Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్చుగల్, యుఎస్ఎ మరియు నెదర్లాండ్స్ ల పర్యటనకు వెళ్లే ముందు జారీ చేసిన ప్రకటన


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు పోర్చుగల్, యుఎస్ఎ మరియు నెదర్లాండ్స్ ల పర్యటనకు బయలుదేరివెళ్లనున్నారు.  తన విదేశీ పర్యటన వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం ధ్యేయంగా సాగనుందని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘నేను 2017 జూన్ 24వ తేదీన పోర్చుగల్ లో పర్యటించనున్నాను.  మన మధ్య నెలకొన్న చారిత్రక మరియు స్నేహపూర్వక సంబంధాలు శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ అంతోనియో కోస్టా భారతదేశ పర్యటన అనంతరం వేగం పుంజుకొన్నాయి.

ప్రధాని శ్రీ కోస్టా తో నా సమావేశం కోసం నేను ఎదురుచూస్తున్నాను.  ఇటీవలి మా చర్చల ఆధారంగా మేము వేరు వేరు కార్యక్రమాల, నిర్ణయాల పురోగతి ని సమీక్షిస్తాము.  మేము ద్వైపాక్షిక సంబంధాలను , మరీ ముఖ్యంగా ఆర్థిక సహకారం, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష సహకారం, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించుకొనేందుకు ఉన్న మార్గాలను కూడా మేము చర్చిస్తాము.  ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా సహకారాన్ని ముమ్మరం చేసుకొనే మార్గాలను గురించి, ఇంకా పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలను గురించి మేము సంప్రదింపులు జరుపుతాము.  ద్వైపాక్షిక వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్ఠపరచుకొనేందుకు గొప్ప అవకాశం ఉందని కూడా నేను భావిస్తున్నాను.

నా పర్యటన సమయంలో పోర్చుగల్ లోని భారతీయ సముదాయంతో ముచ్చటించాలని నాకు ఆసక్తిగా ఉంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి జూన్ 24-26 మధ్య వాషింగ్ టన్, డి.సి. ని సందర్శించనున్నారు.

‘‘ప్రెసిడెంట్ శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆహ్వానించిన మీదట నేను జూన్ 24-26 మధ్య వాషింగ్ టన్, డి.సి. ని సందర్శించబోతున్నాను.  ఇంతకు ముందు ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ మరియు నేను టెలిఫోన్ లో సంభాషించుకున్నాము.  మన ప్రజల పరస్పర లబ్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాత్మకమైనటువంటి సర్వతోముఖ బంధాలను ముందుకు తీసుకుపోవాలన్న ఉమ్మడి ప్రయోజనం గురించి మా సంభాషణలో ప్రస్తావన చోటు చేసుకొంది.  భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ల మధ్య బలమైన మరియు విస్తృత‌మైన‌ శ్రేణిలో నెలకొన్న భాగస్వామ్యాన్ని ఇంకా అధికమైన స్థాయిలో సుసంఘటితం చేసుకోవడంపై ఒకరి అభిప్రాయాలను మరొకరం సమగ్రంగా తెలియజెప్పుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఎదురుచూస్తూ ఉన్నాను.

 యునైటెడ్ స్టేట్స్ తో భారతదేశం భాగస్వామ్యం అనేకమైన పొరలను కలిగినదీ మరియు విభిన్నమైనటువంటిదీనూ.  ఈ భాగస్వామ్యానికి ప్రభుత్వాల మద్దతు మాత్రమే కాక ఇరు పక్షాలకు చెందిన సంబంధిత వర్గాల అన్నింటి మద్దతు కూడా ఉంది.  ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ నాయకత్వంలో యునైటెడ్ స్టేట్స్ లోని నూతన పాలనయంత్రంగంతో మా భాగస్వామ్యాన్ని ముందుచూపు కలిగివున్నటువంటిదిగా మలచుకోవడం కోసం నేను వేచివున్నాను.

ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ తోను మరియు ఆయన మంత్రివర్గ సహచరులతోనూ ఆధికారిక సమావేశాలే కాకుండా, నేను కొంత మంది ప్రముఖ అమెరికా సిఇఒ లతో భేటీ కాబోతున్నాను.  గతంలో మాదిరిగానే, యునైటెడ్ స్టేట్స్ లోని ప్రవాసీ భారతీయులతో కబుర్లాడటం కోసం కూడా నేను ఎదురుచూస్తున్నాను.’’

2017 జూన్ 27వ తేదీ నాడు ప్రధాన మంత్రి నెదర్లాండ్స్ లో కూడా నెదర్లాండ్స్ లో పర్యటించనున్నారు.

‘‘నేను 2017 జూన్ 27వ తేదీ నాడు నెదర్లాండ్స్ లో పర్యటించనున్నాను.  మనం ఈ సంవత్సరంలో భారత-డచ్ దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు కావటాన్ని ఉత్సవాలుగా జరుపుకోబోతున్నాము.  నా పర్యటన లో భాగంగా నేను డచ్ ప్రధాని శ్రేష్ఠుడు శ్రీ మార్క్ రూటే తో ఆధికారిక సమావేశం లో పాల్గొననున్నాను.  నేను నెదర్లాండ్స్ రాజు విలెమ్-అలెగ్జాండర్ గారు మరియు రాణి మాగ్జిమా గారు లతోనూ భేటీ అవుతాను.

ప్రధాని శ్రీ రూటే తో సమావేశమై, మా ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.  ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, శీతోష్ణ స్థితిలో మార్పు సహా ముఖ్యమైన ప్రపంచ అంశాలపై ప్రధాని శ్రీ రూటే తో నా అభిప్రాయాలను చాటిచెప్పి ఆయన అభిప్రాయాలను తెలుసుకొంటాను.

మన ద్వైపాక్షిక సంబంధాలలో ఆర్థిక సంబంధాలది కీలకమైన పాత్ర.  నెదర్లాండ్స్ యూరోపియన్ యూనియన్ లో మన ఆరవ అతి పెద్ద వ్యాపార భాగస్వామ్య దేశం.  అంతే కాక, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అయిదవ అతి పెద్ద పెట్టుబడి భాగస్వామ్య దేశం కూడాను.  జలం మరియు వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయం మరియు ఫూడ్ ప్రాసెసింగ్, నవీకరణయోగ్య శక్తి మరియు నౌకాశ్రయాలు, ఇంకా షిప్పింగ్ వంటి రంగాలలో డచ్చి వారికి ఉన్న  అనుభవం మన అభివృద్ధి అవసరాలతో తుల తూగుతుంది.  భారత-డచ్చి ఆర్థిక బంధం ఉభయ పక్షాలకూ గెలుపును అందించే బంధం.  ఈ రెండు పక్షాలు వాటి సమన్వయాలను మరింతగా పెంచి పోషించుకోడానికి ఎలాగ కలసి పనిచేయాలో ప్రధాని శ్రీ రూటే తో నేను చర్చిస్తాను.  డచ్ లో ప్రధాన కంపెనీల సిఇఒ లతో కూడా నేను సమావేశమై, వారు భారతదేశ వృద్ధి గాథలో పాలుపంచుకొనేటట్లుగా వారిని ప్రోత్సహిస్తాను.

యూరోప్ లో కెల్లా రెండవ అతి పెద్ద సంఖ్యలో ప్రవాసీ భారతీయులు ఉన్నది నెదర్లాండ్స్ లోనే కావడంతో రెండు దేశాల ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి.  నెదర్లాండ్స్ లో ఉంటున్న ప్రవాసీ భారతీయ సముదాయంతో అన్యోన్యత నెలకొల్పుకోవడం కోసం నేను వేచివున్నాను’’ అని ప్రధాన మంత్రి వివరించారు.