Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బి పి ఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఎల్ పి జి కనెక్షన్ లను ఉచితంగా అందించే పథకం – ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం


దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బి పి ఎల్) కుటుంబాలకు చెందిన మహిళలకు ఎల్ పి జి కనెక్షన్ లను ఉచితంగా అందించే పథకం- ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ పథకం కింద బి పి ఎల్ కుంటుంబాలకు 5 కోట్ల ఎల్ పి జి కనెక్షన్ లను అందించడానికి రూ.8,000 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకంలో బి పి ఎల్ కుటుంబాలకు ఒక్కొక్క ఎల్ పి జి కనెక్షన్ కింద రూ.1,600 ఆర్ధిక సహాయం లభిస్తుంది. ఈ పథకానికి అర్హులయ్యే బి పి ఎల్ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని మూడు సంవత్సరాల పాటు అంటే 2016-17,2017-18, మరియు 2018-19 లలో అమలు చేస్తారు.

అత్యంత పేద కుటుంబాలకు చెందిన కోట్లాది మహిళలకు ప్రయోజనాన్ని చేకూర్చే ఒక సంక్షేమ పథకాన్ని పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అమలు చేయబోవటం దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి.

మన దేశంలో పేద ప్రజలకు పరిమితంగానే వంట గ్యాస్ (ఎల్ పి జి) అందుబాటులో ఉన్నది. ఎల్ పి జి సిలిండర్లు చాలా వరకు పట్టణ ప్రాంతాలలోను,సెమి- అర్బన్ ప్రాంతాలలోను.. అది కూడా మధ్య తరగతి కుటుంబాలకు, మరియు సంపన్న కుటుంబాలకే ఉన్నాయి. అయితే శిలాజ జనిత ఇంధనాలపై ఆధారపడి వంట చేసే పద్ధతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. డబ్ల్యుహెచ్ ఒ అంచనాల ప్రకారం – కేవలం శుద్ధి చేయని ఇంధనాలను వంటకు ఉపయోగించటం వల్లనే భారత దేశంలో దగ్గర దగ్గర 5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ అకాల మరణాలలో అనేకం గుండె జబ్బు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ కేన్సర్ ల వంటి అసాంక్రమిక వ్యాధుల ఫలితమే. చిన్న పిల్లలలో ఊపిరి పీల్చుకోవటానికి సంబంధించిన తీవ్ర అస్వస్థతలు పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందడానికి ఇంటి లోపలి గాలి కలుషితం కావడం కూడా ఒక కారణమౌతున్నది. ఆరుబయలు ప్రదేశంలో వంటగదిని పెట్టుకోవడం అంటే గంటకు 400 సిగరెట్లు కాల్చటంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బి పి ఎల్ కుటుంబాలకు ఎల్ పి జి కనెక్షన్ లను సమకూర్చితే దేశంలో అందరినీ వంటగ్యాస్ సదుపాయం పరిధిలోకి తీసుకువచ్చినట్లు అవుతుంది. ఈ ఫథకం మహిళలకు సాధికారితను కల్పించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అంతేకాదు బండచాకిరిని, వంట కోసం ఎక్కువ సమయం వెచ్చించడాన్ని తగ్గిస్తుంది కూడా. దీంతో పాటు వంట గ్యాస్ సరఫరా వ్వవస్థలో గ్రామీణ యువత పాలు పంచుకొనే అవకాశాలను కల్పించి వారి ఉపాధికి బాట వేస్తుంది.

ఈ దిశగా ఆర్థిక మంత్రి 29.2.2016న తన బడ్జెటు ప్రసంగంలో రూ. 2,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు గురించి ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 1.5 కోట్ల మహిళలకు ఈ నిధులను వినియోగించి ఎటువంటి ధరావతు లేకుండానే ఎల్ పి జి కనెక్షన్ లను ఇస్తారు. దీనికి తోడు, ఈ పథకాన్ని మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగించి మొత్తం 5 కోట్ల కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులను చేస్తామని కూడా బడ్జెటులో పేర్కొన్నారు.