Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రిటోరియాలో జ‌రిగిన ఇండియా- ద‌క్షిణ ఆఫ్రికా బిజినెస్ మీట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ముఖ్యాంశాలు

ప్రిటోరియాలో జ‌రిగిన ఇండియా- ద‌క్షిణ ఆఫ్రికా బిజినెస్ మీట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ముఖ్యాంశాలు

ప్రిటోరియాలో జ‌రిగిన ఇండియా- ద‌క్షిణ ఆఫ్రికా బిజినెస్ మీట్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ముఖ్యాంశాలు


శ్రేష్ఠుడైన ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షుడు శ్రీ జాక‌బ్ జుమా,

గౌరవనీయ అంత‌ర్జాతీయ సంబంధాలు మరియు స‌హ‌కార శాఖ‌ మంత్రి,

గౌరవనీయ వ్యాపార- పరిశ్రమ శాఖ మంత్రి,

దక్షిణ ఆఫ్రికా, భారతదేశ పారిశ్రామిక రంగ సారథులు,

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా!

ఈ రోజు మీ అంద‌రినీ క‌ల‌వ‌డం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

భార‌తదేశం, ద‌క్షిణ ఆఫ్రికా ల సంబంధాలు బ‌లమైన పునాదుల‌పై నిర్మితమయ్యాయి.

• విధి మ‌న‌ని ఒక‌టిగా నిలిపింది.

• క‌ల‌లు మ‌న‌ని ఒక్క‌టిగా ముందుకు న‌డిపిస్తున్నాయి.

మ‌న చ‌రిత్ర‌లో ఎన్నో ఉమ్మ‌డి అధ్యాయాలు ఉన్నాయి.

పోరాటాలు, త్యాగాల ఫ‌లంగా మ‌నం చ‌రిత్ర‌ గ‌తిని మార్చివేశాం.

ఈ ప్ర‌య‌త్నంలో మాన‌వ‌ జాతి గ‌ర్వించ‌గ‌ల గొప్ప నాయ‌కుల మార్గ‌ద‌ర్శ‌కం ల‌భించ‌డం మ‌న అదృష్టం.

మిత్రులారా,

శ్రీ నెల్స‌న్ మండేలా, మ‌హాత్మ గాంధీ జీ ల వంటి నాయ‌కులు మ‌న‌కు రాజ‌కీయ స్వాతంత్ర్యం తీసుకు వ‌చ్చారు.

ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాల్సిన స‌మ‌యమిది.

ఈ ర‌కంగా మ‌న ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తీర్చ‌వ‌ల‌సిన ఉమ్మ‌డి ల‌క్ష్యంతో కూడిన బంధం మ‌న‌ది.

– ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య‌ కూడా మ‌నం మిత్రులుగా ఉన్నాం.
– ఇప్పుడు మ‌నం అవ‌కాశాల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది.

మ‌హానాయ‌కుల ఆశీస్సుల‌తో మ‌న దేశాలు రెండూ అభివృద్ధి బాట‌లో ముందుకు సాగాయి.

బి ఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్) ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో కూడా భార‌త‌, దక్షిణ ఆఫ్రికా లు కీల‌క భాగ‌స్వాములు.

దేశ, విదేశాలలో నివ‌సిస్తున్న ఉభ‌య‌ దేశాల‌ ప్ర‌జ‌లు మ‌న వైపు ఎన్నో ఆశ‌ల‌తో చూస్తున్నారు.

అన్ని కీల‌క విభాగాలలో మ‌న మ‌ధ్య అత్యంత క్రియాశీల‌మైన‌, ఫ‌ల‌వంత‌మైన బాంధ‌వ్యం నెల‌కొన‌డం ఆనంద‌దాయ‌కం.

ఇక్క‌డ స‌మావేశ‌మైన మ‌హామ‌హులంద‌రూ కూడా ఆ ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములే.

మిత్రులారా,

ఘ‌న‌ చ‌రిత్ర గ‌ల ఈ దేశాన్నికొంత ఆల‌స్యంగానే నేను సంద‌ర్శిస్తున్నానన్న విష‌యాన్ని నేను అంగీక‌రిస్తున్నాను.

గ‌త రెండేళ్ళ కాలంలో అధ్యక్షుడు శ్రీ జాకబ్ జుమా, నేను ఎన్నో సార్లు భేటీ అయ్యాం.

భార‌తదేశానికి ద‌క్షిణ ఆఫ్రికా ఎంతో కీల‌కమైన వాణిజ్య‌, పెట్టుబ‌డుల భాగ‌స్వామి.

గ‌త ప‌దేళ్ళ కాలంలో మ‌న ద్వైపాక్షిక వాణిజ్య 380 శాతం పెరిగింది.

పెట్టుబ‌డుల రంగంలో ఎంతో ఆశావ‌హ‌మైన స్థితి ఉంది.

రెండు వైపుల నుండి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొనసాగుతూ ఉంది.

150కి పైగా భార‌తీయ కంపెనీలు ద‌క్షిణ ఆఫ్రికాలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి.

అలాగే ద‌క్షిణ ఆఫ్రికాకు చెందిన ప‌లు కంపెనీలు భార‌తదేశంలో అత్య‌ద్భుతంగా ప‌ని చేస్తున్నాయి.

అయినా..

ప‌రిధి చాలా విస్తారంగా ఉంది.

సామ‌ర్థ్యం రోజురోజుకూ పెరుగుతోంది.

ఉభ‌య‌ దేశాలు వాటి ఆర్థిక పునాదులను ప‌టిష్ఠం చేసుకుంటూ ఉండ‌డం ఇందుకు కార‌ణం.

అందుకే మ‌నం వాణిజ్యంలో భిన్న‌త్వానికి మార్గాలు అన్వేషించాలి. మ‌న అవ‌స‌రాల‌కు దీటుగా, ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేయ‌గ‌లిగే విధంగా దీనిని విస్త‌రించుకోవాలి.

అలాంటి స‌హ‌కారం సాధ్య‌మేన‌న‌నేందుకు భిన్న వేదిక‌ల‌పై మ‌న భాగ‌స్వామ్య‌మే సంపూర్ణ నిద‌ర్శ‌నం.

భార‌తీయ కంపెనీల‌కు ఆఫ్రికా ఖండంలో దక్షిణ ఆఫ్రికా పుట్టినిల్లు వంటిది.

ప‌లు అగ్ర‌గామి భార‌తీయ కంపెనీలు దక్షిణ ఆఫ్రికాలో కాలు మోపాయి.

అవి వివిధ వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి.

అనేక మంది భార‌తీయ సి ఇ ఒ లు మనతో ఉన్నారు.

ఈ మ‌హోన్న‌త దేశంలో సామాజిక‌, ఆర్థిక ప‌రివ‌ర్త‌న‌కు త‌మ వ్యాపారాలు దోహ‌ద‌కారి అయ్యేలా చూడాల‌న్న‌దే వారికి నా స‌ల‌హా.

భార‌తదేశానికి మూడు ‘పి’ లను గురించి నేను సూచిస్తూ ఉంటాను.
(అవే.. ప్ర‌భుత్వ రంగం, ప్రైవేటు రంగం, ప్ర‌జల భాగ‌స్వామ్యం)

వ్య‌క్తిగ‌త రంగం గురించి కూడా నేను నొక్కి చెబుతూ ఉంటాను.

అదే ఇక్క‌డ కూడా వ‌ర్తిస్తుంది.

నైపుణ్యాల వృద్ధి, స‌మాజ సాధికార‌త లు మీ వ్యాపార ప్ర‌ణాళిక‌లలో కేంద్ర‌స్థానాన్ని ఆక్ర‌మించాలి.

ఆఫ్రికా మాన‌వ‌తా స్ఫూర్తి ‘ఉబుంటూ’ మీ వ్యాపార విలువ‌లలో ప్ర‌తిబింబించాలి.

స‌ర్వే భ‌వంతు సుఖినః

అనే మా సిద్ధాంతానికి స‌రిపోయే సిద్ధాంతం ఇది.

మ‌హాత్మ గాంధీ జీ జీవించి ఉన్నంత కాలం శ్ర‌మించింది దీని కోసమే.

ఒక‌రిని దోపిడీకి గురి చేయ‌డం కాకుండా వారి అభివృద్ధికి చేయూత ఇవ్వాల‌నే మేం విశ్వ‌సిస్తాం.

మా వ్యాపార నిర్వ‌హ‌ణ ఒక వైపు బాట కాదు.

ద‌క్షిణ ఆఫ్రికా కంపెనీలు కూడా భార‌తదేశంలో క్రియాశీలంగా ఉంటాయి.

అవి అక్క‌డ అస్తిత్వాన్ని క‌లిగి ఉన్నాయి.

మీ మేధ‌స్సు నుండి మేం చాలా నేర్చుకున్నాం, న‌వ్యత‌తో కూడిన మీ ఉత్ప‌త్తుల నుండి మేం లాభ‌ప‌డ్డాం.

ద‌క్షిణ ఆఫ్రికా వ్యాపార ద‌క్ష‌త‌, భార‌తీయ సామ‌ర్థ్యాలు ఒక‌రివి మ‌రొక‌రికి ఉప‌యోగ‌ప‌డాలి. ఉభ‌య‌ దేశాల వృద్ధి, అభివృద్ధి మ‌న ల‌క్ష్యం కావాలి.

గ‌త రెండేళ్ళుగా మేం ఆర్థిక రంగాన్ని స‌రైన బాట‌లో పెట్టేందుకు చాలా క‌ష్ట‌ప‌డి కృషి చేశాం.

మా చిత్త‌శుద్ధి, క‌ఠోర‌ శ్ర‌మ లు ఫ‌లించి, మాకు ప్రోత్సాహ‌క‌ర ఫ‌లితాలు లభించాయి.

ఈ రోజు ప్ర‌పంచ ఆర్థిక రంగంలో భార‌తదేశం ఆశావ‌హ‌మైన ధ్రువ‌ తార‌గా నిలచింది.

భార‌తదేశాన్ని అంద‌రూ అంత‌ర్జాతీయ వృద్ధికి చోద‌క‌ శ‌క్తి గా చూస్తున్నారు.

ప్ర‌పంచంలో త్వ‌రిత గ‌తిన వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌తదేశం గుర్తింపు పొందింది.

అంత‌ర్జాతీయ‌ంగా మాంద్యం నెల‌కొన్న వాతావ‌ర‌ణంలో సైతం భార‌తదేశం 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది.

రానున్న రోజులలో మేం మ‌రింత మెరుగైన వృద్ధిని సాధించ‌గ‌ల‌మ‌ని ప్ర‌పంచ‌ బ్యాంకు, ఐ ఎమ్ ఎఫ్‌, ఇత‌ర అంత‌ర్జాతీయ సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి.

2014-15లో అంతర్జాతీయ వృద్ధికి భార‌తదేశం 12.5 శాతం వాటాను అందించింది.

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా అందిస్తున్న వాటా క‌న్నా అంత‌ర్జాతీయ వృద్ధికి భార‌తదేశం అందిస్తున్న వాటా 68 శాతం అధికం.

ఈ ఏడాది దేశంలోకి ఎఫ్‌ డి ఐ ల రాక చరిత్రలోకెల్లా గ‌రిష్ఠ స్థాయిలో ఉంది.

2016లో ఎఫ్‌ డి ఐ లు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల‌కు చేర‌డానికి ‘మేక్ ఇన్ ఇండియా’ విజ‌య‌మే కార‌ణ‌మ‌ని రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ తెలిపింది.

భార‌తదేశం ఇప్ప‌టివ‌ర‌కు సాధించ‌నంత‌టి బ్రాండ్ విలువ‌ను ‘మేక్ ఇన్ ఇండియా’ తీసుకువ‌చ్చింది.

దేశంలోపల, దేశం వెలుప‌ల కూడా ప్ర‌జ‌లు, సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు, మీడియా, రాజ‌కీయ నాయ‌క‌త్వం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది..

‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా మేం వ్యాపారానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం.

లైసెన్సింగ్ విధానాలు స‌ర‌ళం చేసేందుకు, అనుమ‌తులు, రిట‌ర్నులు, త‌నిఖీ వ్య‌వ‌స్థ‌ల్లో విధివిధానాలు హేతుబ‌ద్ధం చేయ‌డానికి మేం నిర్ణ‌యాత్మ‌క చ‌ర్య‌లు తీసుకున్నాం.

మ‌రికొన్ని ఇత‌ర సూచిక‌ల గురించి కూడా ఇక్క‌డ ప్ర‌స్తావిస్తాను.

– ప‌లు అంత‌ర్జాతీయ ఏజెన్సీలు, సంస్థ‌లు భార‌తదేశాన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన పెట్టుబ‌డుల గ‌మ్యంగా క్ర‌మం త‌ప్ప‌ని ర్యాంకింగ్ ఇచ్చాయి.

– ‘సులభంగా వ్యాపారం చేసుకోగలగడం’ అనే అంశంలో ప్ర‌పంచ‌ బ్యాంకు ర్యాంకింగ్ ల‌లో భార‌తదేశం ర్యాంకు 12 ర్యాంకులు మెరుగైంది.

– పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో యు ఎన్ సి టి ఎ డి ర్యాంకింగ్ కూడా ఎంతో బాగుప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు 15వ స్థానంలో ఉన్న భార‌తదేశం ఇప్పుడు 9వ స్థానానికి ఎదిగింది.

– వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డ‌బ్ల్యు ఇ ఎఫ్‌) యొక్క అంత‌ర్జాతీయ పోటీ సామ‌ర్థ్య సూచిక‌లో భార‌తదేశం 16 స్థానాలు పైకి దూసుకుపోయింది.

మా విధానాలు సానుకూల ఫ‌లితాలు ఇస్తూ ఉండ‌డం వ‌ల్ల మా విశ్వాసం కూడా పెరిగింది.

– వ్యాపారాల నిర్వ‌హ‌ణ‌కు మ‌రింత సానుకూల‌మైన దేశంగా నిలిపే క్ర‌మంలో విధివిధానాలు స‌ర‌ళం చేసేందుకు ఇది మాలో కొత్త స్ఫూర్తిని నింపింది.

– న‌వ్య‌త‌తో కూడిన ఆలోచ‌నా ధోర‌ణుల‌ను ప్రోత్స‌హించి వాటిని ఆచ‌ర‌ణీయం చేయ‌డానికి ఒక న‌వ్య‌త‌తో కూడిన ‘స్టార్ట్ అప్ ఇండియా’ కార్య‌క్ర‌మాన్ని కూడా మేం ఆవిష్క‌రించాం.

– ఈ చ‌ర్య‌ల‌న్నింటి వ‌ల్ల ఉపాధి మార్కెట్ విస్త‌రించి ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి కూడా పెరిగింది.

– మంచి నాణ్య‌మైన జీవ‌నం, జీవ‌న ప్ర‌మాణాల‌తో జీవించ‌డానికి అనువైన ప్ర‌దేశంగా భార‌తదేశం ఎదిగింది.

– అభివృద్ధి ఫ‌లాలు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌న్నింటికీ స‌రిస‌మానంగా విస్త‌రించి వృద్ధి స‌మ్మిళితంగా ఉండేందుకు మేం అన్ని చ‌ర్య‌లు తీసుకున్నాం.

– కీల‌క రంగాల‌తో పాటు సామాజిక రంగాల్లో కూడా త‌దుప‌రి త‌రానికి చెందిన మౌలిక వ‌స‌తులు అందుబాటులోకి తెచ్చే దిశ‌గా మేం పెద్ద అడుగు వేశాం.

మ‌న రెండు దేశాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక స‌వాళ్ళు ఒక‌టే రకంగా ఉన్నాయి.

అభివృద్ధి చ‌క్ర గ‌తి ఎప్ప‌టిక‌ప్పుడు ఆవిష్క‌రించుకునేది కాద‌ని నేను సూచిస్తున్నాను.

మ‌న రెండు దేశాలు ఉభ‌య‌తార‌కంగా స‌హ‌క‌రించుకోగ‌ల స్థితిలో ఉన్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు..

– ప్ర‌కృతి మ‌న ఉభ‌యుల మీద క‌రుణ చూపుతోంది. మ‌న‌కు ప్ర‌కృతి వ‌న‌రులు అపారంగా ఉన్నాయి.

వాటిని స‌రైన రీతిలో వినియోగంలోకి తెచ్చుకోవ‌ల‌సిన, స‌గ‌టు జీవి అభ్యున్న‌తి కోసం అవ‌స‌ర‌మైనంత మేర‌కే ఉప‌యోగించుకోవ‌ల‌సిన బాధ్య‌త మ‌న‌పై ఉంది. ఇందులో మ‌నం ఒక‌రి నుంచి మ‌రొక‌రు నేర్చుకోవ‌ల‌సింది చాలా ఉంది.

– మీకు గ‌ల ప్ర‌పంచ‌శ్రేణి మైనింగ్ కంపెనీల విష‌యంలో మ‌న స‌హ‌కారం మ‌రింత విస్తృతం కావాలి.

వాటిలో కొన్ని ఇప్ప‌టికే భార‌త్ లో క్రియాశీలంగా ప‌ని చేస్తున్నాయి. ఈ విభాగంలో వ్యూహాత్మ‌క స‌హ‌కారం కావాల‌ని మేం కోరుతున్నాం. ఇందులో మా ప్ర‌యోజ‌నం ఒక వైపు బాట మాత్రం కాదు.

– వాతావ‌ర‌ణ‌ప‌ర‌మైన స‌వాళ్ళు, అభివృద్ధి క్ర‌మాన్ని వేగం పుంజుకునేలా చేయ‌డం మ‌న ఉభ‌యుల ముందున్న స‌వాళ్ళు.

హ‌రిత అభివృద్ధి బాట‌లోనే ప‌య‌నించాల‌ని ఉభ‌యులం నిర్ణ‌యించుకున్నాం.

అదే స‌మ‌యంలో మ‌న‌కు ఇంధ‌న వ‌న‌రులు కూడా కావాలి.

• ప‌లు దేశాల స‌హ‌కారంతో మనం అంత‌ర్జాతీయ సోలార్ అల‌య‌న్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వేదిక ద్వారా ఉభ‌యులం ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌మ‌ని నేను ఆశిస్తున్నాను.

• మ‌న ఉభ‌య దేశాలలో ఒకే స‌మ‌యంలో భిన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు

నెల‌కొన‌డం ఒక ప్ర‌త్యేక‌త‌. భార‌తదేశంలో ఇది వేస‌వి, మామిడిపండ్ల సీజ‌న్ అయితే, మీకు చ‌లికాలం.

ఉభ‌యుల వ‌ద్ద అందుబాటులో ఉండే ప‌ళ్ళు, కూర‌గాయ‌లు, త్వ‌రిత‌గ‌తిన నాశ‌నం అయ్యే స్వ‌భావం గ‌ల ఇత‌ర వ‌స్తువులను ప‌ర‌స్ప‌రం అందించుకొనేందుకు గ‌ల చ‌క్క‌ని అవ‌కాశాన్ని మ‌నం వినియోగించుకోవాలి.

• అతి పెద్ద దేశీయ మార్కెట్ ఉన్న భార‌తదేశం మీ ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి చ‌క్క‌ని అవ‌కాశాలు అందుబాటులోకి తెస్తున్నది. ఈ రంగంలో మ‌న స‌హ‌కారం మ‌న రైత‌న్న‌ల‌కు, గ్రామాల‌కు చ‌క్క‌ని విలువ‌ను అందిస్తుంది.

• భార‌తదేశం లో మేం మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి ఆశావ‌హ‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నాం.

స్వాతంత్ర్య కాలం నాటి నుండి పరిష్కారం కాకుండా ఉన్న కార్యభారాన్ని ఇప్పుడిక వేగంగా పూర్తి చేయవలసి ఉంది.

మన రెండు దేశాలు కలసి ఇటువంటి అంతరాలను పూడ్చడానికి ఎంతో కృషి చేయగలుగుతాం.

సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాల శిక్షణలో మీకు సహాయం చేయడానికి భారతదేశం ఉత్తమమైన దేశం.

ఈ రంగాలలో ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి కూడాను.

గత సంవత్సరం న్యూ ఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ లో మేం రానున్న అయిదు సంవ్సరాలలో 50,000 మంది ఆఫ్రికన్ లకు విద్యాబుద్ధులు చెప్పించే, శిక్షణ నిప్పించే బాధ్యతను స్వీకరించాం.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అనేక రంగాలలో మనం కలసి పనిచేయగలుగుతాం. ఎలాగంటే,

• రక్షణ రంగం నుండి పాడి రంగం వరకు;

• హార్డ్ వేర్ నుండి సాఫ్ట్ వేర్ వరకు;

• మందుల నుండి వైద్య పర్యాటకం వరకు మనకు అవకాశాలు ఉన్నాయి.

• భారతదేశం ఇవాళ అత్యంత అధిక అనుమతులు ఇస్తున్న దేశాలలో ఒకటిగా రూపొందింది.

• పలు రంగాలలో మేం మా ఎఫ్ డి ఐ విధానాన్ని సరళతరంగా, వీలయినంత మేరకు సర్దుబాట్లు చేసి.. మార్చాము.

• వ్యాపారాలను ఆరంభించడానికి, వాటిని విస్తరించేందుకు మా నియమావళిని క్రమబద్ధీకరించాము.

మిత్రులారా,

చివరగా నేను చెప్పదల్చుకొన్నదేమిటంటే, మన భాగస్వామ్యానికి మేం సంస్థాగతమైన బాసటను జతచేశాము.

మన బి ఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్) వ్యాపార ఒడంబడిక, సి ఇ ఒ స్ ఫోరమ్ లు మన భాగస్వామ్యం విస్తరించేందుకు, సంపన్నం చేసేందుకు మనకు తోడ్పడ్డాయి.

ఇవాళ మనం ఇండియా- సౌత్ ఆఫ్రికా సి ఇ ఒ స్ ఫోరమ్ మూడో సమావేశాన్ని జయప్రదంగా నిర్వహించుకొన్నాము.

మీ సిఫారసులు మాకు ఎంతో విలువైనవి. వాటిని అమలులోకి తీసుకువచ్చేందుకు మేం కృషి చేయగలం.

క్రమం తప్పక వ్యాపార పనులపై రాకపోకలు జరిపే ప్రయాణికులకు 10 సంవత్సరాల బి ఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్) వీసా ను ప్రవేశపెట్టినందుకు ద‌క్షిణ ఆఫ్రికా ప్రభుత్వానికి మా ధన్యవాదాలు.

ఈ చర్య భారతీయ పరిశ్రమల రంగానికి ప్రోత్సాహాన్నిచ్చేదే.

మేం ద‌క్షిణ ఆఫ్రికా కోసం e-Visa ను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభించాము.

ఇది స్వల్ప కాల యాత్రికులకు, వ్యాపార పనులపై రాకపోకలు జరిపే వారికి చెల్లుబాటు అవుతుంది.

మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చొనే ఇమెయిల్ ద్వారా భారతదేశానికి వీసాను పొందగలరు.. అదీ పూర్తి ఊచితంగానే.

మిత్రులారా,

• మనం మరొక్కసారి చేతులు కలుపుదాం;

• మరొక్క మారు మనలో మనం నిబద్ధులమవుదాం;

• పేదరికమనే శత్రువుతో పోరాడడానికి ఇది ఎంతో అవసరం;

• ఇది బహుశా మరిన్ని సవాళ్లతో కూడుకొని ఉంటుంది;

• కానీ, మనం ఈ పోరులో విజయం సాధించాల్సిందే.

• ఇదే మన మహనీయ నేతలకు మనం అందించగలిగిన సిసలైన నివాళి కాగలదు.

మీకందరికీ ధన్యవాదాలు.