బుందేల్ ఖండ్, విదర్భ, మరియు మహారాష్ట్ర లలో కరవు పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష జరపాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. ఇటువంటి తొలి సమీక్ష బుందేల్ ఖండ్ కు సంబంధించి ఈ నెల 9న ప్రధాన మంత్రి కార్యాలయంలో జరిగింది. యు పి ప్రధాన కార్యదర్శి, మరియు ఆయన నాయకత్వంలోని బృందం ఈ సందర్భంగా ఒక ప్రెజెంటేషన్ ను సమర్పించింది. ప్రభుత్వంలోని సంబంధిత విభాగాల కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.
సహాయక చర్యలు
కేంద్ర హోం శాఖ మంత్రి అధ్యక్షత వహించిన ఉన్నత స్థాయి సంఘం యు పి కి జాతీయ వైపరీత్యాల సహాయక నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) నుంచి రూ.1,304 కోట్ల కరవు సహాయం అందించాలని సిఫారసు చేసింది. ఈ సహాయక నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం రోజుల లోపల వ్యవసాయదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా అందిస్తుంది. 2016 రబీ సీజన్ కోసం యు పి ప్రభుత్వం ఒక విజ్ఞాపన పత్రాన్ని త్వరలోనే సమర్పించాలని నిర్ణయించారు. ఎస్ డి ఆర్ ఎఫ్ కింద 25 శాతం పరిమితిలో ఏమైనా మినహాయింపును ఇవ్వవచ్చా అనే అంశాన్ని కేంద్ర హోం వ్యవహారాల శాఖ పరిశీలించనుంది. అలాగే, ఫుడ్ కాంపొనెంట్ పంపిణీని 90 రోజుల తరువాత కొనసాగించవచ్చునా అనే అంశాన్ని కూడా పరిశీలించనుంది.
తాగు నీరు : బుందేల్ ఖండ్ ప్రాంతంలో ప్రత్యేకించి చిత్రకూట్ డివిజన్ పరిధిలోని మహోబా, చిత్రకూట్, బందా జిల్లా లలో తాగు నీటి స్థితిని పరిష్కరించడానికి ఒక సమగ్రమైన కంటింజెన్సీ ప్లాను సిద్ధంగా ఉన్నదని యు పి ప్రధాన కార్యదర్శి తెలిపారు. తాగు నీటిని సరఫరా చేస్తామని ఆయన హామీని ఇచ్చారు.
ఉపాధికల్పన మరియు బతుకుదెరువు : 2016- 17 ఆర్థిక సంవత్సరానికి బుందేల్ ఖండ్ లో ఎమ్ ఎన్ ఆర్ ఇ జి ఎస్ లో భాగంగా మ్యాన్ డేస్ ను 100 నుంచి 150 కి విస్తరించే ప్రతిపాదనను ఆమోదించారు. ఎమ్ ఎన్ ఆర్ ఇ జి ఎస్ కు చెందిన లేబర్ కాంపొనెంట్ కింద విడుదల అయిన రూ.700 కోట్లను అర్హులైన లబ్ధిదారులకు ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా పంపిణీ జరిగేటట్లు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకోనుంది.
ప్రత్యామ్నాయ ఆదాయ వనరును సమకూర్చడానికి నేషనల్ రూరల్ లైవ్ లీహుడ్ మిషన్ ను పటిష్టపరచి, దీని కవరేజి ని అన్ని బ్లాకులకు విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఆహార భద్రత : 2016 జనవరి ఒకటో తేదీ నుంచి ఎన్ ఎఫ్ ఎస్ ఎ ను అమలు చేస్తున్నట్లు యు పి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. తదనుగుణంగా బుందేల్ ఖండ్ లో ఆహార ధాన్యాల కేటాయింపును పెంచారు. ఎమ్ ఎన్ ఆర్ ఇ జి ఎస్ లబ్దిదారుల రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను అధిక ప్రాధమ్య ప్రాతిపదికన పూర్తి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడమైనది.
బుందేల్ ఖండ్ ప్యాకేజి
బుందేల్ ఖండ్ కు ఇదివరలో ఇచ్చిన ప్యాకేజీల అమలుకు ఈ సమావేశ చర్చాంశాలలో అగ్రతాంబూలమిచ్చారు. యు పి కి వాగ్దానం చేసిన మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను పూర్తి చేసేందుకు ఒకసారి గ్రాంటు కింద నీతి ఆయోగ్ 2016 మార్చి 31వ తేదీన రూ.264 కోట్లు విడుదల చేసిన సంగతిని ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వివిధ దశలలో ఉన్న 37 పైప్ డ్ వాటర్ పథకాలను అన్నింటినీ ప్రాధమ్య ప్రాతిపదికన పూర్తి చేసేలా చూస్తానని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడమైనది. దీనితో పాటు, ఈ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన వేర్ హౌసింగ్ మార్కెటింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను మరింత ఉత్తమంగా వినియోగించుకోవలసిన అవసరం ఉన్నట్లు గుర్తించారు.
దుర్భిక్ష నివారణ
బుందేల్ ఖండ్ కోసం వేరు వేరు ప్రాజెక్టులు, పథకాలలో భాగంగా వాటర్ ట్యాంకులు, డగ్ వెల్స్, ఫాం పాండ్స్ నిర్మాణాన్ని ప్రాధమ్య ప్రాతిపదికన చేపట్టాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్ సి ఇ ఒ సంప్రందించి, బుందేల్ ఖండ్ ప్రాంత ప్యాకేజిలో భాగంగా అందుబాటులోకి వచ్చిన నిధులలో నుంచి దుర్భిక్ష నివారణ దిశగా సరికొత్త పథకాలను చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయేమో అన్వేషిస్తారు.
వ్యవసాయం
బుందేల్ ఖండ్ లో నువ్వులను అత్యంత ప్రధానమైన ఖరీఫ్ పంటగా సాగు చేస్తారని సమావేశం దృష్టికి వచ్చింది. 2016-17 కు గాను నువ్వులకు ఎమ్ ఎస్ పి ని సత్వరం ప్రకటించాలని ఒక అంగీకారానికి వచ్చరు. బుందేల్ ఖండ్ ప్రాంతానికి ఎమ్ ఎస్ పి కన్నా మించి రూ.20 బోనస్ ను పరిశీలించే అవకాశం ఉంది. వ్యవసాయ కార్యదర్శి తో సంప్రదింపులు జరిపి నువ్వుల సేకరణకు ఒక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది.
బుందేల్ ఖండ్ లో వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడంపై దృష్టి నిలపడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా ఒక కొత్త ఉప పథకాన్న ప్రవేశపెట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం ఒక ప్రతిపాదనను పంపించనుంది.
పంటల బీమా : యు పి లో పంటల బీమా పథకం అమలు తీరు 7 శాతం నుండి 10 శాతానికి పరిమితమైనట్లు గుర్తించారు. అయితే బుందేల్ ఖండ్ లో మాత్రం విపత్తు రీత్యా ఈ పథకం అమలు తీరు సుమారు 30 శాతంగా ఉంది. 2014-15 రబీలో 3.34 లక్షల మంది రైతులకు రూ.250 కోట్లకు పైగాను, 2015 ఖరీఫ్ లో 2.16 లక్షల మంది రైతులకు దాదాపు రూ.180 కోట్ల వరకు క్లెయిములను పంపిణీ చేయడం జరిగింది.
ఇటీవల ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పి ఎమ్ ఎఫ్ బి వై) పరిధిలోకి సాధ్యమైనంత ఎక్కువ మంది వ్యవసాయదారులను తీసుకురావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. పంట రుణాలు తీసుకున్న రైతులు, అలాగే పంట రుణాలు తీసుకోని రైతులు కూడా ఈ పథకం పరిధిలోకి వచ్చేటట్లు చూడటానికి జిల్లా వారీ ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అంగీకారం కుదిరింది.
సాగు నీరు
రాష్ట్రం లోని జల వనరుల మరమత్తు, పునర్నిర్మాణం, పునరుద్ధరణ (ఆర్ ఆర్ ఆర్)లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న తొమ్మిది పథకాలకు ప్రాధాన్య క్రమంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని జల వనరుల కార్యదర్శిని కోరడం జరిగింది.
అర్జున్ సహాయక్, వరుణ్, బన సాగర్ సేద్యపునీటి పథకాలకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించడానికి నీతి ఆయోగ్ సి ఇ ఒ, యు పి జల వనరుల కార్యదర్శి, సేద్యపు నీటి పారుదల ప్రధాన కార్యదర్శి ఈ నెల 12వ తేదీన సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్ సి ఇ ఒ సంప్రదింపులు జరిపి, పెండింగులో ఉన్న తాగు నీటి సరఫరా ప్రతిపాదనలను వీలయినంత త్వరలో పరిష్కరిస్తారు.
సహకారాత్మక సమాఖ్య తత్వం
వేరు వేరు అభివృద్ధి ప్రతిపాదనల ప్రత్యేకించి.. పిఎమ్ జి ఎస్ వైలో భాగంగాను, తాగు నీరు, గ్రామాలకు విద్యుత్తు సదుపాయం సమకూర్చడం వంటి ప్రతిపాదనల అమలులో స్థానిక ప్రజా ప్రతినిధులు.. మరీ ముఖ్యంగా పార్లమెంటు సభ్యులతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని కూడా సమావేశంలో ఒక అంగీకారానికి వచ్చారు.
ప్రకృతి విపత్తులకు గురి అవుతున్న ప్రాంతాల సమస్యను
దీర్ఘ కాల ప్రాతిపదికన నిలకడైన పరిష్కార మార్గాలను కనుగొనడం కోసం ప్రధాన మంత్రి ఆశయం మేరకు మరియు సహకారాత్మక సమాఖ్య తత్వానికి అనుగుణంగా భారత ప్రభుత్వం, మరియు రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేయనున్నాయి.