యువర్ ఎక్స్లెన్సీ, ప్రెసిడెంట్ శ్రీ ఇమేనుయెల్ మేక్రాన్,
భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు చెందిన సమ్మానిత ప్రతినిధి వర్గాలు
మరియు
మిత్రులారా,
బోం స్వా,
నమస్కారాలు.
ముందుగా, నేను నా ఆప్త మిత్రుడు ప్రెసిడెంట్ శ్రీ మేక్రాన్ కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆయన ఈ చరిత్రాత్మకమైన వారసత్వ ప్రదేశాని కి నన్ను మరియు నా ప్రతినిధి వర్గాన్ని చాలా భవ్యమైనటువంటి మరియు అత్యంత ఆదారణ పూర్వకమైనటువంటి రీతి లో ఆహ్వానించారు. ఇది నాకు ఒక స్మరణీయ ఘడియ. అధ్యక్షుడు మాన్య శ్రీ మేక్రాన్ జి7 సమ్మిట్ కు పంపినటువంటి ఆహ్వాన పత్రం భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాని కి ఒక ఉదాహరణే కాక నా పట్ల ఆయన ప్రదర్శించినటువంటి మైత్రీపూర్వకమైన చేష్ట కూడాను. ఫ్రాన్స్ అధ్యక్షత వహిస్తున్న జి7 శిఖర సమ్మేళనం తాలూకు కార్యాచరణ ప్రణాళిక ను గురించి మరియు ఆ కార్యక్రమం సంపూర్ణ సాఫల్యం అయ్యేందుకు పలు అంశాల ను గురించి ఈ రోజున మేము సమగ్ర చర్చల ను జరిపామ. ఈ విషయం లో భారతదేశం నుండి అపేక్షిస్తున్న సహకారాన్ని అందజేయాలనేది భారతదేశం యొక్క సంకల్పం గా ఉంది. అది జీవ వైవిధ్యం కావచ్చు, లేదా జల వాయు పరివర్తన కావచ్చు, లేదా కూలింగ్ ఎండ్ గ్యాస్ తాలూకు అంశాలు కావచ్చు.. ప్రకృతి తో సద్భావన కలిగి ఉండటం తో పాటు సంప్రదాయాల ను ఆదరిస్తూ మనుగడ సాగించాలని భారతదేశం శతాబ్దాల తరబడి సూచిస్తూ వచ్చింది. ప్రకృతి ని విధ్వంసం పాలు చేయడం ఎన్నటికీ మానవశ్రేయాని కి ప్రయోజనకారి కాబోదు. మరి ఇదే అంశం ఈ యొక్క జి7 శిఖర సమ్మేళన ఇతివృత్తం అయినప్పుడు ఇది భారతదేశాని కి మరింత సంతోషకారకమైన ఘడియ అని చెప్పాలి.
మిత్రులారా,
ఫ్రాన్స్ మరియు భారతదేశం సంబంధాలు శతాబ్దాల నాటివి. మన స్నేహం ఏ స్వార్థపర కారణాల పైన ఆధారపడినటువంటిది కాదు కానీ ‘స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం’ అనే సాంద్రమైన విలువల పైన ఇది ఆధారపడివున్నది. ఈ కారణం గానే ఫ్రాన్స్ మరియు భారతదేశం భుజం భుజం కలిపి ప్రజాస్వామ్యాన్ని, అలాగే స్వతంత్రాన్ని పరిరక్షించాయి. అంతేకాదు, ఫాసిజమ్ తో, ఉగ్రవాదం తో ఉమ్మడి గా పోరాడాయి. ఒకటో ప్రపంచ యుద్ధం కాలం లో భారతీయ సైనికులు వేల సంఖ్య లో ప్రాణ సమర్పణ చేయడాన్ని ఇప్పటి కీ ఫ్రాన్స్ లో స్మరించుకోవడం జరుగుతోంది. ఉగ్రవాదం, జల వాయు పరివర్తన, పర్యావరణం, ఇంకా సాంకేతిక విజ్ఞానాన్ని సమ్మిళితమైన తీరు లో అభివృద్ధి పరచడం అనే సవాళ్ళ కు ఈ రోజు కు కూడా ఫ్రాన్స్ మరియు భారతదేశం కలసికట్టు గా ఎదురొడ్డి నిలబడ్డాయి. మన ఉభయ దేశాలు కేవలం మంచి విషయాల ను గురించి మాట్లాడటమే కాక మనం నిర్ధిష్ట చర్యల ను కూడా తీసుకొన్నాము. ఫ్రాన్స్ మరియు భారతదేశం చేపట్టిన విజయవంతమైన కార్యక్రమాల లో ఒక కార్యక్రమం ఇంటర్నేశనల్ సోలర్ అలయన్స్.
మిత్రులారా,
రెండు దశాబ్దాలు గా మనం వ్యూహాత్మక భాగస్వామ్య మార్గం లో సాగుతున్నాము. ప్రస్తుతం ఫ్రాన్స్ మరియు భారతదేశం ఒకదానికి మరొకటి విశ్వసనీయమైన భాగస్వామ్య దేశాలు గా ఉన్నాయి. మన కష్టకాలాల లో మనం ఒక దేశం యొక్క ఆలోచనల ను మరొక దేశం అర్థం చేసుకొని, అండగా నిలచాయి.
మిత్రులారా,
ఈ రోజు న, మన సంబంధాల విషయంలో అధ్యక్షులు శ్రీ మేక్రాన్ మరియు నేను ప్రతిదీ కూలంకషం గా చర్చించాము. 2022వ సంవత్సరం లో భారతదేశాని కి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కానుంది. అప్పటి కల్లా ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం కోసం అనేక లక్ష్యాల ను మేము నిర్దేశించుకొన్నాము. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ గా రూపొందించాలనేది మా ప్రధానమైనటువంటి ధ్యేయం గా ఉంది. అభివృద్ధి కోసం భారతదేశాని కి కావలసినటువంటి అంశాలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల కు ఒక సువర్ణావకాశాన్ని ప్రసాదిస్తున్నాయి. మేము మా యొక్క ఆర్థిక సహకారాన్ని ఇనుమడింప చేసుకోవడం కోసం అంతరిక్షం, సమాచార సంబంధ సాంకేతిక విజ్ఞానం, పౌర విమానయానం, నైపుణ్య అభివృద్ధి, ఇంకా మరెన్నో రంగాల లో నూతన కార్యక్రమాల ను చేపట్టడానికై నిరీక్షిస్తున్నాము. రక్షణ రంగ సహకారం మన సంబంధాని కి ఒక బలమైన స్తంభం గా ఉంది. వివిధ పథకాల లో మనం చక్కని పురోగతి ని సాధిస్తూ ఉండటం నాకు సంతోషాన్ని ఇస్తోంది. 36 రాఫెల్ యుద్ధ విమానాల లో ఒకటో విమానం వచ్చే నెల లో భారతదేశాని కి అందజేయబడనుంది. మనం సాంకేతిక విజ్ఞానం లోను, సహ నిర్మాణం లోను సహకారాన్ని పెంపొందింప చేసుకొందాము. మేము క్రొత్త తరం పౌర పరమాణు ఒప్పంద పత్రం పై సంతకం చేసినటువంటి దేశాల లో ఫ్రాన్స్ ఒకటో దేశం గా ఉంది. జైతాపుర్ ప్రోజెక్టు విషయం లో శరవేగం గా ముందుకు సాగవలసిందని మా యొక్క కంపెనీల కు మేము విజ్ఞప్తి చేశాము. అంతేకాదు, విద్యుత్తు యొక్క ధర ను కూడా దృష్టి లో పెట్టుకొన్నాము. రెండువైపులా పర్యటన రంగం వృద్ధి చెందడం సైతం గొప్ప ఉల్లాసాన్ని కలగజేస్తున్న విషయం. సుమారు 2.5 లక్షల మంది ఫ్రెంచ్ యాత్రికులు మరియు 7 లక్షల మంది భారతీయ పర్యాటకులు ప్రతి సంవత్సరం అటు నుండి ఇటు, ఇటు నుండి అటు రాకపోకలు జరుపుతున్నారు. ఉన్నత విద్య రంగం లో విద్యార్థుల ఆదాన ప్రదానాలు కూడా ప్రధానం గా పెరగ వలసిన అవసరం ఉంది. భారతదేశ సాంస్కృతికోత్సవం అయినటువంటి ‘‘నమస్తే ఫ్రాన్స్’’ యొక్క తదుపరి సంచిక ను 2021-2022 మధ్య కాలం లో ఫ్రాన్స్ నలుమూలలా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం యొక్క వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతి పట్ల ఫ్రాన్స్ ప్రజల లో కుతూహలాన్ని ఈ ఉత్సవం మరింత గాఢతరం చేయగలదని నేను ఆశిస్తున్నాను. యోగా ఫ్రాన్స్ లో అమిత ప్రజాదరణ కు నోచుకొందన్న సంగతి ని నేను ఎరుగుదును. దీని ని ఫ్రాన్స్ లోని నా స్నేహితులు మరెంతో మంది వారి యొక్క ఆరోగ్యదాయక జీవనశైలి యొక్క రూపం గా స్వీకరిస్తారని నేను ఆశపడుతున్నాను.
మిత్రులారా,
ప్రపంచం లోని సవాళ్ళ ను ఎదుర్కోవడం కోసం ఫ్రాన్స్ కు మరియు భారతదేశాని కి మధ్య సహకారం నెలకొనడం ముఖ్యమని నేను చెప్పి ఉన్నాను. మన ఇరు దేశాలు ఉగ్రవాదాన్ని మరియు రాడికలైజేశన్ ను నిరంతరం ఎదుర్కోవలసి వస్తున్నది. సీమాంతర ఉగ్రవాదం తో పోరాటం సల్పడం లో మేము ఫ్రెంచ్ మద్దతు ను మరియు సహకారాన్ని అందుకొన్నాము. దీని కి గాను అధ్యక్షుడు శ్రీ మేక్రాన్ కు మేము ధన్యవాదాలు పలుకుతున్నాము. భద్రత, మరియు ఉగ్రవాద నిరోధక చర్యల లో సహకారాన్ని విస్తరింప చేసుకోవాలని మేము అభిలషిస్తున్నాము. సముద్ర సంబంధిత భద్రత, ఇంకా సైబర్ సెక్యూరిటీ రంగాల లో పెరుగుతున్నటువంటి మన సహకారాన్ని మరింత పటిష్ట పరచుకోవాలని కూడా మేము నిర్ణయించాము. సైబర్ సెక్యూరిటీ, ఇంకా డిజిటల్ టెక్నాలజీ ల విషయం లో ఒక నూతనమైన మార్గసూచీ పట్ల మేము అంగీకారానికి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. హిందూ మహాసముద్ర ప్రాంతం లో మన ఆచరణాత్మక సహకారం శీఘ్రం గా వర్ధిల్లుతున్నది. ఈ సహకారం ఆ ప్రాంతం లో భద్రత కు పూచీ పడటం లోను, అన్ని పక్షాల పురోగతి లోను కీలకం కాగలదు.
మిత్రులారా,
నా సన్నిహిత మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ మేక్రాన్ ఆధ్వర్యం లో జి-7 ఒక విజయవంతమైన నాయకత్వాన్ని అందిస్తుందని, అలాగే, సవాళ్ళ తో నిండిన ప్రస్తుత తరుణం లో ఫ్రాన్స్ కు ఒక నవీన దార్శనికత ను, ఉత్సాహాన్ని మరియు నైపుణ్యాన్ని కూడా ప్రసాదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
ఎక్స్లెన్సీ,
మీ కృషి లో 1.3 బిలియన్ మంది భారతీయుల వైపు నుండి సంపూర్ణ సహకారం మరియు అండదండలు మీకు లభించగలవు. మన ఉభయ దేశాలు ఒక భద్రమైనటువంటి మరియు సమృద్ధమైనటువంటి ప్రపంచం కోసం అవసరమయ్యే ఒక బాట ను కలసికట్టు గా ఏర్పరచ గలుగుతాయి. బియార్తిజ్ లో జి-7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడాని కి నేను వేచివున్నాను. ఈ శిఖర సమ్మేళనం సఫలం కావాలని, యావత్తు ఫ్రాన్స్ కు మరియు మీకు అనేకానేక శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. మీరు అందించినటువంటి ప్రేమాస్పదమైన ఆహ్వానాని కి గాను మరొక్కమారు నా యొక్క కృతజ్ఞత ను నేను వ్యక్తం చేస్తున్నాను.
ధన్యవాదాలు
మర్సీ బకూ
ఔ వువా.