ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 27-28 తేదీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర లలో పర్యటించ నున్నారు.
మంగళవారం ఫిబ్రవరి 27న ఉదయం 10:45 గంటలకు కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి ఎస్ ఎస్ సి ) ని ప్రధాని సందర్శిస్తారు. సాయంత్రం 5:15 గంటలకు తమిళనాడులోని మధురైలో ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్ – డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ ఎంఎస్ఎంఇ ఎంటర్‌ప్రెన్యూర్స్‘ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
ఫిబ్రవరి 28న ఉదయం 9:45 గంటలకు తమిళనాడులోని తూత్తుకుడిలో సుమారు రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహారాష్ట్రలోని యావత్మాల్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని, రూ.4,900 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్, ఇతర పథకాల ప్రయోజనాలను కూడా ఆయన విడుదల చేయనున్నారు.
కేరళలో ప్రధాని కార్యక్రమాలు
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శన సందర్భంగా మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో దేశ అంతరిక్ష రంగాన్ని సంస్కరించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత కు, ఈ రంగంలో సాంకేతిక, పరిశోధన–అభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆయన నిబద్ధతకు ఊతం లభిస్తుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో పి ఎస్ ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్); మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో కొత్త ‘సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ‘; తిరువనంతపురంలోని వి.ఎస్.ఎస్.సి వద్ద ‘ట్రైసోనిక్ విండ్ టన్నెల్‘ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. అంతరిక్ష రంగానికి ప్రపంచ స్థాయి సాంకేతిక సౌకర్యాలు కల్పించే ఈ మూడు ప్రాజెక్టులను సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు.
శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని పిఎస్ ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్ ) పిఎస్ ఎల్ వీ ప్రయోగాల ఫ్రీక్వెన్సీని ఏడాదికి 6 నుంచి 15కు పెంచడానికి దోహదపడుతుంది. ఈ అత్యాధునిక సదుపాయం ప్రైవేటు అంతరిక్ష సంస్థలు రూపొందించిన ఎస్ ఎస్ ఎల్.వి, ఇతర చిన్న ప్రయోగ వాహనాల ప్రయోగానికి కూడా ఉపయోగపడుతుంది.
ఐ పి ఆర్ సి మహేంద్రగిరిలో కొత్త ‘సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ‘ సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు , దశల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది, ఇది ప్రస్తుత ప్రయోగ వాహనాల పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 200 టన్నుల థ్రస్ట్ వరకు ఇంజిన్లను పరీక్షించడానికి లిక్విడ్ ఆక్సిజన్ , కిరోసిన్ సరఫరా వ్యవస్థలను కలిగి ఉంది.
వాతావరణ వ్యవస్థలో ఎగిరే సమయంలో రాకెట్లు, విమానాల క్యారెక్టరైజేషన్ కోసం ఏరోడైనమిక్ పరీక్షకు విండ్ టన్నెల్స్ అవసరం. వి.ఎస్.ఎస్.సి వద్ద ప్రారంభించబడుతున్న “ట్రైసోనిక్ విండ్ టన్నెల్” ఒక సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థ, ఇది మన భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధి అవసరాలను తీరుస్తుంది.
గగన్ యాన్ మిషన్ పురోగతిని కూడా ప్రధాని తన పర్యటనలో సమీక్షించనున్నారు.. వ్యోమగాములకు వింగ్స్ ప్రదానం చేస్తారు. గగన్ యాన్ మిషన్ భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయోగ కార్యక్రమం, దీని కోసం వివిధ ఇస్రో కేంద్రాల్లో విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి.
తమిళనాడులో ప్రధాని కార్యక్రమాలు
మదురైలో ప్రధాన మంత్రి ‘క్రియేటింగ్ ద ఫ్యూచర్ – డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ ఎం ఎస్ ఎం ఇ ఎంటర్ ప్రిన్యూర్స్ ‘ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆటోమోటివ్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎం ఎస్ ఎం ఇ ) ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాన మంత్రి భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ లో ఎంఎస్ ఎం. ఇ లకు సపోర్ట్ చేయడానికి, ఉద్ధరించేందుకు రూపొందించిన రెండు ప్రధాన కార్య క్రమాలను కూడా ప్రారంభిస్తారు. ఇందులో టి వి ఎస్ ఓపెన్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్, టీవీఎస్ మొబిలిటీ–సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. దేశంలో ఎంఎస్ఎంఈల వృద్ధికి తోడ్పడటం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానం కావడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి వారికి సహాయపడాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా ఈ కార్యక్రమాలు ఒక అడుగు.
తూత్తుకుడిలో జరిగే ప్రభుత్వ కార్య క్రమంలో ప్రధాన మంత్రి వి. ఒ చిదంబరనార్ లో అవుటర్ హార్బర్ కంటెయినర్ టెర్మినల్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ కంటైనర్ టెర్మినల్ వి. ఒ చిదంబరనార్ పోర్టును తూర్పు తీరానికి ట్రాన్స్ షిప్ మెంట్ హబ్ గా మార్చే దిశగా ఒక అడుగు. భారతదేశ పొడవైన సముద్రతీరం, అనుకూలమైన భౌగోళిక స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం , ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశ పోటీతత్వాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన , ఆర్థిక వృద్ధికి కూడా దారితీస్తుంది.
వి. ఒ చిదంబరనార్ ఓడరేవును దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన పలు ఇతర ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో డీశాలినేషన్ ప్లాంట్, హైడ్రోజన్ ఉత్పత్తి, బంకరింగ్ ఫెసిలిటీ మొదలైనవి ఉన్నాయి.
హరిత్ నౌక చొరవ కింద భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంతర్గత జలరవాణా నౌకను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ నౌకను కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేసింది క్లీన్ ఎనర్జీ పరిష్కారాలను స్వీకరించడానికి , దేశ నెట్–జీరో కట్టుబాట్లకు అనుగుణంగా ఉండటానికి ఒక మార్గదర్శక దశను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పది రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్ హౌస్ ల లోని పర్యాటక సదుపాయలను కూడా ప్రధాన మంత్రి అంకితం చేస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వంచిమణియచ్చి – తిరునల్వేలి , మేలపాళయం – అరళ్వాయిమోలి సెక్షన్ లు సహా వంచిమణియచ్చి – నాగర్ కోయిల్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసే ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. సుమారు రూ.1,477 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ డబ్లింగ్ ప్రాజెక్టు కన్యాకుమారి, నాగర్ కోయిల్, తిరునల్వేలి నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
తమిళనాడులో సుమారు రూ.4,586 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నాలుగు రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఎన్ హెచ్ -844లోని జిట్టండహళ్లి–ధర్మపురి సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం, ఎన్ హెచ్ -81లోని మీన్సురుట్టి–చిదంబరం సెక్షన్ ను రెండు లేన్లుగా మార్చడం, ఎన్ హెచ్ -83లోని ఒడ్డంచత్రం–మడత్తుకుళం సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం, ఎన్ హెచ్ -83లోని నాగపట్నం–తంజావూరు సెక్షన్ ను రెండు లేన్లుగా మార్చడం ప్రాజెక్టులు. ఇందులో ఉన్నాయి. కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సామాజిక–ఆర్థిక వృద్ధిని పెంచడం ఇంకా ఈ ప్రాంతంలో తీర్థయాత్ర సందర్శనలను సులభతరం చేయడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.
మహారాష్ట్రలో ప్రధాని కార్యక్రమాలు
రైతుల సంక్షేమం పట్ల ప్రధాని నిబద్ధతకు మరో ఉదాహరణగా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం–కిసాన్) కింద 16 వ విడత మొత్తాన్ని యవత్మాల్ లోని బహిరంగ కార్యక్రమంలో లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ద్వారా మోదీ విడుదల చేస్తారు. ఈ విడుదలతో 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ అవుతుంది.
సుమారు రూ.3800 కోట్ల విలువైన ‘నమో షెట్కారీ మహాసన్మాన్ నిధి‘ రెండో, మూడో విడత నిధులను లను కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు. ఈ పథకం మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు సంవత్సరానికి రూ .6000 అదనపు మొత్తాన్ని అందిస్తుంది.
మహారాష్ట్రలోని 5.5 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.825 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను ప్రధాని పంపిణీ చేయనున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద భారత ప్రభుత్వం అందించే రివాల్వింగ్ ఫండ్ కు ఈ మొత్తం అదనం. స్వయం సహాయక సంఘాల్లో రొటేషన్ పద్ధతిలో రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించడానికి, గ్రామస్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పేద కుటుంబాల వార్షిక ఆదాయాన్ని పెంచడానికి స్వయం సహాయక బృందాలకు రివాల్వింగ్ ఫండ్ (ఆర్ఎఫ్) ఇస్తున్నారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రధాని ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలను నూటికి నూరు శాతం పూర్తి చేయాలన్న ప్రధాని దార్శనికతను సాకారం చేసేందుకు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువయ్యేందుకు ఇది మరో ముందడుగు.
మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం మోదీ ఆవాస్ ఘర్కుల్ యోజన పథకాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 10 లక్షల ఇళ్లను నిర్మించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. 2.5 లక్షల మంది లబ్ధిదారులకు మొదటి విడత రూ.375 కోట్లను ప్రధాని బదిలీ చేయనున్నారు.
మరాఠ్వాడా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై), బలిరాజ జల్ సంజీవని యోజన (బీజేఎస్వై) కింద రూ.2750 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు.
మహారాష్ట్రలో రూ.1300 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులలో వార్ధా–కలంబ్ బ్రాడ్ గేజ్ లైన్ (వార్ధా–యావత్మాల్–నాందేడ్ కొత్త బ్రాడ్ గేజ్ లైన్ ప్రాజెక్టులో భాగం) ; న్యూ అష్తీ – అమల్నర్ బ్రాడ్ గేజ్ లైన్ (అహ్మద్ నగర్–బీడ్–పార్లీ కొత్త బ్రాడ్ గేజ్ లైన్ ప్రాజెక్టులో భాగం) ఉన్నాయి. కొత్త బ్రాడ్ గేజ్ లైన్లు విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ఇంకా సామాజిక–ఆర్థిక అభివృద్ధిని పెంచుతాయి. ఈ కార్యక్రమంలో రెండు రైలు సర్వీసులను ప్రధాని వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో కలంబ్ , వార్ధాలను కలిపే రైలు సేవలు ఉన్నాయి; అమల్నర్ , న్యూ అష్తీలను కలిపే కొత్త రైలు సేవ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రాంతంలోని విద్యార్థులు, వ్యాపారులు రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
మహారాష్ట్ర లో రోడ్డు రంగం బlలోపేతానికి పలు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. ఎన్ హెచ్l-930లోని వరోరా–వనీ సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం; . సకోలి–భండారా, సలైఖుర్ద్–తిరోరాలను కలిపే ముఖ్యమైన రహదారుల కోసం రహదారి అప్ గ్రేడేషన్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ఈ ప్రాంతంలో సామాజిక–ఆర్థిక అభివృద్ధిని పెంచుతాయి. యవత్మాల్ నగరంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.