Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం


అధ్యక్షులు ,

ప్రముఖులు ,

మహిళలు, పెద్దలు

16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.

బ్రిక్స్ లో చేరిన కొత్త మిత్రులందరికీ మరోసారి సాదర స్వాగతం. కొత్త రూపంలో బ్రిక్స్ ప్రపంచ మానవాళిలో 40 శాతం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం వాటాను కలిగి ఉంది.

గత రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ ఎన్నో మైలురాళ్లను సాధించింది. రాబోయే కాలంలో, ఈ సంస్థ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికి మరింత ప్రభావవంతమైన మాధ్యమంగా ఆవిర్భవిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

గత పది సంవత్సరాలలో, ఈ బ్యాంకు అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల  అవసరాలకు ఒక ముఖ్యమైన ఎంపికగా అవతరించింది. భారతదేశంలో గిఫ్ట్ లేదా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీతో పాటు ఆఫ్రికా, రష్యాలో ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించడం ఈ బ్యాంకు కార్యకలాపాల విస్తృతిని పెంచింది. ఇంకా, దాదాపు 35 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతి లభించింది. డిమాండ్ ఆధారిత సూత్రాన్ని బట్టి ఎన్డీబీ పనిచేయాలి. బ్యాంకును విస్తరించేటప్పుడు దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిర, ఆరోగ్యకరమైన క్రెడిట్ రేటింగ్, మార్కెట్ యాక్సెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.

మిత్రులారా,

విస్తరించిన కొత్త రూపంలో బ్రిక్స్ 30 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. మన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ ఉమెన్ బిజినెస్ అలయన్స్ ప్రత్యేక పాత్ర పోషించాయి.

ఈ ఏడాది డబ్ల్యూటీఓ   సంస్కరణలు, వ్యవసాయంలో వాణిజ్య సౌలభ్యం, సుస్థిర సరఫరా వ్యవస్థలు, ఈ-కామర్స్, ప్రత్యేక ఆర్థిక మండలాలపై బ్రిక్స్ లో కుదిరిన ఏకాభిప్రాయం మన ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇన్ని కార్యక్రమాల మధ్య చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రయోజనాలపై కూడా మనం దృష్టి పెట్టాలి.

2021 లో భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్ ఈ సంవత్సరం ప్రారంభం కావడం నాకు సంతోషంగా ఉంది. బ్రిక్స్ దేశాల మధ్య రవాణా, సరఫరా అనుసంధానాన్ని పెంచడంలో భారత్ ఏర్పాటు చేసిన రైల్వే రీసెర్చ్ నెట్వర్క్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. పరిశ్రమ 4.0 కోసం నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి యునిడో సహకారంతో బ్రిక్స్ దేశాలు ఈ సంవత్సరం సాధించిన ఏకాభిప్రాయం చాలా ముఖ్యమైనది.

2022 లో ప్రారంభించిన బ్రిక్స్ వ్యాక్సిన్ పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రం అన్ని దేశాలలో ఆరోగ్య భద్రతను పెంచడానికి సహాయపడుతుంది. డిజిటల్ హెల్త్ లో విజయవంతమైన భారత్ అనుభవాన్ని మేము బ్రిక్స్ భాగస్వాములతో సంతోషంగా పంచుకుంటాం.

మిత్రులారా,

వాతావరణ మార్పు అనేది మా ఉమ్మడి ప్రాధాన్య అంశం

రష్యా అధ్యక్షతన బ్రిక్స్ ఓపెన్ కార్బన్ మార్కెట్ భాగస్వామ్యానికి కుదిరిన ఏకాభిప్రాయం స్వాగతించదగినది. భారత్ లోనూ హరితవృద్ధి, సుస్థిర వాతావరణ మౌలిక సదుపాయాలు, హరిత మార్పు పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కూటమి, మిషన్ ఎల్ఐఎఫ్ఇ అంటే పర్యావరణం కోసం జీవనశైలి, ఏక్ పెడ్ మా కే నామ్ (తల్లి పేరుతో ఒక చెట్టు)  వంటి అనేక కార్యక్రమాలను భారతదేశం చేపట్టింది.

గత సంవత్సరం, సిఒపి-28 సందర్భంగా,  మేము గ్రీన్ క్రెడిట్ అనే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమాల్లో చేరాల్సిందిగా బ్రిక్స్ భాగస్వాములను నేను ఆహ్వానిస్తున్నాను.

బ్రిక్స్ దేశాలన్నింటిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

భారతదేశంలో మల్టీ మోడల్ కనెక్టివిటీని వేగంగా విస్తరించడానికి గతి-శక్తి పోర్టల్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేశాం. ఇది సమీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక, అమలులో సహాయపడింది. రవాణా ఖర్చులను తగ్గించింది.

మా అనుభవాలను మీ అందరితో పంచుకోవడానికి మేము సంతోషిస్తాము.

మిత్రులారా,

బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సమగ్రతను పెంచే ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం.

స్థానిక కరెన్సీలలో వాణిజ్యం, సీమాంతర చెల్లింపులు సజావుగా సాగడం మన ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశం అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఒక పెద్ద విజయగాథ. అనేక దేశాలు దీనిని స్వీకరించాయి.

గతేడాది షేక్ మహమ్మద్ తో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లోనూ దీన్ని ప్రారంభించాం. యుపిఐ పై  ఇతర బ్రిక్స్ దేశాలతో కూడా మనం సహకరించుకోవచ్చు.

మిత్రులారా,

బ్రిక్స్ ద్వారా సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది.

మన వైవిధ్యం, బహుళ ధ్రువత్వంపై మనకున్న ప్రగాఢమైన నమ్మకమే మన బలం. మన ఈ బలం, మానవత్వంపై మనకున్న ఉమ్మడి విశ్వాసం రాబోయే తరాలకు సుసంపన్నమైన, ఉజ్వలమైన భవిష్యత్తుకు అర్థవంతమైన రూపాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఈ రోజు చాలా ముఖ్యమైన, విలువైన చర్చలకు గాను నేను ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

బ్రిక్స్ తదుపరి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న అధ్యక్షుడు లూలాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ బ్రిక్స్ అధ్యక్ష పదవి విజయవంతానికి భారత్  పూర్తి మద్దతు ఇస్తుంది.

అధ్యక్షుడు పుతిన్ కు, నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు.

గమనిక- ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి సుమారు అనువాదం. ప్రధానమంత్రి  హిందీలో ప్రసంగించారు.

 

***