క్లుప్తంగా మాట్లాడ‌తాను. బొగ్గు, ఖ‌నిజాలు, స్పెక్ట్రమ్ వేలాలు పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగాయి..ప్ర‌భుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వ‌చ్చింది. నిర్వ‌హ‌ణా ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంవ‌ల్ల విద్యుత్ కొర‌త‌ను లేకుండా చేసుకోగ‌లిగాం. ప్ర‌తి రోజూ నిర్మించగ‌లిగే ప్ర‌ధాన ర‌హ‌దారి నిర్మాణ విష‌యంలోను రికార్డు నెల‌కొల్పాం. అలాగే నౌకాశ్ర‌యాల వినియోగంలోను రికార్డు సృష్టించాం. వివిధ రంగాల్లో అనేక కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టాం. వార‌స‌త్వ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాం. ఆగిపోయిన ప్రాజెక్టుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. చాలా కాలంగా మూత‌ప‌డిన ద‌భోల్ విద్యుత్ కేంద్రాన్ని ఇప్పుడు ప‌ని చేయించ‌గ‌లుగుతున్నాం. అంద‌రం క‌లిసి ఐక‌మ‌త్యంగా కృషి చేయ‌డంద్వారానే ఇది సాధ్య‌మైంది. ఇప్పుడా కేంద్రంలో విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. ఎంతోమంది ఉద్యోగాలు నిల‌బ‌డ‌గ‌లిగాయి. బ్యాంకుల‌తో రుణాల స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయి. ఇక ఇప్పుడు విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల గురించి చూద్దాం. మా ప్ర‌భుత్వం పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టినుంచీ చెబుతూనే ఉన్నాను ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నిలకడగా ఉంచుతామంటూ. ఈ ప‌నిని చేయ‌డానికి మేం తీసుకున్న చ‌ర్య‌లే కార‌ణం. ద్ర‌వ్య విధానాన్ని ప‌టిష్టంగా ఉంచ‌డానికి సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌ల‌వ‌ల్ల కూడా ఇది కొంత‌మేర‌కు సాధ్య‌మైంది. గ‌తం సంవ‌త్స‌రం మేం రిజ‌ర్వ్ బ్యాంకుతో మానిట‌రీ ఫ్రేమ్‌వ‌ర్క్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం.

రిజ‌ర్వ్ బ్యాంకు చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేయ‌డానికి వీలుగా ఈ సంవ‌త్స‌రం మేం ఫైనాన్స్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టాం. ఈ సవ‌ర‌ణ‌ల ప్ర‌కారం ఆర్‌బిఐకి ద్ర‌వ్యోల్బ‌ణ ల‌క్ష్యం ఉంటుంది. మానిట‌రీ పాల‌సీ క‌మిటీద్వారా అది మానిట‌రీ పాల‌సీని ఏర్పాటు చేసుకుంటుంది. ప్ర‌భుత్వంవైపునుంచీ ఎవ‌రూ ఈ క‌మిటీలో స‌భ్యులుగా ఉండ‌రు. ఈ సంస్క‌ర‌ణ ద్వారా మానిట‌రీ పాల‌సీ ప‌రిధిలోకి ద్ర‌వ్యోల్బ‌ణ ప్రాధాన్య‌తకు చోటు ద‌క్కుతుంది. అంతే కాదు ఆర్‌బిఐలో సంస్థాగ‌త‌మైన స్వ‌యంప్ర‌తిప‌త్తికి వీలు క‌లుగుతుంది. ఇప్పుడిప్పుడే పురోగ‌మిస్తున్న మార్కెట్ల‌లో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని మార్పు ఇది. ఇది అభివృద్ధి చెందిన దేశాల‌కంటే ఉన్న‌త‌మైన‌ది. ద్ర‌వ్య స్థిరీకరణ మార్గానికి క‌ట్టుబ‌డి ఉంటూనే మేం స్థూల ఆర్థిక‌ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు, సుస్థిర‌త్వానికి క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్నాం.

మేం చేసిన ప్ర‌ధాన‌మైన విధాన సంస్కర‌ణ‌ల్లో మ‌రో ముఖ్య‌మైన‌ది పెట్రోలియం రంగంలో చేసినది. హైడ్రోకార్బ‌న్ ఎక్స్‌ప్లొరేష‌న్ లైసెన్సింగులో చేసిన నూత‌న పాల‌సీ ప్ర‌కారం ధ‌ర‌ల నిర్ణ‌యంలోను, మార్కెట్ చేసుకోవ‌డంలోను కంపెనీల‌కు స్వేచ్ఛ ఉంటుంది. ఆదాయ పంపకంలో పార‌ద‌ర్శ‌క విధానం ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాం. దీనివ‌ల్ల అధికార వ్య‌వ‌స్థ‌ల్లోని ప‌లు నియంత్ర‌ణ పొర‌ల్ని తుడిచిపెట్టేయ‌గ‌లిగాం. ఇప్ప‌టికీ అభివృద్ధి కాకుండా అమ‌లులో ఉన్న ప్రాజెక్టుల‌ను తీసుకుంటే వాటికి కూడా ధ‌ర‌లను నిర్ణ‌యించ‌డంలోను, మార్కెట్ చేసుకోవ‌డంలోను స్వేచ్ఛ‌ను ఇచ్చాం. దిగుమ‌తి చేసుకునే హైడ్రోకార్బ‌న్ల ధ‌ర‌లను ఆధారం చేసుకునే పార‌ద‌ర్శ‌క‌మైన అత్య‌ధిక ధ‌ర‌లుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. ప్రస్తుతం అమ‌లులో ఉన్న ఉత్ప‌త్తి పంప‌క కాంట్రాక్టుల విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కూడా పార‌ద‌ర్శ‌క విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాం. ప్ర‌భుత్వ లాభాల వాటాలో పెరుగుద‌ల ఫ్లాట్ ప‌ర్సంటేజ్ ప్ర‌కారం ఉండేలా చూశాం. త‌ద్వారా ఈ రంగంలో అనిశ్చితి, వివ‌క్ష‌త‌ తొలగుతాయి.

రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేష‌న్ యాక్ట్ బిల్లును పార్ల‌మెంటు ఆమోదించింది. త‌ద్వారా ఈ రంగంలో అనేక మార్పులు రాబోతున్నాయి. వినియోగ‌దారుల హ‌క్కులకు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఆరోగ్య‌క‌ర‌మైన విధానాల్ని పాటించేవారికి, నిజాయతీతో వ్యాపారం చేసేవారికి ప్రోత్సాహం ల‌భిస్తుంది. ఎప్ప‌టినుంచో మూల‌ప‌డిన ఈ బిల్లును చ‌ట్టం చేయ‌డ‌మే కాకుండా డెవ‌ల‌ప‌ర్స్‌కు, కొనుగోలుదార్ల‌కు టాక్స్ ఇన్సెంటివ్స్ ప్ర‌వేశ‌పెట్టాం. ఇది పేద‌ల‌కు, నూత‌న‌ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తుంది.

ఇక విద్యుత్ రంగంలో ప్ర‌వేశ‌పెట్టిన యు డి ఎ వై ప‌థ‌కం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన ఇన్సెంటివ్ స్ట్ర‌క్చ‌ర్‌నే శాశ్వతంగా మార్చేసింది. అమ‌లు చేయ‌డానికి వీలున్న ఔత్సాహిక ల‌క్ష్యాల‌కు న‌మ్మ‌క‌మైన ప్రోత్స‌హకాల భ‌రోసా త‌ప్ప‌కుండా ఉంటుంది.

ద‌శ‌ల‌వారీగా అమ‌ల‌య్యే ఈ ప‌థ‌కం ప్ర‌కారం డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల న‌ష్టాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు భ‌రించాలి. వాటిని వారి ఆర్థిక లోటు ల‌క్ష్యాల్లో భాగంగా చూడాలి. దీనివ‌ల్ల రాష్ట్రాల బ‌డ్జెటు రూపక‌ల్ప‌న‌లోనే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రుగుతుంది. విద్యుత్ రంగాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డంపైన ఆయా రాష్ట్రాలు దృష్టి పెట్టి ప‌టిష్ట‌మైన ప్రోత్సాహ‌క చ‌ర్య‌లు తీసుకుంటాయి. డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల మొత్తం అప్పుల్లో న‌ల‌భైశాతానికి పైగా త‌మ అకౌంట్ల‌లోకి తీసుకున్న తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వంతో ఇప్ప‌టికే అవ‌గాహ‌న‌పూర్వ‌క ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మ‌రో తొమ్మిది రాష్ట్రాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాయి.

పునర్నవీకరణ యోగ్య శ‌క్తి రంగంలో మా ప్ర‌భుత్వం చేప‌ట్టిన క‌నీవినీ ఎర‌గ‌ని విధాన సంస్క‌ర‌ణ‌ల గురించి మీకు ఇప్ప‌టికే తెలిసి ఉంటుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం స‌రాస‌రి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యే ప‌రిస్థితుల‌నుంచి మేం ప్ర‌తి సంవ‌త్స‌రం 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ వినియోగ దిశ‌గా అడుగులు వేస్తున్నాం. నేను గ‌తంలో వాతావ‌ర‌ణ మార్పుల వ్యూహంలో భాగంగా 175 గిగావాట్ల పునర్నవీకరణ యోగ్య విద్యుత్‌ను త‌యారు చేసుకోబోతున్నామంటూ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. కొంత‌మంది పెద‌వి విరిచారు. ఈ నెల‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎనర్జీ ఏజెన్సీ ప్ర‌క‌టించిన నివేదిక ప్ర‌కారం చూస్తే పునర్నవీకరణ యోగ్య ఇంధ‌న వినియోగం పెర‌గ‌డంవ‌ల్ల శ‌క్తికి సంబంధించిన కార్బ‌న్ ఉద్గారాల‌కు అడ్డుక‌ట్ట‌ప‌డిందనే విష‌యం తెలుస్తోంది.

జ‌ల‌ర‌వాణాకు సంబంధించి ఒక కొత్త చ‌ట్టానికి పార్ల‌మెంటు ఆమోదం తెలిపింది. ఈ స‌మ‌ర్థ‌వంత‌మైన ర‌వాణా మార్గంలో వేగ‌వంత‌మైన మార్పుల‌కు ఇది శ్రీకారం చుడుతుంది. ఈ చ‌ట్టంవ‌ల్ల జ‌ల‌రవాణాకు అనుకూల‌మైన మార్గాలు 5 నుంచి 106కు చేరుకుంటాయి.

విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల విధానానికి చేసిన సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా ఇంత‌వ‌ర‌కు వీటికి ప్ర‌వేశం లేని రంగాల్లోకి వీటిని అనుమ‌తించ‌డం జ‌రిగింది. రైల్వేలు, ర‌క్ష‌ణ రంగాల్లోకి వీటిని అనుమ‌తించ‌డం జ‌రిగింది. జీవిత‌బీమా, ఇంకా ఇత‌ర రంగాల‌ల‌ పెట్టుబ‌డుల ప‌రిమితిలో మార్పులు చేయ‌డంవ‌ల్ల ఆయా రంగాల్లోపెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. ఈ సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాలు ఇప్ప‌టికే క‌నిపిస్తున్నాయి. 5 బిలియ‌న్ డాలర్ల‌కు పైగా పెట్టుబ‌డులతో రెండు కొత్త రైలు ఇంజ‌న్ల త‌యారీ ఫ్యాక్ట‌రీల నిర్మాణం బిహార్‌లో మొద‌లైంది. వీటిని జిఇ, ఆల్ స్తోమ్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఇక బీమా రంగాన్ని తీసుకుంటే 9600 కోట్ల రూపాయ‌ల ఎఫ్‌డిఐలు వ‌చ్చేశాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందిన బీమా కంపెనీల‌నుంచి, దేశంలోని ప‌న్నెండు కంపెనీల్లోకి ఈ నిధులు రావ‌డానికి వీలుగా, ఆమోదంకూడా తెల‌ప‌డం జ‌రిగింది.

దేశంలోని స్టాక్ ఎక్స్ ఛేంజ్‌ల‌లో విదేశీ పెట్టుబ‌డుల ప‌రిమితుల‌ను పెంచడం జ‌రిగింది. అంతే కాదు ఆయా విదేశీ కంపెనీలు త‌మ పేర్ల‌ను ఈ ఎక్స్ ఛేంజ్‌ల‌లో లిస్టు చేసుకోవడానికి వీలు క‌ల్పించాం. ప్రైవేట్ ఈక్విటీ వెంచ‌ర్ కాపిట‌ల్ ను ప్రోత్స‌హించ‌డానికి మేం తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల గురించి మీకు తెలిసే ఉంటుంది. అంతే కాదు స్టార్టప్ కంపెనీల మ‌నుగ‌డ‌కు కావ‌ల‌సిన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డానికి కూడా అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింది. భార‌త‌దేశానికి సంబంధించిన ఈ నూత‌న ఆర్థిక‌ ద్ప‌క్ప‌థంపైన మీ పానెల్ డిస్క‌ష‌న్ల‌లో దృష్టిపెట్టిన‌ట్టుగా నాకు తెలిసింది.

ఉద్యోగ క‌ల్ప‌న రంగంలో మేం తీసుకున్న ప్ర‌ధాన‌మైన చ‌ర్య‌ల‌గురించి చివ‌ర‌గా విశ‌దీక‌రిస్తాను. నేను ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చే రంగాల‌లో ఇది ఒక‌టి. భార‌త‌దేశంలో పెట్టుబ‌డులకు కొర‌త ఉంది కానీ మాన‌వ‌వ‌న‌రులు మాత్రం పుష్క‌లంగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ కార్పొరేట్ టాక్స్ విధానమ‌నేది కాపిట‌ల్ ఇంటెన్సివ్ ఉత్ప‌త్తికే ప్రాధాన్య‌త‌నిస్తోంది. ప‌న్నులపరంగా జ‌రిగే మేళ్ల కార‌ణంగా అంటే ఆక్సిల‌రేటెడ్ డిప్రిషియేష‌న్‌, ఇన్వెస్ట్‌మెంట్ అలోవెన్స్ లాంటివాటి కార‌ణంగా కార్మికుల‌ప‌ట్ల కృత్రిమ‌మైన వివ‌క్ష జ‌నిస్తోంది. కార్మిక నియంత్ర‌ణ‌లు కూడా ఎలాంటి సాంఘిక భ‌ద్ర‌త‌లేని అవ్య‌వ‌స్థీకృత ఉపాధికే ప్రాధాన్య‌తనిచ్చాయి త‌ప్ప వ్య‌వ‌స్థీకృత ఉపాధికి కాదు. ఈ ప‌రిస్థితిలో మార్పు తేవ‌డానికి మేం రెండు ముఖ్య‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాం.

మొద‌టిది, ఏదైనా కంపెనీ తన టాక్స్ ఆడిట్ ప్ర‌కారం త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే ఉద్యోగుల సంఖ్య‌ను పెంచితే ఆ కంపెనీకి మూడు సంవ‌త్స‌రాల‌పాటు ఆ పెరిగిన వేత‌న వ్య‌యంపైన 30 శాతం వెయిటెడ్ టాక్స్ డిడ‌క్షన్ ల‌భిస్తుంది. గ‌తంలో ఇలాంటిది కొన్ని పారిశ్రామిక యాజ‌మాన్యాల‌కే అందుబాటులో ఉండేది. అందులోనే అనేక నియ‌మ‌నిబంధ‌న‌లు ఉండేవి. త‌ద్వారా దీన్ని అమ‌లు చేయ‌డం క‌ష్ట‌సాధ్యంగా ఉండేది. ఇప్పుడు మేం తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగా సేవ‌ల రంగంతోపాటు అన్ని రంగాల్లోను ఈ నియ‌మం వ‌ర్తిస్తుంది. నెల‌కు 25,000 రూపాయ‌ల దాకా వేత‌నం ల‌భించే ఉద్యోగుల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.

ఉద్యోగుల భ‌విష్య‌నిధిలో చేరే కొత్త‌వాళ్లంద‌రికీ మూడు సంవ‌త్స‌రాల‌పాటు పింఛన్ చెల్లించే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకుంది. నెల‌కు 15,000 రూపాయ‌ల‌వ‌ర‌కు వేత‌న ప‌రిమితి ఉన్న ఉద్యోగులకు ఇది వ‌ర్తిస్తుంది. ల‌క్ష‌లాది నిరుద్యోగుల‌కు, అవ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌నిచేసేవారికి ఈ నిర్ణ‌యం మేలు చేస్తుంద‌ని మేం భావిస్తున్నాం.

ప్ర‌భుత్వ నియామ‌కాల్లో అవినీతిని తుడిచిపెట్టేయ‌డానికి వీలుగా దిగువ‌, మ‌ధ్య స్థాయి ఉద్యోగాల‌కోసం ఇంట‌ర్వ్యూల ప్ర‌క్రియ‌ల‌ను ర‌ద్దు చేశాం. పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగే రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాల ఆధారంగానే వారు ఉద్యోగాల‌ను పొంద‌గ‌లుగ‌తారు.

ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశం కోసం ప్ర‌భుత్వం నిర్వ‌హించే ప్ర‌వేశ పరీక్ష‌ల‌ను ప్రైవేటు కాలేజీలు కూడా ఉప‌యోగించుకుంటున్నాయ‌నే విష‌యం మీకు తెలిసిందే. లేబ‌ర్ మార్కెట్ ను అభివృద్ధి చేయ‌డానికి వీలుగా, నిరుద్యోగుల‌కు ల‌బ్ధి చేకూర్చ‌డానికి వీలుగా అద‌నంగా మ‌రో నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడానికి నేను ఎంత‌గానో సంతోషిస్తున్నాను. ప్ర‌భుత్వంగానీ, ప్ర‌భుత్వ రంగ కంపెనీలుగానీ అనేక నియామాకాల ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంటాయి. ఈ ప‌రీక్ష‌ల్లో అభ్య‌ర్థులు సాధించిన ఫ‌లితాల వివ‌రాలు ప్ర‌భుత్వం ద‌గ్గ‌రే ఉంటాయి.. అయితే ఇప్ప‌టినుంచీ ఈ ఫ‌లితాల‌ను, అభ్య‌ర్థుల స‌మాచారాన్ని ఆయా అభ్య‌ర్థుల ఆమోదం మేర‌కు అంద‌రికీ అందుబాటులోకి తెస్తాం. త‌ద్వారా ప్రైవేటు సంస్థ‌ల యాజ‌మాన్యాలు దీనినుంచి ల‌బ్ధి పొంద‌డానికి ఆస్కార ముంది. త‌మ‌కు కావ‌ల‌సిన ఉద్యోగుల ఎంపిక వారికి సులువు అవుతుంది. దాంతో వారికి ఇందుకుగాను పెట్టే వ్య‌యం కూడా త‌గ్గుతుంది. ఇటు ఉద్యోగాన్వేష‌కుల‌కు మేలు జ‌రుగుతుంది. అభ్య‌ర్థుల‌ను అద‌నంగా క‌లిగిన రంగాల‌నుంచి ఇత‌ర రంగాల‌కు వారిని త‌ర‌లించ‌డానికి ఈ నిర్ణ‌యం దోహ‌దం చేస్తుంది.

ప్ర‌ధాన‌ మంత్రి ముద్ర యోజ‌న సాధిస్తున్న అద్భుత‌మైన ప్ర‌గ‌తి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ సంవత్స‌రం ఈ ప‌థ‌కం కింద 19 బిలియ‌న్ డాల‌ర్ల‌కు సమాన‌మైన 31 మిలియ‌న్ రుణాల‌ను ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌లో 77 శాతంమంది మ‌హిళ‌లే. ఈ మ‌హిళ‌ల్లోనే 22 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన‌వారు. సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఆలోచించి లెక్కించిన‌ప్పుడు…స‌రాస‌రి ప్ర‌తి ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఒకరికి ఉద్యోగం ఇవ్వొచ్చ‌ని భావించినా ఈ ప‌థ‌కం కింద 31 మిలియన్ మందికి కొత్త‌గా ఉపాధి దొరికిన‌ట్టే. ఇక స్టాండ‌ప్ ఇండియా స్కీమును తీసుకుంటే దీనికింద మ‌హిళ‌ల‌కు, ఎస్సీఎస్టీల‌కు 250,000 ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల విభాగం కింద‌ రుణాలను ఇవ్వ‌బోతున్నాము.

నైపుణ్యాల అభివృద్ధిలో మా ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు అంద‌రికీ తెలిసిన‌వే. ఈ బ‌డ్జెటులో మేం రెండు ముఖ్య‌మైన సంస్క‌ర‌ణ‌ల్ని విద్యారంగంలో ప్ర‌వేశ‌పెట్టాం. వీటి గురించి మీకు వివ‌రంగా తెలియ‌జేస్తాను. అత్యున్న‌త ప్ర‌మాణాల‌ను అందుకోవ‌డానికి వీలుగా మా ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌ను ప‌టిష్టం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం. ఇందుకుగాను ప్రారంభంలో ప‌ది ప్ర‌భుత్వ ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు, ప‌ది ప్రైవేటు ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం సాయం చేస్తుంది. వాటికి స‌మ‌ర్థ‌వంత‌మైన నియంత్ర‌ణ వాతావ‌ర‌ణం ఏర్పాటు చేసుకోవ‌డానికి స‌హ‌క‌రిస్తుంది. త‌ద్వారా ఆ సంస్థ‌లు అంత‌ర్జాతీయ స్థాయి బోధ‌నా, ప‌రిశోధ‌నా విద్యాల‌యాలుగా అవ‌త‌రిస్తాయి. వీటికోసం ఏర్పాటు చేసే నియంత్ర‌ణా వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం అమ‌లులో వున్న యూనివ‌ర్సిటి గ్రాంట్స్ క‌మిష‌న్‌, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ లాంటి నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌లకంటే భిన్నంగా ఉంటుంది. ఈ సంస్థ‌లు పూర్తిగా స్వ‌యంప్ర‌తిప‌త్తిని క‌లిగి ఉంటాయి. విద్యాప‌రంగాను, ప‌రిపాల‌న‌పరంగాను, ఆర్ధిక విష‌యాల్లోను ఎవ‌రూ జోక్యం చేసుకోవడానికి వీలుండ‌దు. ప‌ది ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల‌కు, రాబోయే ఐదు సంవ‌త్స‌రాల‌కుగాను అద‌న‌పు వ‌న‌రుల‌ను స‌మ‌కూరుస్తాం. దీనివ‌ల్ల సామాన్య భార‌తీయులు అంత‌ర్జాతీయ స్థాయి డిగ్రీ కోర్సులు అభ్య‌సించ‌డానికి వీలు క‌లుగుతుంది. ఉన్న‌త విద్యారంగంలోని నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌కు ప్రారంభంలో క‌ల్పించిన అస‌లు సిస‌లు ల‌క్ష్యాల‌ను పున‌రుద్ధరించ‌డానికి చేస్తున్న ప్ర‌యాణంలో ఇది ప్రారంభం మాత్ర‌మే.

నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌నేవి మార్గ‌ద‌ర్శ‌నం చేసి స‌హాయ‌కారులుగా ఉండాలి. ఎవ‌రికివారు స్వ‌యంగా ప్ర‌క‌టించుకునే పార‌ద‌ర్శ‌క‌త‌తో అవి ప‌ని చేయాలి. అంతే త‌ప్ప పైనుంచి కిందిదాకా అదిరించి బెదిరించి ప‌ని చేయించ‌గ‌లిగే వ్య‌వ‌స్థ‌ల్లాగా ఉండ‌కూడ‌దు. చిట్ట‌చివ‌రిగా ఇలాంటి నియంత్ర‌ణా వ్య‌వ‌స్థ‌ల్లో చేప‌ట్టే సంస్క‌ర‌ణ‌ల‌ద్వారా మా క‌ళాశాల‌ల్లోను, విశ్వ‌విద్యాల‌యాల్లోను అంత‌ర్జాతీయ‌స్థాయి ప్ర‌మాణాల్ని నెల‌కొల్పుగ‌లుగుతాం.

మేం తీసుకొచ్చిన మ‌రో సంస్క‌ర‌ణ పాఠశాల విద్యారంగంలో తెచ్చిన‌ది. స్కూలు విద్య అంద‌రికీ అందుబాటులోకి తేవడంలోను, విద్యార్థుల‌కు-ఉపాధ్యాయుల‌కు మ‌ధ్య‌ ఉండాల్సిన నిష్ప‌త్తి విష‌యంలోను మేం రాశిపరంగా మంచి ప్ర‌గ‌తినే సాధించాం. ఇప్పుడున్న విజ్ఞాన‌దాయ‌క ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు పునాదిగా నిలచింది ఒక‌ప్పుడు స్కూలు విద్య‌ను అభ్య‌సించిన‌వారే. చ‌దువు ద్వారా నాణ్య‌మైన ఫ‌లితాల‌ను సాధించాల‌ని మేం నిర్ణ‌యాలు తీసుకున్నాం. అదే ప్ర‌భుత్వ ప్రాథమిక ల‌క్ష్యం. దీనికి అనుగుణంగానే నాణ్య‌త సాధించ‌డానికి వీలుగా స‌ర్వ శిక్ష అభియాన్ కార్య‌క్ర‌మం కింద వ‌న‌రుల కేటాయింపు అధికం చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌డ‌తాం. ఈ నిధుల‌ను ఉప‌యోగించి స్థానిక కార్య‌క్ర‌మాల‌ద్వారా, నూత‌న అన్వేష‌ణ‌ల‌ద్వారా బోధ‌నా ఫ‌లితాల‌ను మెరుగ‌ప‌ర‌చుతాం. మీలో త‌ల్లిదండ్రులున్నారు..కంపెనీల య‌జ‌మానులున్నారు…పాఠ‌శాల, ఉన్న‌త విద్య‌ల విష‌యంలో మేం తీసుకున్న చ‌ర్య‌ల‌ను స్వాగ‌తిస్తార‌ని నేను భావిస్తున్నాను.

ఇక ముగింపునకు వ‌స్తే, లేడీస్ అండ్ జెంటిల్ మెన్.. ఇప్ప‌టికే మేం అనేక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాం. ఇంకా మ‌రెన్నో చేప‌ట్టాల్సి ఉంది. మేం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో కొన్ని ఇప్ప‌టికే ఫ‌లితాల‌ను అందిస్తున్నాయి. ఇంత‌వ‌ర‌కు మేం సాధించిన దాన్ని చూస్తే నాకు ఒక ధీమా క‌లుగుతోంది..అది ఏంటంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో మ‌నం భార‌త‌దేశంలో మార్పు తేవ‌చ్చు.

నాకు తెలుసు ఇది క‌ష్ట‌మ‌ని
కానీ, నాకు తెలుసు క‌ష్ట‌సాధ్యం కాద‌ని.
నాలో దృఢ‌మైన న‌మ్మ‌క‌ముంది..ఇది త‌ప్ప‌కుండా సాధ్య‌మ‌వుతుంద‌ని.

అంద‌రికీ అభినంద‌న‌లు.

***