Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన – తెలుగు అనువాదం

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన – తెలుగు అనువాదం


గౌరవనీయులైన ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి, 

గౌరవనీయులైన రెండు ప్రతినిధి బృందాల సభ్యులకు, 

మీడియా మిత్రులకు, 

నమస్కారం !

ముందుగా, నేను, ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి, వారి ప్రతినిధి బృందానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.   గత సంవత్సరం మనం బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ 50 వ వార్షికోత్సవాన్ని,  మన దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాన్నీ, బంగా బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జన్మ శతాబ్ది ఉత్సవాలను కలిసి జరుపుకున్నాము.   గత ఏడాది డిసెంబర్, 6 వ తేదీన మనం మొదటి ‘మైత్రి దినోత్సవాన్ని’ కూడా ప్రపంచవ్యాప్తంగా కలిసి జరుపుకున్నాము.   ఈ రోజు, భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి షేక్ హసీనా గారి పర్యటన జరుగుతోంది.  రాబోయే 25 ఏళ్ల అమృత్‌-కాల్‌ లో భారత్-బంగ్లాదేశ్ మధ్య స్నేహం నూతన శిఖరాలను తాకుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ప్రధానమంత్రి  షేక్ హసీనా గారి నాయకత్వంలో బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రగతిని సాధించింది.  గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతి రంగంలో, మా పరస్పర సహకారం కూడా వేగంగా పెరిగింది.  ఈ రోజు, భారతదేశ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి గాను, ఈ ప్రాంతంలో మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి గాను బంగ్లాదేశ్ నిలిచింది. 

మన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు కూడా క్రమంగా పెరిగాయి.  ఈ రోజు, ప్రధానమంత్రి షేక్ హసీనా గారు, నేను అన్ని ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై విస్తృతమైన చర్చలు జరిపాము.

కోవిడ్ మహమ్మారి తో పాటు, ఇటీవలి ప్రపంచ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా, ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని మేమిద్దరం నమ్ముతున్నాము.

మా రెండు దేశాల మధ్య అనుసంధానత విస్తరణతో పాటు సరిహద్దులో వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి తో, రెండు ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో ఒకటి మరింత అనుసంధానం కాగలవు, ఒకదానికొకటి మద్దతు ఇవ్వగలవు.  మన ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందుతోంది.  ఈ రోజు, బంగ్లాదేశ్ ఎగుమతులకు ఆసియాలో భారతదేశం అతిపెద్ద మార్కెట్.  ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు, ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై త్వరలో చర్చలు ప్రారంభిస్తాం.

 

మా యువ తరాలకు ఆసక్తి కలిగించే ఐటీ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం.  వాతావరణ మార్పులు, సుందర్‌-బన్స్ వంటి ఉమ్మడి వారసత్వాన్ని కాపాడుకోవడంపై కూడా మేము సహకారాన్ని కొనసాగిస్తాము. 

మిత్రులారా, 

పెరుగుతున్న ఇంధన ధరలు ప్రస్తుతం అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సవాలుగా మారుతున్నాయి.  మైత్రీ థర్మల్ పవర్ ప్లాంట్‌ లోని మొదటి యూనిట్‌ ను ఈరోజు ఆవిష్కరించడం వల్ల బంగ్లాదేశ్‌ లో సరసమైన విద్యుత్ లభ్యత పెరుగుతుంది.

విద్యుత్ సరఫరా లైన్లను అనుసంధానం చేయడం పై కూడా ఇరు దేశాల మధ్య ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయి.  రూప్షా నదిపై రైల్వే వంతెన ప్రారంభోత్సవం అనుసంధానతను పెంపొందించే దిశగా ఒక అద్భుతమైన ముందడుగు.  భారతదేశ “లైన్ అఫ్ క్రెడిట్” కింద ఖుల్నా మరియు మోంగ్లా పోర్ట్ మధ్య నిర్మించబడుతున్న కొత్త రైల్వే లైన్‌ లో ఈ వంతెన ఒక ముఖ్యమైన భాగం.  బంగ్లాదేశ్ రైల్వే వ్యవస్థ అభివృద్ధి, విస్తరణకు భారతదేశం అన్ని సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటుంది.

మిత్రులారా, 

భారత-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా 54 నదులు ప్రవహిస్తున్నాయి.  శతాబ్దాలుగా ఈ నదులు రెండు దేశాల ప్రజల జీవనోపాధి తో ముడిపడి ఉన్నాయి.  ఈ నదులు, వాటి గురించిన జానపద కథలు, జానపద పాటలు, మన భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వానికి కూడా సాక్ష్యంగా ఉన్నాయి.  ఈ రోజు, కుషి యారా నది నీటిని పంచుకోవడం పై ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసాము.  ఇది భారతదేశం లోని దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వరదల నివారణకు సంబంధించి సహకారాన్ని పెంపొందించుకోవడం పై నేను, ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా ఫలవంతమైన చర్చ జరిపాము.   భారతదేశ వరద సంబంధిత సమాచారాన్ని బంగ్లాదేశ్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నాము.  మేము సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సమయాన్ని కూడా పెంపొందించుకున్నాము. 

ఈ రోజు, మేము తీవ్రవాద,  ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా సహకారం పై కూడా నొక్కి చెప్పాము.  1971 నాటి స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి, మన పరస్పర విశ్వాసం పై దాడి చేయాలనుకునే శక్తులతో కలిసి పోరాడ్డం కూడా చాలా ముఖ్యం.

మిత్రులారా, 

బంగబంధు చూసిన స్థిరమైన, సుసంపన్నమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్ దృక్పథాన్ని గ్రహించడంలో, భారతదేశం బంగ్లాదేశ్‌తో అంచెలంచెలుగా నడవడం కొనసాగిస్తుంది.  ఈ ప్రధాన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ రోజు మా మధ్య జరిగిన సంభాషణ కూడా ఒక అద్భుతమైన అవకాశం గా భావిస్తున్నాను. 

ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి, వారి ప్రతినిధి బృందానికి భారతదేశానికి నేను మరోసారి స్వాగతం పలుకుతున్నాను.  వారి భారతదేశ పర్యటన ఆహ్లాదకరంగా సాగాలని కోరుకుంటున్నాను.

మీకు అనేక కృతజ్ఞతలు.

గమనికఇది ప్రధానమంత్రి హిందీ లో చేసిన పత్రికా ప్రకటన కు స్వేచ్చానువాదం.

 

*****