ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 2 హెక్టార్ల వరకు సాగు భూమి కల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ 6000 లు చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని మినహాయింపులను పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు.
ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి వంతున మూడు వాయిదాలలో వాయిదాకు రూ 2000 వంతున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో ప్రత్యక్షనగదు బదిలీ పథకం కింద జమ చేస్తారు. ఈ పథకం కింద తొలి వాయిదా తొలి లాట్ కింద దేశవ్యాప్తంగా గల కోటి పైగా రైతుకుటుంబాలకు సుమారు 2000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేశారు. మిగిలిన లభ్దిదారులకు సంబంధించి తొలి వాయిదా మొత్తాన్ని విడుదల చేయనున్నారు.
ఈ పథకం కింద రెండో వాయిదా మొత్తాన్ని 2019 ఏప్రిల్ 1 తర్వాత చెల్లింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రెండో విడత వాయిదా నుంచి తదుపరి వాయిదాల విడుదలకు లబ్ధిదారుకు సంబంధించిన ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం తప్పని సరి అని 1.2.2019న ఈ పథకాన్ని ఆమోదించే సందర్భంలో కేంద్ర కేబినెట్ పేర్కొనింది. అయితే రెండో విడత నిధుల విడుదలకు నూరు శాతం ఆధార్ సీడింగ్ ఉండాలంటే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే లబ్ధిదారుల వివరాలను ఆధార్ సీడింగ్ సమర్ధంగా చేయాలంటే అందుకు బయోమెట్రిక్ నిర్ధారణ అవసరమౌతుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఆధార్ వివరాల నమోదులో పేర్లకు సంబంధించి స్పెల్లింగ్ కచ్చితంగా సరిపోయే విధంగా ఉండాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున అవి తిరస్కరణకు గురయ్యే వీలుంది. రెండో విడత వాయిదా మొత్తాన్ని ఏప్రిల్ 1 ,2019న చెల్లించాల్సి ఉండగా ఆధార్ నంబర్ తో లబ్ధిదారుల వివరాల అనుసంధానం జాప్యమైతే వారికి రెండో విడత విడుదల జాప్యమౌతుంది. ఇది రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్ల ఈ నిబంధనను సడలించారు.మూడవ వాయిదా మొత్తం నుంచి ఆధార్ అనుసంధానత షరతును వర్తింప చేయాలని నిర్ణయించారు. అయితే రెండో విడత మొత్తం పొందడానికి ఆధార్ నంబర్ మాత్రం ఉండాలి. చెల్లింపులు చేసే ముందు ప్రభుత్వం డాటా నిర్ధారణకు తగిన చర్యలు తీసుకుంటుంది.