Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వ పథకాలతో 13.5 కోట్ల మంది పేదరిక సంకెళ్ల నుంచి బయటపడి, కొత్తగా మధ్యతరగతిలో చేరారు : పిఎం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 2014  సంవత్సరంలో ప్రపంచంలో 10వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2023 నాటికి 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా పరివర్తన చెందింది గుర్తు చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రభుత్వ ప్రయోజనాల బదిలీలో లీకేజిల నిలుపుదల, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం,  ప్రజాధనం పేదల సంక్షేమానికి వినియోగం ద్వారా ఇది సాధించగలిగామని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఈ రోజు నేను దేశ ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. దేశం ఆర్థికంగా సుసంపన్నం అయితే దాని వల్ల ఖజానా మాత్రమే నిండదు; పౌరులు, జాతి  సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రజల సొమ్మును నిజాయతీగా పౌరుల సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేస్తామని ప్రతిన తీసుకునే ప్రభుత్వం ఉన్నట్టయితే అరుదైన విజయాలు సాధ్యమవుతాయి’’ అన్నారు.  

కేంద్రం నుంచి రాష్ర్టాలకు నిధుల బదిలీ రూ.30 లక్షల కోట్ల నుంచి రూ.100 లక్షల కోట్లకు పెరిగింది.

గత 10 సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి గురించి వివరిస్తూ ఈ గణాంకాలు మనం ఎంత పురోగతి సాధించామన్నది తెలియచేస్తాయన్నారు. రాష్ర్టం నుంచి కేంద్రానికి నిధుల బదిలీ రూ.30 లక్షల కోట్ల నుంచి ఈ తొమ్మిదేళ్ల  కాలంలో రూ.100 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. పరివర్తన భారీగా ఉంది, జాతి అద్భుత సామర్థ్యాలకు అదే నిదర్శనం అన్నారు. ‘‘గతంలో భారత ప్రభుత్వ ఖజానా నుంచి స్థానిక సంస్థల అభివృద్ధికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేసే వారు. నేడు అది రూ.3 లక్షల కోట్లకు పెరిగింది’’ అని చెప్పారు.

పేదలకు ఇళ్ల నిర్మాణం నాలుగు రెట్లు పెరిగింది, యూరియా సబ్సిడీగా రూ.10 లక్షల కోట్లు రైతులకు చేరుతోంది.

పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేసే వారు. ఇప్పుడది నాలుగు రెట్లు పెరిగి రూ.4 లక్షల కోట్లు దాటింది అని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘కొన్ని ప్రపంచ మార్కెట్లలో రూ.3,000 అమ్ముతున్న యూరియా బస్తా మన రైతులకు రూ.300కే అందుతోంది. ఆ రకంగా ప్రభుత్వం రైతులకు రూ.10 లక్షల కోట్లు యూరియా సబ్సిడీగా అందిస్తోంది’’ అన్నారు.

10 కోట్ల మందిని ఉద్యోగకల్పన శక్తిగా మార్చిన ముద్ర యోజన

ముద్ర యోజన కోట్లాది మంది పౌరులను ఎంటర్  ప్రెన్యూర్లుగా మార్చి ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థితి కల్పించిందని శ్రీ మోదీ అన్నారు. ‘’రూ.20 లక్షల కోట్ల బడ్జెట్  తో ప్రారంభమైన ముద్రా యోజన స్వయం-ఉపాధి, స్వంత వ్యాపారాలు, సొంత సంస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశం యువతకు కల్పించింది. సుమారు 8 కోట్ల మంది కొత్త వ్యాపారాలు ప్రారంభించారు. 8 కోట్ల మంది వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఎంటర్  ప్రెన్యూర్లుగా మారడమే కాదు, ప్రతీ ఎంటర్  ప్రెన్యూర్  కనీసం ఒకరిద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎనిమిది కోట్ల మంది ముద్ర యోజన వినియోగించుకుని మరో 8-10 కోట్ల మందికి ఉపాధి కల్పించగల సామర్థ్యం పొందారు’’ అని వివరించారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో వ్యాపారాలకు కూడా మద్దతు ఇచ్చామని ప్రధానమంత్రి అన్నారు. ఎంఎస్ఎంఇలకు అందించిన రూ.3.5 కోట్ల వరకు ఆర్థిక మద్దతు అవి మునిగిపోవడాన్ని నివారించి బలం  పుంజుకునేందుకు దోహదపడిందని వివరించారు.

‘‘ఒక ర్యాంకు, ఒక పింఛన్’’ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. మన సైనికుల సాహస సేవలకు గౌరవసూచకంగా అందించిన ఈ పథకం రూ.70,000 కోట్లకు పైగా ప్రయోజనం కల్పించిందని తెలిపారు. పదవీ విరమణ చేసిన మన రైతుల కుటుంబాలకు ఈ ప్రయోజనం అందిందని చెప్పారు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని దేశాభివృద్ధికి విశేషంగా దోహదపడిన, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు సహాయపడిన ఇంకా ఎన్నో చర్యలున్నట్టు ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ముందు సంవత్సరాలతో పోల్చితే జాతి బడ్జెట్  అన్ని విభాగాల్లోనూ పలు రెట్లు పెరిగిందన్నారు.

‘’13.5 కోట్ల మంది పేదరికం సంకెళ్ల నుంచి వెలుపలికి వచ్చి మధ్యతరగతిలో కొత్తగా చేరారు’’

ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా కేవలం ప్రభుత్వ తొలి విడత పదవీ కాలంలోనే 13.5 కోట్ల మంది పేదలు పేదరిక సంకెళ్లను ఛేదించుకుని కొత్తగా మధ్యతరగతిలో చేరారు అని పిఎం శ్రీ మోదీ తెలిపారు. ఒక మనిషిగా ఇంతకు మంచిన సంతృప్తి ఏముంటుంది అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. గృహనిర్మాణ పథకాల నుంచి ప్రారంభించి పిఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు రూ.50,000 కోట్ల సహాయం, ఇతర ఎన్నో ముఖ్య పథకాలు ఈ 13.5 కోట్ల మంది పేదరిక కష్టాల నుంచి బయటపడేందుకు దోహదపడ్డాయని వివరించారు.

 

***