గుజరాత్‌లోని భర్వాడ్ సమాజ బవలియాళి ధామ్ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సందేశమిచ్చారు. ముందుగా మహంత్ శ్రీరామ్ బాపూజీ, సమాజ నాయకులు, కార్యక్రమానికి హాజరైన వేలాది భక్తజనానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, వాటిని కొనసాగించడంలో జీవితం అంకితం చేసిన గౌరవనీయ సాధువులు, మహంతులకు గౌరవ నివాళి అర్పించారు. చారిత్రక మహాకుంభ్‌తో ముడిపడిన అమితానందం, ప్రతిష్టను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా మహంత్ శ్రీరామ్ బాపూజీకి ‘మహామండలేశ్వర్’ బిరుదు ప్రదానాన్ని ఓ కీలక ఘట్టంగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఇదొక చిరస్మరణీయ ఘనత మాత్రమేగాక అందరికీ అమితానందం కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. మహంత్ శ్రీరామ్ బాపూజీతోపాటు భర్వాడ్ సమాజంలోని కుటుంబాల సేవను, వారి విజయాలను స్మరించుకుంటున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.
భావ్‌నగర్ గడ్డ వారం రోజులుగా శ్రీకృష్ణుని బృందావనంగా మారిపోయినట్లు కనిపిస్తున్నదని, సమాజం నిర్వహించిన భగవత్ కథ యావత్ వాతావరణాన్ని భక్తిభావనతో నింపగా, ప్రజలు కృష్ణకథా సారంలో లీనమైపోయారని శ్రీ మోదీ అన్నారు. “బవళియాళి కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు… భర్వాడ్ సమాజంతోపాటు ఇతరత్రా అనేక వర్గాల విశ్వాసం, సంస్కృతి, ఐక్యతలకు ప్రతీక” అని ఆయన వ్యాఖ్యానించారు.
నాగ లఖా ఠాకూర్ ఆశీస్సులతో బవళియాళి తీర్థప్రదేశం భర్వాడ్ సమాజానికి సదా వాస్తవ పథనిర్దేశం చేస్తూ, అనంత స్ఫూర్తినిచ్చిందని ప్రధానమంత్రి వివరించారు. శ్రీ నాగ లఖా ఠాకూర్ ఆలయ పునఃప్రతిష్ఠ ఒక సువర్ణ అవకాశమని పేర్కొంటూ ఇదొక చిరస్మరణీయ సందర్భమని అభివర్ణించారు. వారం నుంచీ ఆనందోత్సాహాలతో సాగిన వేడుకలను ప్రస్తావిస్తూ సమాజం శక్తిసామర్థ్యాలకు, స్ఫూర్తికి ఇది నిదర్శనమని ప్రశంసించారు. వేలాది మహిళలు ప్రదర్శించిన ‘రాస్’ (దాండియా నృత్యం) పురాణ కాలంనాటి బృందావనంలోని కోలాహలాన్ని సజీవంగా కళ్లముందు నిలిపిందని కొనియాడారు. ఇది అలౌకిక ఆనందం, సంతృప్తికి మూలం మాత్రమేగాక విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల సామరస్య సమ్మేళనానికి నిలువెత్తు ఉదాహరణగా అభివర్ణించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కళాకారుల ప్రతిభను ప్రస్తావిస్తూ- వివిధ కళారూపాలకు జీవం పోయడం ద్వారా సమాజానికి సమకాలీన సందేశాలిచ్చారని ప్రశంసించారు. భగవత్ కథ ద్వారా సమాజం ఎల్లప్పుడూ అమూల్య సందేశాలను అందుకుంటూనే ఉంటుందని ప్రధానమంత్రి విశ్వాసం వెలిబుచ్చారు. ఇందులో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, వారి కృషి అపార ప్రశంసార్హమన్నారు.
ఈ శుభ కార్యక్రమానికి తనను ఆహ్వానించడంపై మహంత్ శ్రీరామ్ బాపూజీతోపాటు బవళియాళి ధామ్ నిర్వాహకులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అయితే, పార్లమెంటరీ కార్యకలాపాల్లో ఉన్నందువల్ల రాలేకపోయానని, త్వరలోనే వచ్చి భక్తిప్రపత్తులు చాటుకుంటానని హామీ ఇచ్చారు.
భర్వాడ్ సమాజం, బవళియాళి ధామ్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. సేవకు అంకితమైన భర్వాడ్ సమాజానికి ప్రకృతిపైగల ప్రేమ, గో రక్షణపైగల నిబద్ధత ప్రశంసనీయమన్నారు. వారు పాటిస్తున్న విలువలు మాటలకు అందనివని అభివర్ణించారు. ఈ ఉమ్మడి భావన భర్వాడ్ సమాజంలో లోతుగా ప్రతిధ్వనిస్తూంటుందని చెప్పారు.
నాగ లఖా ఠాకూర్ విస్తృత వారసత్వాన్ని వివరిస్తూ- సేవాపథ మార్గదర్శిగా, ప్రేరణగా నిలిచిన ఆయన, సమాజానికి అద్వితీయ సేవలందించారని శ్రీ మోదీ కొనియాడారు. ఠాకూర్ కృషి సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని, శతాబ్దాలు దాటినా చిరస్మరణీయమై నిరంతర ప్రశంసలు పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్‌ను అనేక సవాళ్లు పీడించిన ప్రతి సందర్భంలో… ముఖ్యంగా తీవ్ర కరవు కాలంలో పూజ్య ఇసు బాపు అనుపమాన సేవలందించారని, ఇందుకు తాను ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేసుకున్నారు. ధంధుకా, రాంపూర్ వంటి ప్రాంతాలు అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నాయని, ప్రధానంగా నీటి కొరత నిరంతర సమస్యగా ఉండేదని తెలిపారు. అలాంటి సమయాల్లో బాధిత ప్రజలకు పూజ్య ఇసు బాపు నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు. ఈ సేవలను దైవిక తోడ్పాటుగా యావత్ గుజరాత్ గుర్తించి, గౌరవించిందని అభివర్ణించారు. వివిధ కారణాల వల్ల నిరాశ్రయులైన వర్గాల సంక్షేమంతోపాటు వారి పిల్లల విద్య, పర్యావరణ పరిరక్షణ, గిర్ ఆవుల సంరక్షణ తదితరాలపై ఇసు బాపు అంకితభావాన్ని ప్రధానమంత్రి విశదీకరించారు. ఆయన ప్రతి కదలికలోనూ సేవ, కరుణతో నిండిన ప్రగాఢ సంప్రదాయం ప్రతిబింబించేదని వ్యాఖ్యానించారు.
భర్వాడ్ సమాజం కృషి, త్యాగాలు, అచంచల నిబద్ధత, సుస్థిర పురోగమనం, పునరుత్థాన సామర్థ్యం తదితర విశిష్ట లక్షణాలను ప్రధానమంత్రి కొనియాడారు. ఆ సమాజంతో తన గతకాలపు అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. కర్రలు పట్టుకునే చేతులతో కలాలు పట్టాల్సిన అవసరాన్ని వివరించి, విద్యకుగల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ ఆ దిశగా వారిని ప్రోత్సహించానని పేర్కొన్నారు. తదనుగుణంగా భర్వాడ్ సమాజంలోని నవతరం నేడు ఈ దృక్కోణాన్ని అనుసరించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. వారి పిల్లలు విద్యారంగంలో ముందడుగు వేస్తున్నప్పటికీ, మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఆ మేరకు కుమార్తెలు కూడా కంప్యూటర్లతో కనిపించాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రకృతి, సంస్కృతి రక్షకులుగా సమాజం పాత్రను ప్రస్తావిస్తూ- “అతిథి దేవో భవ” సంప్రదాయానికి ప్రతీకలుగా వారిని ప్రశంసించారు. భర్వాడ్ సామాజిక విలువలు విశిష్టమైనవని, ఉమ్మడి కుటుంబాలలో పెద్దల సంరక్షణ బాధ్యతను దైవానికి సేవలా పరిగణించే వారి అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.
ఒకవైపు ఆధునికతను అందిపుచ్చుకుంటూ మరోవైపు సంప్రదాయాలను పరిరక్షించడంలో ఈ సమాజం చేస్తున్న కృషిని శ్రీ మోదీ ప్రశంసించారు. నిరాశ్రయులైన కుటుంబాల పిల్లలకు వసతిగృహాల సదుపాయం, ప్రపంచవ్యాప్త అవకాశాలతో సమాజ అనుసంధానం వంటి కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ సమాజంలోని బాలికలు క్రీడారంగంలోనూ రాణించాలని ఆకాంక్షించారు. గుజరాత్ క్రీడా మహా సంరంభం సందర్భంగా వారి ప్రతిభాపాటవాలను తాను ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేశారు. పశుపోషణపై వారి సమాజం అంకితభావాన్ని… ముఖ్యంగా దేశానికి గర్వకారణమైన ‘గిర్’ జాతి ఆవుల సంరక్షణలో వారి కృషిని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గిర్ జాతి ఆవులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడంలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. పశుపోషణపై ఎంత శ్రద్ధ చూపుతారో, తమ పిల్లల జీవన పురోగమనంపైనా అంతే శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
భర్వాడ్ సమాజంతో తనకుగల లోతైన అనుబంధాన్ని వివరిస్తూ- వారిని తన కుటుంబంగా, భాగస్వాములుగా శ్రీ మోదీ అభివర్ణించారు. బవళియాళి ధామ్ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ- రాబోయే 25 సంవత్సరాలలో వికసిత భారత్ దిశగా తన ఆలోచనలకు సమాజం మద్దతిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘సమష్టి కృషి’ (సబ్ కా ప్రయాస్)ని మన దేశానికి తిరుగులేని శక్తిగా ఎర్రకోట పైనుంచి తాను ప్రకటించడాన్ని పునరుద్ఘాటిస్తూ సమైక్యంగా ముందడుగు వేయాల్సిన అవసరాన్ని వివరించారు. వికసిత భారత్ రూపకల్పనలో గ్రామీణాభివృద్ధి తొలి అడుగని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పశువులకు సోకే వివిధ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత టీకాల కార్యక్రమం గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భర్వాడ్ సమాజం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని కరుణాపూర్వక కార్యంగా, దైవాశీర్వాదం పొందే మార్గంగా ఆయన అభివర్ణించారు. పశుపోషకుల కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టామని, వీటి ద్వారా తమ వ్యాపార విస్తరణ కోసం తక్కువ వడ్డీతో రుణాలు పొందవచ్చునని తెలిపారు.
దేశీయ పశుజాతుల సంరక్షణ ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. వాటి పరిరక్షణ, వృద్ధి లక్ష్యంగా నేషనల్ గోకుల్ మిషన్ వంటి కీలక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన సమాజాన్ని కోరారు. అలాగే మొక్కలు నాటి, సంరక్షించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ‘అమ్మ పేరిట ఓ మొక్క’ నాటి తల్లితోపాటు భూమాతను గౌరవించాల్సిందిగా ఉద్బోధించారు. భూ వినియోగంలో విపరీత పోకడలు, రసాయనాల వినియోగం వంటివి భూగోళాన్ని కలుషితం చేస్తున్న నేపథ్యంలో మొక్కల పెంపకానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయానికిగల విలువను స్పష్టం చేస్తూ- భూమాత పునరుజ్జీవనం లక్ష్యంగా ఈ విధానాన్ని అనుసరించాల్సిందిగా భర్వాడ్ సమాజానికి విజ్ఞప్తి చేశారు. సేవకు అంకితమైన సమాజ సభ్యులను ప్రశంసిస్తూ, భూసారం పునరుద్ధరణలో పశువుల పేడ కీలక వనరుగా ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ కృషిని కొనియాడుతూ, ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరించాలని సమాజానికి పిలుపునిచ్చారు.
నాగ లఖా ఠాకూర్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికీ లభించాలని ప్రార్థిస్తూ, భర్వాడ్ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బవళియాళి ధామ్‌తో అనుబంధంగల వారందరి సౌభాగ్యం, ప్రగతిపై ఆశాభావం వ్యక్తం చేస్తూ, విద్యకుగల ప్రాధాన్యాన్ని మరొకసారి స్పష్టం చేశారు. వారి పిల్లలు… ముఖ్యంగా కుమార్తెలు, విద్యాపరంగా రాణిస్తూ తమ సమాజాన్ని మరింత శక్తిమంతం చేయాలని ఆకాంక్షించారు. ఆధునికత ద్వారా సమాజానికి సాధికారత కల్పించడంలో అత్యంత ప్రధానమైనది విద్యేనని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పవిత్ర కార్యక్రమానికి నేరుగా హాజరై ఉంటే మరెంతో సంతోషంగా ఉండేదని ప్రధాని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రస్తుత శుభ సందర్భంలో పాలు పంచుకునే అవకాశం లభించడంపై ఆనందం, కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ తన ప్రసంగం ముగించారు.
****
Sharing my remarks during a programme of Bavaliyali Dham in Gujarat. https://t.co/JIsIUkNtGS
— Narendra Modi (@narendramodi) March 20, 2025