అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం మరియు అందరికీ సామాజిక భద్రతను కల్పించడం కోసం ప్రభుత్వం చెప్పుకొన్న వచనబద్ధతలో భాగంగా ప్రధాన మంత్రి వయ వందన యోజన (పిఎమ్‌వివివై) తాలూకు పెట్టుబడి పరిమితిని 7.5 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు ఈ పథకంలో సబ్‌స్క్రిప్షన్ కు ఉద్దేశించినటువంటి కాల పరిమితి ని 2018 మే 4వ తేదీ నుండి 2020 మార్చి నెల 31వ తేదీ వరకు పొడిగించేందుకు కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇంకా, సీనియర్ సిటిజన్ లకు ఉద్దేశించిన సామాజిక భద్రత కార్యక్రమాలకు ఒక ఉత్తేజాన్ని ఇవ్వడంలో భాగంగా పెట్టుబడి పరిమితిని ఒక కుటుంబానికి ఇప్పుడు ఉన్న 7.5 లక్షల రూపాయల నుండి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ కు 15 లక్షల రూపాయలకు పెంచడమైంది. తద్వారా, సీనియర్ సిటిజన్ లకు మరింత పెద్దదైన సామాజిక భద్రత కవచాన్ని సమకూర్చేందుకు వీలవుతుంది. ఈ చర్య ద్వారా సీనియర్ సిటిజన్ లకు ఒక్కొక్క నెలకు 10000 రూపాయల వరకు పెన్షన్ అందేందుకు ఆస్కారం ఉంటుంది.
పిఎమ్‌వివివై లో భాగంగా 2018 మార్చి మాసం నాటికి మొత్తం 2.23 లక్షల మంది సీనియర్ సిటిజన్ లు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. మునుపటి వరిష్ట పెన్షన్ బీమా యోజన- 2014 లో, మొత్తం 3.11 లక్షల మంది సీనియర్ సిటిజన్ లకు ప్రయోజనం చేకూరుతోంది.
పూర్వరంగం:
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) ద్వారా పిఎమ్‌వివివై ని అమలు చేయడం జరుగుతోంది. వృద్ధాప్యంలో సామాజిక భద్రతను అందించడం కోసం మరియు అనిశ్చిత మార్కెట్ స్థితిగతుల కారణంగా వారి యొక్క వడ్డీ రూప ఆదాయం భవిష్యత్తు లో తగ్గే పక్షంలో 60 సంవత్సరాలు మరియు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వృద్ధులను రక్షించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా 10 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరానికి 8 శాతం ప్రతిఫలానికి హామీని ఇస్తున్నటువంటి పెన్షన్ దక్కుతుంది. ఈ పథకంలో పెన్షన్ ను నెలవారీ పద్ధతిన/ మూడు నెలలకు ఒకసారి పద్ధతిన/ ఆరు నెలలకు ఒకసారి పద్ధతిన మరియు సంవత్సరానికి ఒక సారి పద్ధతిన.. వీటిలో దేనినైనా ఎంచుకొనే ఐచ్చికం ఉంది. భేదాత్మక ప్రతిఫలాన్ని, అంటే, ఎల్ఐసి అందించే ప్రతిఫలానికి మరియు ఒక్కొక్క సంవత్సరానికి 8 శాతం హామీ తో కూడిన ప్రతిఫలానికి మధ్య ఉండే వ్యత్యాసానికి.. భారత ప్రభుత్వం సాంవత్సరిక ప్రాతిపదికన సబ్సిడీగా తాను భరిస్తుంది.
***