ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని జపాన్ రక్షణ శాఖ మంత్రి శ్రీ ఇత్సునోరీ ఒనోదెరా ఈ రోజు కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ మోదీ తాను ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించే కన్నా ముందునుంచే తనకు జపాన్ తో దీర్ఘకాలిక అనుబంధం ఉందని గుర్తుకు తెచ్చుకొన్నారు. అలాగే ఇటీవల కొంత కాలంగా భారతదేశానికి,జపాన్ కు మధ్య గల ప్రత్యేక వ్యూహాకత్మక మరియు ప్రపంచ స్థాయి భాగస్వామ్యం గాఢతరం కావడంతో పాటు అంతకంతకూ విస్తరిస్తూ ఉండడాన్ని ఆయన స్వాగతించారు.
భారతదేశానికి, జపాన్ కు మధ్య ఉన్నటువంటి భాగస్వామ్యానికి రక్షణ రంగ సహకారం ఒక కీలకమైన స్తంభం గా ఉన్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. రెండు దేశాలకు మధ్య రక్షణ రంగ చర్చల సంబంధిత వివిధ యంత్రాంగాలను పటిష్టం కావడాన్ని, దీంతో పాటు ఉభయ దేశాల సాయుధ బలగాల మధ్య సంబంధాలు ఇనుమడించడాన్ని ఆయన స్వాగతించారు. రెండు దేశాలకు మధ్య రక్షణ సంబంధ సాంకేతిక విజ్ఞాన సహకారం లో పురోగతి నమోదు కావడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
గత సంవత్సరం భారతదేశం లో జపాన్ ప్రధాని శ్రీ శింజో అబే జరిపిన పర్యటన విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ సంవత్సరమే జపాన్ లో పర్యటించడం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు.