ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యం లోని కేంద్ర మంత్రివర్గం 2015-16 సంవత్సరపు బడ్జెట్ లో ప్రతిపాదించిన బంగారం బాండ్ల పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం వల్ల దేశంలో భౌతికంగా బంగారం కొనుగోళ్ళకు డిమాండు తగ్గుతుంది. దేశంలో ధనవంతులు, సాధారణ ప్రజలు ఏటా భౌతికంగా బార్ ల రూపంలో కొనుగోలు చేస్తున్న 300 టన్నుల బంగారంలో కొంత భాగాన్ని అయినా బాండ్ల లో పెట్టుబడులకు తరలించేందుకు వీలు కలుగుతుంది. దేశీయ మార్కెట్ కు అవసరం అయిన బంగారంలో అధిక భాగం దిగుమతులే అయినందు వల్ల దిగుమతులకు కళ్ళెం వేయడం ద్వారా కరెంట్ ఖాతా లోటును కూడా నిర్దేశిత పరిమితిలోనే ఉంచడం సాధ్యమవుతుంది.
2015-16 ఆర్థిక సంవత్సరంలోను, ఆ తర్వాత మార్కెట్ నుంచి ప్రభుత్వం సమీకరిస్తున్న రుణాల పరిమితిలోనే ఈ బాండ్లు కూడా జారీ చేస్తారు. ఎంత మొత్తానికి ఈ ఏడాది బాండ్లు జారీ చేయాలన్నది ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించి ఆర్.బి.ఐ నిర్ణయిస్తుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను త్వరలో ఏర్పాటు చేయనున్న బంగారం రిజర్వ్ ఫండ్ నుంచి భరిస్తారు. రుణ సమీకరణ వ్యయాల తగ్గుదల ద్వారా చేకూరే లాభాన్ని ప్రభుత్వం బంగారం రిజర్వ్ ఫండ్ కు తరలిస్తుంది.
స్కీమ్ ముఖ్య లక్షణాలు…
i. రూపాయి విలువలో చెల్లింపుల ద్వారా బంగారం బాండ్లను జారీ చేస్తారు. బంగారాన్ని గ్రాముల పరిమాణంలో కొలుస్తారు.
ii. భారత ప్రభుత్వం తరఫున ఆర్.బి.ఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. దీని వల్ల బాండ్లకు ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది.
iii. పంపిణీ వ్యయాలు, మధ్యవర్తిత్వ చానెళ్ళకు అమ్మకం కమిషన్ వంటివి బాండ్ల జారీ ఏజెన్సీ భరిస్తుంది. ఆ సంస్థకు అయ్యే వ్యయాలను భారత ప్రభుత్వం తిరిగి అందచేస్తుంది.
iv. దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సంస్థలకు మాత్రమే బాండ్లు విక్రయించాల్సి ఉంటుంది. అలాగే ఏ సంస్థకు ఎంత మొత్తంలో బంగారం బాండ్లు జారీ చేయవచ్చునన్నది తదుపరి నిర్ణయిస్తారు. ఒక్కో వ్యక్తికి ఏడాదికి 500 గ్రాములకు మించిన బాండ్లు కేటాయించకూడదు.
v. బాండ్లపై ఇచ్చే వడ్డీరేటును ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ వడ్డీరేటులో మార్పులుంటాయి. అందువల్ల వివిధ విడతల్లో జారీ చేసే బాండ్లకు వడ్డీరేటులో తేడాలుంటాయి. పెట్టుబడి సమయంలో బంగారం విలువ ఆధారంగా వడ్డీరేటు నిర్ణయం ఉంటుంది. రేటు చర లేదా స్థిర వడ్డీరేటు కావచ్చు.
vi. బాండ్లు డీమ్యాట్, పేపర్ రూపంలో ఎందులోనైనా ఉండవచ్చు.
vii. 5,10,50,100 గ్రాములతో సహా వివిధ విలువల్లో బంగారం బాండ్లుంటాయి.
viii. బంగారం ధరను ఫారెక్స్ మార్కెట్ లో రిఫరెన్స్ రేటు ఆధారంగా నిర్ణయిస్తారు. బంగారం బాండ్ల జారీకి, బాండ్ల విక్రయానికి వాస్తవ విలువ ఆర్.బి.ఐ రిఫరెన్స్ రేటు ఆధారంగా నిర్ణయిస్తారు.
ix. బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సి.లు, పోస్ట్ ఆఫీస్ లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లు, ఇతర అధీకృత సంస్థలు ప్రభుత్వం తరఫున బాండ్ల జారీ సొమ్మును (ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకి) వసూలు చేయడం, చెల్లించడం వంటి కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
x. బాండ్ల కాలపరిమితి కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాలుంటుంది. దీని వల్ల బంగారం ధరల్లో మధ్యకాలిక ఆటుపోట్ల నుంచి ఇన్వెస్టర్ కు రక్షణ ఉంటుంది. బాండ్ల జారీ ప్రభుత్వ రుణ సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది గనుక 2015-16 సంవత్సరం నుంచి ప్రభుత్వం నిర్దేశించుకునే విత్తలోటు లక్ష్యానికి అనుగుణంగా బాండ్ల జారీ లక్ష్యం కూడా ఉంటుంది.
xi. బాండ్లు కొనుగోలు చేసిన వారు తాము వ్యక్తిగతంగా సమీకరించుకునే ఏ రుణానికి అయినా వాటికి కొల్లేటరల్ గా (అనుబంధ హామీ) పెట్టవచ్చు. లోన్ టు వేల్యూను (బాండ్లను తనఖాగా ఉంచుకునే విలువ) ఆర్.బి.ఐ నిర్దిష్ట కాలపరిమితిలో ప్రకటించే బంగారం రుణం ధరకు సమానంగా ఉంచుతారు.
xii. బాండ్లను కాలపరిమితి కన్నా ముందుగానే నగదుగా మార్చుకోవాలనుకునే వారి సౌలభ్యం కోసం వాటిని ఎక్స్ఛేంజిల్లో ట్రేడింగ్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నారు.
xiii. బంగారానికి వర్తించే కెవైసి నిబంధనలే బంగారం బాండ్లకు కూడా వర్తిస్తాయి.
xiv. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు భౌతికంగా బంగారం కొనుగోలుపై వర్తించే కాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనలే బంగారం బాండ్లకు కూడా వర్తిస్తాయి. బాండ్ల బదిలీపై “దీర్ఘ కాలానికి వర్తించే కాపిటల్ గెయిన్స్ కు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తింపచేయడం”, “ఎస్.జి.బి.ల రిడెంప్షన్ ద్వారా సమకూరే కాపిటల్ గెయిన్స్” కు ఆదాయపు పన్ను రాయితీలు అందించడం వంటి అంశాలు తదుపరి బడ్జెట్ లో (2016-17) పరిశీలించేందుకు రెవిన్యూ శాఖ అంగీకరించింది. భౌతికంగా బంగారం కొనుగోలుకు, బాండ్లలో పెట్టుబడికి మధ్య పన్ను రేట్ల తేడాకు భయపడి ఇన్వెస్టర్లు బాండ్ల కొనుగోలుపై విముఖత ప్రదర్శించడాన్ని ఇది నివారిస్తుంది.
xv. బాండ్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును ప్రభుత్వ రుణ సమీకరణ లక్ష్యం కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. అలాంటి సొమ్ము సేకరించడం ద్వారా సమకూరుతుందనుకునే వడ్డీ ప్రయోజనాన్ని “బంగారం రిజర్వ్ ఫండ్” లో జమ చేస్తుంది.
బంగారం ధరల్లో పెరుగుదల వల్ల ఏర్పడే రిస్క్ ను ఈ ఫండ్ సద్దుబాటు చేస్తుంది. స్థిరత్వం కోసం ఈ బంగారం రిజర్వ్ ఫండ్ ను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు.
xvi. రిడెంప్షన్ సమయంలో సొమ్మును రూపాయి విలువలో మాత్రమే చెల్లిస్తారు. పెట్టుబడి సమయంలో బంగారం విలువ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారు. పెట్టుబడి సమయంలో మూలధనాన్ని (ప్రిన్సిపల్) బంగారం గ్రాముల రూపంలో మదింపు చేస్తే రిడెంప్షన్ సమయంలో అప్పటి బంగారం విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఏదైనా కారణాల వల్ల బాండ్ కొనుగోలు సమయంలో ఉన్న బంగారం విలువ రిడెంప్షన్ సమయానికి తగ్గినట్టయితే మరో మూడు సంవత్సరాలు లేదా ఆ పైబడిన కాలానికి బాండ్ గడువును పొడిగించుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
xvii. డిపాజిట్ కు ఎలాంటి హెడ్జింగ్ (ఆటుపోట్ల నుంచి రక్షణ కల్పించుకునే అవకాశం) లేకపోయినా బంగారం, కరెన్సీ ధరల్లో ఆటుపో్ట్లకు బంగారం రిజర్వ్ ఫండ్ నుంచి రక్షణ కల్పిస్తారు. బంగారం రిజర్వ్ ఫండ్ ఆధారనీయం కాని స్థాయికి చేరిపోతే దాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది.
xviii. బంగారం ధరల్లో పెరుగుదల వల్ల లాభాలు కలిగినా, క్షీణత వల్ల నష్టం ఏర్పడినా ఆ రిస్క్ ఇన్వెస్టర్ పైనే ఉంటుంది. బంగారం ధరల్లో ఆటుపోట్లు తప్పవన్న విషయం ఇన్వెస్టర్లు గమనంలో ఉంచుకోవాలి.
xix. బాండ్లు ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉండేందుకు వాటిని పోస్ట్ ఆఫీసులు/బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, బ్రోకర్లు/ఏజెంట్లు (ఎన్.ఎస్.సి ఏజెంట్లతో సహా) అందరి వద్ద విక్రయానికి ఉంచుతారు. వారికి ప్రభుత్వం కమిషన్ చెల్లిస్తుంది.