పశు పోషణ మరియు పాడి రంగాలలో సహకారం కోసం భారతదేశం మరియు డెన్మార్క్ ల మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు) ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకు రావడమైంది. ఈ ఎమ్ఒయు పై 2018 ఏప్రిల్ 16వ తేదీ నాడు సంతకాలయ్యాయి.
సంస్థాగత పటిష్టీకరణ మరియు పాడి అభివృద్ధి అంశాలలో ఇప్పటికే అమలులో ఉన్న విజ్ఞాన నిధి ని విస్తృతపరచే ఉద్దేశంతో పశు పోషణ, ఇంకా పాడి రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని అభివృద్ధిపరచాలన్నది ఈ ఎంఒయు ధ్యేయం.
సంయుక్త కార్యక్రమాలను రూపొందించడం, సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం, ఈ అంశాలపై సంప్రదింపులు జరపడంతో పాటు, తదనంతర మదింపునకు ఇరు పక్షాల ప్రతినిధులతో కూడిన ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుసి) ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
డెన్మార్క్ తో భాగస్వామ్యం పశువుల పెంపకం, పశువుల ఆరోగ్యం మరియు పాడి కార్యకలాపాలు, పశుగ్రాసం నిర్వహణ తదితర రంగాలలో ప్రావీణ్యం మరియు జ్ఞానం.. ఈ రెండింటి ఆదాన ప్రదానానికి మార్గాన్ని సుగమం చేయగలదని ఆశిస్తున్నారు. తత్ఫలితంగా భారతదేశం లో పశుగణం యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంపొందడంతో పాటు పరస్పర ప్రయోజనాలు ముడివడివుండే పశుగణం తాలూకు వ్యాపారం కూడా పెంపొందాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం.
***