గ్రామీణ ప్రాంతాలలో 6 కోట్ల కుటుంబాలకు డిజిటల్ అవగాహనపరంగా విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్’ (పిఎమ్ జిడిఐఎస్ హెచ్ఎ)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2019 మార్చి కల్లా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ విద్యావ్యాప్తికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు రూ.2,351.38 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది 2016-17 కేంద్ర బడ్జెటు లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉంది.
పిఎమ్ జిడిఐఎస్ హెచ్ఎ ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ లిటరసీ కార్యక్రమాలలో ఒకటి కాగలుగుతుందని భావిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 25 లక్షల మంది అభ్యర్థులకు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 275 లక్షల మంది అభ్యర్థులకు,2018-19 ఆర్థిక సంవత్సరంలో 300 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణను అందిస్తారు. ఈ పథకం పరిధిలోకి అన్ని ప్రాంతాలు వచ్చేందుకుగాను 2,50,000 గ్రామ పంచాయతీలలోనూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుండి సగటున 200-300 అభ్యర్థులను ఈ పథకం కోసం నమోదు చేసేటట్లు చూస్తారు.
డిజిటల్ పరంగా విద్యావంతులైన వ్యక్తులు కంప్యూటర్లను మరియు టాబ్లెట్ లు, స్మార్ట్ ఫోన్ ల వంటి డిజిటల్ ఏక్సెస్ డివైసెస్ ను పనిచేయించగలరు; ఇమెయిల్ లను పంపడం, అందుకోవడం చేయగలరు; ఇంటర్ నెట్ ను బ్రౌజ్ చేయగలుగుతారు; ప్రభుత్వ సేవలను పొందగలుగుతారు, సమాచారాన్ని అన్వేషించగలుగుతారు; నగదు రహిత లావాదేవీల వంటి వాటిని నిర్వహించగలుగుతారు; కాబట్టి, దేశ నిర్మాణ ప్రక్రియలో చురుకుగా పాలుపంచుకోవడం కోసం సమాచార సాంకేతికతను (ఐటి ని) వినియోగించగలుగుతారు.
ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది. ఈ శాఖకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి డెజిగ్నేటెడ్ స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజన్సీస్, డిస్ట్రిక్ట్ ఇ- గవర్నెన్స్ సొసైటీ (డిఇజిఎస్) వగైరా ల ద్వారా తమ సమన్వయాన్ని అందజేస్తాయి.
పూర్వరంగం:
విద్య పై 71వ ఎన్ఎస్ఎస్ఒ సర్వేక్షణ ప్రకారం, కేవలం 6 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద కంప్యూటర్ లు ఉన్నాయి. దీనిని బట్టి, 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాల వద్ద కంప్యూటర్ లు లేవని, వీరిలో చెప్పుకోదగిన సంఖ్యలో కుటుంబాలు డిజిటల్ అవగాహనను సంపాదించుకొంటాయని విశ్లేషణ చాటిచెబుతోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆరంభిస్తున్న పిఎమ్ జిడిఐఎస్ హెచ్ఎ గ్రామీణ ప్రాంతాల లోని 6 కోట్ల కుటుంబాలకు డిజిటల్ పరంగా విద్యావంతులను చేయడానికి ఉద్దేశించినటువంటిది. ఇది పౌరులకు కంప్యూటర్లు / డిజిటల్ ఏక్సెస్ డివైసెస్ లను ఉపయోగించడానికి కావలసిన నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని, సమాచార లభ్యతను సమకూర్చుతుంది.
మొబైల్ ఫోన్ ల ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించదలుస్తున్నందున కోర్సు పాఠ్యాంశాలలో డిజిటల్ వ్యాలెట్ లు, మొబైల్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ), అన్ స్ట్రక్చర్ డ్ సప్లిమెంటరీ డేటా (యుఎస్ఎస్ డి) మరియు ఆధార్ ఎనేబుల్ డ్ పేమెంట్ సిస్టమ్ (ఎఇపిఎస్) వగైరా లకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది.