బ్రెజిల్ రియో డి జెనీరో జి-20 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిటిష్ ప్రధాని సర్ కెయిర్ స్టార్మర్ తో భేటీ అయ్యారు. ఇరుదేశాల ప్రధానులూ సమావేశమవడం ఇదే తొలిసారి. బ్రిటన్ అధికార పగ్గాలు చేపట్టినందుకు శ్రీ మోదీ సర్ స్టార్మర్ కు అభినందనలు తెలియచేశారు. మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన శ్రీ మోదీకి బ్రిటన్ ప్రధానమంత్రి శుభాకాంక్షలు అందజేశారు.
ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.
స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలను వీలైనంత త్వరగా పునః ప్రారంభించాలని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు. ఇరుదేశ బృందాలూ మిగిలిన అంశాలను పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించగలవనీ తద్వారా ఇరుదేశాలకు లాభాన్ని చేకూర్చే స్థిరమైన తాజా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం సిద్ధమవగలదన్న విశ్వాసాన్ని దేశాధినేతలు వెల్లడించారు. భారత్-బ్రిటన్ ల మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాల దృష్ట్యా పరస్పర సహకారానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించిన భారత ప్రధాని శ్రీ మోదీ, బెల్ ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో రెండు కొత్త కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇవి బ్రిటన్ లో నివసిస్తున్న భారతీయులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రకటనను సర్ స్టార్మర్ స్వాగతించారు.
బ్రిటన్ లో నివాసం ఏర్పరుచుకున్న భారత్ ఆర్థిక నేరగాళ్ళ అంశాన్ని లేవనెత్తిన శ్రీ మోదీ, కీలకమైన ఈ అంశంలో వీలైనంత త్వరలో పరిష్కారాలు కనుగొనాలన్నారు. వలసలు, అనుసంధానం వంటి అంశాల్లో పురోగతి సాధించవలసిన అవసరముందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు.
భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందాల వేగవంతమైన అమలు దిశగా కృషి చేయాలనీ, ప్రధానమంత్రులిరువురూ మంత్రులనూ సీనియర్ అధికారులనూ ఆదేశించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సహకారం గురించి భవిష్యత్తులో చర్చలు కొనసాగించాలని శ్రీ మోదీ శ్రీ స్టార్మర్ నిర్ణయించారు.
***
Had an extremely productive meeting with Prime Minister Keir Starmer in Rio de Janeiro. For India, the Comprehensive Strategic Partnership with the UK is of immense priority. In the coming years, we are eager to work closely in areas such as technology, green energy, security,… pic.twitter.com/eJk6hBnDJl
— Narendra Modi (@narendramodi) November 18, 2024