జమ్మూకశ్మీర్ రాష్ట్రం, శ్రీనగర్‌కు చెందిన 30 మంది పాఠశాల విద్యార్థినిలు న్యూఢిల్లీలో ప్రధానిని కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ విద్యార్థినిలు దేశంలో పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. భారతదేశ రక్షణ శాఖ క్రమం తప్పకుండా నిర్వహించే ఆపరేషన్ సద్భావన కార్యక్రమంలో భాగంగా ఈ విద్యార్థినిలు ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ మోదీ జమ్మూకశ్మీర్ విద్యార్థినిలతో అనేక అంశాలపైన మాట్లాడారు. విద్య గురించీ, ముఖ్యంగా బాలికా విద్య గురించి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి విద్యార్థినిల ఆకాంక్షలు, కలల గురించి ఆయన వారితో ముచ్చటించారు.
ఎంతో ఉత్సాహభరితంగా సాగిన సమావేశంలో విద్యార్థినిలు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిచ్చారు. బాలికా విద్యకోసం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశానికి వచ్చే పలు ఉప ప్రయోజనాల గురించి ముఖ్యంగా ఆరోగ్యం, పర్యాటక రంగ పరంగా చేకూరే లబ్ధి గురించి ఆయన వారికి వివరించారు. ఏకాగ్రత పెరగడానికి యోగా ఉపయోగపడుతుందని, యోగా ద్వారా చేకూరే లబ్ధిని ఆయన వారికి చెప్పారు.
సివిల్ సర్వీస్ పరీక్షల్లో జమ్మూ కశ్మీర్ యువత అత్యధికంగా విజయం సాధించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతే కాదు ఆ రాష్ట్రంనుంచి క్రీడల్లో కూడా సమర్థత కనబరుస్తున్నారని అన్నారు. భారతదేశానికి మంచి భవిష్యత్ వుందని, జమ్మూ కశ్మీర్ యువత అత్యధిక స్థాయిలో ముందుకొచ్చి దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
*****