నమస్కారం !
ప్రబుద్ధ భారత 125 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక సాధారణమైన పత్రిక కాదు. దీనిని, 1896 లో సాక్షాత్తూ, స్వామి వివేకానంద ప్రారంభించారు. అది కూడా, కేవలం, ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో ప్రారంభించారు. దేశంలో చాలా కాలంగా నడుస్తున్న ఆంగ్ల పత్రికలలో, ఇది ఒకటి.
“ప్రబుద్ధ భారత” – అనే – ఈ పేరు వెనుక చాలా శక్తివంతమైన ఆలోచన ఉంది. మన దేశ స్ఫూర్తిని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో, స్వామి వివేకానంద ఈ పత్రికకు ప్రబుద్ధ భారత అని పేరు పెట్టారు. ఆయన, ‘ జాగృతమైన భారతదేశాన్ని’ సృష్టించాలని అనుకున్నారు. భారత్ అంటే అర్థం చేసుకున్న వారికి తెలుస్తుంది, అది కేవలం రాజకీయ లేదా ప్రాదేశిక సంస్థకు మించినదని. స్వామి వివేకానంద ఈ విషయాన్ని చాలా ధైర్యంగా, గర్వంగా వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా జీవించి, ఊపిరి పీల్చుకుంటున్న సాంస్కృతిక స్పృహగా ఆయన భారతదేశాన్ని చూశారు. అంచనాలు విరుద్ధంగా ఉన్నప్పటికి, భారతదేశం, ప్రతి సవాలు అనంతరం కూడా మరింత బలంగా ఉద్భవించే దేశం. స్వామి వివేకానంద భారతదేశాన్ని ‘ప్రబుద్ధ’ గా మార్చాలని లేదా జాగృతం చేయాలని అనుకున్నారు. ఒక దేశంగా మనం గొప్పతనాన్ని కోరుకుందాం – అనే ఆత్మ విశ్వాసాన్ని మేల్కొల్పాలని ఆయన కోరారు.
మితృలారా !
స్వామి వివేకానందకు పేదల పట్ల అపారమైన కరుణ ఉండేది. పేదరికంమే – అన్ని సమస్యలకు మూలమని ఆయన బలంగా నమ్మారు. అందువల్ల, పేదరికాన్ని, దేశం నుండి తొలగించాలి. అందుకే, ఆయన ‘దరిద్ర నారాయణ’ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
స్వామి వివేకానంద, అమెరికా నుండి, చాలా లేఖలు రాశారు. మైసూర్ మహారాజు కు, స్వామి రామకృష్ణానందజీ కి ఆయన రాసిన లేఖలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ లేఖలలో, పేదవారి సాధికారతపై, స్వామిజీ విధానం గురించి రెండు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. పేదలు సులభంగా సాధికారతను చేరుకోలేకపోతే, సాధికారతనే పేదల వద్దకు తీసుకు వెళ్ళాలన్నది, ఆయన మొదటి ఆలోచన. ఇక రెండవ ఆలోచనగా, ఆయన భారతదేశ పేదల గురించి మాట్లాడుతూ, “వారికి ఆలోచించే అవకాశం ఇవ్వాలి; వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతోందో, వారి కళ్ళతో చూడాలి; అప్పుడు, వారి సమస్యల పరిష్కారానికి, వారే కృషి చేస్తారు.” అని సూచించారు.
ఇదే విధానంతో, ఇప్పుడు, భారతదేశం ముందుకు సాగుతోంది. పేదలు బ్యాంకులను చేరుకోలేకపోతే, బ్యాంకులే పేదల దగ్గరకు రావాలి. ఆ పనిని “జన్ ధన్ యోజన” చేసింది. పేదలు బీమాను పొందలేకపోతే, బీమా పేదలను చేరాలి. “జన సురక్ష పథకాలు” అదే చేస్తున్నాయి. పేదలు ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతే, మనం పేదల వద్దకు ఆరోగ్య సంరక్షణను తప్పకుండా తీసుకు వెళ్ళాలి. “ఆయుష్మాన్ భారత్ పథకం” ఇదే చేసింది. రోడ్లు, విద్య, విద్యుత్తు, ఇంటర్నెట్ అనుసంధానం వంటి సౌకర్యాలను, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ, ముఖ్యంగా పేదల దగ్గరకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇది పేదల మధ్య ఆకాంక్షలను రేకెత్తిస్తోంది. ఈ ఆకాంక్షలే దేశాభివృద్ధి కి కారణమవుతున్నాయి.
మితృలారా !
“బలహీనతకు పరిహారం, దాన్ని పెంచి పోషించడం కాదు, బలం గురించి ఆలోచించడం”. అని స్వామీ వివేకానంద అన్నారు. మనం అస్తమానం అవరోధాల గురించే ఆలోచిస్తూంటే, మనం, వాటిలోనే మునిగి పోతాము. అదే, మనం, అవకాశాల పరంగా ఆలోచిస్తే, ముందుకు సాగడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కోవిడ్-19 మహమ్మారిని ఉదాహరణగా తీసుకోండి. భారతదేశం ఏమి చేసింది? ఇది సమస్యను మాత్రమే చూస్తూ, నిస్సహాయంగా ఉండిపోలేదు. భారతదేశం, పరిష్కారాలపై దృష్టి పెట్టింది. పి.పి.ఇ. కిట్ లను ఉత్పత్తి చేయడం నుండి ప్రపంచానికి ఫార్మసీగా మారడం వరకు మన దేశం పోటా, పోటీగా నిలిచింది. సంక్షోభ సమయంలో, భారతదేశం ప్రపంచానికి మద్దతుగా మారింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారతదేశం ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనం ఇతర దేశాలకు సహాయం చేయడానికి కూడా, ఈ సామర్థ్యాలను ఉపయోగిస్తున్నాము.
మితృలారా !
ప్రపంచమంతా ఎదుర్కొంటున్న మరో అవరోధం వాతావరణ మార్పు. అయితే, మనం కేవలం, సమస్య గురించి మాత్రమే ఫిర్యాదు చేయలేదు. మనం అంతర్జాతీయ సౌర కూటమి రూపంలో దీనికి, ఒక పరిష్కారం తీసుకువచ్చాము. పునరుత్పాదక వనరులను ఎక్కువగా ఉపయోగించాలని మనం సూచిస్తున్నాము. స్వామి వివేకానంద ఆలోచనలకు అనుగుణంగా రూపొందిన ప్రబుద్ధ భారత కూడా ఇదే. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్న భారతదేశం ఇదే.
మితృలారా !
భారత యువతపై అపారమైన నమ్మకం ఉన్నందున స్వామి వివేకానందకు భారతదేశం గురించి పెద్ద కలలు ఉండేవి. ఆయన భారతదేశ యువతను, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క శక్తి కేంద్రంగా చూశారు. “నాకు వంద మంది శక్తివంతమైన యువకులను ఇవ్వండి; నేను భారతదేశాన్ని మారుస్తాను” అని, ఆయన చెప్పారు. ఈ రోజు మనం భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలతో పాటు ఎంతో మందిలో ఈ స్ఫూర్తిని చూస్తున్నాము. వారు సరిహద్దులను అధిగమించి, అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తారు.
అయితే, మన యువతలో ఆ విధమైన స్ఫూర్తిని మరింతగా ప్రోత్సహించడం ఎలా? ఆచరణీయ వేదాంతంపై, స్వామీ వివేకానంద ఉపన్యసిస్తూ, కొన్ని లోతైన విషయాలను వెల్లడించారు. ఆయన ఎదురుదెబ్బలను అధిగమించడం గురించి మాట్లాడుతూ, వాటిని అభ్యాస క్రమంలో భాగంగా చూడాలని పేర్కొన్నారు. ప్రజలలో నింపాల్సిన రెండవ విషయం ఏమిటంటే: నిర్భయంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో నిండి ఉండటం. నిర్భయంగా ఉండడం అనే పాఠాన్ని స్వామి వివేకానంద స్వీయ జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఆయన ఏ పని చేసినా, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. ఆయనపై ఆయన పూర్తి విశ్వాసంతో ఉండేవారు. శతాబ్దాల నాటి ఒక నీతికి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఆయన నమ్మకంగా ఉండేవారు.
మితృలారా !
స్వామి వివేకానంద ఆలోచనలు శాశ్వతమైనవి. వాటిని, మనం, ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: ప్రపంచానికి విలువైనదాన్ని సృష్టించడం ద్వారా నిజమైన అమరత్వం సాధించాలి. అదే, మనల్ని మనం బ్రతికిస్తుంది. మన పౌరాణిక కథలు మనకు ఎంతో విలువైన విషయాలు నేర్పుతాయి. అమరత్వాన్ని వెంబడించిన వారికి అది ఎన్నడూ లభించలేదని, అవి మనకు బోధిస్తాయి. కానీ, ఇతరులకు సేవ చేయాలనే లక్ష్యం ఉన్నవారు దాదాపు ఎల్లప్పుడూ అమరులుగానే ఉంటారు. స్వామి జీ స్వయంగా చెప్పినట్లుగా, “ఇతరుల కోసం జీవించేవారు మాత్రమే, జీవించి ఉంటారు.” మనం, ఈ విషయాన్ని, స్వామి వివేకానంద జీవితంలో కూడా గమనించవచ్చు. తనకోసం ఏదైనా సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన బయటకు వెళ్ళలేదు. ఆయన హృదయం ఎప్పుడూ, మన దేశంలోని పేదల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన గుండె అప్పుడూ, బంధనాల్లో ఉన్న మాతృభూమి కోసమే, కొట్టుకుంటూ ఉంటుంది.
మితృలారా !
స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పురోగతిని పరస్పరం భిన్నంగా చూడలేదు. మరీ ముఖ్యంగా, ప్రజలు పేదరికాన్ని శృంగారభరితం చేసే విధానాన్ని, ఆయన వ్యతిరేకించారు. ఆచరణీయ వేదాంతం గురించి, ఆయన, తన ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ, “మతం మరియు ప్రపంచ జీవితాల మధ్య కల్పిత వ్యత్యాసం అంతరించిపోవాలి, ఎందుకంటే వేదాంతం ఏకత్వాన్ని బోధిస్తుంది”, అని పేర్కొన్నారు.
స్వామి జీ ఒక ఆధ్యాత్మిక దిగ్గజం, అత్యున్నతమైన మనసు కలిగిన వ్యక్తి. అయినప్పటికీ, ఆయన, పేదల ఆర్థిక పురోగతి ఆలోచనను, ఎప్పుడూ త్యజించలేదు. స్వామి జీ స్వయంగా సన్యాసి. ఆయన, తన కోసం ఎప్పుడూ ఒక్క పైసా కూడా, ఆశించలేదు. అయితే, గొప్ప సంస్థలను నిర్మించడానికి నిధులు సేకరించడానికి సహాయం చేశారు. ఈ సంస్థలు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడి, ఆవిష్కరణలను ప్రోత్సహించాయి.
మితృలారా !
మనకు మార్గనిర్దేశం చేసే అనేక సంపదలు స్వామి వివేకానంద నుండి మనకు లభిస్తాయి. స్వామి జీ ఆలోచనలను వ్యాప్తి చేస్తూ, ప్రబుద్ధ భారత, 125 సంవత్సరాల నుండి నడుస్తోంది. యువతకు విద్యను అందించడం, దేశాన్ని మేల్కొల్పడం అనే, స్వామీజీ ఆలోచనలపై వారు దృష్టి కేంద్రీకరించారు. స్వామి వివేకానంద ఆలోచనలకు అమరత్వం కలిగించడానికి, ఇది గణనీయంగా దోహదపడింది. ప్రబుద్ధ భారత భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదములు.
*****
Addressing the 125th anniversary celebrations of ‘Prabuddha Bharata.’ https://t.co/UOPkG8gjW8
— Narendra Modi (@narendramodi) January 31, 2021