Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బకాయి జీతాల చెల్లింపు, వి ఆర్ ఎస్ /వి ఎస్ ఎస్ లను ప్రవేశపెట్టడం మరియు ట్రాక్టర్ విభాగం కార్యకలాపాల మూసివేయడానికి గాను హెచ్ ఎమ్ టి లిమిటెడ్ కు బడ్జెటరీ మద్దతును అందించేందుకు మంత్రివర్గం ఆమోదం


బకాయి జీతం/వేతనాలు, ఇతరత్రా ఉద్యోగి సంబంధ బాకీల చెల్లింపు నిమిత్తం హెచ్ ఎమ్ టి లిమిటెడ్ (హెచ్ ఎమ్ టి ఎల్ ) కు బడ్జెటరీ సహాయాన్ని అందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 2007 నోషనల్ పే స్కేల్స్ వర్తించే ఆకర్షణీయమైన విఆర్ఎస్ / విఎస్ఎస్ ను ఇవ్వజూపడం ద్వారా హెచ్ ఎమ్ టి ట్రాక్టర్ డివిజన్ ను మూసివేయాలనే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

బకాయి జీతం, వేతనాలు ఇంకా చట్టబద్ధ బకాయిల చెల్లింపు, విఆర్ఎస్/ విఎస్ఎస్ అనుగ్రహ పూర్వక చెల్లింపులకు తోడు బ్యాంకు, రుణదాతలు వగైరాలకు ట్రాక్టర్ డివిజన్ అప్పులను తీర్చివేయడం కోసం మొత్తం రూ. 718.72 కోట్ల ఆర్థిక భారం పడనుంది.

బెంగళూరు, కోచిలలో హెచ్ ఎమ్ టి కి ఉన్న కొద్దిపాటి భూములను విశాల ప్రజాహితం కోసం ఉపయోగించడానికి గాను వేరు వేరు ప్రభుత్వ ఎన్ టిటీలకు బదలాయించేందుకు కూడా మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలియజేసింది.

పూర్వరంగం:

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వశాఖ ఆధీనంలోని హెచ్ ఎమ్ టి లిమిటెడ్ (హెచ్ ఎమ్ టి ఎల్) ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా 1953లో బెంగళూరులో ఏర్పాటయింది. దేశంలో పారిశ్రామిక మహా భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన మెషీన్ టూల్స్ ను అందించే ధ్యేయంతో ఈ సంస్థను నెలకొల్పారు. దేశ ఇంజినీరింగ్, తయారీ సామర్థ్యాలను తీర్చిదిద్దడంలో హెచ్ ఎమ్ టి కీలకమైన పాత్రను పోషించింది. 1990 వ దశకంలో ఉదారవాద ఆర్థిక విధానం తెర మీదకు వచ్చిన తరువాత కంపెనీ పనితీరు క్షీణించడం మొదలుపెట్టింది. వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ సంస్థల నుండి గట్టి పోటీ ఎదురుకావడం, దిగుమతి వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం కూడా ఈ పరిణామానికి దారితీశాయి. కంపెనీ క్షీణ దశను అరికట్టడం కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, సంస్థ తన దిశను మార్చుకోవడంలో సఫలం కాలేకపోయింది. ఆర్డర్లు లోపించడం, సామర్ధ్యాన్నిసరిగ్గా వినియోగించుకోలేకపోవడం, వర్కింగ్ కేపిటల్ పరమైన ఇబ్బందులు తలెత్తడంతో కంపెనీకి లాభాలు ఆర్జించిపెడుతూ వచ్చిన ట్రాక్టర్ల వ్యాపారం సన్నగిలింది. మార్కెట్ షేర్ అంతగా లేని ట్రాక్టర్ వ్యాపారాన్ని కొనసాగించడం ఆర్థికంగా లాభదాయకం కాదేమోనన్న అభిప్రాయానికి వచ్చారు. ట్రాక్టర్ వ్యాపారాన్ని మూసివేయడమే వివేకవంతమైన పని అని, కీలకమైన మెషిన్ టూల్స్ కార్యకలాపాలపైనే శ్రద్ధ తీసుకోవాలని భావించారు.

ట్రాక్టర్ డివిజన్ క్రమం తప్పకుండా నష్టాలనే మిగులుస్తూ వచ్చింది. తన ఉద్యోగులకు జీతాలు, ఇంకా చట్టబద్దమైన ఇతర బకాయిలను చెల్లించడంలో విఫలమైంది. పింజోర్ కేంద్రంగా పని చేస్తున్న ట్రాక్టర్ డివిజన్ ఉద్యోగులకు 2014, జులై నుండి జీతాలు చెల్లించడం లేదు. అంతేకాకుండా వారికి ఇవ్వవలసిన ఇతర చట్టబద్ధ బకాయిలు 2013, నవంబర్ నుండి పేరుకుపోయాయి. హెచ్ ఎమ్ టి ఎల్ కు చెందిన ఇతర డివిజన్ (కార్పొరేట్ ప్రధాన కార్యాలయం, కామన్ సర్వీస్ డివిజన్ మరియు ఔరంగాబాద్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీ యూనిట్)లకు చెందిన ఉద్యోగుల విషయంలోను చట్టబద్ధ బకాయిలు (టెర్మినల్ బెనిఫిట్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వంటివి) కూడా పెండింగ్ పడ్డాయి. కంపెనీ పరిస్థితి దిగజారుతూ ఉన్నందువల్ల, జీతం/ వేతనాలు, పదవీ విరమణ బకాయిలు చెల్లించని కారణంగా ఉద్యోగులు ఇక్కట్లకు లోనవుతున్న కారణంగా ఉద్యోగులకు ఆకర్షణీయమైన విఆర్ఎస్ / విఎస్ఎస్ ను ఇవ్వజూపడం, అలాగే వారి బకాయిలను తీర్చివేయడం ద్వారా హెచ్ ఎమ్ టి లిమిటెడ్ కు చెందిన ట్రాక్టర్ డివిజన్ ను మూసివేయాలని నిర్ణయించడమైనది.

***