ప్రత్యామ్నాయ వైద్య విధాన రంగంలో భారత్, జర్మనీలమధ్య పరస్పర సహకరానికి ఆసక్తి కనబరచే సంయుక్త ఒప్పందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంయుక్త ఒప్పందపై సంతకాలు జరిగితే అది ఉభయదేశాల మధ్య సంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్య రంగంలో పరస్పర సహకారాన్నిమరింత ముందుకు తీసుకుపోనుంది. పరస్పర సహకారంతో పరిశోధన,శిక్షణ, ప్రత్యామ్నాయ వైద్యరంగంలో శాస్త్రీయ సామర్థ్యాల నిర్మాణం వంటివి ఆయుష్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడుతుంది.
ఇందులో అదనపు ఆర్థిక అంశాలు ఏవీ లేవు. పరిశోధనలు, శిక్షణ కోర్సుల నిర్వహణ ,సదస్సులు, సమావేశాల నిర్వహణను ఆయుష్ మంత్రిత్వశాఖకు చేసిన ప్రస్తుత కేటాయింపుల నుంచే , ప్రస్తుత ప్రణాళికా పథకాలనుంచే సర్దుబాటు చేస్తారు.
నేపథ్యం…
:సంప్రదాయ వైద్యానికి సంబంధించి భారత దేశంలో బాగా అభివృద్ధిచెందిన వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య రంగం ఈ సేవలు పొందేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. సంప్రదాయ వైద్య వ్యవస్థ పట్ల జర్మనీకి ఎంతో ఆసక్తి ఉంది. అంతర్జాతీయంగా భారతీయ సంప్రదాయ వైద్య విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న నిర్ణయంలో భాగంగా ఆయుష్ మంత్రిత్వశాఖ చైనా, మలేషియా, ట్రినిడాడ్, టొబాగో హంగరి, బంగ్లాదేశ్,నేపాల్, మారిషస్, మంగోలియా, మయన్మార్‌లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా పలు చర్యలు తీసుకుంది.
ఆయుష్ మంత్రిత్వశాఖ జర్మనీలో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు తీసుకుంది. బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం సిఫార్సు, సహకారంతో ఈ చర్యలు చేపట్టింది. ఇరుదేశాలు తీసుకున్న చర్యలలో ముఖ్యమైనది సెంట్రల్‌కౌన్సిల్ ఫర్ రిసెర్ఛ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సిసిఆర్ ఎ ఎస్), బెర్లిన్‌లోని చరితేయూనివర్సిటీలు సంయుక్తంగా మోకాలికి సంబంధించిన ఆస్టియో అరిత్రైటిస్పై రిసెర్చ్ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ పరిశోధనకు సంబంధించిన ప్రయోగాత్మక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో రోగులకు చాలవరకు ఉపశమనం కలిగినట్టు తెలిసింది. ఈ అధ్యయనం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది,
ఆయుష్ మంత్రిత్వశాఖ కు చెందిన స్వతంత్ర మంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ 2016 అక్టోబర్ 15-19 తేదీలమధ్య జర్మనీ వెళ్లి అక్కడ జరిగిన ఐరోపా రెండో ఆయుర్వేద కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. అలాగే జర్మనీ అదికారులతో సమావేశమయ్యారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఈప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్‌కు మద్దతు నిచ్చింది. మంత్రివర్యులు శ్రీ శ్రీపాద యశోనాయక్గారి పర్యటన సందర్భంగా మంత్రిగారికి, జర్మనీ పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీ ఇన్గ్రిడ్ఫిస్చ్బాచ్ ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయుష్, ప్రకృతి వైద్య రంగంలో సంయుక్త ప్రకటనకు సంబంధించిన ముసాయిదా, సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. భారత , జర్మనీల మద్య బంధాన్ని, పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సంయుక్త ప్రకటన ఆకాంక్ష మంచి అవకాశం ఇవ్వగలదని బావిస్తున్నారు.