ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.
ఈ సమావేశంలో రోస్ నెఫ్ట్, బిపి, రిలయన్స్, సౌదీ అరామ్ కో, ఎక్సాన్ మొబిల్, రాయల్ డచ్ షెల్, వేదాంత, వుడ్ మెకన్జీ, ఐహెచ్ఎస్ మార్కిట్, శ్లుంబర్ గర్, హాలిబర్టన్, ఎక్స్ కోల్, ఒఎన్ జిసి, ఇండియన్ ఆయిల్, గెయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్ జి, ఆయిల్ ఇండియా, హెచ్ పిసిఎల్, డెలొనాక్స్ ఎనర్జి, ఎన్ఐపిఎఫ్ పి, ఇంటర్ నేషనల్ గ్యాస్ యూనియన్, వరల్డ్ బ్యాంకులతో పాటు ఇంటర్ నేషనల్ ఎనర్జి ఏజెన్సి లకు చెందిన అగ్రగామి సిఇఒ లు మరియు అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ ఆర్. కె. సింగ్ లతో పాటు నీతి ఆయోగ్ , పిఎమ్ఒ, పెట్రోలియమ్ శాఖ, ఆర్థిక శాఖ లకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాలు పంచుకొన్నారు.
నీతి ఆయోగ్ ఈ సమావేశాన్ని సమన్వయపరచింది. పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ రాజీవ్ కుమార్ లు సమావేశం మొదట్లో కొద్ది సేపు మాట్లాడుతూ ఈ రంగంలో జరిగిన పనులను గురించి వివరించారు. భారతదేశంలో శక్తి రంగంలో డిమాండు పెరిగేందుకు అవకాశం ఉందని, అంతే కాక విద్యుద్దీకరణ లోను, ఎల్ పిజి విస్తరణలోను చెప్పుకోదగ్గ పురోగతి చోటు చేసుకొందని కూడా వారు స్పష్టంచేశారు.
నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాంత్ భారతదేశ చమురు- గ్యాస్ రంగంలో ఇటీవలి పరిణామాలు మరియు సవాళ్లను గురించి క్లుప్తంగా తెలియజేశారు.
గత మూడు సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన ప్రగతిని, అమలైన సంస్కరణలను పలువురు మెచ్చుకొన్నారు. వారు శక్తి రంగంలో ప్రధాన మంత్రి వేగంగాను, చొరవ తోను తీసుకువచ్చిన సంస్కరణలను అభినందించారు. ఒక ఏకీకృత శక్తి విధానం యొక్క అవసరం గురించి, కాంట్రాక్ట్ ఫ్రేమ్ వర్క్ లు మరియు సర్దుబాట్లు, సైజ్మిక్ డాటా సెట్స్, జీవ ఇంధనాలకు ప్రోత్సాహం, గ్యాస్ సరఫరాను మెరుగుపరచడం, ఒక గ్యాస్ హబ్ ను ఏర్పాటు చేయడం, ఇంకా నియంత్రణపరమైన అంశాలు వంటివి చర్చకు వచ్చాయి. గ్యాస్ ను, విద్యుత్తును జిఎస్ టి ఫ్రేమ్ వర్క్ లో చేర్చాలని అనేక మంది గట్టిగా సిఫారసు చేశారు. చమురు- గ్యాస్ రంగానికి సంబంధించి జిఎస్ టి కౌన్సిల్ లో ఇటీవల తీసుకొన్న నిర్ణయాలను రెవెన్యూ కార్యదర్శి శ్రీ హస్ ముఖ్ అధియా చాటిచెప్పారు.
సమావేశంలో పాలు పంచుకొన్న వారు వారి అభిప్రాయాలను వెల్లడించినందుకు వారికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 2016 లో జరిగిన కడపటి సమావేశంలో అందిన బోలెడు సూచనలు విధాన రూపకల్పనలో తోడ్పడ్డట్లు ఆయన చెప్పారు. చాలా రంగాలలో సంస్కరణలకు అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. సమావేశంలో పాలుపంచుకొన్న వారు అమిత శ్రద్ధతో సలహాలను అందించారంటూ ఆయన అభినందించారు.
తమ తమ సంస్థల సమస్యలకు మాత్రమే పరిమితం అయిపోకుండా, చమురు- గ్యాస్ రంగంలో భారతదేశానికి ఉన్నటువంటి విశిష్టమైన సత్తాను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన సూచనలతో ముందుకు వచ్చినందుకుగాను ఆహూతులందరికీ ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు సమావేశంలో వ్యక్తమైన సలహాలు పాలనపరంగా రచించవలసిన విధానంతో పాటు నియంత్రణపరమైన అంశాలను కూడా స్పర్శించాయని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో శక్తి రంగానికి మద్దతుగా తమ వచనబద్ధతను వ్యక్తంచేసిన రష్యా అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు, రోస్ నెఫ్ట్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యొక్క 2030 దార్శనిక పత్రాన్ని కూడా ఆయన అభినందించారు. సౌదీ అరేబియా లో తన పర్యటనను గురించి ఆయన ప్రేమపూర్వకంగా గుర్తుకుతెచ్చుకొంటూ, శక్తి రంగంలో అక్కడ ఎన్నో ప్రగతిశీల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందన్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశానికి, సౌదీ అరేబియా కు మధ్య సహకారానికి తావున్న రకరకాల అవకాశాల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.
భారతదేశంలో శక్తి రంగం యొక్క స్థాయి ఎంతో అసమతుల్యంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఒక సమగ్రమైనటువంటి శక్తి విధానం కోసం అందిన సలహాను ఆయన స్వాగతించారు. తూర్పు భారతావనిలో శక్తిని అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉందని, అలాగే శక్తి సంబంధ అవస్థాపనను అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. బయోమాస్ ఎనర్జీ యొక్క సామర్థ్యాన్ని గురించి ఆయన విశదీకరిస్తూ, కోల్ గ్యాసిఫికేషన్ లో పాలుపంచుకోవలసిందిగాను మరియు జాయింట్ వెంచర్ లను ఏర్పాటు చేయవలసిందిగాను సంస్థలను ఆహ్వానించారు. చమురు- గ్యాస్ రంగంలో నవకల్పనకు, పరిశోధనకు ఉన్న అన్ని అవకాశాలను తరచిచూసేందుకు ముందుకు రావలసిందిగా ఆయన కోరారు.
భారతదేశం శుద్ధమైనటువంటి మరియు ఇంధనాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోగలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తున్నదని ప్రధాన మంత్రి సూచించారు. దీని యొక్క ప్రయోజనాలను సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా, మరీ ముఖ్యంగా ఈ ప్రయోజనాలను నిరుపేదలకు విస్తరించేలా చూడాల్సివుందని కూడా ఆయన అభిలషించారు.
***