Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్ర‌గ‌తి’ ద్వారా ప్ర‌ధాన‌ మంత్రి స‌ంభాషణ


ఐసిటి ఆధారిత మల్టీ మాడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (ప్ర‌గ‌తి) మాధ్యమం ద్వారా జరిగిన 21వ ముఖాముఖి స‌మీక్ష‌ స‌మావేశానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించారు.

ఇంతవరకు ప్ర‌ధాన మంత్రి ఇటువంటి ఇరవై సమావేశాలను నిర్వ‌హించారు. ఈ స‌మావేశాల‌లో మొత్తం రూ.8.79 ల‌క్ష‌ల కోట్ల విలువైన 183 ప్రాజెక్టుల పురోగ‌తితో పాటు 17 రంగాల‌లో ప్ర‌జా ఫిర్యాదుల యొక్క ప‌రిష్కారం దిశగా నమోదైన పురోగతిని కూడా ఆయ‌న స‌మీక్షించారు.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు నిర్వ‌హించిన 21వ స‌మావేశంలో పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల‌కు సంబంధించిన ఫిర్యాదులు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో పురోగ‌తిని ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ప‌నితీరులో మెరుగుద‌ల‌ను ప్ర‌శంసించ‌డంతో పాటు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్ ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంలో మ‌రింత చొర‌వ చూపుతూ ఆ ప్రక్రియను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనిపై అధికారులు ప్రతిస్పందిస్తూ పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లను వేగంగా మంజూరు చేసే దిశ‌గా సిబ్బంది సంఖ్య‌ను పెంచ‌డం స‌హా తీసుకున్నటువంటి చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. అయితే, ఈ విషయంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను అందుకొనేలా ప్ర‌క్రియ‌ స‌ర‌ళీక‌రణకు అందుబాటులో ఉన్న అత్యాధునిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ప్రాముఖ్యాన్నివ్వాలని ప్ర‌ధాన‌ మంత్రి నొక్కిచెప్పారు.

రైల్వేలు, ర‌హ‌దారులు, విద్యుత్తు, చ‌మురు సరఫరా గొట్టపు మార్గాలు, ఆరోగ్య రంగాల‌లో మౌలిక స‌దుపాయాలకు సంబంధించిన రూ.56,000 కోట్ల విలువైన 9 కీల‌క ప్రాజెక్టుల పురోగ‌తిని ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్షించారు. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌ నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, హ‌రియాణా, రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఒడిశా త‌దిత‌ర పలు రాష్ట్రాల‌లో ఈ 9 ప్రాజెక్టులు విస్త‌రించి ఉన్నాయి. నేటి స‌మీక్ష‌లో భాగంగా ఢిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్‌ స‌హా ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ లోని మంగ‌ళ‌గిరి, ప‌శ్చిమ‌ బెంగాల్‌ లోని క‌ల్యాణి, మ‌హారాష్ట్ర లోని నాగ్‌ పుర్‌, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ లోని గోర‌ఖ్‌ పుర్‌ ల‌లో నాలుగు కొత్త అఖిల‌ భార‌త వైద్య‌ విజ్ఞాన శాస్త్రాల సంస్థ‌ (AIIMS)ల నిర్మాణపనులలో పురోగతి తీరును కూడా ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించారు.

స్టార్ట్ సిటీస్ కార్య‌క్ర‌మం పైనా ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్ష జరిపారు. ఇందుకోసం నిర్దేశించిన పోటీలో వివిధ న‌గ‌రాలు ఉత్సాహంగా పాల్గొన‌డాన్ని ఆయ‌న అభినందించారు. దేశంలో ఇప్ప‌టిదాకా గుర్తించిన 90 స్మార్ట్ సిటీల‌లో చేప‌ట్టిన ప‌నుల‌ను స‌కాలంలో, అత్యంత నాణ్య‌త‌తో, వేగంగా పూర్తిచేసేందుకు ఈ పోటీ విధానం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయన అన్నారు.

అలాగే అట‌వీ హ‌క్కుల చ‌ట్టం పురోగ‌తిని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షిస్తూ ఆదివాసీ తెగ‌ల హ‌క్కుల నిర్ధార‌ణ‌, స‌త్వ‌ర ప‌రిష్కారానికి వీలుగా అంత‌రిక్ష సంబంధిత సాంకేతిక విజ్ఞాన వినియోగ ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు.

వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను(జిఎస్ టి)పై అనుమానాల‌న్నీ ప‌టాపంచ‌ల‌య్యాయ‌ని, కొత్త వ్య‌వ‌స్థ దిశ‌గా ప‌రివ‌ర్త‌న స‌జావుగా సాగిపోయింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. జిఎస్ టి లో భాగంగా న‌మోదులను మ‌రింతగా పెంచి ఒక నెల‌ రోజుల లోపల ప‌రిమాణాత్మ‌క ప్ర‌గ‌తిని సాధించే దిశ‌గా కృషి చేయవలసిందంటూ అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

ప్ర‌భుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) పోర్ట‌ల్‌లో పార‌ద‌ర్శ‌క‌త మెరుగుప‌డింద‌ని, వృథా వ్య‌యానికి అడ్డుక‌ట్ట ప‌డింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌భుత్వ కొనుగోళ్ల‌లో GeM కే ప్రాధాన్యం ఇవ్వాల‌ని కూడా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు ఆయ‌న సూచించారు.