ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు డాక్టర్ జిమ్ యోంగ్ కిమ్ ఈ రోజు కలుసుకున్నారు.
భారత దేశానికి వరల్డ్ బ్యాంక్ బాసటగా నిలుస్తున్నందుకు, మరీ ముఖ్యంగా స్మార్ట్ సిటీస్, గంగా నది శుద్ధి, నైపుణ్యాల అభివృద్ధి, స్వచ్ఛ భారత్ మరియు అందరికీ విద్యుత్ సదుపాయం తదితర ప్రాధాన్య రంగాలలో చేయూతను అందిస్తున్నందుకు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలకు ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల దిశగా సాగిపోతుండడం తననెంతగానో ఆకట్టుకొన్నదని డాక్టర్ కిమ్ అన్నారు.
పర్యావరణ పరంగా ఒక స్థిరమైన మార్గాన్ని అనుసరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న భారత దేశం వంటి దేశాలకు వాతావరణం మార్పునకు సంబంధించిన ఆర్ధిక సహాయాన్ని తగినంతగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాంక్ సంస్కరణల అనుకూల దృక్పథంతో సాగగలదని, ఈ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండదండలను అందించగలదని ప్రధాన మంత్రికి డాక్టర్ కిమ్ హామీ ఇచ్చారు.
వ్యాపారాన్ని సులభతరంగా మార్చడంలో, ప్రత్యేకించి లాజిస్టిక్స్ రంగంలో భారత దేశం శర వేగంగా దూసుకు వెళుతోందంటూ డాక్టర్ కిమ్ అభినందనలు తెలిపారు.
అనేక అంశాల పైన, అలాగే సహకరించుకోవడానికి అవకాశం ఉన్న మార్గాల పైన ప్రధాన మంత్రి మరియు డాక్టర్ కిమ్ చర్చలు జరిపారు.
Met @WorldBank President @JimYongKim & discussed ways to deepen India’s engagement with the World Bank. https://t.co/5yfW1e8BZK
— Narendra Modi (@narendramodi) June 30, 2016