ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అఫ్గానిస్తాన్ కు చెందిన అత్యున్నత పౌర పురస్కారమైన ‘అమీర్ అమానుల్లాహ్ ఖాన్ అవార్డు’ను ఇచ్చారు. అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ గనీ నిన్న హెరాత్ లో ప్రతిష్టాత్మక న ఆఫ్గన్-భారత్ స్నేహ వారధి ప్రారంభ కార్యక్రమం ముగిసిన అనంతరం ఈ పురస్కారంతో శ్రీ మోదీని గౌరవించారు.
ప్రధాన మంత్రి తన అభిమానాన్ని ట్విటర్ లో వ్యక్తం చేస్తూ ‘‘అమీర్ అమానుల్లాహ్ ఖాన్ అవార్డును నాకు ఇచ్చినందుకు అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి ఇవే నా ప్రగాఢ ధన్యవాదములు’’ అని పేర్కొన్నారు.
అఫ్గాన్ పౌరులకు, లేదా విదేశీయులకు వారు అందించే సేవలకు ఒక అభినందనగా అఫ్గాన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైన పౌర పురస్కారమిది. పతకం వెనుక వైపున “నిషాన్-ఎ-దౌలతీ గాజీ అమీర్ అమానుల్లాహ్ ఖాన్” అనే పదాలు ఉంటాయి. ఈ మాటలకు “స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లాహ్ ఖాన్” అని అర్థం.
పూర్వ రంగం:
అమీర్ అమానుల్లాహ్ ఖాన్ పతకం అఫ్గానిస్తాన్ కు చెందిన సర్వోచ్చ పౌర పురస్కారం. ఈ పురస్కారానికి అఫ్గానిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన శూరుడు, జాతీయ నాయకుడైన అమానుల్లాహ్ ఖాన్ (గాజీ) పేరును పెట్టారు. ఆయన అఫ్గానిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1919 నుండి 1929 మధ్య అఫ్గానిస్తాన్ ఎమిరేట్ కు పాలకుడిగా ఉన్నారు.
కింగ్ అమానుల్లాహ్ ఖాన్ అఫ్గానిస్తాన్ ఆధునిక రాజ్యాంగం ఏర్పాటుకు చొరవ తీసుకొన్నారు. అందులో వ్యక్తులకు సమాన హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు చోటు కల్పించారు. ఆయన దేశ ఆధునికీకరణకు బాట వేశారు. బాలురు, బాలికలు.. ఈ ఇరువురి కోసం మహానగరీయ పాఠశాలలను తెరిచారు. అంతే కాకుండా యూరోప్ తో, ఆసియా తో అఫ్గానిస్తాన్ వ్యాపారాన్ని విస్తరించారు. స్వతంత్ర, ఆధునిక అఫ్గానిస్తాన్ కోసం అమానుల్లాహ్ ఖాన్ కన్న కల ఇదివరకటి మాదిరిగానే ఈ నాటికి కూడా ప్రాసంగికమేనని చెప్పాలి.
అమానుల్లాహ్ ఖాన్ భారతదేశంతో బలీయమైన సంబంధాలను నెలకొల్పారు. 1929లో కొంత కాలం పాటు ఇక్కడకు వచ్చారు. ఆయన పాదు కట్టిన స్నేహమనే మొక్క ఇరు దేశాల మధ్య బలంగా వేళ్లూనుకొంటున్నది.
జూన్ 4న హెరాత్ లో అఫ్గాన్-భారత స్నేహ వారధిని ప్రారంభించిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమీర్ అమానుల్లాహ్ ఖాన్ అవార్డును అందుకొన్నారు. ఈ అవార్డును అందుకున్న అతి కొద్ది మంది విదేశీ నాయకులలో శ్రీ మోదీ ఒకరు. భారత-అఫ్గానిస్తాన్ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి శ్రీ మోదీ చూపుతున్న వ్యక్తిగత కట్టుబాటును, ఉభయ దేశాల మధ్య నెలకొన్న విశిష్టమైన సంబంధాన్ని ఈ అవార్డు ప్రస్ఫుటం చేస్తోంది.
ఈ అవార్డును అఫ్గానిస్తాన్ ప్రభుత్వం 2006 లో మొదలుపెట్టింది. ఈ అవార్డును ఇంతవరకు అందుకున్న ప్రముఖులలో అమెరికా అధ్యక్షుడు శ్రీ జార్జ్ బుష్, కజాక్ స్తాన్ అధ్యక్షుడు శ్రీ నూర్ సుల్తాన్ నజర్ బయెవ్, టర్కీ అధ్యక్షుడు శ్రీ రిసెప్ తయీప్ ఎర్ డోగన్, నాటో జనరల్ శ్రీ జేమ్స్ జోన్స్, అఫ్గానిస్తాన్ పూర్వ అధ్యక్షుడు, ఆధ్యాత్మిక నేత శ్రీ సిబ్ గాతుల్లాహ్ ముజాదిదీ, ఇంకా అఫ్గానిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి శ్రీ అబ్దుల్ సలామ్ అజిమీ లు ఉన్నారు.
My deepest gratitude to the Government of Afghanistan for conferring the Amir Amanullah Khan Award. pic.twitter.com/EfzeXIBdK1
— Narendra Modi (@narendramodi) June 4, 2016