బ్యాంకాక్‌లో ఈ రోజు బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ ప్రధాని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
మయన్మార్‌లో విధ్వంసకర భూకంపం తరువాతి స్థితినీ, మయన్మార్‌కు మానవతాపూర్వక సహాయంతోపాటు వైద్యసహాయం అందించడానికీ, ఉపశమన చర్యలు చేపట్టడానికీ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’లో భాగంగా భారత్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించీ నేతలిద్దరూ చర్చించారు. భారత్ సహాయ కార్యకలాపాలకుగాను సీనియర్ జనరల్ కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో…. మొదటి ప్రతిస్పందన దేశంగా భారత్.. మయన్మార్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుందనీ, అవసరమైతే మరింత సహాయక సామగ్రిని, వనరులను కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉందనీ ప్రధాని శ్రీ మోదీ తెలిపారు.
అన్ని వర్గాలవారు పాలుపంచుకునేందుకు అవకాశం లభించే, నమ్మదగ్గ ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను వీలైనంత త్వరలో పునరుద్ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు. పూర్తిగా మయన్మార్ ఆధీనంలో, మయన్మార్ నాయకత్వంలో శాంతియుత, స్థిర, ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు దిశగా సాగే ప్రయత్నాలను ముందుకు తీసుకుపోయే చర్యలకూ, విశ్వాసాన్ని పెంచేందుకు చేపట్టే చర్యలకూ భారత్ మద్దతిస్తుందని కూడా ఆయన తెలిపారు. మయన్మార్‌లో జాతుల మధ్య జరుగుతున్న హింస.. ప్రాణనష్టాన్ని నానాటికీ పెంచుతోందని ప్రధాని సూచనప్రాయంగా ప్రస్తావిస్తూ ఈ పోరాటానికి సైన్యం వైపు నుంచి ఎలాంటి పరిష్కారం లేదని, సంబంధిత వర్గాలన్నింటితో చర్చించడం ద్వారానే చిరకాల శాంతిని సాధించవచ్చన్నారు.
మయన్మార్–థాయిలాండ్ సరిహద్దు వెంబడి ఉన్న సైబర్–స్కాం సెంటర్ల నుంచి భారత జాతీయులను రక్షించడం, స్వదేశానికి పంపించడంలో మయన్మార్ అందిస్తున్న సహాయాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
మయన్మార్‌లో ప్రస్తుతం భారత్ సాయంతో సాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. మయన్మార్‌లో అందరి అభివృద్ధి కోసం సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారు.
***