శ్రీ రామ్నాథ్ కోవింద్, బీహార్ గవర్నర్
మంగోలియా నుంచి విచ్చేసిన గౌరవనీ యులు ఖంబాలామా సిహెచ్ దెంబరెల్
తైవాన్ నుంచి విచ్చేసిన గౌరవనీ యులు మింగ్ క్వాంగ్ షి
వియత్నాం నుంచి విచ్చేసిన గౌరవనీ యులు తిచి థీన్ తామ్
రష్యా నుంచి విచ్చేసిన గౌరవనీ యులు తెలో తుల్కు రింపోచె
శ్రీలంక నుంచి విచ్చేసిన గౌరవనీ యులు బనగాల ఉపతిస్స
గౌరవనీయ లామా లోబ్జాంగ్
నా మంత్రివర్గ సహచరుడు శ్రీ కిరెన్ రిజిజూ
భూటాన్ మంత్రివర్యులు నాంగే దోర్జి
మంగోలియా మంత్రివర్యులు బయర్సైఖాన్
గౌరవనీయ మహాసంఘ సభ్యులు, కార్యక్రమానికి విచ్చేసిన దౌత్యవేత్తలు, మంత్రులు
మీ అందరి మధ్యన ఇలా నిలబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. బోధ్గయలో ఉండే భాగ్యం నాకు లభించడం ఆనందదాయకం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఈ పవిత్ర స్థలానికి వచ్చే భాగ్యం నాకు లభించింది.
భారతదేశానికి రెండవ రాష్ర్టపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళిగా భారత్లో మేమందరం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్న గొప్ప తరుణంలో మీ అందరితో నేను సమావేశం కావడం ఈ రోజు విశేషం.
ఈ సమ్మేళనంలో మనందరం ప్రపంచ చరిత్రనే ప్రభావితం చేసిన మహా బోధకుడు గౌతమ బుద్ధుని గురించి చర్చించుకుంటున్నాం. శతాబ్దాలుగా ఆయన బోధనలు ఎందరిలోనో స్ఫూర్తిని నింపాయి.
ఇదే రోజు మేం భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి కూడా నిర్వహించుకుంటున్నాం. భగవాన్ కృష్ణుని నుంచి ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కృష్ణుని గురించి మాట్లాడాల్సివస్తే “కృష్ణం వందే జగద్గురుం” అని సంబోధిస్తాం. శ్రీకృష్ణ భగవానుడు ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు, గురువులకే గురువు.
గౌతమ బుద్ధుడు, కృష్ణ భగవానుడు ఇద్దరూ ప్రపంచానికి ఎంతో విలువైన విషయాలు బోధించారు. ఆ మహాబోధకులు ప్రవచించిన విలువలు, ఆదర్శాల స్ఫూర్తితోనే ఈ సమ్మేళనంలో చర్చనీయాంశాలకు రూపకల్పన జరిగింది.
కృష్ణ భగవానుడు ఐతిహాసికంగా అతి పెద్దదైన మహాభారత యుద్ధానికి ముందు తన సందేశాన్ని ప్రపంచానికి వివరిస్తే యుద్ధానికి అతీతంగా ఆలోచించాలని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. ఇద్దరూ ఇచ్చిన సందేశం ఒక్కటే..ధర్మస్థాపన.
ఉభయులూ సిద్ధాంతాలు, విధానాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఎనిమిదంచెల మార్గాన్ని, పంచశీలను ప్రబోధించాడు. శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధించడం ద్వారా అత్యంత విలువైన జీవితసత్యాలను ప్రపంచానికి అందించాడు. ఈ ఇద్దరు పవిత్ర మూర్తులు భేదభావాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటిగా చేయగల శక్తి గలవారు. వారి బోధనలు అత్యంత ఆచరణీయం, దైవదత్తం. తెరమరుగైపోయిన శకాల కన్నా మనందరం జీవనం సాగిస్తున్న ప్రస్తుత యుగానికి అత్యంత అవసరం.
మనందరం కలుసుకున్న ఈ ప్రదేశం మరింత ప్రత్యేకమైనది. మానవాళి చరిత్రలోనే ప్రత్యేక స్థానం గల బోధ్గయలో మనందరం ఈ రోజు సమావేశమయ్యాం.
చైతన్యతా స్ఫూర్తికి ప్రతీక ఈ భూమి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి సిద్ధార్థుని పొందింది. కాని మేథస్సు, శాంతి, కరుణలకు చిహ్నంగా చెప్పదగిన బుద్ధభగవానుని ప్రపంచానికి అందించింది.
జన్మాష్టమి, ఉపాధ్యాయ దినోత్సవం వంటి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమై చర్చలకు ఉద్యుక్తులం కావడానికి ఇది ఆదర్శనీయమైన ప్రదేశం.
ఘర్షణల నివారణ-పర్యావరణ చైతన్యంపై అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య మద్దతుతో వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్, టోక్యో ఫౌండేషన్ మొన్న నిర్వహించిన తొలి అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభోత్పవంలో పాల్గొనే అవకాశం రావడం నాకు ఎంతో గర్వకారణం.
ప్రపంచం దృష్టిని ఘర్షణల పరిష్కారం నుంచి ఘర్షణల నివారణ వైపు, పర్యావరణ నియంత్రణ నుంచి పర్యావరణ చైతన్యం వైపు మరలించడం ప్రధాన సూత్రంగా ఈ సమ్మేళనం నిర్వహించడం ముదావహం.
ముందెన్నడూ కనివిని ఎరుగనంత స్థాయిలో మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ రెండు ప్రధాన సమస్యలపై నా భావాలను ఇప్పటికే మీతో పంచుకున్నాను. సంఘర్షణల నివారణ, పర్యావరణ నియంత్రణ యంత్రాంగాల విషయంలో ప్రపంచం ఆలోచనా ధోరణిని మార్చి బుద్ధుని మార్గం వైపు మరలించాల్సిన అవసరాన్ని నేను ప్రస్తావించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రెండు సమస్యలకు సంబంధించిన పరిణామాలను మదింపు చేయడంలో మనం విఫలం అవుతున్నాం. అంతే కాకుండా జాతీయ రాజ్యాల ఆలోచనా ధోరణులపైనే ఈ రెండు అంశాలు ఆధారపడి ఉన్నాయి.
ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన మతనాయకులు, మేథావులు…ప్రధానంగా బౌధ్ధ సంఘాల వారు రెండు రోజుల పాటు జరిగిన ఆ సమ్మేళనంలో పాల్గొని ఆ రెండు కీలక సమస్యలపై చర్చించారు. ఆధ్యాత్మిక, మత నాయకులు, మేథావులు తీవ్రస్థాయిలో చర్చలు నిర్వహించిన అనంతరం 2016 జనవరిలో ఇదే తరహా సమ్మేళనం మరొకటి నిర్వహించనున్నట్టు టోక్యో ఫౌండేషన్ ప్రకటించింది. బౌద్ధమతాన్ని ఆచరిస్తున్న దేశాలు కూడా తమ ప్రాంతాల్లో ఇదే తరహా సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించాయి.
ఆసియా ఆర్థిక శక్తిగాను, పౌరసమాజానికి ప్రతీకగాను ఎదుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి తీర్మానం అసాధారణమైనది. హిందూ-బౌద్ధ నాగరిక, సాంస్కృతిక దృక్కోణానికి అనుగుణంగా సంఘర్షణల నివారణ, పర్యావరణ చైతన్య సిధ్దాంతాలను ఆసియా వెలుపలికి కూడా వ్యాపింపచేయాలన్న సుస్పష్టమైన హామీతో ఈ సమ్మేళనం ప్రధాన చర్చనీయాంశాలను రూపొందించారు.
ఆ రెండు రోజుల సమ్మేళనం ఈ రెండు కీలక సమస్యలపై స్థూల ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. సంఘర్షణల విషయానికి వస్తే ప్రధానంగా మతపరమైన అసహనం కారణంగానే అవి చెలరేగుతున్నాయన్నది వాస్తవం. తమ తమ సిద్ధాంతాలను ఆచరించుకునే స్వేచ్ఛ ప్రతీ ఒక్క మతానికి ఉన్నప్పటికీ ఆయా మతాల్లోని మౌఢ్య శక్తులు ఆ సిద్ధాంతాలను లేదా విశ్వాసాలను ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినప్పుడే సంఘర్షణలు చెలరేగే ఆస్కారం ఉంటుందని వక్తలు తీర్మానించారు. అలాగే మనం ధర్మతత్వాన్ని విస్మరించినందువల్లనే మనం ప్రకృతిసిద్ధమైన రక్షణను కోల్పోతున్నట్టు సమావేశం గుర్తించింది. సుస్థిర వృద్ధికి కూడా ఇదే పెద్ద అవరోధంగా పరిణమించింది. స్థానిక సంస్కృతిని మిళితం చేస్తూ అభివృద్ధి లక్ష్యాలను రూపొందించుకున్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
అంతర్జాతీయ దృక్పథంలో ఏర్పడిన ఈ సానుకూల ధోరణిని ఆసరా చేసుకుని హిందూబౌద్ధ సమాజాలు ఈ రెండు కీలక అంశాలపై తమ ఆలోచనా ధోరణులను అంతర్జాతీయ స్థాయికి వ్యాపింపచేసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. రెండు సమస్యలపైన చక్కని ఆలోచనా ధోరణులు కొరవడిన అంతర్జాతీయ సమాజంలోసంఘర్షణల నివారణ-పర్యావరణ చైతన్యంపై ఇప్పుడు జరిగిన ఈ సమ్మేళనం అత్యంత కీలకమైనదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.
గౌతమ బుద్ధుడు ప్రబోధించిన బోధనల వల్ల అమితంగా ప్రభావితమైనది హిందూతత్వం.
హిందూయిజంపై బుద్ధుని ప్రభావాన్ని చాలా మంది పండితులు విశ్లేషించారు. వాస్తవానికి ఆది శంకరులు బౌద్ధసిద్ధాంతాలకు ప్రభావితులు కావడంపై విమర్శలు కూడా చెలరేగాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆది శంకరులను ప్రచ్ఛన్న బౌద్ధునిగా (శంకరుల ముసుగులో ఉన్న బుద్ధుడు) అభివర్ణించారు. ఆది శంకరులపై బుద్ధుని ప్రభావం ఎంత ఉన్నదనేందుకు ఈ ఉదాహరణ ఒక్కటి చాలును. జయదేవుడు గీతగోవిందంలో బుద్ధుని మహావిష్ణువుగా అభివర్ణించడమే కాకుండా అహింసను బోధించేందుకు సాక్షాత్తు భగవంతుడే భువికి దిగివచ్చాడని చెప్పాడంటే సమాజంపై బుద్ధుని ప్రభావం ఎంత లోతుగా ఉందో అర్ధం చేసుకోవచ్చును. బుద్ధుని అవతారం తర్వాత హిందూయిజం బౌద్ధ హిందూయిజం లేదా హిందూ బుద్ధిజంగా మారిందంటే అతిశయోక్తి కాదు. నేడు ఆ రెండూ అవిభాజ్యం.
భారతదేశానికి ఒక చక్కని ఆధ్యాత్మిక గురువు అవసరం అయిన వేళ బుద్ధుడు అవతరించినట్టు స్వామి వివేకానంద చెప్పిన మాటలు నేను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నాను.
వేదానికి గాని, కులం, ప్రవక్త, ఆచారానికి గాని బుద్ధుడు ఎప్పుడూ తల వంచలేదు. హేతుబద్ధత తనని ఎక్కడకు నడిపిస్తే అక్కడకు ఆయన నిర్భయంగా నడిచాడు. నిర్భీతితో ఆయన సాగించిన సత్యశోధన, ప్రపంచంలోని జీవరాశులన్నింటి పట్ల ప్రేమ భావం ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు.
ఏ బోధకుని కన్నా సాహసి, చిత్తశుద్ధి గల వాడు బుద్ధుడు.
పూర్తి స్థాయి నైతికతతో కూడిన ఒక వ్యవస్థను అందించిన తొలి మానవీయుడు బుద్ధుడు. మంచి కోసమే మంచిని, ప్రేమ కోసమే ప్రేమను ఆయన ఆచరించాడు.
సమానత్వాన్ని ప్రబోధించిన గొప్ప బోధకుడు ఆయన. ప్రతీ ఒక్క పురుషునికి, మహిళకు ఆధ్యాత్మికత శిఖరాన్ని చేరగల హక్కు సమానంగా ఉన్నదన్నదే ఆయన బోధన.
భారతదేశానికి చెందిన మతపండితులు కూడా తమ సాహిత్యంలో బుద్ధుడు ప్రబోధించిన విలువలు ప్రచారం చేశారు గనుక ఈ భూమిని నేను వ్యక్తిగతంగా బుద్ధిస్ట్ ఇండియాగా వ్యవహరిస్తున్నాను.
హిందూ తాత్వికులు ఇంత గొప్ప నివాళి అర్పించినప్పుడు నేటి హిందూయిజంను బుద్ధిస్ట్ హిందూయిజంగా వ్యవహరించడంలో తప్పేమైనా ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నాను.
సర్వమతారాధనను గుర్తించిన భారతజాతికి కిరీటంలో కలికి తురాయి బుద్ధుడు. ఎందరో మహామత నాయకులు మలచిన మణిహారం హిందూయిజం. వారిలో అతి ప్రముఖుడు బుద్ధుడు. భారత లౌకిక స్వభావానికి ఇదే దర్పణం.
బోధ్ గయలో బుద్ధుడు సాధించిన సత్యదర్శనమే హిందూయిజం ప్రవచించే సత్యం.
ఈ ప్రాచీన జాతి తొలి సేవకునిగా నేను బుద్ధుని హిందూయిజానికే కాదు…యావత్ ప్రపంచానికి ఒక సంస్కర్తగా నేను గౌరవిస్తాను. ప్రపంచంలోని అందరూ సమైక్యంగా జీవనం సాగించేందుకు కావలసిన ఒక దృక్పథాన్ని ఆయన మనకి అందించాడు.
ఒక యాత్రా స్థలంగా బోధ్గయను ప్రపంచంలోని బౌద్ధులందరూ ఎలా గౌరవిస్తారో నాకు తెలుసు. భారత్కు, బౌద్ధ ప్రపంచానికి మధ్య నాగరికతా వారధిగాను, ఆధ్యాత్మిక రాజధానిగాను బోధ్ గయను అభివృద్ధి చేయాలన్నది భారత ప్రజల ఆకాంక్ష. ఈ పవిత్ర ప్రార్థనా స్థలాల నుంచి బౌద్ధ మతాన్ని ఆరాధించే దేశాలు ఏమి కోరుకుంటున్నాయో అవన్నీ అందించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
బౌద్ధ మతం, మతనాయకుల ప్రకటనను చదవడానికి అవకాశం వచ్చినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. భవిష్యత్కు బాటను చూపే కరదీపిక వంటిది ఈ ప్రకటన. ఎందరో అహరహం శ్రమించి తీవ్ర వాదోపవాదాల అనంతరం రూపొందించిన పత్రం ఇది. సౌభ్రాతృత్వం, సౌహార్దతల స్ఫూర్తితో సహన భావాన్ని అలవరచుకోవాలంటూ జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించిన అభిప్రాయాన్ని నేను సమర్థిస్తున్నాను. ఈ విజ్ఞుల సమ్మేళనానికి ఆయన పంపిన సందేశం, దీన్ని ముందుకు నడిపేందుకు ఆయన ఇస్తున్న నిరంతర సహకారం మనందరికీ పెద్ద బలం.
మరోసారి మీ అందరికీ నా శుభాభినందనలు. ఘర్షణలకు అతీతంగా నాగరిక తతో కూడిన సామరస్యం, ప్రపంచ శాంతికి అవసరమైన చర్చలకు ఈ సమ్మేళనం చక్కని బాట వేసింది. కొంగ్రొత్త ఆశలు నింపింది. మనం సాధించిన ఈ పరిణతిని భవిష్యత్ తరాలకు అందించేందుకు మీరందరూ నిరంతరం, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని, ఆచరణసాధ్యం చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు…యావత్ మానవాళి పురోగతికి, ప్రకృతి మాత మనకి అందించిన ఈ సుందరమైన పరిసరాలు కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం.
మీ అందరికీ బహుథా కృతజ్ఞతలు…అభివాదాలు…
Some glimpses from Mahabodhi Temple. Feeling very blessed. pic.twitter.com/VF8oBml7EN
— Narendra Modi (@narendramodi) September 5, 2015
Some glimpses from Mahabodhi Temple. Feeling very blessed. pic.twitter.com/VF8oBml7EN
— Narendra Modi (@narendramodi) September 5, 2015