Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన భారత జి-20 అధ్యక్షతపై సమన్వయ సంఘం 6వ సమావేశం


   భారత జి-20 అధ్యక్షతపై సమన్వయ కమిటీ 6వ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోగల అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశం మందిరం (ఐఇసిసి)లో జరిగింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించే జి-20 శిఖరాగ్ర సదస్సు సంబంధిత సన్నాహాలపై సమావేశం సమీక్షించింది. ఈ మేరకు సదస్సు వేదికవద్ద ఏర్పాట్లుసహా అధికారిక విధివిధానాలు, భద్రత, విమానాశ్రయ సమన్వయం, మీడియా, మౌలిక సదుపాయాల నవీకరణ , ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలను  సమావేశం నిశితంగా పరిశీలించింది. ఈ సదస్సు విజయవంతానికి అన్ని వ్యవస్థలూ ‘సంపూర్ణ ప్రభుత్వం’ పద్ధతిలో పనిచేయాలని ఈ సందర్భంగా డాక్టర్ మిశ్రా స్పష్టం చేశారు.

   నంతరం కమిటీ సభ్యులు వివిధ సమావేశాల కోసం ప్రతిపాదించిన ప్రదేశాలను సందర్శించి, సూక్ష్మ వివరాలను కూడా లోతుగా పరిశీలించారు. వివిధ వ్యవస్థలు సజావుగా పనిచేసేందుకు వీలుగా నమూనా కార్యక్రమాలు, కసరత్తులు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అలాగే శిఖరాగ్ర సదస్సు సన్నాహకాలకు మార్గనిర్దేశం చేసింది. మరో రెండు వారాల్లో తదుపరి సమీక్ష నిమిత్తం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటిదాకా నిర్వహించిన జి-20 సమావేశాలు, భారత జి-20 అధ్యక్షత కింద నిర్వహించాల్సిన మిగిలిన సమావేశాల సమీక్షకు అవకాశం కల్పించింది. కాగా, దేశవ్యాప్తంగా 55 ప్రాంతాల్లో ఇప్పటివరకూ 170 సమావేశాలు నిర్వహించినట్లు కమిటీ పేర్కొంది. అలాగే 2023 జూలై, ఆగస్టు నెలల్లో మంత్రుల స్థాయి సమావేశాలు అనేకం నిర్వహించాల్సి ఉందని తెలిపింది.

   జి-20కి భారత అధ్యక్షత సంబంధిత కార్యక్రమాల సన్నాహాలు, ఏర్పాట్ల పరిశీలన బాధ్యతను కేంద్ర మంత్రిమండలి సమన్వయ సంఘానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో సమన్వయ సంఘం ఇప్పటిదాకా ఐదుసార్లు సమావేశమై సమీక్షలు నిర్వహించింది. దీంతోపాటు భారత జి-20 అధ్యక్షతకు సంబంధించిన నిర్దిష్ట వాస్తవిక, రవాణా అంశాలపై చర్చ కోసం చాలాసార్లు సమావేశమైంది. ప్రస్తుత తాజా సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు శ్రీ అజిత్ దోవల్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ వి.కె.సక్సేనా, కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబాలతోపాటు మరికొందరు ప్రముఖులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

*****