Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం

ఫ్రాన్స్ అధ్యక్షుడితో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం


యువర్ ఎక్సలెన్సీ, నా మిత్రుడు, అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్

వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయెల్,

పౌర విమానయాన శాఖా మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ శ్రీ రతన్ టాటా

టాటా సన్స్ ఛైర్మన్ శ్రీ ఎన్ చంద్రశేఖరన్

ఎయిరిండియా సీఈవో  శ్రీ కాంప్ బెల్ విల్సన్

ఎయిర్ బస్ సీఈవో శ్రీ గిల్లమ్ ఫౌరీ  

ముందుగా ఈ చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్న ఎయిర్ ఇండియాకు, ఎయిర్ బస్ కు నా  అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా మిత్రుడైన అధ్యక్షుడు మాక్రన్ ను ప్రత్యేక ధన్యవాదాలు.

భారత్, ఫ్రాన్స్ మధ్య బలపడుతున్న బంధానికి, భారత పౌర విమానయాన శాఖ విజయానికి, ఆకాంక్షలకు నిదర్శనం ఈ ఒప్పందం. ఈరోజు మన పౌర విమానయాన రంగం దేశాభివృద్ధిలో విడదీయరాని భాగం. పౌరవిమానయాన రంగాన్ని బలోపేతం చేయటమన్నది జాతీయ మౌలిక సదుపాయాల వ్యూహంలో భాగం. గడిచిన ఎనిమిదేళ్ళలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147 కు పెరిగి దాదాపు రెట్టింపైంది. ప్రాంతీయ అనుసంధానత పథకం ఉడాన్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలు సైతం వాయుమార్గాన అనుసంధానమవుతున్నాయి. దీనివల్ల వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది.  

వైమానిక రంగంలో భారతదేశం త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా మారబోతోంది. అనేక అంచనాల ప్రకారం వచ్చే 15 ఏళ్లలో భారతదేశానికి 2000 కు పైగా విమానాలు అవసరమవుతాయి. ఇలా పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకోవటానికి ఈనాటి చరిత్రాత్మక ప్రకటన సహాయపడుతుంది.  ‘మేకిన్ ఇండియా- మేక్ ఫర్ ది వరల్డ్’  దార్శనికత కింద ఏరోస్పేస్ తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలకోసం 100% విదేశ ప్రత్యక్షపెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. నిర్వహణ, మరమ్మతులు,  గ్రౌండ్ హాండ్లింగ్ విభాగాలకు కూడా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వెసులు బాటు కల్పించారు. ఈరోజు అన్ని  అంతర్జాతీయ వైమానిక సంస్థల కంపెనీలూ భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఉన్న పూర్తి అవకాశాలు వాడుకోవాలసిందిగా కోరుతున్నా.

మిత్రులారా,

ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్ మధ్య జరిగిన ఒప్పందం కూడా భారత్-ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి.  కొద్ది నెలల కిందటే 2022 అక్టోబర్ లో వడోదరలో రక్షణ రవాణా విమాన ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యాను. 2.5 బిలియన్ యూరోలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో టాటా కు, ఎయిర్ బస్ కు భాగస్వామ్యముంది. విమాన ఇంజన్ల సర్వీసింగ్ కోసం ఫ్రెంచ్ కంపెనీ  సాఫ్రాన్  కూడా ఇక్కడో యూనిట్ నెలకొలపుతున్నట్టు తెలియటం సంతోషంగా ఉంది.

ఈరోజు అంతర్జాతీయంగానూ, బాహుళపక్షంగానూ స్థిరత్వం సాధించటంలో భారత్-ఫ్రెంచ్ భాగస్వామ్యం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం విషయం కావచ్చు,  అంతర్జాతీయ ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కావచ్చు భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా, సానుకూలంగా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

అధ్యక్షుడు మాక్రన్,

మన ద్వైపాక్షిక సంబంధాలు ఈ సంవత్సరం కొత్త శిఖరాలు అధిరోహిస్తాయని నమ్ముతున్నాను. జీ-20 కి భారతదేశ అధ్యక్షత కింద మనం కలసి పనిచేయటానికి మరిన్ని అవకాశాలున్నాయి. అందరికీ మరో సారి ధన్యవాదాలు, అభినందనలు.  

గమనిక: ప్రధాని ప్రసంగానికి ఇది సాధ్యమైనంత దగ్గరి అనువాదం. ప్రధాని అసలు ప్రసంగం హిందీలో ఉంది.

 

***