Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రియ‌మైన నా దేశ‌వాసులంద‌రికీ ప్ర‌ణామం!


ప్రపంచ మహమ్మారి కరోనాపై భారత్‌ పోరాటం అత్యంత శక్తిమంతంగా, స్థిరంగా ముందుకు సాగుతోంది. దేశవాసులైన మీ అందరి సంయమనం, పట్టుదల, త్యాగాల కారణంగానే మన దేశం ఇప్పటివరకూ కరోనావల్ల కలిగే హానిని చాలావరకూ నిలువరించగలిగింది. మన దేశాన్ని, మన భరతఖండాన్ని రక్షించేందుకు మీరెన్నెన్నో కష్టనష్టాలు సహించారు. మీరెన్నెన్ని అగచాట్లు పడ్డారో నాకు తెలుసు. కొందరిది ఆకలి బాధ… మరికొందరికి రాకపోకల ఇక్కట్లు… ఇంకొందరు సొంత ఊళ్లకు, కుటుంబాలకు దూరంగా ఎక్కడెక్కడో ఉండిపోయారు. ఏదేమైనప్పటికీ మీరంతా దేశం కోసం- క్రమశిక్షణగల సైనికుల్లాగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మన రాజ్యాంగంలో “భారత పౌరులమైన మేము” అంటూ మనం చాటుకున్న ప్రజాశక్తి ఇదే! దేశ ప్రజలంతా ఇలా సామూహిక శక్తి, సంకల్పాలను ప్రదర్శించడమే డాక్టర్‌ బాబాసాహెబ్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్క్‌ర్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మనం అర్పించే నిజమైన నివాళి. మనకు ఎదురయ్యే ప్రతి సవాలునూ సంకల్పశక్తితో, కృషితో అధిగమించేలా బాబాసాహెబ్‌ జీవితం మనకు నిరంతర ప్రేరణనిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవాసులందరి తరఫునా బాబాసాహెబ్‌కు వందనాలర్పిస్తున్నాను.
మిత్రులారా!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇది విభిన్న పండుగల సమయం. అదేవిధంగా భారతదేశం బైశాఖి, పొయిలా బైశాఖి, పుత్తాండు, విషు వంటి పండుగలతో అనేక రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అయితే, దిగ్బంధం ఆంక్షల నడుమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, అత్యంత సంయమనంతో ఇళ్లలోనే ఉంటూ నిరాడంబరంగా పండుగలు నిర్వహించుకోవడం నిజంగా ఎంతో ప్రశంసనీయం. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
నేడు కరోనా వైరస్‌ మహమ్మారివల్ల ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నదీ మీకందరికీ తెలిసిందే. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం చేసిన ఇతోధిక కృషిలో మీరంతా భాగస్వాములేగాక ప్రత్యక్ష సాక్షులు కూడా. చాలాకాలం కిందట మన దేశంలో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. కరోనా పీడిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మనం విమానాశ్రయాల్లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించాం. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 100కు చేరకముందే విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల నిర్బంధ పర్యవేక్షణను తప్పనిసరి చేశాం. అనేక ప్రాంతాల్లో మాల్స్‌, క్లబ్బులు, వ్యాయామశాలలు వంటివి మూసివేశాం. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 550కి చేరేసరికే 21 రోజుల దేశవ్యాప్త దిగ్బంధంపై కీలక నిర్ణయం తీసుకున్నాం. సమస్య తీవ్రమయ్యేదాకా భారత్‌ ఎదురుచూస్తూ కూర్చోలేదు సరికదా… అనేక సత్వర నిర్ణయాలతో మొగ్గలోనే దాన్ని తుంచేయడానికి ప్రయత్నించింది.
మిత్రులారా!
ఈ సంక్షోభం నడుమ ఇతర దేశాలతో మన పరిస్థితిని పోల్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అయినప్పటికీ ప్రపంచంలోనే పెద్ద, శక్తిమంతమైన దేశాల్లో కరోనా సంబంధిత గణాంకాలను మనం ఒకసారి పరిశీలిస్తే- వైరస్‌ వ్యాప్తి నిరోధం, నియంత్రణలో నిజంగా భారత్‌ ఇవాళ చాలా ముందంజలో ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించి ఓ నెల-నెలన్నర కిందట అనేక దేశాలు భారత్‌తో సమాన స్థితిలోనే ఉన్నాయి. కానీ, నేడు ఆయా దేశాల్లో కరోనా కేసులు భారత్‌తో పోలిస్తే 25 నుంచి 30 రెట్లు అధికంగా నమోదయ్యాయి. అంతేకాదు… వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌గనుక సకాలంలో సంపూర్ణ, సమగ్ర, సత్వర, నిర్ణయాత్మక కార్యాచరణకు దిగి ఉండకపోతే దేశంలో ఇవాళ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. గత కొన్ని రోజులుగా మన అనుభవాన్ని ఒకసారి సమీక్షించుకుంటే మనం సరైన మార్గమే ఎంచుకున్నామన్నది స్పష్టమవుతుంది. సామాజిక దూరం, దిగ్బంధం నిబంధనలతో మన దేశం ఎంతగానో ప్రయోజనం పొందింది. ఆర్థికరంగ దృక్పథంతో చూస్తే మాత్రం ఇప్పటికిది భారీ మూల్యంతో కూడుకున్నదే అనడం నిస్సందేహంగా వాస్తవం. కానీ, భారత పౌరుల ప్రాణాల విలువతో బేరీజు వేసినప్పుడు ఇది అత్యంత స్వల్పమేననడం అంతకన్నా తిరుగులేని వాస్తవం. పరిమిత వనరులుగల మనదేశం తీసుకున్న ఈ నిర్ణయం నేడు ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది.
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. అయితే, మిత్రులారా… మనం ఇంత కఠోరంగా శ్రమిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు- ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను, ప్రభుత్వాలను మరింత అప్రమత్తం చేస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంపై నేను కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాను. ప్రస్తుత విషమ స్థితిలో దిగ్బంధాన్ని కొనసాగించాలని అన్ని రాష్ట్రాలూ అభిప్రాయపడ్డాయి. వాస్తవానికి పలు రాష్ట్రాలు ఇప్పటికే దిగ్బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి.
మిత్రులారా!
ఈ సూచనలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా దిగ్బంధాన్ని మే 3వ తేదీవరకూ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మే 3వ తేదీదాకా మనలో ప్రతి ఒక్కరూ దిగ్బంధంలో ఉండాల్సిందే. ఆ మేరకు ఇప్పటివరకూ ఉన్నట్లే ఈ సమయంలోనూ మనం క్రమశిక్షణ పథాన్ని వీడకూడదు. అందుకే నా సహపౌరులందరికీ నా వినతి, ప్రార్థన ఏమిటంటే- ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వైరస్‌ వ్యాప్తిని మనం కొనసాగనివ్వరాదు. ఇకపై ఏ సూక్ష్మస్థాయిలో కూడా ఒక్క కొత్త కేసు నమోదు కాకుండా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు మన కర్తవ్యం! కరోరా వైరస్‌ పీడితులలో ఏ ఒక్కరు మరణించినా అది మనకు విషాదమేననే స్పృహ మనలో ఇంకాఇంకా పెరగాలి. కాబట్టి తీవ్ర ముప్పున్న ప్రాంతాల విషయంలో మనమంతా ఇంకా అప్రమత్తం అవుదాం. అటువంటి స్థితికి దగ్గరలోగల ప్రదేశాలపై నిశిత, నిరంతర, సన్నిహిత, కఠిన నిఘా ఉంచుదాం. అటువంటి ముప్పున్న ప్రాంతాలు కొత్తగా తలెత్తడమంటే ఇప్పటిదాకా మనం చేసిన కృషి, మన పట్టుదల మొత్తం నీరుగారి కొత్త సవాలు ఎదురైనట్లే అవుతుంది. అందుకే కరోనాపై పోరులో భాగంగా మన కఠిన నిబద్ధతను, పట్టుదలను మరో వారంపాటు పొడిగిద్దాం. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 20వ తేదీదాకా ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి పట్టణం, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిగ్బంధాన్ని ఎంత పటిష్ఠంగా అమలు చేసిందీ పర్యవేక్షిస్తాం. కరోనా వైరస్‌ నుంచి ప్రతి ప్రాంతం తననుతాను ఎలా రక్షించుకున్నదీ గమనిస్తాం.
ఈ కఠిన పరీక్షలో నెగ్గుకొచ్చే తీవ్ర ముప్పున్న విభాగంలో లేని ప్రాంతాల్లో; ఆ పరిస్థితికి చేరువయ్యే అవకాశంలేని ప్రదేశాల్లో ఏప్రిల్ 20 నుంచి కొన్ని అవసరమైన కార్యకలాపాలను అనుమతించవచ్చు. అయితే, కొన్ని షరతులతో మాత్రమే ఈ అనుమతి లభిస్తుందని, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయనే వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కరోనా వైరస్‌ వ్యాప్తికి దారితీసేలా దిగ్బంధం నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం అనుమతులన్నీ తక్షణం రద్దవుతాయి. కాబట్టి మనం మాత్రమేగాక ఇతరులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చూపకుండా బాధ్యత వహిద్దామని నిర్ణయించుకుందాం. ఈ మేరకు ప్రభుత్వం రేపు సంబంధిత సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.
మిత్రులారా!
మన నిరుపేద సోదరీసోదరుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20వ తేదీ తర్వాత పరిమిత అనుమతులు ఇస్తున్నాం. రోజుకూలీలు, దినసరి ఆదాయంలేనిదే పూటగడవని వారంతా నా కుటుంబసభ్యులే. కాబట్టి నాకున్న ప్రాథమ్యాల్లో మొట్టమొదటిది వారి జీవితాల్లో కష్టాలు తొలగించడమే! ఆ మేరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద సాధ్యమైనంత వరకూ వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తదనుగుణంగా కొత్త మార్గదర్శకాల రూపకల్పనలో వారి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఇక ప్రస్తుతం రబీ పంటల నూర్పిళ్లు సాగుతున్నాయి. దీంతో రైతుల సమస్యలను కనీస స్థాయికి తగ్గించే దిశగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేస్తున్నాయి.
మిత్రులారా!
దేశంలో మందులకు ఎలాంటి కొరతా లేదు. అలాగే ఆహారం-రేషన్‌, ఇతర నిత్యావసరాలు, సరఫరా క్రమాలకు సంబంధించిన ఆటంకాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. అదే సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల ఉన్నతీకరణలో వేగంగా పురోగమిస్తున్నాం. జనవరిలో కరోనా వైరస్‌ పరీక్ష ప్రయోగశాల ఒక్కటి మాత్రమే ఉండగా ఇవాళ 220కిపైగా అదే పనిలో నిమగ్నం కావడమే ఇందుకు నిదర్శనం. ప్రతి 10,000 మందికీ 1,500-1,600 పడకలు అవసరమని ప్రపంచానుభవం చెబుతోంది. కానీ, భారత్‌లో నేడు లక్ష పడకలు సిద్ధంగా ఉన్నాయి… అంతేకాదు- కేవలం కోవిడ్‌ చికిత్స కోసం 600 ప్రత్యేక ఆస్పత్రులున్నాయి. మనం ఇలా అనుకుంటున్న సమయానికి ఈ సదుపాయాలు ఇంకా.. మరింత వేగంగా పెరుగుతుంటాయి కూడా!
మిత్రులారా!
భారతదేశంలో వనరులు పరిమితమే. అందువల్ల మన యువ శాస్త్రవేత్తలకు నాదొక ప్రత్యేక విజ్ఞప్తి… మీరంతా తక్షణం ముందడుగు వేసి, కరోనా వైరస్‌కు టీకా రూపకల్పన కృషికి నాయకత్వం వహించండి. ప్రపంచ సంక్షేమం కోసం… మొత్తంగా మానవజాతి మనుగడ కోసం చొరవచూపండి. మిత్రులారా… మనం సహనంతో కొన్ని విధివిధానాలు పాటిస్తే కరోనావంటి ప్రపంచ మహమ్మారినైనా తరిమికొట్టగలం. ఈ నమ్మకంతో ఆత్మవిశ్వాసంతోనే మీరందరూ 7 సూత్రాలు పాటించాలని ఈ ప్రసంగంలో చివరగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను:
మొదటిది
మీ ఇళ్లలోని పెద్దలు.. ప్రత్యేకించి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపట్ల అత్యంత జాగ్రత్త వహించండి. వాస్తవానికి అదనపు సంరక్షణతో వారు కరోనా వైరస్‌ బారినపడకుండా చూసుకోవాలి.
రెండోది
దిగ్బంధం ‘లక్షణరేఖ’కు కచ్చితంగా కట్టుబడండి.. సామాజిక దూరం తప్పక పాటించండి… ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులు తప్పకుండా ధరించండి.
మూడోది
మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించండి. వేడినీళ్లు, కషాయం వంటిది తరచూ తాగుతూండండి.
నాలుగోది
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం ‘ఆరోగ్య సేతు’ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతోపాటు ఇతరులనూ అందుకు ప్రోత్సహించండి.
ఐదోది
మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాల యోగక్షేమాలను పట్టించుకోండి. ప్రత్యేకించి వారి అవసరాలు తీర్చడానికి ప్రయత్నించండి.
ఆరోది
మీ వ్యాపారాలు, పరిశ్రమలలో పనిచేసేవారిపై కరుణతో మెలగండి. వారిలో ఎవరికీ జీవనోపాధి లేకుండా చేయవద్దు.
ఏడోది
కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు-నర్సులు, పోలీసు-పారిశుధ్య సిబ్బందివంటి మన జాతీయ యోధులపట్ల అత్యంత మన్నన చూపండి.
మిత్రులారా!
దిగ్బంధం నిబంధనలను మే 3వ తేదీదాకా అత్యంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో పాటించండి.. దయచేసి ఎక్కడున్నారో అక్కడే ఉండండి… భద్రంగా ఉండండి.
“వయం రాష్టే జాగృత్యా”
‘మనమంతా ఒక్కటై ఈ జాతిని శాశ్వతంగా, చైతన్యంతో నిలుపుదాం’- ఈ పిలుపుతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
మీకందరికీ నా కృతజ్ఞతలు!