ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మల్టి- మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’ ) అని వ్యవహరిస్తున్న ఐసిటి ఆధారిత మాధ్యమం ద్వారా జరిగిన 17వ ముఖాముఖి సంభాషణ సమావేశానికి అధ్యక్షత వహించారు.
టెలికం రంగానికి సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించే దిశగా సాగుతున్న పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ ఇబ్బందులలో సేవల నాణ్యత, ల్యాండ్ లైన్ కనెక్షన్ ల అనుసంధానం అధ్వానంగా ఉండడం, ల్యాండ్ లైన్ కనెక్షన్ లు అసలు పనిచేయకపోవడం వంటి అంశాలకు సంబంధించినవే చాలా వరకు ఉన్నాయి. ఈ విషయంలో ఇంతవరకు తీసుకున్న చర్యలను గురించి టెలికం విభాగం కార్యదర్శి ఈ సందర్భంగా వివరించారు. పరిస్థితిలో వీలైనంత త్వరగా గమనించదగిన మార్పును తీసుకురావడం కోసం అన్ని స్థాయిలలోను జవాబుదారీతనాన్ని ఖరారు చేయడంతో పాటు దక్షతను మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 2015 ఏప్రిల్ లో తాను నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడం కోసం అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక సంబంధ పరిష్కారాలను వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పనుల పురోగతిపై జరిగిన సమీక్షలో భాగంగా 2022 కల్లా అందరికీ గృహ వసతి కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధాన మంత్రి శ్రీ మోదీ చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా తగిన వ్యూహాలు, నిర్దిష్ట కాలావధిలో అమలు చేయవలసిన పథకాలు, ఒక మార్గసూచీ, అనుశీలన చర్యలను పర్యవేక్షించేందుకు ఒక యంత్రాంగాన్ని నియమించడం వంటివి చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పనిలో నాణ్యతను పెంచేందుకు, మరింత వేగంగా పనులు జరిగేందుకు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవలసిందంటూ ఆయన సలహా ఇచ్చారు.
వ్యాపారాన్ని సులభతరంగా మార్చడానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని ఒకసారి సమీక్షించవలసిందంటూ భారత ప్రభుత్వ కార్యదర్శులను, ముఖ్య కార్యదర్శులను ప్రధాన మంత్రి కోరారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంశంపై ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికను గురించి ఆయన ప్రస్తావిస్తూ, పనులలో పురోగతిని ఆ నివేదికలో పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా మదింపు చేయండని అధికారులకు చెప్పారు. అంతే కాకుండా పనులలో పురోగతిని ప్రతి వారం సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులను ఆయన కోరారు.
తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళ నాడు, కర్ణాటక, హరియాణా, బిహార్, పశ్చిమ బెంగాల్, మరియు మేఘాలయ సహా అనేక రాష్ట్రాలలో అమలవుతున్న రైల్వేలు, రహదారులు, ఓడరేవులు, విద్యుత్తు, సహజ వాయువు రంగాలలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి పైన కూడా ప్రధాన మంత్రి సమీక్షను నిర్వహించారు. ఈ ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడం ఎంతో ముఖ్యమని, అలా పూర్తి చేస్తే వ్యయాలు పెచ్చు పెరగకుండా నివారించడం సాధ్యపడుతుందని, మొదట అనుకున్న ప్రకారం ఆయా ప్రాజెక్టుల ప్రయోజనాలు ప్రజలకు చేరే వీలు ఉంటుందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ రోజు సమీక్ష చేపట్టిన ప్రాజెక్టులలో బిర్నిహాత్-శిల్లాంగ్ రైలు మార్గం, జోగ్ బని-బిరాట్ నగర్ (నేపాల్) రైలు మార్గం, సూరత్-దహిసార్ రాజమార్గం, గుర్గామ్ -జైపూర్ రాజమార్గం, చెన్నై – ఎణ్ణూర్ ఓడరేవు అనుసంధాన పథకం, కొచ్చిన్ షిప్ యార్డ్ డ్రై-డాక్ నిర్మాణ పథకంతో పాటు ఈస్ట్ కోస్ట్ టు వెస్ట్ కోస్ట్ మల్లవరం-భోపాల్-బిల్ వాడా-విజయపూర్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ లు ఉన్నాయి.