Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగ్లాదేశ్ అధ్య‌క్షుడితో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ స‌మావేశం


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , 2019 మే 31 వ తేదీ పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అధ్య‌క్షుడు గౌర‌వ‌ అబ్దుల్ హ‌మీద్‌ను హైద‌రాబాద్ హౌస్‌లో క‌లుసుకున్నారు.

ఈ స‌మావేశం సంద‌ర్భంగా ఇరువురునాయ‌కులు ఇరుదేశాల మ‌ధ్య‌గ‌ల అద్భుత ద్వైపాక్షిక సంబంధాల ప‌ట్ల గొప్ప సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ముంద‌స్తు కార్య‌క్ర‌మాల కార‌ణంగా భార‌త్‌కు రాలేక పోయిన బంగ్లాదేశ్ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా త‌ర‌ఫున ,బంగ్లాదేశ్ అధ్య‌క్షుడు అబ్దుల్ హ‌మీద్‌, శుభాకాంక్ష‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి తెలియ‌జేశారు. బంగ్లాదేశ్‌ను సంద‌ర్శించాల్సిందిగా బంగ్ల‌దేశ్ అధ్య‌క్షుడి ఆహ్వానాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషంగా అంగీక‌రించారు. దౌత్య వ‌ర్గాల ద్వారా ప‌ర్య‌టన తేదీల‌ను ఖ‌రారు చేసేందుకు ఇరువురు నాయ‌కులూ నిర్ణ‌యించారు.

బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మొగ్గ‌తొడిగిన ద్వైపాక్షిక సంబంధాలు, భ‌ర‌త‌దేశానికి ఇప్ప‌టికీ అత్యంత ప్రాధాన్య‌త గ‌లిగినివిగానే ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు . గ‌డ‌చిన ఐదు సంవ‌త్స‌రాల‌లో ఇరు దేశాలూ స‌రిహ‌ద్దు అంశంతో పాటు ఎన్నో సంక్లిష్ట అప‌రిష్కృత అంశాలను ప‌రిష్క‌రించ‌డంలో ఎంతో ప‌రిణ‌తిని, స‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. 2021లో బంగ్లాదేశ్ విముక్తి అర్ధ శ‌తాబ్ది ఉత్స‌వాలు, బంగ‌బంధు షేక్ ముజిబుర్ ర‌హ్మాన్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు (2020) నేప‌థ్యంలో ఇండియా, బంగ్లాదేశ్‌లు త‌మ మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత ఉన్న‌త స్థాయికి తీసుకుపోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు.

బంగ్లాదేశ్ అధ్య‌క్షుడు అబ్దుల్ హ‌మీద్‌, 2019 మే30 న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఆయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు భార‌త్ వ‌చ్చారు. అంత‌కు ముందు వీరు 2014 డిసెంబ‌ర్‌లో భార‌త్‌లో ప‌ర్య‌టించారు. అలాగే 2018 మార్చిలో అంత‌ర్జాతీయ సౌర కూట‌మి తొలి స‌మావేశానికి అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌న దేశానికి వ‌చ్చారు.