శ్రేష్ఠులారా,
మిత్రులారా,
నా మిత్రుడు జకోవీకి మరోసారి అభినందనలు తెలియచేస్తున్నాను. అత్యంత కష్టకాలంలో ఆయన జి-20కి సమర్థవంతమైన నాయకత్వం అందించారు. బాలి డిక్లరేషన్ ఆమోదించినందుకు నేను జి-20 కమ్యూనిటీని కూడా అభినందిస్తున్నాను. జి-20 అధ్యక్ష సమయంలో ఇండోనేసియా తీసుకున్న ప్రశంసనీయమైన చొరవలను మరింత ముందుకు నడిపించేందుకు భారతదేశం కృషి చేస్తుంది. మనం ఈ పవిత్ర దీవి బాలిలోనే జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం శుభప్రదమైన అంశం. భారతదేశం, బాలి రెండింటి నడుమ ప్రాచీన కాలం నాటి అనుబంధం ఉంది.
శ్రేష్ఠులారా,
ప్రపంచం ఏకకాలంలో తీవ్రమైన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు; ఆర్థిక మాంద్యం; పెరిగిన ఆహారం, ఇంధన ధరలు, మహమ్మారి దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో భారతదేశం జి-20 నాయకత్వం చేపడుతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచం జి-20 వైపు ఆశగా చూస్తోంది. భారతదేశ అధ్యక్ష కాలంలో జి-20 సమ్మిళితంగా, ఆశావహంగా, నిర్ణయాత్మకంగా, క్రియాశీలంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను.
శ్రేష్ఠులారా,
రాబోయే ఏడాది కాలంలో కొత్త ఆలోచనలు, సామూహిక కార్యాచరణతో ప్రపంచానికి ప్రధాన చోదక శక్తిగా జి-20 నిలిచేలా మేము శ్రమించి కృషి చేస్తాం. సహజ వనరులపై యాజమాన్యం నేడు సంఘర్షణలు పెరగడానికి కారణమవుతోంది. పర్యావరణ దురవస్థకు ప్రధాన కారణంగా మారింది. ట్రస్టీ విధానం ఒక్కటే ఈ భూగోళం భవిష్యత్ భద్రతకు భరోసా ఇస్తుంది. లైఫ్ అంటే “పర్యావరణకు అనుకూలమైన జీవనశైలి” ప్రచారం ఇందుకు ఎంతో ఉపయోగపడుతుంది. స్థిరమైన జీవనశైలులు ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం దీని లక్ష్యం.
శ్రేష్ఠులారా,
అభివృద్ధి ప్రయోజనాలు సార్వత్రికం, సమ్మిళితం కావడం నేటి అవసరం. దయ, సంఘీభావంతో మానవాళి అందరికీ అభివృద్ధి ప్రయోజనాలు అందేలా మనందరం చూడాల్సి ఉంది. మహిళా భాగస్వామ్యం లేనిదే ప్రపంచ పరిణామాలేవీ సాధ్యం కాదు. మహిళా చోదక అభివృద్ధిని మనం జి-20 అజెండా ప్రాధాన్యతాంశంగా మార్చాలి. శాంతి, సుస్థిరతలు లేనిదే భవిష్యత్ తరాలు ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఇన్నోవేషన్ ప్రయోజనాలు పొందలేవు. ప్రపంచానికి జి-20 బలమైన శాంతి, సామరస్య సందేశం ఇవ్వాలి. భారతదేశం జి-20 నాయకత్వ కాలానికి అందించిన “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” థీమ్ లోనే ఈ ప్రాధాన్యతలన్నింటినీ పొందుపరచడం జరిగింది.
శ్రేష్ఠులారా,
జి-20 అధ్యక్షతను భారతదేశం చేపట్టడం ప్రతీ ఒక్క భారతీయునికి గర్వకారణం. దేశంలోని విభిన్న రాష్ర్టాలు, నగరాల్లో మేం జి-20 సమావేశాలు నిర్వహిస్తాం. భారతదేశానికి చెందిన భిన్నత్వం, సమ్మిళిత సాంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని మా అతిథులు పూర్తిగా అనుభవించే వీలు కలుగుతుంది. “ప్రజాస్వామ్య మాతృక” అయిన భారతదేశం నిర్వహించుకునే ఈ ప్రత్యేక వేడుకల్లో మీరందరూ భాగస్వాములవుతారని మేం ఆశిస్తున్నా. జి-20ని ప్రపంచ పరివర్తనకు ఉత్తేజిత శక్తిగా మార్చేందుఉ అందరి సహకారంతో మేం కృషి చేస్తాం.
ధన్యవాదాలు.
గమనిక – ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం ఇది.
***