బ్యాంకాక్‌లో 16వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సుసహా 35వ ఆసియాన్-భారత, సంబంధిత ఇతర శిఖరాగ్ర సదస్సుల ప్రారంభానికి ముందు- ‘బ్యాంకాక్ పోస్ట్’ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ప్రపంచంలో, ఈ ప్రాంతంలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై తన అభిప్రాయాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠమిది:
మీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదిగిందని మీరు భావిస్తున్నారా?
సుసంపన్న, వైవిధ్యభరిత భారతదేశం ఒక ప్రాచీన నాగరక సమాజమన్నది జగమెరిగిన సత్యం. కొన్ని శతాబ్దాల కిందటిదాకా ప్రపంచ ప్రగతిలో భారత్ తనవంతు తోడ్పాటు అందించింది. శాస్త్రవిజ్ఞానం, సాహిత్యం, తత్త్వశాస్త్రం, కళలు, వాస్తుశిల్పశైలి అభివృద్ధికీ ఎంతగానో దోహదపడింది. ఇన్ని రంగాల్లో ఇంతగా ముందంజకు చేయూతనిచ్చినా ఇతర దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించాలని ఎన్నడూ భావించలేదు సరికదా- మహాసముద్రాంతర దేశాలతో నిరంతర స్నేహబంధాన్ని నిర్మించుకుంటూ వచ్చింది. గడచిన కొన్నేళ్లుగా ప్రపంచానికి మా వంతు చురుకైన తోడ్పాటును మరింత క్రియాశీలం చేస్తున్నాం. అది ఆర్థిక రంగం… వాతావరణ మార్పుపై పోరాటం… అంతరిక్షం లేదా ఉగ్రవాదంపై యుద్ధం తదితరాల్లో ఏదైనా కావచ్చు… మా తోడ్పాటు కీలకంగా ఉంటోంది. నేడు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి, ప్రగతికి తోడ్పడుతున్న దేశాల్లో భారత్ పోషిస్తున్న పాత్ర అద్వితీయం. తమ నిగూఢ సామర్థ్యాన్ని సాకారం చేసేందుకు తగిన విధాన పర్యావరణం, అవకాశాలు లభిస్తే ప్రపంచంలో తామెవరికీ తీసిపోబోమని భారతీయులు ఇప్పటికే రుజువు చేశారు.
భారతీయుల ‘జీవన సౌలభ్యం’ మెరుగు కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని మేమిప్పుడు నడుపుతున్నాం. అలాగే మెరుగైన మౌలిక సదుపాయాలు, సేవలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంద్వారా ఉత్పాదక సామర్థ్యం పెంపునకు కృషిచేస్తున్నాం. ప్రతి గ్రామాన్నీ విద్యుదీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది; దేశంలోని 350 మిలియన్ల మందికిపైగా పౌరులను బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చాం; సామాజిక సంక్షేమ పథకాల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాం; గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో 150 మిలియన్లకుపైగా మరుగుదొడ్లను నిర్మించాం; సేవల డిజిటలీకరణ ద్వారా పాలనను మెరుగుపరిచాం, సాంకేతిక-ఆర్థిక ఉత్పత్తులకు అత్యంత జోరుగా వృద్ధిచెందుతున్న విపణిగా రూపొందడానికి వేగంగా అడుగులు వేస్తున్నాం; భారత ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధి మార్గంలోకి తీసుకెళ్లాం. ప్రపంచ బ్యాంకు ప్రకటించే వాణిజ్య సౌలభ్య సూచీలో దాదాపు 80 స్థానాలు ఎగువకు దూసుకెళ్లాం. మా అత్యుత్తమ వారసత్వాన్ని సంరక్షించుకోవడంతోపాటు ప్రజాస్వామ్య చట్రం పరిధిలోనే ఇదంతా సాధించాం.
భారతదేశంలో అత్యధిక స్థాయిలో ఆవిర్భవిస్తున్న ఆకాంక్షభరిత మధ్యతరగతికి ప్రాథమిక అవసరాలన్నీ అందుబాటులోకి రావడంతో జీవనపథంలో ఎగువకు దూసుకెళ్లే అవకాశాల కోసం అది ఎదురుచూస్తోంది. ‘‘అందరి తోడ్పాటుతో అందరి ప్రగతి.. అందరి విశ్వాసం’’ అన్నదే మా తారకమంత్రం. అంటే- అందరి సహకారంతో అందరి అభివృద్ధి ద్వారా అందరి విశ్వాసాన్నీ చూరగొనడం అన్నమాట! ‘అందరి తోడ్పాటు’ అంటే ఒక్క మా పౌరులు మాత్రమేగాక ‘మొత్తం మానవాళి’ అన్నది మా ఉద్దేశం. అందుకే మా స్నేహపూర్వక పొరుగు దేశాలతో ప్రగతి భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో చురుగ్గా కృషిచేస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ, సీమాంతర సవాళ్లను ఎదుర్కొనడంపై అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించాలని కూడా మేం ఆకాంక్షిస్తున్నాం. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నుంచి కోలుకోగల మౌలిక వసతుల కల్పన కూటమి కోసం కృషి ఇందులో భాగమే.
సమకాలీన వాస్తవాల నేపథ్యంలో బహుపాక్షికత బలోపేతానికి, సంస్కరణలకు భారతదేశం బలమైన మద్దతుదారుగా నిలుస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితి నడుమ వేగంగా వృద్ధి చెందుతున్న బలమైన, ప్రజాస్వామ్య భారతం ఇకమీదట కూడా శాంతికి, సుస్థిరతకు, సౌభాగ్యానికి దారిచూపే కరదీపికగా కొనసాగుతుంది. ఈ 21వ శతాబ్దం ఆసియాదేనన్న నినాదానికి తగిన రీతిలో ఆసియా ఖండంతోపాటు పరివర్తనాత్మక ప్రపంచం దిశగా తన వంతు కృషికి భారత్ సదా సిద్ధంగా ఉంటుంది.
భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో ఆసియాన్ ప్రాముఖ్యం ఏమిటి?
‘తూర్పు కార్యాచరణ విధానాని’కి ఆసియాన్ కేంద్రకం. తదనుగుణంగా ఇప్పటికి 16 ఏళ్లుగా సాగుతున్న నిరంతరాయ శిఖరాగ్ర స్థాయి సంప్రదింపులకు మాకున్న ఏకైక సహకార యంత్రాంగం ఇదే. హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఆసియాన్ ఒక ప్రధాన ముఖద్వారం కావడం, నాగరకతపరంగా సన్నిహితమైనది కావడం వంటివి మాత్రమేగాక ప్రపంచంలో నేడు ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత చురుగ్గా ఉన్న ప్రాంతాల్లో ఆసియాన్ ఒకటి కావడం కూడా ఇందుకు కారణం. గతిశీల ఇండో-పసిఫిక్ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించగల బలమైన, ఏకీకృత సుసంపన్న ఆసియాన్ సాకారం కావాలన్నదే భారత్ ఆకాంక్ష. భారతదేశ శ్రేయస్సు, భద్రత ప్రయోజనాల దృష్ట్యా కూడా ఇది అత్యంత ఆవశ్యకం. అందుకే ఆసియాన్‌తో బంధం ఇప్పుడు… ఎప్పుడూ ‘తూర్పు కార్యాచరణ విధానం’, వ్యూహంలో కీలకాంశంగానే కొనసాగుతుంది. మా దేశాల మధ్య నాగరకతపరమైన సాన్నిహిత్యం ఒక బలమైన పునాదిగా మేం చురుకైన, అత్యాధునిక, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నాం. ఆసియాన్ బలోపేతం, అనుసంధాన విస్తృతి, భారత-ఆసియాన్ ఆర్థిక సమగ్రత ప్రగతి కూడా మా ‘తూర్పు కార్యాచరణ విధానం’లో కీలక ప్రాథమ్యాలే. ఆసియాన్‌కు నేతృత్వం వహిస్తున్న థాయ్‌లాండ్- ఈ కూటమితో భారత సన్నిహిత సంబంధాలను సజావుగా నడిపిస్తున్నందుకు మేమెంతో కృతజ్ఞులమై ఉంటాం.
ప్రాంతీయ భద్రత స్వరూపంలో ఎలాంటి పాత్ర పోషించాలని భారత్ భావిస్తోంది?
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన వైఖరిని భారత్ ఇప్పటికే స్పష్టం చేయడంతోపాటు ఈ ప్రాంతంలోని దేశాలన్నీ దానితో ఏకీభవించాయి. సముద్రాంతర అంశాల ప్రాధాన్యాన్ని, పరస్పర అనుసంధాన స్వభావాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. దీనికి సంబంధించి మా అభిప్రాయాలను సింగపూర్‌లో నిరుడు నిర్వహించిన ‘షాంగ్రి-లా చర్చల’ సందర్భంగా నేను సుస్పష్టంగా వివరించాను. ఇండో-పసిఫిక్ ప్రాంతీయ భద్రత స్వరూపం అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు దాపరికంలేనిదిగా, పారదర్శకంగా, సార్వజనీనంగా, నియమబద్ధంగా ఉండాలన్నది మా నిశ్చితాభిప్రాయం. ఏ ప్రాంతీయ భద్రత స్వరూపానికైనా అంతర్జాతీయ చట్టాలతోపాటు సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణమైన రీతిలో సముద్ర-గగనతల ప్రయాణ స్వేచ్ఛ, అవరోధరహిత వాణిజ్యంసహా సుస్థిర సముద్ర భద్రత వాతావరణం అవసరం.
ఈ అంశానికి సంబంధించి ‘ఈ ప్రాంతంలో అన్నిదేశాలకూ భద్రత, ప్రగతి’ పేరిట నేను 2015లోనే ‘సాగర్’ అనే భావనను ప్రతిపాదించాను. హిందీ భాషలో ‘సాగర్’ అంటే ‘సముద్రం’ అని అర్థం. పరస్పర విశ్వాసాన్ని, భద్రత సహకారాన్ని విస్తృతం చేసుకోవడంద్వారా ఈ భావనను సాకారం చేసుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ఆ మేరకు ప్రాంతీయ భద్రత స్వరూపం, తదనుగుణ సూత్రావళిపై ఏకాభిప్రాయ సాధనకు, సామూహిక భద్రత సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రస్తుత చట్రాలు, యంత్రాంగాల ప్రాతిపదికన ఆచరణాత్మక సంస్థాగత చట్రం రూపకల్పనకు భారత్ కృషి చేస్తుంది.
ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ వైఖరితో భారత ఇండో-పసిఫిక్ దృష్టికోణం ఎలా మమేకం కాగలదు?
ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ వైఖరి ప్రత్యేకించి… సూత్రావళి, విధానాలపరంగా మా దృక్కోణంతో గణనీయస్థాయిలో మమేకం కావడాన్ని మేం అభినందిస్తున్నాం. ఇండో-పసిఫిక్ దృక్కోణం రూపకల్పనలో ఆసియాన్ ఐక్యత, కేంద్రస్థానం కీలకాంశామని మేం విశ్వసిస్తున్నాం. ఈ ప్రాంతంలో భౌగోళిక కేంద్రక స్థానం గుర్తింపు దృష్ట్యానే కాకుండా ఆసియాన్ నేతృత్వంలోగల యంత్రాంగాలు… ప్రత్యేకించి దేశాధినేతలు సారథ్యం వహించే తూర్పు ఆసియా కూటమి వంటివి కూడా ఇందుకు కారణం. అంతేకాదు… ఈ ప్రాంతంలోని ప్రధాన సమస్యలపై చర్చలకు ప్రస్తుతం అందుబాటులోగల అత్యంత సార్వజనీన వేదిక కూడా ఇదే. శాంతియుత, సౌభాగ్య ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణంలో సముద్ర భద్రత, అనుసంధానం, ఆర్థిక వృద్ధి, సుస్థిర ప్రగతి తదితరాలు ప్రధానంగాగల విధానాలకే మాతోపాటు ఆసియాన్ కూడా ప్రాముఖ్యమిస్తోంది. ఈ లక్ష్యాలను సాధంచడంలో మా భాగస్వాములైన ఆసియాన్ దేశాలతో కలసి కృషిచేయడంపై మేమెంతో సంతోషిస్తున్నాం.
అనేక ప్రాంతీయ శక్తులు పోటీ పడుతున్న మెకాంగ్ ఉప-ప్రాంతంలో ప్రగతిపై మీరు ఆందోళన పడుతున్నారా?
ఈ ప్రాంతంలోని దేశాలతో సముద్ర, వాణిజ్య, సాంస్కృతిక, నాగరకత పరమైన అనుబంధాలకు సంబంధించి భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. నేటి ప్రపంచంలో ఈ సంబంధాలన్నిటినీ మేం మళ్లీ నవీకరించడంతోపాటు సరికొత్త ప్రాంతీయ భాగస్వామ్యాలను సృష్టించాం. అటువంటివాటిలో 19 ఏళ్లకిందట రూపొందిన ‘మెకాంగ్-గంగా’ సహకార ఒడంబడిక కూడా ఒకటి. థాయ్‌లాండ్ నాయకత్వంలోని అయొవడీ-ఛావో ఫ్రాయా-మెకాంగ్ ఆర్థిక సహకార వ్యూహం (ACMECS)లో భారత్ ఇటీవలే భాగస్వామిగా చేరింది. తదనుగుణంగా సహకార కృషి పునరావృతం కాకుండా చూడటంతోపాటు ఏకీకృతమయ్యేలా మెకాంగ్ ప్రాంతం వెలుపలి ప్రధాన భాగస్వామ్య దేశాలన్నిటినీ మేము ఒకే తాటిపైకి తెస్తాం. అదే సమయంలో విలక్షణ వ్యవస్థల గురించి మాకు తెలుసు కాబట్టి ఈ ప్రాంతీయ చట్రాలపైనా దృష్టిపెడతాం. భారతదేశానికి సంబంధించినంతవరకూ ఉదాహరణకు- మెకాంగ్ దేశాల చట్రాలకు లోబడి ఆసియాన్-భారత సంప్రదింపుల వ్యవస్థ, మెకాంగ్-గంగా సహకార సంస్థ, బిమ్‌స్టెక్ తదితర వ్యవస్థలతో కలసి కృషిచేస్తున్నాం. ఈ చట్రాల మూల సూత్రాలలో పునరుక్తి ఉన్నట్లు అనిపించినప్పటికీ ఉపకరణాలు, ప్రక్రియలు, సహకారాల రీత్యా ప్రభావంలో మార్పు స్పష్టంగా గోచరిస్తుంది. మెకాంగ్ ఉప-ప్రాంతంలోని బహుళ ప్రాంతీయ సమూహాల సామరస్యపూరిత సహజీవనంసహా ఆ ప్రాంత ప్రగతి, శ్రేయస్సు కోసం స్థానిక-వెలుపలి భాగస్వాముల మధ్య సమన్వయానికి తగినన్ని అవకాశాలున్నాయి.
విస్తృతమైన ‘తూర్పు కార్యాచరణ విధానం’లో బిమ్‌స్టెక్ ఎలా ఇముడుతుంది?
‘బహుళ రంగాల్లో సాంకేతిక-ఆర్థిక సహకారం కోసం బంగాళాఖాత తీర దేశాల ఒడంబడిక’ (BIMSTEC)కు భారతదేశం విశేష ప్రాధాన్యమిస్తోంది. దక్షిణాసియా-ఆగ్నేయాసియాల మధ్య ఇదొక విశిష్ట అనుబంధం ఏర్పరుస్తుంది. దక్షిణాసియాలోని ఐదు దేశాలు (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక)సహా ఆగ్నేయాసియాలోని రెండు దేశాలు (మయన్మార్, థాయ్‌లాండ్) బిమ్‌స్టెక్ సభ్యత్వం కలిగి ఉన్నాయి. కఠ్మాండూలో జరిగిన 4వ బిమ్‌స్టెక్ సదస్సు ప్రాంతీయ సహకారానికి మరింత ఊతమిచ్చింది. అంతేగాక బిమ్‌స్టెక్ వ్యవస్థాగత యంత్రాంగాల బలోపేతం, కూటమి నియమావళి రూపకల్పన, బిమ్‌స్టెక్ అభివృద్ధి నిధి ఏర్పాటు అవకాశాల అన్వేషణకూ వీలు కల్పించింది. ఈ సదస్సు తీర్మానాల రూపకల్పనలో భారత్ చురుకైన పాత్ర పోషించింది. బిమ్‌స్టెక్ పరిధిలో భద్రత, విపత్తుల నిర్వహణ, ఆర్థిక-వాణిజ్య, వ్యవసాయ, ఆరోగ్య, డిజిటల్ అనుసంధానం తదితర రంగాల మధ్య సహకారం, సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంపై భారత్ తీసుకునే అనేక చర్యలను మేం ప్రకటించాం. దీంతోపాటు సాంస్కృతిక, యువతరం సంధానం కార్యకలాపాలను ప్రోత్సహించే కార్యక్రమాల గురించి కూడా వెల్లడించింది. మా ‘తూర్పు కార్యాచరణ విధానం’లో బిమ్‌స్టెక్ ఒక కీలక భాగమని భారత్ గట్టిగా విశ్వసిస్తోంది. ఈ ఏడాది మే నెలలో మా ప్రభుత్వం రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో బిమ్‌స్టెక్ దేశాల అధినేతలు హాజరు కావడం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఇది మాకెంతో గౌరవం మాత్రమేగాక మా దేశాలు, అధినేతల మధ్య సన్నిహిత బంధాన్ని జ్ఞప్తికి తెచ్చే ఉదంతం. బిమ్‌స్టెక్ పరిధిలో సహకార బలోపేతానికి థాయ్‌లాండ్ గణనీయ మద్దతివ్వడాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాను.
ఆర్‌సిఇపి వాణిజ్య ఒప్పందంలో చేరడంపై భారత్‌కు ఆసక్తి లేదన్న వాదన ఉంది.. ఈ ఏడాది ఆర్‌సిఇపి చర్చలు పూర్తవుతాయని మీరు భావిస్తున్నారా.. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏంచేయాలంటారు?
ప్రపంచంలోని అత్యంత వ్యాపారానుకూల దేశాల్లో ఇవాళ భారతదేశం ఒకటిగా ఉంది. ‘వాణిజ్య సౌలభ్యం’పై ప్రపంచ బ్యాంకు ప్రకటించే ర్యాంకులలో నాలుగైదేళ్ల కిందట 142వ స్థానంలో ఉన్న భారత్ ఈ తాజా సూచీలో ఏకంగా 63వ స్థానానికి దూసుకెళ్లడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక వ్యవస్థల మధ్య సమగ్రత, పేదల అభ్యున్నతి దిశగా అంతర్జాతీయ వాణిజ్యానికిగల శక్తిపై మాకు నమ్మకం ఉంది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌సిఇపి చర్చల్లో సమగ్ర, సమతూకపు ఫలితం రాబట్టడంపై భారత్ చిత్తశుద్ధితో ఉంది. ఇందులో భాగస్వామ్యంగల దేశాలన్నిటికీ చర్చలు విజయవంతంగా ముగియడం అవసరం. అందువల్ల వస్తువులు, సేవలు, పెట్టుబడులుసహా అన్ని అంశాల్లోనూ సమతూకాన్ని భారత్ ఆకాంక్షిస్తోంది. వస్తువులకు సంబంధించి మా భాగస్వాములు ఎన్నో ఆకాంక్షలతో ఎదురుచూడటాన్ని గుర్తించాం. కాబట్టి అందరికీ ప్రయోజనకరమైన ఫలితాన్నే మేమూ కోరుకుంటున్నాం. ఈ దిశగా అస్థిర వాణిజ్య లోటుకు సంబంధించి మా సమస్యల పరిష్కారం ముఖ్యమని భావిస్తున్నాం. అంటే- విస్తృత భారత విపణి లభ్యత కోరే భాగస్వాములు మా వ్యాపారాలకు అవకాశమున్న రంగాల్లో లబ్ధినిచ్చే విపణిని మాకూ అందుబాటులో ఉంచాలన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని అభిలషిస్తున్నాం. ఆ మేరకు హేతుబద్ధ ప్రతిపాదనలను సుస్పష్టంగా ముందుకు తెచ్చి, చిత్తశుద్ధితో సంప్రదింపులలో పాల్గొంటున్నాం. సేవలకు సంబంధించి మా భాగస్వాముల ఇబ్బందులను పరిష్కరించేందుకు మేం సంసిద్ధంగా ఉన్నప్పటికీ, తదనుగుణ స్థాయిలో వారినుంచి ప్రతిస్పందనను కోరుకుంటున్నాం. మొత్తంమీద భారత్ సహా చర్చల్లో భాగస్వాములైన అన్ని పక్షాలకూ సహేతుక లబ్ధి కలిగే పరస్పర ప్రయోజనకర, పారదర్శక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్యం అవసరమన్నదానిపై మా అభిప్రాయం సుస్పష్టంగా ఉంది.