Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌గ‌తి ద్వారా ప్ర‌ధాన మంత్రి స‌మీక్ష‌


ఐసిటి ఆధారిత మల్టి మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పిఆర్ఎజిఎటిఐ – ప్రగతి) ద్వారా జరిగిన 16వ స‌మీక్ష స‌మావేశానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి కార్మిక , ఉపాధి మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించిన ఫిర్యాదులను ప్ర‌ధానంగా ఇ పి ఎఫ్ ఒ, ఇ ఎస్ ఐ సి, లేబ‌ర్‌ క‌మిష‌న‌ర్ లకు సంబంధించిన వాటిని ప‌రిష్కరిస్తున్న తీరులో పురోగ‌తి ఎలా ఉందనేది స‌మీక్షించారు. కార్మిక విభాగం కార్య‌ద‌ర్శి క్లెయిమ్‌ల ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్ తో పాటు, ఎల‌క్ట్రానిక్ చ‌లాన్‌లు, మొబైల్ అప్లికేష‌న్ లు, ఎస్‌ ఎం ఎస్ అలర్ట్ లు, ఆధార్ సంఖ్యలకు యు ఎ ఎన్ ను అనుసంధానించడం, టెలి మెడిసిన్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం, ఇంకా మరిన్ని సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వంటి చొరవలతో ఫిర్యాదుల ప‌రిష్కార వ్యవస్థ మెరుగుదలకు కృషి చేసినట్లు వివ‌రించారు.

కార్మికుల నుండి, ఇ పి ఎఫ్ ల‌బ్ధిదారుల‌ నుండి పెద్ద సంఖ్యలో దాఖలు అవుతున్న ఫిర్యాదులపై ప్రధాన మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ, ప్రభుత్వం కార్మిక‌ుల అవ‌స‌రాల పట్ల సున్నిత‌త్వంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో కార్మికులు వారికి చ‌ట్ట‌బ‌ద్ధంగా దక్కవలసినవి అందుకోవడం కోసం సంఘర్షణ చేయనక్కరలేని స్థితి ఉండాలి అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఒక వ్యవస్థను పరిచయం చేయాలని, ఆ వ్యవస్థ ద్వారా ఉద్యోగులందరి ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల ఖ‌రారు ప్ర‌క్రియ ఒక సంవత్సరం ముందుగానే మొదలవ్వాలని ఆయన సూచించారు. అకాల మ‌ర‌ణం సంభ‌విస్తే పత్రాలను నిర్దిష్ట కాలంలోపు పూర్తి చేయాలని, ఇందుకోసం అధికారుల‌ను జవాబుదారీ చేయాల‌ని ఆయన సూచించారు.

ఇ-ఎన్ ఎ ఎమ్ (e-NAM) పురోగ‌తి పై జరిగిన స‌మీక్ష లో 2016 ఏప్రిల్‌లో 8 రాష్ట్రాల‌లోని 21 మండీల‌లో ప్రారంభమైన ఈ ప‌థ‌కం ఇప్పుడు ప‌ది రాష్ట్రాల‌లో 250 మండీల‌కు విస్త‌రించినట్లు అధికారులు తెలిపారు. 13 రాష్ట్రాలు ఎ పి ఎమ్ సి చ‌ట్టాన్ని స‌వ‌రించే ప్ర‌క్రియ‌ను పూర్తి చేశాయి. ఎ పి మిగతా రాష్ట్రాలు ఎమ్ సి చట్టంలో అవసరమైన సవరణలను వెంటనే చేయాలని ప్రధాన మంత్రి కోరారు. తద్వారా e-NAM ను దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి వీలు ఏర్పడుతుంది. నాణ్య‌త‌, ప‌రిమాణం , గ్రేడింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తే రైతు దాని ద్వారా ల‌బ్ధి పొంద‌డానికి వీలు క‌లుగుతుంద‌ని ఆయన అన్నారు. దీనివ‌ల్ల రైతులు దేశ‌వ్యాప్తంగా మండీల‌లో త‌మ ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ చేసుకోవ‌డానికి వీలు ఉంటుందన్నారు. e-NAM పై రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వారి సూచ‌న‌ల‌ను ఇవ్వాలి కూడా అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌ధాన మంత్రి తెలంగాణ‌, ఒడిశా, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్, ఢిల్లీ, పంజాబ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కిమ్, ప‌శ్చిమ‌ బెంగాల్‌, ఝార్ ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల‌తో సహా అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే, ర‌హ‌దారులు, విద్యుత్తు, స‌హ‌జ‌ వాయువు రంగాల‌లో కీల‌క మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ పురోగ‌తిపై కూడా స‌మీక్ష జరిపారు. ప్రాజెక్టుల‌ను స‌కాలంలో పూర్తి చేయడానికి ఉన్న ప్రాముఖ్య‌ాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి పునరుద్ఘాటించారు. అలా చేసినప్పుడు వ్యయాలు పెరిగిపోకుండా నివారించగలమన్నారు. ఆయా ప్రాజెక్టుల ప్రయోజనాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావ‌డానికి వీలుంటుంద‌ని ఆయన చెప్పారు. ఈ రోజు స‌మీక్షించిన ప్రాజెక్టుల‌లో హైద‌రాబాద్ – సికింద్రాబాద్ రెండో ద‌శ మ‌ల్టి మోడ‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, అంగ‌మ‌లై-శ‌బ‌రిమ‌ల రైల్వే లైను, ఢిల్లీ – మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ వే , సిక్కింలోని రెనాక్‌-పాక్యాంగ్ రోడ్ ప్రాజెక్టు, తూర్పు భార‌త దేశంలో విద్యుత్‌ స‌ర‌ఫ‌రాను బ‌లోపేతం చేసేందుకు ఉద్దేశించిన మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ఐదో ద‌శ ప్రాజెక్టు ఉన్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఫూల్‌పూర్‌- హాల్దియా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు పురోగతిని కూడా స‌మీక్షించడం జరిగింది.

అమృత్ (అట‌ల్ మిష‌న్ ఫ‌ర్ రెజువెనేష‌న్ అండ్ అర్బ‌న్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ ) ప‌థ‌కానికి సంబంధించి కూడా ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. అమృత్ లో భాగంగా మొత్తం 500 ప‌ట్ట‌ణాలలోని నివాసులకు సుర‌క్షితమైన తాగు నీరు అందుబాటులో ఉండేటట్లు చ‌ర్య‌లు తీసుకోవలసిందని ఆయా రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను ప్ర‌ధాన‌ మంత్రి కోరారు. హిందీలో న‌గ‌ర్ అనే మాటకు న‌ల్‌- (తాగు నీరు), గ‌ట్ట‌ర్ ( పారిశుధ్యం), రాస్తే (ర‌హ‌దారులు) సమకూర్చడం అని అర్ధం చెప్పుకోవ‌చ్చ‌ని ఆయన చెప్పారు. పౌరులు ప్రధానంగా ఉండే సంస్క‌ర‌ణ‌ల‌పై అమృత్ శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన అన్నారు.

ఇంకా సంబంధిత‌ అంశాలను గురించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌స్తావిస్తూ ఇలాంటి సంస్క‌ర‌ణ‌లు ప్ర‌భుత్వంలోని అన్ని విభాగాల‌కు విస్త‌రించాల‌న్నారు. సుల‌భ‌త‌ర వాణిజ్యానికి సంబంధించి ప్ర‌ప‌పంచ‌ బ్యాంకు విడుద‌ల చేసిన తాజా నివేదిక‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, అన్ని విభాగాల కార్య‌ద‌ర్శులు ఈ నివేదిక‌ను అధ్య‌య‌నం చేసి త‌మ త‌మ రాష్ట్రాలు లేదా త‌మ విభాగాల‌లో మెరుగుద‌ల‌కు బ‌ల‌మైన అవ‌కాశాలున్న అంశాల‌ను విశ్లేషించాల‌ని కోరారు. ఈ అంశంపై సంబంధిత అధికారులంద‌రు నెల‌ రోజుల‌లో నివేదికను స‌మ‌ర్పించాల‌ని ఆయన అన్నారు. ఆ త‌రువాత వీట‌న్నింటిపై స‌మీక్షను నిర్వ‌హించాల్సిందిగా కేబినెట్ సెక్ర‌ట‌రీకి సూచన చేశారు.

వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప్రాజెక్టుల స‌త్వ‌ర అమ‌లుకు వీలుగా కేంద్ర బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ‌ను నెల‌ రోజులు ముందుగా ప్ర‌వేశ‌పెట్ట‌నున్న విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. అన్ని రాష్టాలు త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను దీనితో అనుసంధానం చేసుకోవాల‌ని ఆయన సూచించారు. ఈ చ‌ర్య‌తో వారు గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌న్నారు.

రానున్న స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతిని గురించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌స్తావిస్తూ అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, కార్య‌ద‌ర్శులు వారి వారి ప‌రిధులలోని విభాగాలు , సంస్థ‌ల‌కు సంబంధించిన క‌నీసం ఒక వెబ్‌సైట్‌ ప్ర‌భుత్వం అధికారికంగా గుర్తించిన భారతీయ భాష‌ల‌న్నింటిలో అందుబాటులో ఉండేందుకు కృషి చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.