Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్‌లోని భాగల్‌పూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

బిహార్‌లోని భాగల్‌పూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం


భారత్ మాతాకీ జై!

ప్రపంచ ప్రఖ్యాత విక్రమశిల మహావిహారం ఉన్న, వసుపూజయ మహర్షి తపస్సు చేసిన, బాబా బుధనాథుని పవిత్ర భూమి, అంగ రాజు దాన వీర శూర కర్ణుడికి చెందిన ఈ ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు!

గౌరవనీయ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు, బిహార్ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తూ ప్రశంసలందుకుంటోన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌గారు వేదికపై ఉన్నారు. నా మంత్రివర్గ సహచరులు గౌరవ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, జితన్ రామ్ మాంఝీ గారు, లల్లన్ సింగ్ గారు, గిరిరాజ్ సింగ్ గారు, చిరాగ్ పాశ్వాన్ గారు, బిహార్ ఉప ముఖ్యమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ గారు, సామ్రాట్ చౌదరి గారు, విజయ్ సిన్హా గారు, ఇతర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, బిహార్‌కు చెందిన నా ప్రియమైన సోదరసోదరీమణులు కూడా ఇక్కడ ఉన్నారు.

దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కోట్లాది మంది రైతులు ఇవాళ జరుగుతోన్న కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు. వారందరికీ నా గౌరవ నమస్కారాలు.

మిత్రులారా,

పవిత్రమైన మహా కుంభమేళా సమయంలో ఈ పవిత్రమైన మందాంచల్‌ను సందర్శించడం అపారమైన గౌరవంతో కూడుకున్న అంశం. ఈ ప్రాంతం విశ్వాసం, వారసత్వం, వికసిత్ భారత్(అభివృద్ధి చెందిన భారతదేశం) వాగ్దానానికి సంబంధించిన సంగమం. వీరమరణం పొందిన తిల్కా మాంఝీకి  చెందిన ఈ ప్రాంతాన్ని సిల్క్ సిటీ అని కూడా పిలుస్తారు. బాబా అజ్గైబినాథ్‌‌కు చెందిన ఈ పవిత్ర భూమిలో ప్రస్తుతం మహాశివరాత్రికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇలాంటి శుభ సమయంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో మరో విడతను దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు పంపించే గౌరవం నాకు దక్కింది. ఒక్క క్లిక్‌తో దేశవ్యాప్తంగా దాదాపు రూ.22 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. బటన్ నొక్కగానే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యక్ష ప్రసార దృశ్యాలు కనిపించాయి. ఇక్కడ కూడా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఆసక్తిగా చూసుకుంటూ డబ్బు రావటాన్ని ధ్రువీకరించడం నేను చూశాను. వారి కళ్లలో అప్పుడు కనిపించిన మెరుపు వారి ఆనందాన్ని, ఉపశమనాన్ని తెలియజేసింది.

మిత్రులారా,

నేటి కిసాన్ సమ్మాన్ నిధి  విడతలో బిహార్‌లోని 75 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. దాదాపు రూ.1,600 కోట్లు బిహార్ రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. యావత్ దేశ, బిహార్‌కు చెందిన రైతు కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

పేదలు, రైతులు, మన యువత, మన దేశంలోని మహిళలు అనే నాలుగు బలమైన స్తంభాలపై వికసిత్ భారత్ నిలబడి ఉంటుందని నేను ఎర్రకోటపై నుంచి చెప్పాను. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అయినా, బిహార్‌లోని నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం అయినా రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గత దశాబ్ద కాలంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సవాలును పరిష్కరించడానికి అవిశ్రాంతంగా పనిచేశాం. వారికి నాణ్యమైన విత్తనాలు, అందుబాటు ధరలో తగినంత ఎరువులు, సరైన నీటి పారుదల సౌకర్యాలు.. తమ పశువులకు వ్యాధుల నుంచి  రక్షణ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ అవసరం. గతంలో ఇక్కడ రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. పశువులకు ఉద్దేశించిన పశుగ్రాసాన్ని తినే వారు ఎప్పటికీ మార్పు తీసుకురాలేరు. అయితే ఎన్డీయే ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేసింది. రైతుల కోసం ఇటీవలి కాలంలో వందలాది ఆధునిక విత్తన వంగడాలను ప్రవేశపెట్టాం. ఒకప్పుడు యూరియా కొరత విషయంలో రైతులు లాఠీచార్జీని ఎదుర్కోవాల్సి వచ్చేది. యూరియా బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. నేడు, పరిస్థితి మారింది. రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్-19 సంక్షోభ సమయంలోనూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూశాం. ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి.

మిత్రులారా,

ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే ఎరువుల కోసం మన రైతులు ఇంకా పోలీసుల లాఠీచార్జీలు ఎదుర్కోవాల్సి వచ్చేది. బరౌనీ ఎరువుల కర్మాగారం ఇప్పటికీ పనిచేయకపోయేది. చాలా దేశాల్లో ఒక ఎరువు బస్తా ధర రూ. 3,000 ఉండగా.. మన రైతులకు రూ.300‌లోపే అందిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వం లేకుంటే రైతులు యూరియా బస్తాకు రూ.3‌వేలు చెల్లించాల్సి వచ్చేది. తమ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యమిచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోంది. అందుకే యూరియా, డీఏపీల ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. గత దశాబ్ద కాలంలో సుమారు రూ.12 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాం. ఈ కేటాయింపులు లేకుంటే ఎరువుల కోసం రైతులు ఇంత మొత్తం తమ జేబుల నుంచి ఖర్చు చేసే వాళ్లు. అంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల చేతుల్లో రూ.12 లక్షల కోట్లు ప్రత్యక్షంగా ఆదా అయ్యాయి.

మిత్రులారా,

ఎన్డీయే ప్రభుత్వం లేకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉండేది కాదు. ఈ పథకం దాదాపు ఆరేళ్లుగా అమలులో ఉంది. ఇప్పటివరకు సుమారు రూ.3.7 లక్షల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాం.  దళారులు లేరు, కమీషన్ కోతలు లేవు. దిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయి రైతులకు పూర్తిగా చేరుతోంది. మధ్యవర్తులు తమ వాటాను పక్కదారి పట్టించడం వల్ల గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు దూరమైన చిన్న రైతులు ఇప్పుడు నేరుగా లబ్ధి పొందుతున్నారు. ఇది మోదీ ప్రభుత్వం, ఇది నితీష్ ప్రభుత్వం. మేం రైతుల హక్కులను హరించడానికి  ఎవరినీ అనుమతించం. మేం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్తంలో పోల్చితే చాలా తక్కువ మాత్రమే కాంగ్రెస్, జంగిల్ రాజ్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కేటాయించాయి. అవినీతి ప్రభుత్వం ఎప్పటికీ దీన్ని సాధించలేదు. రైతు సంక్షేమానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాత్రమే ఇలాంటి వాటిని సాధించగలదు.

మిత్రులారా,

అది కాంగ్రెస్ అయినా, జంగిల్ రాజ్ పాలన అయినా రైతుల కష్టాలు ఏనాడూ వారికి పట్టలేదు. గతంలో వరదలు, కరువులు, వడగండ్ల వానలు వచ్చినప్పుడల్లా రైతులను వదిలేశారు. కానీ మీరు 2014లో ఎన్డీయేపై విశ్వాసం ఉంచినప్పుడు.. ఈ నిర్లక్ష్యం కొనసాగదని నేను స్పష్టం చేశాను. ఎన్డీయే ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టింది. దీని కింద ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు పరిహారంగా రైతులకు దాదాపు రూ .2 లక్షల కోట్లు చెల్లించింది.

మిత్రులారా,

భూమిలేని, చిన్న తరహా రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎన్డీయే ప్రభుత్వం పశుపోషణను చురుకుగా ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లోని మన సోదరీమణులను ‘లాఖ్ పతి దీదీ’లుగా మార్చడంలో కూడా ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1.25 కోట్ల మంది మహిళలు ఈ మైలురాయిని సాధించారు. వీరిలో బిహార్‌కు చెందిన వేలాది మంది జీవికా దీదీలు కూడా ఉన్నారు. గత దశాబ్ద కాలంలో, భారతదేశ పాల ఉత్పత్తి  14 కోట్ల టన్నుల నుంచి  24 కోట్ల టన్నులకు పెరిగి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. కేవలం పదేళ్లలో పాల ఉత్పత్తి చాలా పెరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ విజయంలో బిహార్ గణనీయమైన పాత్ర పోషించింది. ప్రస్తుతం బీహార్ సహకార పాల సంఘాలు రోజుకు 30 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. ఫలితంగా ఏటా రూ.3,000 కోట్లకు పైగా నేరుగా బిహార్‌లోని పశు పోషణ చేపడుతోన్న రైతుల ఖాతాల్లోకి.. ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణుల ఖాతాల్లోకి జమ అవుతోంది.

మిత్రులారా,

రాజీవ్ రంజన్ గారు (లల్లన్ సింగ్) పాడి పరిశ్రమ బలోపేతానికి తీసుకుంటోన్న కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయన అంకితభావానికి కృతజ్ఞతలు. బిహార్‌లోని రెండు ప్రధాన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. మొదటిది మోతీహరిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది ఉత్తమ స్వదేశీ ఆవు జాతుల అభివృద్ధికి తోడ్పడుతుంది. రెండోది బరౌనీలో పాల ప్రాసెసింగ్ కేంద్రం. ఇది ఈ ప్రాంతంలోని మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

మిత్రులారా,

చాలాకాలంగా పడవల ద్వారా ఉపాధి పొందే మన కార్మికులు, మత్స్యకారులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. వారికి ఎటువంటి సహాయం లేదా ప్రయోజనాలు లభించలేదు. తొలిసారిగా కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని చేపలు పెంచే రైతులకు అందించాం. ఇటువంటి కార్యక్రమాల ఫలితంగా బిహార్ చేపల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించింది. ముఖ్యమంత్రి సరిగ్గా చెప్పారు. ఆయన అన్నట్లు బిహార్ ఒకప్పుడు చేపల దిగుమతిపై ఆధారపడింది.. కానీ నేడు స్వయం సమృద్ధి సాధించింది. 2013లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను పర్యటించినప్పుడు.. ఇంత సమృద్ధిగా నీటి వనరులున్న రాష్ట్రం చేపల దిగుమతులపై ఎలా ఆధారపడుతోంది? అని నేను ఆశ్చర్యపోయాను. ఇవాళ బిహార్ చేపల డిమాండ్‌ను రాష్ట్రమే తీర్చుతున్నందుకు నేను గర్విస్తున్నాను. దశాబ్దం క్రితం భారత్‌లో చేపలు ఉత్పత్తి చేసే మొదటి పది రాష్ట్రాల్లో బీహార్ ఒకటిగా ఉండేది. నేడు మొదటి 5 అగ్రస్థానాల్లో చోటు దక్కించుకుంది. మత్స్య రంగంపై దృష్టి సారించిన మా విధానం చిన్న రైతులు, మత్స్యకారులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చింది. గంగానది డాల్ఫిన్లకు ప్రసిద్ధి చెందిన భాగల్పూర్ కూడా నమామి గంగా కార్యక్రమం కింద గొప్ప విజయాన్ని సాధించింది.

మిత్రులారా,

ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశ వ్యవసాయ ఎగుమతులలో గణనీయమైన వృద్ధికి దారితీశాలు. దీంతో రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించింది. అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు మొదటిసారి ఎగుమతి అవుతున్నాయి. వాటిలో బిహార్‌లోని మఖానా ఒకటి. మఖానా దేశవ్యాప్తంగా పట్టణ గృహాలలో అల్పాహారంలో ఒక ప్రధాన భాగంగా మారింది. వ్యక్తిగతంగా, నేను సంవత్సరానికి కనీసం 300 రోజులు మఖానా తింటాను. ఇది ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయాల్సిన సూపర్ ఫుడ్. మఖానా రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో మఖానా బోర్డు ఏర్పాటును ప్రకటించాం. ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ వంటి ప్రతి అంశంలో బిహార్ రైతులకు ఈ బోర్డు సహాయపడుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో  మఖానాకు ఉన్న పూర్తి సామర్థ్యాన్ని నిరూపించేలా చేస్తుంది.

మిత్రులారా,

బిహార్ రైతులు, యువతకు ఈ బడ్జెట్ మరో కీలక ప్రకటనను తీసుకొచ్చింది. తూర్పు భారతదేశంలో ఆహార శుద్ధి పరిశ్రమకు బిహార్ కీలక కేంద్రంగా మారనుంది. రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌ను ఏర్పాటు చేయనున్నాం. అదనంగా వ్యవసాయానికి సంబంధించి మూడు కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను బిహార్‌లో రానున్నాయి. వీటిలో ఒకటి భాగల్పూర్‌లో ఉండనుంది. ఇది ప్రసిద్ధ మామిడి రకం- జర్దాలుపై దృష్టి పెడుతుంది. టమోటా, ఉల్లి, బంగాళదుంప రైతులను ఆదుకునేందుకు ముంగేర్, బక్సర్‌లలో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో మా అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనం.

మిత్రులారా,

వస్త్రాల ప్రధాన ఎగుమతిదారుగా భారత్ శరవేగంగా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. భాగల్పూర్‌లో ఒక సామెత ఉంది. ఇక్కడి చెట్లు కూడా బంగారాన్ని ఉమ్ముతాయని అని ఇక్కడ అంటారు. పట్టు ఉత్పత్తిలో ఈ ప్రాంతం గొప్పతనానికి ఇది నిదర్శనం. భాగల్పురి పట్టు, తుస్సార్ పట్టు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచ మార్కెట్లలో వీటికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు వస్త్రాలు, యార్న్‌డైయింగ్ యూనిట్లు, వస్త్రాలపై ప్రింటింగ్ యూనిట్లు, వస్త్రాల ప్రాసెసింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయంలో చేపట్టిన కార్యక్రమాలు భాగల్పూర్ నేత కార్మికులకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించటమే కాకుండా వారి ఉత్పత్తులు ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి చేరేలా చేస్తాయి.

మిత్రులారా,

బిహార్‌లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల్లో ఒకటైన చాలా నదులపై వంతెనల కొరతను ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరిస్తోంది. సరిపడిన వంతెనలు లేకపోవడం రవాణా, అనుసంధానత విషయంలో చాలా కాలంగా ఇబ్బందులను సృష్టించింది. దీనిని పరిష్కరించడానికి మేం బీహార్ అంతటా పలు వంతెనలను వేగంగా నిర్మిస్తున్నాం. అలాంటి ప్రధాన ప్రాజెక్టుల్లో గంగానదిపై నిర్మిస్తోన్న నాలుగు వరుసల వంతెన. రూ.1,100 కోట్ల వ్యయంతో చేపడుతోన్న ఈ వంతెన నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

మిత్రులారా,

బిహార్‌లో ఎల్లప్పుడూ తీవ్రమైన సమస్యగా ఉన్న వరదలు ప్రతి సంవత్సరానికి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు మా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పశ్చిమ కోసి కెనాల్ ఈఆర్ఎం ప్రాజెక్టుకు ఈ ఏడాది బడ్జెట్‌ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిథిలా ప్రాంతంలోని 50,000 హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడంతో పాటు లక్షలాది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చి.. వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

మిత్రులారా,

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎన్డీయే ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి, పప్పుధాన్యాలు, నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించడానికి.. ఆహార శుద్ధి పరిశ్రమలను విస్తరించడానికి..  భారతీయ రైతుల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరేలా చూసేందుకు వరుసగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రపంచంలోని ప్రతి వంటగదిలో భారత రైతులు పండించే కనీసం ఒక ఉత్పత్తి ఉండాలన్నది నా లక్ష్యం. ప్రతిష్టాత్మక పీఎం ధన్య యోజన ప్రకటనతో ఈ ఏడాది బడ్జెట్ ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అతి తక్కువ పంట ఉత్పత్తి ఉన్న 100 జిల్లాలను గుర్తించి ఈ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదనంగా, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు, కనీస మద్దతు ధరతో సేకరించే పప్పుధాన్యాలను పెంచుతూ రైతులు మరింత వృద్ధి సాదించేలా ప్రోత్సహించేందుకు లక్షిత చర్యలు తీసుకుంటున్నాం.

మిత్రులారా,

ఈ రోజు ఇంకో కారణం వల్ల  కూడా ముఖ్యమైన రోజు. దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓ) ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మేం ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించామని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. మొక్కజొన్న, అరటి, వరి సాగుపై దృష్టి సారించే ఖగారియా జిల్లాలో నమోదైన 10,000వ ఎఫ్పీఓకు ఉన్న ఘనత బిహార్‌కు దక్కింది. ఎఫ్‌పీఓ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. ఇది పెద్ద మార్కెట్లను ప్రత్యక్షంగా అందుబాటులో తీసుకురావటం ద్వారా రైతుల ఆదాయాలను పెంచే ఒక పరివర్తన శక్తి. ఎఫ్పీఓల ద్వారా మన రైతు సోదర సోదరీమణులకు గతంలో అందుబాటులో లేని అవకాశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది రైతులు ఎఫ్పీఓలతో అనుసంధానమై ఉండగా.. వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ సంస్థలు ఇప్పుడు వేల కోట్ల రూపాయల వ్యవసాయ వ్యాపారాన్ని చేపడుతున్నాయి. 10,000 ఎఫ్పీఓల సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

బిహార్ పారిశ్రామికాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిహార్ ప్రభుత్వం భాగల్పూర్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ విద్యుతుత్పత్తి కేంద్రానికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతుంది. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు లింకేజీకి ఆమోదం తెలిపింది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ బిహార్ వృద్ధికి దోహదపడుతూ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

పూర్వోదయ ద్వారా అభివృద్ధి చెందిన భారత్‌ ఆవిర్భవిస్తుంది. తూర్పు భారతానికి బిహార్ ‌అత్యంత ముఖ్యమైన స్తంభంగా నిలుస్తుంది. బిహార్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు. ఇది దేశానికి సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. అయితే కాంగ్రెస్-ఆర్జేడీల సుదీర్ఘ దుష్పరిపాలన బిహార్‌ను శిథిలావస్థకు చేర్చి, దాని ప్రతిష్ఠను దెబ్బతీసింది. కానీ ప్రాచీన సుసంపన్న భారత్‌లో పాటలీపుత్రానికి ప్రాముఖ్యత ఉన్నట్లే ఇప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశంలో బిహార్ తన సముచిత స్థానాన్ని తిరిగి పొందుతుంది. ఈ లక్ష్యసాధనకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం.

బిహార్‌లో అనుసంధానతను ఆధునీకరించడానికి, రహదారి మార్గాలను విస్తరించడానికి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ముంగేర్ నుంచి భాగల్పూర్ మీదుగా మీర్జా చౌకీ వరకు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో కొత్త రహదారి నిర్మాణం జరుగుతోంది. భాగల్పూర్ నుంచి అన్ష్‌దిహా వరకు నాలుగు వరుసల రహదారిని వెడల్పు చేసే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. విక్రమశిల నుంచి కటారియా వరకు కొత్త రైల్వే లైన్, రైలు వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మిత్రులారా,

భాగల్పూర్‌కు అపారమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. విక్రమశిల విశ్వవిద్యాలయం ఉన్న కాలంలో ఇది ప్రపంచ విద్యాకేంద్రంగా ఉండేది. నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించడానికి, ఆధునిక భారత్‌కు అనుసంధానించేందుకు మేం ఇప్పటికే ఒక మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు నలంద అడుగుజాడల్లో నడుస్తూ విక్రమశిలలో కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. నితీష్ గారు, విజయ్ గారు, సామ్రాట్ గారు, పూర్తి బిహార్ ప్రభుత్వ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తూనే భారతదేశ ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే జంగిల్ రాజ్‌కు చెందిన వర్గం ‌మన వారసత్వం, విశ్వాసం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో అందరికి ఐక్యం చేసే మహా కుంభమేళా జరుగుతోంది. ఇది భారత్‌ విశ్వాసం, ఐక్యత, సామరస్యానికి సంబంధించిన అతిపెద్ద వేడుక. ఐరోపాలోని మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ఇప్పటికే పవిత్ర స్నానాలు చేయటం ద్వారా ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. బిహార్‌లోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు ఈ పవిత్ర ఘట్టానికి తరలివస్తున్నారు.

అయినా జంగిల్ రాజ్ నాయకులు సిగ్గులేకుండా మహా కుంభమేళాను అగౌరవపరుస్తూ ఈ పవిత్ర వేడుకను అవమానిస్తున్నారు. రామ మందిర నిర్మాణంతో ఆగ్రహించిన వారే ఇప్పుడు మహా కుంభమేళాను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పవిత్ర సంప్రదాయాన్ని అవమానించే వారిని బిహార్ ఎప్పటికీ క్షమించదని నేను కచ్చితంగా చెప్పగలను.

మిత్రులారా,

బిహార్‌ను నూతన సౌభాగ్యం దిశగా నడిపించాలన్న మా నిబద్ధతకు మేం కట్టుబడి ఉన్నాం. దేశంలోని రైతులకు, బిహార్ ప్రజలకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

నాతో చెప్పండి-

భారత్ మాతా కీ జై !

భారత్ మాతా కీ జై !

ధన్యవాదాలు!

గమనిక: ఇది ప్రధాన మంత్రి ప్రసంగం అనువాదం. అసలు ప్రసంగం హిందీలో ఉంది.

 

***