మాననీయ మహోదయులు అధ్యక్షుడు శ్రీ ఉహురు కెన్యాట్టా,
డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ విలియమ్ రూతో,
మంత్రివర్గ సభ్యులు,
విశిష్ట అతిథులారా,
జాంబో, నమస్కార్,
మీ సాదర స్వాగతానికి ఇవే నా కృతజ్ఞతలు.
మీ కోసం నూట ఇరవై ఐదు కోట్ల భారతీయుల శుభాకాంక్షలను నేను నా వెంట తీసుకువచ్చాను. రెండు సహస్రాబ్దుల క్రితమే మన ఇరు దేశాల ప్రజలు ఒకరితో మరొకరు సన్నిహితం అయ్యేందుకు హిందూ మహాసముద్ర జలాలు కారణమయ్యాయి. మనం సముద్రతీర ప్రాంతాల పరంగా ఇరుగుపొరుగు దేశస్థులం.
భారతదేశ పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలు, ముఖ్యంగా నా స్వంత రాష్ట్రం గుజరాత్ కు చెందినవారిని, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతానికి చెందినవారిని తీసుకుంటే వీరు అటు నుండి ఇటు, ఇటు నుండి అటూ వెళ్లి ఆయా ప్రాంతాల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 19వ శతాబ్దం చివరలో వలసరాజ్య వాద శకంలో పలువురు భారతీయులు కెన్యాకు వచ్చి ప్రసిద్ధి చెందిన మొంబాసా ఉగాండా రైల్వే నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వారిలో చాలా మంది కెన్యాలోనే స్థిరపడి కెన్యా ఆర్ధికాభివృద్ధికి కృషి చేశారు. చాలా మంది భారతీయులు కెన్యా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. కెన్యా ప్రథమ అధ్యక్షుడు శ్రీ ఎంజీ జోమో కెన్యాట్టాతో కలసి వారు పోరాటంలో కదం తొక్కారు. శ్రీ మఖన్ సింగ్, శ్రీ పియో గామా పింటో, శ్రీ చమన్ లాల్, శ్రీ ఎమ్.ఎ. దేశాయి వంటి వారు ఆ కోవకు చెందిన వారు. ఇరు దేశాల సమాజాల మధ్య అనాదిగా గల బంధాలు ఇరు దేశాల సంస్కృతులను సౌభాగ్యవంతం చేశాయి. ఎంతో ఉన్నతమైన స్వాహిలి భాష అనేక హిందీ పదాలను అక్కున చేర్చుకొంది.
కెన్యా భోజన సంప్రదాయంలో భారతీయ వంటకాలు అంతర్భాగమయ్యాయి. మాననీయ మహోదయులైన అధ్యక్షుల వారూ, గడచిన సాయంత్రం మీరు, నేను కలసి కెన్యాతో భారతీయ సంతతి ప్రజలకు గల అభిమానాన్ని ఆప్యాయతను, బంధాలను స్వయంగా తిలకించాం. వారు ఇరు దేశాల మధ్య గల బలమైన వంతెన లాంటి వారు. ఈ ఉమ్మడి వారసత్వానికి మనం విలువనివ్వాలి. 2008లో మొదటిసారిగా ఈ అందమైన దేశాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఇప్పుడు ఇక్కడకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి పర్యటన సమయం తక్కువే అయినప్పటికీ, దీని ద్వారా వచ్చే ఫలితాలు మాత్రం చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవి. 2015 అక్టోబర్ లో న్యూ ఢిల్లీలో మొదలైన మన వ్యక్తిగత స్నేహాన్ని తిరిగి నేను స్మరించుకుంటున్నాను. ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా నెలకొన్న సంబంధాలకు సరికొత్త శక్తిని గమనాన్ని ఇచ్చేటట్లు గడచిన కొన్ని గంటలలో మనం చేయగలిగాం. ఇరు దేశాల రాజకీయ అవగాహన, నిబద్ధతలు మరింత గాఢమయ్యాయి.
కెన్యా అభివృద్ధి ప్రాథమ్యాలను నెరవేర్చడానికి అనుగుణంగా మేం చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు సూచించిన రంగాల్లోనే మీరు కోరుకున్నట్టుగానే మా సహాయం ఉంటుంది.
వ్యవసారంగం కావొచ్చు, లేదా ఆరోగ్య రంగం కావొచ్చు. విద్యావసరాలు, వృత్తి విద్య, లేదా శిక్షణ, చిన్న వ్యాపారాల అభివృద్ధి, పునర్వినియోగ శక్తి లేదా విద్యుత్ సరఫరా, సంస్థాగత సామర్థ్యాల నిర్మాణం.. ఇలా అన్ని రంగాలలో గతంలో అందించినట్లుగానే మా అనుభవాలను, నిపుణత్వాన్ని కెన్యా లబ్ధి పొందడం కోసం వెచ్చించగలం.
ఎక్స్ లెన్సీ, ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వాణిజ్య బంధం వర్థిల్లుతూ ఉంది. ఇది తాత్కాలికమైన, వ్యాపారత్మకమైన బంధం కాదు. కాల పరీక్షకు తట్టుకొని నిలచినటువంటిది. ఉభయ దేశాలు పలు విలువలను, అనుభవాలను పంచుకోవడం ద్వారా ఏర్పడిన బంధం ఇది.
స్నేహితులారా,
భారతదేశం, కెన్యా రెండు దేశాలలో యువ శక్తి అపారంగా ఉంది. ఇరు దేశాల సంస్కృతులు విద్యకు విలువనిస్తున్నాయి. నైపుణ్యాల అభివృద్ధికి ఇదే సరైన సమయం. స్వాహిలి లో ఒక సామెతను గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను..
ఎలిముబిలామాలి, కమంతాబిలాసాలి. (దీనికి అర్థం.. ఆచరణలో పెట్టని విజ్ఞానం తేనె లేని తుట్టె లాంటిది అని.) కెన్యా, భారతదేశం రెండూ ప్రపంచ శాంతి కోసం కృషి చేశాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలసి మనం ఐకమత్యంగా కృషి చేయాలి. బలహీనులు, పేదవారి ప్రగతి కోసం మాత్రమే కాదు, ధరణీ మాతను సంరక్షించడానికి మనం కలిసికట్టుగా కృషి చేయాలి.
ఎంతో ముఖ్యమైన సహజ వనరుల పరిరక్షణ రంగంలో మనం ఒకరి దగ్గర నుండి మరొకరం ఎంతో నేర్చుకోవచ్చు. కీర్తిశేషుడు శ్రీ ఎంజీ జోమో కెన్యాట్టా మాటల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. మన పిల్లలు గత కాలపు కథానాయకుల నుండి నేర్చుకోవచ్చు. భవిష్యత్ నిర్మాణ నిపుణులుగా మనల్ని తీర్చిదిద్దుకోవడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.
అధ్యక్షుడు శ్రీ ఉహురు కెన్యాట్టా, ముఖ్యమైన అతిథులారా, నేనిప్పుడు మిమ్మల్ని విందుకు పదమంటున్నాను.
కెన్యా అధ్యక్షుడైన హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ ఉహురు కెన్యాట్టా ఆరోగ్యంగాను, క్షేమంగాను ఉండాలని కోరుకుంటూ;
మా హిందూ మహాసముద్రం పొరుగువారయిన కెన్యా ప్రజలు ప్రగతిని సాధిస్తూ, సంపదలతో వెలుగొందాలని ఆకాంక్షిస్తూ;
భారతదేశం, కెన్యా ప్రజల స్నేహ సౌభ్రాతృత్వాలు చిరకాలం కొనసాగాలని ఆశిస్తూ..
మనందరం ఈ విందులో పాలు పంచుకొందామిక.