ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ఈ కింది విధంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు:
అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ ఆహ్వానించిన మీదట, నేను ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నాను. ప్యారిస్‌లో, కృత్రిమ మేధ శిఖరాగ్ర సమావేశానికి సహాధ్యక్షత వహించేందుకు నేను ఎదురుచూస్తున్నా. ఈ సమావేశంలో ప్రపంచ నేతలతోపాటు గ్లోబల్ టెక్ సీఈఓలు పాల్గొంటారు. ఈ కృత్రిమ మేధ శిఖరాగ్ర సమావేశాన్ని నవకల్పనలను ప్రోత్సహించడానికీ, విశాల ప్రజాహితం కోసం సహకారపూర్వక వైఖరిని అనుసరిస్తూ సురక్షాత్మక, విశ్వసనీయ వైఖరులతో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవడానికీ ఉద్దేశించారు.
నా పర్యటన సందర్భంగా… భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన 2047 హొరైజన్ రోడ్ మ్యాప్ పరంగా చోటుచేసుకున్న పురోగతిని నా మిత్రుడు శ్రీ మేక్రోన్‌తో కలిసి సమీక్షించడానికి ఒక అవకాశం దక్కనుంది. మేం ఫ్రాన్స్‌లో తొలి భారత కాన్సులేట్ ను ప్రారంభించడానికీ, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్టును చూడడానికీ మాసే నగరానికి కూడా వెళ్లబోతున్నాం. దీనిలో ఫ్రాన్స్ సహా భాగస్వామ్య దేశాలతో ఏర్పాటైన ఒక కూటమిలో భారత్ కూడా ఒక భాగస్వామ్య దేశంగా ఉంది. ఇంధనాన్ని ప్రపంచం మేలు కోసం వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ కూటమిని ఏర్పాటు చేశారు. నేను మజా యుద్ధ సమాధి స్థలానికి వెళ్లి ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు శ్రద్ధాంజలి సమర్పించనున్నాను.
ఫ్రాన్స్ నుంచి. నేను రెండు రోజుల పాటు అమెరికా సందర్శించడానికి వెళ్తాను. అక్కడకు రావాల్సిందిగా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. నేను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా. ఆయన చరిత్రాత్మక విజయాన్ని సాధించి, జనవరిలో పదవీ బాధ్యతల్ని స్వీకరించిన తరువాత ఇది మా మొట్టమొదటి సమావేశం కానుంది. అయితే ఆయన మొదటి పదవీ కాలంలో భారత్, అమెరికాల మధ్య ఒక సమగ్ర ప్రపంచ శ్రేణి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచడానికి ఆయనతో కలిసి పనిచేయడం, ఎంతో ఆప్యాయత నిండిన పాత సంగతులు నాకిప్పటికీ జ్ఞాపకమున్నాయి.
ఈ పర్యటన ఆయన తొలి పదవీకాలంలో మన ఉభయ పక్షాల సహకారం ద్వారా సాధించిన విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని మన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి మరింత ముందుకు పోవడానికి ఒక కార్యాచరణను రూపొందించడానికి ఒక అవకాశాన్ని అందించనుంది. ఉభయ పక్షాల భాగస్వామ్యంలో టెక్నాలజీ, వ్యాపారం, రక్షణ, ఇంధనం, సరఫరాహారంలో దృఢత్వం వంటి రంగాలకు కూడా పాత్ర ఉంటుంది. మన రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల సాధనతోపాటు ప్రపంచవ్యాప్తంగా మెరుగైన భవిష్యత్తుకు రూపురేఖలు కల్పించడానికి మేం కలిసి కృషి చేస్తాం.
****
PM @narendramodi embarks on two-nation visit to France and USA. pic.twitter.com/r07pymd4Bq
— PMO India (@PMOIndia) February 10, 2025