హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పుర్ లో కొత్తగా ఎఐఐఎమ్ఎస్ ను ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్ఎస్ఎస్‌వై) లో భాగంగా ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 1351 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారు.
ముఖ్యాంశాలు :
• కొత్త ఎఐఐఎమ్ఎస్ ను 48 మాసాల లోపల దీనిని పూర్తి చేస్తారు; దీని ముందస్తు నిర్మాణ దశ 12 నెలలుగాను, నిర్మాణ దశ 30 నెలలుగాను, స్థిరీకరణ/ అప్పగింత దశ 6 నెలలుగాను ఉంటుంది.
• ఈ సంస్థలో 750 పడకల సామర్థ్యం కలిగివుండే ఆసుపత్రి మరియు గాయాల చికిత్స సదుపాయాలు కలిగివుండే కేంద్రం భాగంగా ఉంటాయి.
• ఒక్కో సంవత్సరానికి 100 మంది విద్యార్థులకు అవకాశం లభించే వైద్య కళాశాల కూడా ఉంటుంది.
• అలాగే, ఒక్కొక్క సంవత్సరానికి 60 మంది బి. ఎస్సి. (నర్సింగ్ కోర్సు) విద్యార్థులతో కూడిన నర్సింగ్ కళాశాల కూడా ఉంటుంది.
• స్థూలంగా న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ఎస్ ను పోలి ఉండే నివాస భవన సముదాయాలు మరియు తత్సంబంధిత సదుపాయాలు/ సేవలు కూడా ఉంటాయి.
• 15 ఆపరేషన్ థియేటర్ లతో సహా 20 స్పెషాలిటీ/సూపర్ స్పెషాలిటీ డిపార్ట్ మెంట్ లు ఈ ఆసుపత్రిలో భాగంగా ఉంటాయి.
• సాంప్రదాయక వైద్య పద్ధతిలో చికిత్స సదుపాయాలు సమకూర్చేటటువంటి ఆయుష్ విభాగం సైతం ఇందులో భాగంగా ఉంటుంది. ఈ విభాగంలో 30 పడకలు ఉంటాయి.
ప్రభావం:
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంతో పాటు, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వైద్యులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తల దళాన్ని ఏర్పాటు చేయడంలో తోడ్పడడం నూతన ఎఐఐఎమ్ఎస్ స్థాపనలో ముఖ్యోద్దేశంగా ఉంటుంది. నేశనల్ హెల్త్ మిశన్ (ఎన్హెచ్ఎమ్)లో భాగంగా ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయి సంస్థలు/ సదుపాయాలకు వీరి సేవలు లభ్యమవుతాయి.
పూర్వరంగం:
ఈ పథకంలో భాగంగా భువనేశ్వర్, భోపాల్, జోధ్‌పుర్, పట్నా, రాయ్‌పుర్, ఇంకా రుషికేశ్ లలో ఎఐఐఎమ్ఎస్ లను నెలకొల్పారు. కాగా, రాయ్ బరేలీ లో ఎఐఐఎమ్ఎస్ నిర్మాణ పనులు పురోగమిస్తున్నాయి. అంతేకాకుండా 2015వ సంవత్సరంలో 3 ఎఐఐఎమ్ఎస్ లను- మహారాష్ట్ర లోని నాగ్‌పుర్, పశ్చిమ బెంగాల్ లోని కళ్యాణి మరియు ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి లలో- మంజూరు చేశారు. మరో రెండు ఎఐఐఎమ్ఎస్ లను 2016వ సంవత్సరంలో బఠిండా మరియు గోరఖ్‌పుర్ లలో మంజూరు చేయడమైంది.
***