ఘనత వహించిన డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలి, ప్రెసిడెంట్ ఆఫ్ ద కో ఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా.
ఎక్సలెన్సీ, గౌరవనీయ జేమ్స్ మరపే , పపువా న్యూగునియా ప్రెసిడెంట్
ఎక్సలెన్సీ, నా మిత్రుడు, మహ్మద్ నషీద్, పీపుల్స్ మజ్లిస్ రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్ స్పీకర్,
ఎక్సలెన్సీ, మిస్ అమిమా జె మహమ్మద్ , ఐక్యరాజ్యసమితి డిప్యూటి సెక్రటరీ జనరల్
శ్రీ ప్రకాశ్ జవడేకర్, భారత ప్రభుత్వపర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి,
గౌరవనీయ అతిథులకు,
నమస్తే,
ప్రపంచ సుస్థిరాభివృద్ధి సమ్మేళనంలో మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వేదిక 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తున్నందుకు టిఇఆర్ ఐ కి నా అభినందనలు. ఇది మన ప్రస్తుత , భవిష్యత్తుకు ఎంతో అవసరమైనది.
మిత్రులారా,
రానున్న రోజులలో మానవాళి ప్రగతి ప్రస్థానం ఎలా ఉండబొతుందన్నది రెండు అంశాలు నిర్వచించనున్నాయి. అందులో మొదటిది మన ప్రజల ఆరోగ్యం, రెండోది మన ఈ విశ్వ ఆరోగ్యం. రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రత అందరికీ తెలిసినవే. ప్రస్తుతం చేయవలసింది మూసధోరణికి భిన్నంగా ఆలోచించడం, మన యువతపై పెట్టుబడి పెట్టడం, సుస్థిరాభివృద్ధి కోసం కృషి చేయడం.
మిత్రులారా,
వాతావరణ మార్పులపై పోరాటానికి మార్గం, వాతావరణ న్యాయం ద్వారానే జరగాలి. వాతావరణ న్యాయం దిశగా సాగేటపుడు అందుకు ఉదారబుద్ధి కావాలి. వాతావరణ న్యాయం అంటే భారీ, దీర్ఘకాలిక దృశ్యాన్ని గురించి ఆలోచించడమే. దురదృష్టకరమైన అంశం ఏమంటే, పర్యావరణంలో మార్పులు, ప్రకృతి విపత్తులు చాలావరకు పేదలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. వాతావరణ న్యాయం అనేది ట్రస్టీషిప్ అనే దార్శనికత నుంచి ప్రేరణ కలిగినది. ఇందులో అభివృద్ధి పేదల పట్ల సానుకూల దృక్పథంతో సాధించడం జరుగుతుంది. వాతావరణ న్యాయం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదగడానికి తగినంత అవకాశం ఇవ్వడమే. మనలోని ప్రతి ఒక్కరూ వ్యక్తులుగా సమష్టిగా మన బాధ్యతలను అర్ధం చేసుకున్నట్టయితే వాతావరణ న్యాయం సాధించగలుగుతాం.
మిత్రులారా,
ఇండియా ఆలోచనలు పటిష్టమైన కార్యాచరణతో ముడిపడినవి. ప్రజల సమష్టి కృషి ఉంది. మనం పారిస్ సదస్సు నాటి లక్ష్యాలు, చిత్తశుద్ధితో చేసుకున్న సంకకల్పాలను దాటిపోయే స్థితిలో ఉన్నాం. మనం 2005 స్థాయి నుంచి జిడిపిలో ఉద్గారాల తీవ్రతను 33 నుంచి 35 శాతానికి తగ్గించేందుకు కట్టుబడి ఉన్నాం.ఇప్పటికే 24 శాతం ఉద్గారాల తీవ్రత తగ్గింది. ఈవిషయం తెలిసి మీరు సంతోషిస్తారు.
శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం మొత్తం విద్యుత్ స్థాపిత సామర్ధ్యం సాధించేందుకు సంకల్పం ఉండేది.ఇవాళ శిలాజేతర ఇంధన వనరుల నుంచి విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం వాటా 38 శాతానికి పెరిగింది. ఇందులో అణు విద్యుత్, భౄరీ జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండియాలో ల్యాండ్ డిగ్రడేషన్ న్యూట్రాలిటీ కి సంబంధించి పునరుత్పాదక ఇంధన వనరులు వేగంగా పుంజుకుంటున్నాయి. 2030 నాటికి 450 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసేదిశగా ముందుకు సాగుతున్నాం. ఇక్కడ నేను మన ప్రైవేటు రంగాన్ని, పలువురు వ్యక్తులను అభినందించదలచాను. వారు ఇందుకు కృషి చేస్తున్నారు. ఇండియా ఇథనాల్ వాడకాన్ని కూడా పెంచుతున్నది.
మిత్రులారా,
ఇంధన వనరులు అందరికీ అందుబాటులో లేకుండా ఉంటే సుస్థిరాభివృద్ధి అసంపూర్ణమే. ఈ దిశగా కూడా ఇండియా మంచి ప్రగతి సాధించింది. 2019 మార్చిలో ఇండియా దాదాపు నూరు శాతం విద్యుదీకరణను సాధించింది. దీనిని సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా , వినూత్న విధానాల ద్వారా సాధించడం జరిగింది. అంతర్జాతీయంగా ఎల్.ఇ.డి బల్బులు విస్తృత ప్రచారంలోకి రావడానికి చాలా ముందే ఇండియా ఎల్.ఇ.డి బల్బులపై పెట్టుబడి పెట్టింది. ఉజాలా కార్యక్రమం కింద 67 మిలియన్ల ఎల్.ఇ.డి బల్బులు ప్రజల జీవితాలలో భాగమయ్యాయి. ఇది ఏటా 38 మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించింది. జల్ జీవన్ మిషన్ 34 మిలియన్ ఇళ్లను కేవలం 18 నెలల కాలంలో ట్యాప్ కనెక్షన్ ద్వారా అనుసంధానం చేసింది.ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 80 మిలియన్లకు పైగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి వంటగ్యాస్ అందుబాటులోకి తేవడం జరిగింది. భారతదేశ ఇంధన బాస్కెట్‌లో సహజవాయు వాటాను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు మనం కృషి చేస్తున్నాం.
దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 60 బిలియన్ డాలర్ల పెట్టుబడి సిద్ధంగా ఉంది. సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లను విస్తరించడానిఇక పనులు జరుగుతున్నాయి. మరో వంద జిల్లాలను రాగల 3 సంవత్సరాలలో నెట్ వర్క్‌కు అనుసంధానం చేయడం జరుగుతుంది. పిఎం-కుసుమ్ పథకం కింద 30 గిగా వాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యానని వ్యవసాయ రంగంలో 2022నాటికి అభివృద్ధి చేయడం జరుగుతుంది.
మిత్రులారా,
తరచూ సుస్థిరాభివృద్ధిపై చర్చలు ప్రధానంగా హరిత ఇంధనంపై దృష్టిపెడుతుంటాయి. హరిత ఇంధనం ఒక్కటే మార్గం.
మనం ఆశిస్తున్న లక్ష్యం హరిత విశ్వం. మన సంస్కృతిలో అడవులకు అత్యంత గౌరవం ఉంది. హరిత ప్రాంత విస్తరణ మంచి ఫలితాలను ఇస్తున్నది. ఎఫ్.ఎ.ఒ అంతర్జాతీయ అటవీ వనరుల అసెస్‌మెంట్ 2020 ప్రకారం, ఇండియా గత దశాబ్దంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకున్న అత్యున్నత మూడు దేశాలలో ఒకటిగా ఉంది. దేశంలో అటవీ విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు నాలుగోవంతుకు చేరింది. సంప్రదాయకంగా ఆలోచించే వారు , దేశం అభివృద్ధిలో ముందుకుపోతుంటే అటవీ విస్తీర్ణం తగ్గుతుందని ఆలోచించవచ్చు. కానీ ఇది సరైనది కాదని చూపిస్తున్న దేశాలలో ఇండియా ఒకటి.
సుస్థిరాభివృద్ధి సాధించే మన లక్ష్యం లో జంతువుల సంరక్షణ పై ప్రధాన దృష్టి ఉంది.
దేశవ్యాప్తంగా ప్రజలు ఈ విషయంలో ఎంతో గర్వపడుతున్నారు. గత ఐదు, ఏడు సంవత్సరాలలో సింహాలు, పులులు, చిరుతలు, గంగానదీ ప్రాంత డాల్ఫిన్‌ల సంఖ్య బాగా పెరిగింది.
మిత్రులారా,
ఈ సమ్మేళనం సుస్థిరాభివృద్ధికి కృషిచేస్తున్న అద్భుత మేధావులు, ఆలోచనా పరులను ఒక చోట చేర్చింది. నేను ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పదలచాను. సమష్టితత్వం, ఆవిష్కరణలు. సుస్థిరాభివృద్ధి అనేది సమష్టి ప్రయత్నాల ద్వారానే సాధ్యం.
ప్రతి ఒక్క వ్యక్తీ దేశ మంచి కోసం ఆలోచించినట్టయితే, ప్రతి దేశం ప్రపంచం మంచి కోసం ఆలోచించినట్టయితే,అలాంటపుడు సుస్థిరాభివృద్ధి అనేది సాకారం అవుతుంది. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా ఇండియా ఈ దిశగా గట్టి కృషి చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ మంచి ఆలోచనలు, మంచి విధానాలను స్వాగతించాలి. అదే స్ఫూర్తితో మనం మన మంచి విధానాలను ఇతరులతో పంచుకోవాలి. ఇక రెండోది ఆవిష్కరణలకు సంబంధించినది. పునరుత్పాదక ఇంధన వనరులపైన, పర్యావరణ హితకర సాంకేతిక పరిజ్ఞానాలపైన ఇంకా ఎన్నింటిపైనో చాలా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. విధాన నిర్ణేతలుగా మనం వీలైనంత ఎక్కువగా ఇలాంటి కృషికి మద్దతునివ్వాలి. మన యువత శక్తి సామర్ధ్యాలు తప్పకుండా అద్భుత ఫలితాలను ఇవ్వనున్నాయి.
మిత్రులారా,
ఈ వేదిక ద్వారా నేను మరో అంశాన్ని ప్రస్తావించదలచాను.దానిపై మరింత ఆలోచన పెట్టాలి. అదేమిటంటే , మన విపత్తుల నిర్వహణ సామర్థ్యాన్నిపెంచుకోవడం గురించి. ఇందుకు మనం మానవ వనరుల అభివృద్ధి, సాంకేతికతపై దృష్టిపెట్టాలి. విపత్తుల ను తట్టుకోగల మౌలికసదుపాయాలలో భాగంగా మనం ఈ దిశగా పనిచేస్తున్నాం.
మిత్రులారా,
సుస్థిరాభివృద్ధికి సంబంధించి తీసుకోవలసిన సాధ్యమైన అన్ని చర్యలనూ తీసుకోవడానికి ఇండియా సిద్ధంగా ఉంది. మానవాళి కేంద్రిత మన విధానం ప్రపంచ శ్రేయస్సుకు మరింత ఊతం ఇవ్వనుంది. టిఇఆర్ ఐ వంటి పరిశోధన సంస్థలు ఈ దిశగా సాగే కృషిలో కీలకమైనవి.
ఈ సమ్మేళనానికి, మీ అందరికీ అభినందనలు
ధన్యవాదాలు.
***
Addressing the World Sustainable Development Summit. https://t.co/PZsoUMzfRe
— Narendra Modi (@narendramodi) February 10, 2021