Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రెజిల్ అధ్య‌క్షుడి భారతదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

బ్రెజిల్ అధ్య‌క్షుడి భారతదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌


శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ మైకెల్ టెమర్‌, ప్రసార మాధ్యమాల స‌భ్యులు, మిత్రులారా,

భారతదేశానికి విచ్చేసిన అధ్యక్షుడు శ్రీ మైకెల్ టెమర్‌ కు స్వాగ‌తం ప‌లికే గౌరవం నాకు దక్కింది. ఉమ్మ‌డి సాంస్కృతిక పోర్చుగీసు వార‌స‌త్వం క‌లిగిన గోవా ఆయన ప్రథమ ప‌ర్య‌ట‌న‌లో చోటు చేసుకోవడం నాకు సంతోషాన్ని క‌లిగించింది. భౌగోళికంగా వేరైన‌ప్ప‌టికీ, బ్రెజిల్, భారతదేశం ప్ర‌జాస్వామ్యం, చ‌ట్ట‌బ‌ద్ధ‌పాల‌న‌, అభివృద్ధి ఆకాంక్ష‌లు, శాంతి, సౌభాగ్యానికి సంబంధించిన ఉమ్మ‌డి విలువ‌ల‌తో అనుసంధాన‌మైన స‌హ‌జ భాగ‌స్వామ్య దేశాలు. గొప్ప రాజ్యాంగ నిపుణుడైన శ్రీ మైకెల్ టెమర్‌ దీనిని అభినందిస్తారు కూడా. ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఏర్పడి ప‌ది సంవత్సరాలు అయిన సంద‌ర్భంలో శ్రీ టెమర్ ప‌ర్య‌ట‌నకు విచ్చేశారు. ఈ ప‌ది సంవత్సరాలలో ప్ర‌పంచం ఎంతో మారింది. భారతదేశం, బ్రెజిల్ ల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత మెరుగైన స్థితికి చేరాయి. అన్ని స్థాయిల‌లో మేము సంభాష‌ణ‌ల‌ను పెంచాము. మ‌న ఉమ్మ‌డి ల‌క్ష్యాలు, ప్ర‌య‌త్నాలకు అనుగుణంగా అంత‌ర్జాతీయ అభిప్రాయాల‌ను మ‌లిచేందుకు మేం చేతులు క‌లిపాము. నేను 2014 లో బ్రెజిల్‌లో జ‌రిపిన ప‌ర్య‌ట‌నను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవ‌డం సంతోషంగా ఉంది. నేను ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆసియా వెలుప‌ల నేను ప‌ర్య‌టించిన మొదటి దేశం బ్రెజిల్‌ యే. భారతదేశం ప‌ట్ల ఎంతో స్నేహాభిమానాలను వ్యక్తం చేసే బ్రెజిల్ మిత్రుల ఆద‌రాభిమానాలు నాకు తెలుసు. శ్రేష్ఠుడైన అధ్యక్షుల వారూ, మీరు కీల‌కమైన నూతన బాధ్య‌త‌లను చేప‌ట్టిన అనంత‌రం లాటిన్ అమెరికా వెలుప‌ల ద్వైపాక్షిక‌ ప‌ర్య‌ట‌న‌కు ఎంచుకున్న దేశాల‌లో భారతదేశం మొద‌టిది. మీ ప‌ర్య‌ట‌న‌తో ఇరు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాల‌కు ఎంత‌టి ప్రాముఖ్య‌ాన్ని ఇస్తున్నాయో స్ప‌ష్ట‌మౌతోంది. ఇది ఈ రోజు ఉద‌యం మ‌నం నిర్వ‌హించిన ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ‌ల‌లో ప్ర‌తిఫ‌లించింది.

మిత్రులారా,

అధ్యక్షుడు శ్రీ టెమర్‌, నేనూ ద్వైపాక్షిక స‌హ‌కారానికి సంబంధించిన పూర్తి అంశాల‌ను స‌మీక్షించాము. ఈ విష‌యంలో ఉన్న‌ సామ‌ర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మా మ‌ధ్య స‌హ‌కారాన్ని మ‌రింత ఎత్తుకు తీసుకుపోవాల‌ని నిర్ణ‌యించాము. ఇది వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని ప‌టిష్ఠం చేయాల‌న్న ఉభ‌యుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణ‌ంగా ఉంది. లాటిన్ అమెరికాలోని మా అత్యంత ప్ర‌ముఖ ఆర్థిక భాగ‌స్వాముల‌లో బ్రెజిల్ ఒక ముఖ్య భాగ‌స్వామి. ద్వైపాక్షిక పెట్టుబ‌డి ఒప్పంద ప‌త్రాన్ని భారతదేశం, బ్రెజిల్‌ లు ఖ‌రారు చేశాయ‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాను. ఇది ద్వైపాక్షిక వ్యాపారం పెంపున‌కు,పెట్టుబ‌డి అనుసంధాన‌త‌కు అవ‌స‌ర‌మైన చోద‌క శ‌క్తిని ఇవ్వ‌గ‌ల‌దు. బ్రెజిల్‌లో దేశీయ ఆర్థిక అజెండాను పున‌రుద్ధ‌రించ‌డానికి అధ్యక్షుడు శ్రీ టెమర్‌ ఇస్తున్న ప్రాధాన్య‌ాన్ని గ‌మ‌నించాము. ఇందులో భారతదేశం విలువైన భాగ‌స్వామి కాగ‌ల‌దు. భారతదేశానికి వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టాలని, దీర్ఘ‌కాలిక భాగ‌స్వామ్యాన్నిఏర్పాటు చేసుకోవాలని బ్రెజిల్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షుడు శ్రీ టెమర్‌, నేను మా సిఇఒ ల‌తో ఇప్పుడే స‌మావేశ‌మై వారి నుండి ముఖాముఖిగా ప‌లు విష‌యాలను తెలుసుకున్నాము. వాస్త‌విక దృష్టితో భాగ‌స్వామ్యాలు కుదుర్చుకొనేందుకు వారు తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్రోత్సాహ‌క‌రంగా ఉన్నాయి.

దీనికి మేము పూర్తి మ‌ద్ద‌తునిస్తాము.

భార‌తీయ ఉత్ప‌త్తులు, కంపెనీల‌కు మ‌రింత మార్కెట్ అందుబాటు, పెట్టుబ‌డి అవ‌కాశాలు క‌ల్పించాల్సిందిగా అధ్యక్షుడు శ్రీ టెమర్‌ మ‌ద్ద‌తును నేను కోరాను. దీనికి వారు సానుకూలత‌ తెలిపినందుకు కృత‌జ్ఞ‌త‌లు. డ్ర‌గ్ రెగ్యులేష‌న్‌, వ్య‌వ‌సాయ ప‌రిశోద‌న‌,సైబ‌ర్ భ‌ద్ర‌తల వంటి కొత్త అంశాల‌లో స‌హ‌కారానికి ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మేము పురోగ‌తిని సాధించాము. ముఖ్య‌మైన అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై సైతం మా మ‌ధ్య స‌మ‌న్వ‌యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని అధ్యక్షుడు శ్రీ టెమర్‌, నేనూ నిర్ణ‌యించాము. మా వైఖ‌రులు, విధానాల‌లో చాలా వ‌ర‌కు ఏక‌రూప‌త ఉంది. ఐక్య‌రాజ్య‌స‌మితి, జి-20, జి-4,డ‌బ్ల్యు టి ఒ, బ్రిక్స్‌, ఐబిఎస్ ఎ , ఇంకా ఇత‌ర ముఖ్య‌మైన వేదిక‌ల‌పై మేము క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయ‌నున్నాము.

శ్రేష్ఠుడా,

ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం తీసుకొంటున్న చ‌ర్య‌ల విష‌యంలో బ్రెజిల్ అందిస్తున్న మ‌ద్ద‌తుకు మా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఉగ్ర‌వాదంపై పోరుకు ప్ర‌పంచ దేశాలు ఎలాంటి తేడా, వివ‌క్ష లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు రావాల‌ని మేము అంగీక‌రించాము. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఐక్యరాజ్యస‌మితిలో తీర్మానాన్ని (సి సి ఐ టి) త్వ‌ర‌గా తీసుకువ‌చ్చేందుకు బ్రెజిల్‌తో ఒక ముఖ్య భాగ‌స్వామిగా మేము క‌లిసి ప‌నిచేయ‌నున్నాము. పరమాణు స‌ర‌ఫ‌రాదారుల బృందంలో స‌భ్య‌త్వం పొందాలన్న భార‌తదేశం ఆకాంక్ష‌ను అర్థం చేసుకున్నందుకు బ్రెజిల్‌కు ధన్యవాదాలు.

శ్రేష్ఠుడా, మిత్రులారా,

భారతదేశం, బ్రెజిల్‌ ల మ‌ధ్య ద్వైపాక్షిక‌, బ‌హుళ ప‌క్ష భాగ‌స్వామ్యానికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. వాటిని స‌ఫ‌లీకృతం చేయాల‌న్న‌ది మా ఆకాంక్ష‌. భారతదేశంలో అధ్యక్షుడు శ్రీ టెమర్‌ ప‌ర్య‌ట‌న ఈ దిశ‌గా ల‌క్ష్య సాధ‌న‌కు అనుస‌రించాల్సిన విధాన రూప‌క‌ల్ప‌న‌కు ఒక ముఖ్య అవ‌కాశంగా ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌దు. పోర్చుగీసులో చెప్పినట్లుగా

[ ఈ మాటలకు అర్థం: మన బంధం మ‌నలను మ‌రింత బ‌లోపేతం చేస్తుంది అని.]

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.