ఫిజీ లో ఈ రోజు న జరిగిన శ్రీ శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఉపన్యసాన్నిచ్చారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ని ఏర్పాటు చేసినందుకు గాను ఫిజీ ప్రధాని కి మరియు ఫిజీ ప్రజల కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆసుపత్రి ఇరు దేశాల మధ్య సంబంధాల సంకేతం గా ఉంది. ఇది భారతదేశం మరియు ఫిజీ ఉమ్మడి ప్రస్థానం లో మరొక మజిలీ గా కూడా ఉంది అని ఆయన అన్నారు. బాలల గుండెజబ్బుల ఆసుపత్రి ఫిజీ లో ఆ తరహా ఏకైక ఆసుపత్రి కావడంతో పాటు గా యావత్తు దక్షిణ పసిఫిక్ ప్రాంతం లోనే ఆ తరహా ఒకటో బాలల ఆసుపత్రి కూడాను అని ఆయన అన్నారు. ‘‘హృదయ సంబంధి వ్యాధులు పెను సవాలు గా నిలచిన ప్రాంతం లో వేల కొద్దీ బాలల కు సరికొత్త జీవనాన్నిచ్చే మాధ్యమం గా ఈ ఆసుపత్రి మారనుంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పిల్లలు ప్రపంచ శ్రేణి చికిత్స ను పొందడం ఒక్కటే కాకుండా అన్ని శస్త్ర చికిత్స లు ఎటువంటి ఖర్చు లేకుండా జరుగుతాయి అంటూ ఆయన తన సంతోషాన్ని వెలిబుచ్చారు. మరి దీనికి గాను ఆయన ఫిజీ లోని సాయి ప్రేమ్ ఫౌండశన్ ను, ఫిజీ ప్రభుత్వాన్ని, భారతదేశం లోని శ్రీ సత్య సాయి సంజీవని చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ను ప్రశంసించారు.
బ్రహ్మం లో లీనమైన శ్రీ సత్య సాయి బాబా కు ప్రధాన మంత్రి ఈ సందర్బం లో ప్రణామాన్ని ఆచరించారు. సత్య సాయి బాబా నాటిన మానవ సేవ అనేటటువంటి ఒక చిన్న మొక్క ఇవాళ ఒక పెద్ద వట వృక్షం గా ఎదిగి యావత్తు మానవాళి కి ఉపయోగపడుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శ్రీ సత్య సాయి బాబా ఆధ్యాత్మికత ను కర్మకాండ బారి నుంచి విముక్తం చేసి ప్రజల సంక్షేమం తో ముడి పెట్టే అద్భుతమైన పని ని చేశారు అని గుర్తు కు తెచ్చుకొన్నారు. విద్య, ఆరోగ్యం రంగాల లో సత్య సాయి బాబా చేసిన కార్యాలు ఈ నాటి కీ ప్రేరణ ను అందిస్తూ ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గుజరాత్ లో భూకంపం సంభవించిన కాలం లో సాయి భక్తులు అందించిన సేవల ను సైతం శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో స్మరించుకొన్నారు. ‘‘సత్య సాయి బాబా యొక్క దీవెనల ను నేను నిరంతరం గా అందుకొంటూ ఉన్నాను. ఇవాళ్టికి కూడా వారి ఆశీర్వాదాలు నాకు లభిస్తూ ఉండటం నాకు లభించినటువంటి ఒక గొప్ప అదృష్టం అని నేను భావిస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
మానవాళి కి సేవ చేయాలి అనే భావన పై భారతదేశం-ఫిజీ సంబంధాలు ఆధారపడి ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి కాలం లో భారతదేశం తన కర్తవ్యాల ను ఈ విలువ ల ఆధారం గా నెరవేర్చగలిగింది, మరి మేం 150 దేశాల కు మందుల ను అందజేశాం. అదేవిధం గా సుమారు 100 దేశాల కు దాదాపు 100 మిలియన్ వేక్సీన్ లను ఇచ్చాం. ఈ ప్రయాసల లో మేం ఫిజీ కి కూడా ఎల్లప్పుడూ ప్రాధాన్యాన్ని ఇచ్చాం అని ఆయన అన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాల గాఢత గురించి ప్రధాన మంత్రి మరిన్ని వివరాల ను తెలిపారు. రెండు దేశాల మధ్య విశాల సముద్రం ఉన్నప్పటికీ, మన సంస్కృతి మన దేశాల ను కలిపి ఉంచింది. మన సంబంధాలు పరస్పర ఆదరణ, ప్రజల మధ్య గల పటిష్ట బంధాలు ఆధారంగా నిలచి ఉన్నాయి అని ఆయన అన్నారు. ఫిజీ యొక్క సామాజిక అభివృద్ధి లో, ఆర్థిక అభివృద్ధి లో తోడ్పాటు ను అందించే అవకాశాలు భారతదేశాని కి దక్కుతూ ఉండడం భారతదేశానికి సౌభాగ్యం అని ఆయన పేర్కొన్నారు.
ఫిజీ ప్రధాని శ్రీ ఫ్రాంక్ బైనీమరామా పుట్టిన రోజు ఈ రోజు న కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షల ను తెలిపారు. శ్రీ ఫ్రాంక్ బైనీమరామా నాయకత్వం లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
My remarks at inauguration of children's heart hospital in Fiji. https://t.co/ThQKuyNZz2
— Narendra Modi (@narendramodi) April 27, 2022