మహంత్ శ్రీ రామ్ బాపూజీ, సంఘానికి చెందిన గౌరవ సభ్యులు, ఇక్కడకు విచ్చేసిన భక్తులైన లక్షలాది మంది సోదర సోదరీమణులకు – నమస్కారం, జై ఠాకర్!
ముందుగా, భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, గౌరవనీయులైన సాధువులు, మహంతులకు, ఈ పవిత్ర సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు తమ జీవితాలను అంకితం చేసిన వారికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ రోజు మన ఆనందం ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సారి నిర్వహించిన మహాకుంభ్ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, మనందరికీ గర్వకారణంగా నిలిచింది. ఎందుకంటే ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగానే మహంత్ శ్రీ రామ్ బాపూజీని మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించుకున్నాం. ఇది మనందరికీ అమితానందనాన్ని కలిగిస్తోంది. రామ్ బాపూజీకి, మన సమాజానికి చెందిన అన్ని కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
గడచిన వారం రోజులుగా, భావనగర్ నేల అంతా కృష్ణభగవానుని బృందావనంగా మారిపోయినట్లుగా అనిపిస్తోంది. మన గౌరవ సోదరుడు నిర్వహించిన భాగవత కథ ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఇక్కడ పొంగి పొర్లుతున్న భక్తిభావన, భక్తులు కృష్ణుని ప్రేమలో తమను తాము లీనం చేసుకుంటున్న విధానం ఈ వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేశాయి. నా ప్రియ కుటుంబ సభ్యులారా, బవలియాలీ ధామ్ధార్మిక ప్రదేశం మాత్రమే కాదు.. ఇది భర్వాడ్ సమాజంతో పాటు ఇతరుల నమ్మకానికి, సంస్కృతికి, ఏకత్వానికి ప్రతీక.
నగా లఖా ఠాకర్ ఆశీర్వాదంతో ఈ పుణ్యస్థలం ఎల్లప్పుడూ భర్వాడ్ సమాజానికి అసలైన మార్గనిర్దేశం, గొప్ప ప్రేరణను అందిస్తోంది. ఈ రోజు, శ్రీ నగ లఖా ఠాకర్ ఆలయ పున:ప్రతిష్ఠ చేయడం మనకు దక్కిన సువర్ణావకాశం. గడచిన వారం రోజులుగా ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ సమాజం ప్రదర్శిస్తున్న ఆసక్తి, ఉత్సాహం అద్భుతంగా ఉన్నాయి – ఇక్కడ ఉన్నవారి నుంచి నాకు ప్రశంసలు వినపడుతున్నాయి. మీలో ఒకడిగా అక్కడ ఉండి ఉంటే బాగుండునని నా మనసుకు అనిపిస్తోంది. కానీ పార్లమెంటులో నాకున్న బాధ్యతలు, పని కారణంగా నేను అక్కడికి రాలేకపోయాను. దానికి నేను చాలా విచారిస్తున్నాను. వేలాది మంది సోదరీమణులు అద్భుతంగా ప్రదర్శించిన రాస్ (దాండియా నృత్యం) గురించి విన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. వారు ఇక్కడే బృందావనానికి జీవం పోశారు!
నమ్మకం, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు హృదయాన్ని ఉప్పొంగిపోయేలా చేస్తోంది. ఈ కార్యక్రమాలన్నింటిలో, పాల్గొన్న కళాకారులు, సోదరసోదరీమణులను నేను అభినందిస్తున్నాను. వారు తమ అద్భుతమైన ప్రదర్శనల ద్వారా అర్థవంతమైన సందేశాలను ఈ సమాజానికి అందించారు. కథల ద్వారా భాయ్ జీ తన జ్ఞానాన్ని మనందరికీ పంచడం కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఎన్నిసార్లు నేను కృతజ్ఞతలు తెలిపినా అది సరిపోదు.
ఈ పవిత్రమైన కార్యంలో పాల్గొనేందుకు నాకు అనుమతిచ్చిన మహంత్ శ్రీ రామ్ బాపూజీ, బవలియాలీ ధామ్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైన రోజున మీ అందరి మధ్య నేను ఉండలేకపోయాను కాబట్టి క్షమాపణలు కూడా కోరుతున్నాను. మీ అందరికీ నాపై సమాన హక్కు ఉందని నాకు తెలుసు. కానీ భవిష్యత్తులో ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడల్లా భక్తితో నా శిరస్సు వంచి నమస్కరిస్తాను.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా,
భర్వాడ్ సమాజంతో, బవలియాలీ ధామ్తో నా అనుంబంధం చాలా పాతది. భర్వాడ్ సమాజం అనుసరించే సేవా దృక్పథం, గోసేవ పట్ల వారి అంకితభావాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఎల్లప్పుడూ మనం ఉచ్చరించే ఒక వచనం:
నగా లాఖా నర్ భలా,
పచ్ఛమ్ ఘరా కే పీర్|
ఖారే పానీ మీఠే బనాయే,
సూకీ సూఖీ నదియోం మే బహాయే నీర్|
(నాగ లఖా, గొప్ప వ్యక్తి,
పశ్చిమ ప్రాంతానికి చెందిన సాధువు.
ఉప్పునీటిని తీపిగా మార్చారు,
ఎండిపోయిన నదులకు తిరిగి జీవం పోశారు.)
ఇవి వట్టి మాటలేం కావు. ఆ కాలంలో సైతం, నిస్వార్థ సేవ, ఏదైనా అసాధ్యమనుకున్న దానిని సాధించాలన్న సత్తా వారు పూనుకొని చేపట్టే పనుల్లో కనిపించేది. (గుజరాతీలో ఒక నానుడి ఉంది.. నేవా కే పానీ మోభే లగా లియే– ఎండిపోయిన బావి నుంచి నీటిని తోడడం). వారు వేసిన ప్రతి అడుగూ సేవా పరిమళాన్ని వెదజల్లింది. మరి వందల ఏళ్ల తరువాత కూడా, ఇంకా ప్రజలు వారిని స్మరించుకొంటూనే వస్తున్నారంటే అది దానంతట అదే ఒక ఘనమైన కార్యం. పూజ్య ఈశు బాపు స్వార్థరహిత సేవను నేను ప్రత్యక్షంగా గమనించాను. ఆయనలో ఉన్న అంకితభావాన్ని నా కళ్లారా చూశాను. అనావృష్టి పరిస్థితులు గుజరాత్‌కు కొత్త కాదు. పదేళ్లలో ఏడు సంవత్సరాల పాటు దుర్భిక్షం తాండవించేది. గుజరాత్‌లో చివరకు ఈ మాటలు కూడా అనే వారు.. ‘‘ఏమైనా చేయి, కానీ ధంధూకా (దుర్భిక్ష ప్రాంతం) వారికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకు’’. (గుజరాతీలో ‘బందూకే దేజో పణ్ ధంధూకే న దేనా..’ అని. ఈ మాటలకు.. మీ కుమార్తెను ధంధూకాకు వధువుగా పంపే కన్నా తుపాకితో కాల్చి చంపడమే నయం అని భావం). ధంధూకా తరచుగా తీవ్ర కరవులతో అల్లాడిపోయేది కాబట్టి ఈ నానుడి చలామణిలోకి వచ్చింది. ధంధూకాతోపాటు రాణ్‌పుర్ నీటికి కటకటలాడింది. ఆ కాలంలో, పూజ్య ఈశు బాపు చేసిన నిస్వార్థ సేవ సుస్పష్టం. ఆయన ప్రజల ఇక్కట్లను తీర్చిన తీరును ఈనాటికీ జ్ఞాపకం పెట్టుకొన్నారు. నేనొక్కడినే కాదు, గుజరాత్ ప్రజలంతా ఆయన చేసిన పనిని దైవీకార్యమనే తలుస్తున్నారు. ఆయన అందించిన తోడ్పాటులను ప్రజలు ప్రశంసించకుండా ఉండలేరు. సంచార జాతులకు సేవలు చేయడం కావచ్చు, వారి పిల్లలు చదువుకునేటట్టు చూడడం కావచ్చు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఆశయాలకు తనను తాను అంకితం చేసుకోవడం కావచ్చు, లేదా గిర్ గోవులను కంటికి రెప్పలా కాపాడడం కావచ్చు.. సేవకు కట్టుబడిపోయిన ఆయన తత్వాన్ని ఆయన చేసిన ప్రతి పనిలోనూ చూడవచ్చు. ఆయన చేసిన పనుల ద్వారా, స్వార్థరహిత సేవా సంప్రదాయం ఎంత లోతుగా వేళ్లూనుకుపోయిందీ మనం సుస్పష్టంగా గమనించవచ్చు.
ప్రియమైన నా కుటుంబ సభ్యులారా,
భర్‌వాడ్ ప్రజలు కష్టపడి పనిచేయడానికి, త్యాగాలు చేయడానికి ఎన్నడూ వెనుకాడలేదు.. వారు సదా ముందుభాగంలో నిలబడుతూ వచ్చారు. నేను మీ మధ్యకు వచ్చినప్పుడల్లా, నేను సూటిగా స్పష్టంగా మాట్లాడిన సంగతి మీకందరికీ తెలుసు. కర్రలు పట్టుకొనే రోజులు పోయాయని నేను ఒక సారి భర్‌వాడ్ ప్రజలతో అన్నాను.. మీరు చాలా కాలం పాటు కర్రలు పట్టుకున్నారు. కానీ కలం పట్టుకోవాల్సిన కాలమిది. మరి ఈ రోజు, నేను గర్వంగా చెప్పి తీరాలి.. గుజరాత్‌కు నేను సేవలందించిన కాలంలో, భర్వాడ్ ప్రజల్లో నవ తరం ఈ మార్పును హృదయానికి హత్తుకుంది. పిల్లలు ఇప్పుడు చదువుకుంటూ, జీవనంలో ముందడుగు వేస్తున్నారు. ఇంతకు ముందు నేను అంటుండే వాడిని.. ‘‘మీ కర్రలు కిందపడేసి కలం పట్టుకోండి’’ అని. ఇప్పుడు, నేను అంటున్నా.. ‘‘నా కుమార్తెలు వారి చేతుల్లో కంప్యూటర్లతో కనపడాలి అని’’. మారుతున్న ఈ కాలంలో, మనం ఎంతో సాధించవచ్చు.. ఇదే కదా మనకు ప్రేరణనిచ్చేది. మన సముదాయం ప్రకృతి పరిరక్షకురాలు. మీరు ‘‘అతిథి దేవో భవ’’ అనే భావనను ప్రవేశపెట్టారు. చాలా మందికి మన ధార్మిక సంప్రదాయాలు, బల్వా సముదాయాల సంప్రదాయాల గురించి తెలియదు. భర్వాడ్ ప్రజల్లో వయోవృద్ధులు వృద్ధాశ్రమాల్లో కనిపించరు. ఉమ్మడి కుటుంబ భావన, వయస్సు మళ్లిన వారికి సేవ చేయడాన్ని దైవానికి సేవ చేయడంగా భావించడం వారి సంస్కృతిలో ఉంది. కుటుంబాల్లోని పెద్దవారిని వృద్ధాశ్రమాలకు పంపించరు.. వారిని వారు జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ విలువలను తరువాతి తరం వారికి అందించడం ఒక గొప్ప విజయం. తరాల తరబడి, భర్వాడ్ ప్రజల్లో నైతిక విలువలను, కుటుంబ విలువలను బలపరచే కృషి సాగుతూ వచ్చింది.
ఆధునికత వైపునకు మన సమాజం శరవేగంగా దూసుకుపోతూనే తన సంప్రదాయాలను పరిరక్షించుకోవడం చూసి నాకు చాలా సంతోషం కలుగుతోంది. సంచార జాతుల కుటుంబాల పిల్లలకు విద్యతోపాటు వసతిగృహ సదుపాయాల కల్పన సైతం గొప్ప సేవే. మన ప్రజల్ని ఆధునికతకు జోడించడం, ప్రపంచంతో మమేకం అయ్యే అవకాశాలను కల్పించడం కూడా ఒక కీలక బాధ్యత. మన ఆడబిడ్డలు క్రీడల్లో సైతం రాణించడం చూడాలని నేను అభిలషిస్తున్నాను. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం తప్పక కృషిచేయాలి. ఇదీ ఒక మహా సేవే. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు, బాలికలు బడికి వెళ్లడంతోపాటు ఖేల్ మహాకుంభ్‌లో క్రీడా పతకాలను గెలుచుకోవడం గమనించాను. వారికి దైవం ప్రత్యేక బలాన్నిచ్చినందువల్ల, మనం కూడా వారి పురోగతి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మనం మన పశుగణం సంరక్షణపై దృష్టి పెడతాం.. వాటికి రోగం వస్తే, పున:స్వస్థత కోసం మనం చేయాల్సిందంతా చేస్తాం. ఇప్పుడు, మన పిల్లల పట్ల కూడా మనం అదే అంకితభావాన్ని, ఆందోళనను వ్యక్తం చేసి తీరాలి. బావలియాలీ పశు సంవర్ధకం విషయంలో ఆరితేరింది. ముఖ్యంగా గిర్ గోజాతిని సంరక్షించడంలో. ఇది యావత్తు దేశానికి గర్వకారణం. ప్రస్తుతం, గిర్ గోవును ప్రపంచం అంతటా ప్రశంసిస్తున్నారు.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, సోదరసోదరీమణులారా,
మనం వేర్వేరు కాదు, సహచరులమన్నది నా భావన. మనమంతా ఒకే కుటుంబ సభ్యులమని నాకనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ మీ మధ్య ఒక కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను. ఈ రోజు బవలియాలీ ధామ్ కు చేరుకున్న లక్షలాది మందిని చూస్తుంటే మీ నుంచీ ఆశించే హక్కు నాకుందని, మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనీ అనిపిస్తోంది. మీరు నన్ను నిరాశ పరచరనే నమ్మకంతో అభ్యర్థిస్తున్నాను. మనం ఇప్పుడు ఉన్న విధంగానే కొనసాగే వీలు లేదు. వేగంగా ముందడుగు వేస్తూ రానున్న 25 సంవత్సరాల్లో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పనిచేయాలి. మీ సహకారం లేనిదే నా పని నెరవేరే అవకాశం లేదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మొత్తం సమాజం ఒకటిగా కదలాలి. ఒకనాడు నేను ఎర్రకోట నుంచీ ఇచ్చిన ‘సబ్ కా ప్రయాస్‘ పిలుపు మీకు గుర్తుండే ఉంటుంది. ‘సబ్ కా ప్రయాస్‘ మన సిసలైన బలం. ‘వికసిత్ భారత్’ వైపు తొలి అడుగులు మన గ్రామాల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ప్రకృతిని, మన పశు సంపదను కాపాడుకోవడం మన కర్తవ్యం. ఈ విషయాన్ని గుర్తుంచుకుని మనం చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఉంది. భారత ప్రభుత్వం ఫుట్ అండ్ మౌత్ వ్యాధికి సంబంధించి పూర్తి ఉచిత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వ్యాధినే మన భాషలో ఖుర్పకా–ముఖ్‌పకా (నోరు, కాలి వ్యాధి) అని పిలుస్తాం. మన జంతువుల్ని సంపూర్ణంగా కాపాడుకోవాలంటే, అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు వాటికి టీకాలు వేయించడం చాలా అవసరం. మూగజీవాల పట్ల కరుణతో చేపట్టవలసిన పని. ఈ టీకాలను ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తోంది. మన పశువులన్నింటికీ ఈ టీకాలు సరైన పద్ధతిలో అందేలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే శ్రీ కృష్ణుడి అనుగ్రహం పొందగలం. మన థాకర్లు మనకు తప్పక సహాయం చేస్తారు.
మన ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన చర్య పశుపాలన పరంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సంబంధించినది. గతంలో కిసాన్ క్రెడిట్ కార్డులు కేవలం రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వీటిని పశువులున్న రైతులకు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఈ క్రెడిట్ కార్డులతో పశుపాలన రైతులు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు బ్యాంకుల నుంచీ తక్కువ వడ్డీతో రుణాలు పొందవచ్చు. ఇక దేశవాళీ గోజాతుల సంరక్షణ, కొత్త జాతుల సృష్టి కోసం జాతీయ గోకుల్ మిషన్ అమల్లో ఉంది. మీ అందరినీ అభ్యర్థించేది ఇదే… నేను ఢిల్లీలో ఉండి ఈ చర్యలను తీసుకుంటున్నా. మీరు వాటిని ఉపయోగించుకోకపోతే ప్రయోజనం ఏముంది? మీరు ఈ పథకాల లబ్ధి తప్పక పొందాలి. అప్పుడు ఇక్కడున్న లక్షలాది పశువుల, మనుషుల ఆశీస్సులు నాకు దక్కుతాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొమ్మని మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను.
నేను గతంలో చెప్పిన ముఖ్యమైన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తాను. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమైన విషయమో మీకు చెప్పాను. ఈ సంవత్సరం నేను ప్రారంభించిన ఒక ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది – అదే ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరు మీద ఒక చెట్టు). మీ తల్లి జీవించి ఉన్నట్లయితే, ఆమె సమక్షంలో ఒక చెట్టు నాటండి. ఆమె గనక స్వర్గస్తురాలై ఉంటే, ఆమె జ్ఞాపకార్థం ఆమె ఫోటో ముందు ఒక చెట్టు నాటండి. భార్వాడ్ సామాజిక వర్గ పెద్దలు దృఢమైన వారని, దీర్ఘాయుష్కులని పేరుంది. వీరిలో చాలామంది 90-100 సంవత్సరాల వరకు జీవిస్తారు. వారికి సేవ చేయడంలో మనం గొప్ప తృప్తిని, గర్వాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు మన తల్లుల పేరుతో చెట్లు నాటి అదే గర్వాన్ని అనుభూతి చెందాలి. పుడమి తల్లికి మనమంతా హాని చేశామన్న విషయాన్ని అంగీకరించాల్సిందే! నీళ్ళు తోడుకున్నాం, రసాయనాలు ఉపయోగించాం. చుక్క నీటిని మిగల్చకుండా ఆమెకు దాహం కలిగించాం. చివరికి మట్టిని విషపూరితం చేశాం. భూమాతకి తిరిగి స్వస్థత చేకూర్చే పూచీ మనదే. పశువుల పేడ మన భూమికి వరం వంటిది, అది మట్టికి పోషణనందిస్తుంది, బలాన్నందిస్తుంది. అందుకే సహజ వ్యవసాయం ఎంతో కీలకమైనది. భూమి కలిగి, అవకాశం ఉన్నవారు సహజ వ్యవసాయాన్ని తప్పక మొదలుపెట్టాలి. గుజరాత్ గవర్నర్ ఆచార్యజీ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికి నా అభ్యర్థన ఇదే, మనకు ఉన్న భూమి – పెద్దదైనా చిన్నదైనా, మనం సహజ వ్యవసాయం వైపు మళ్ళాలి, భూమాతను కాపాడుకోవాలి.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా,
భార్వాడ్ సమాజానికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, నాగ లక్ఖా థాకర్ మనపై సదా ఆశీర్వాదాలు కురిపించాలని ప్రార్థిస్తున్నాను. బవలియాలీ ధామ్ కు చెందిన ప్రతి ఒక్కరూ సుఖసమృద్ధులతో ప్రగతి సాధించాలని థాకర్ పాదాలనంటి వేడుకుంటున్నాను. మన ఆడపిల్లలు, మగపిల్లలూ పెద్ద చదువులు చదివి ఎదుగుతూ, మన సమాజం బలంగా ఎదగడం కంటే నేనేమి కోరుకోగలను! ఈ శుభ సందర్భంలో, భాయిజీ మాటలను గౌరవించి, ఆయన మాటలు నిజమయ్యేలా ఈ సమాజం తన శక్తిని నిలుపుకుంటూ ఆధునికత వైపు ప్రయాణం సాగించాలి. నాకు ఈరోజు నిజంగా ఎంతో ఆనందం కలిగింది. నేను స్వయంగా వచ్చి ఉంటే, ఈ సంతోషం రెట్టింపయ్యేది.
జై థాకర్!
***
Sharing my remarks during a programme of Bavaliyali Dham in Gujarat. https://t.co/JIsIUkNtGS
— Narendra Modi (@narendramodi) March 20, 2025