Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి కతర్ పర్యటన సందర్భంగా భారతదేశం- కతర్ ల సంయుక్త ప్రకటన

ప్రధాన మంత్రి కతర్ పర్యటన సందర్భంగా భారతదేశం- కతర్ ల సంయుక్త ప్రకటన

ప్రధాన మంత్రి కతర్ పర్యటన సందర్భంగా భారతదేశం- కతర్ ల సంయుక్త ప్రకటన


1. కతర్ అమీర్ గౌరవనీయులు శ్రీ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 జూన్ 4, 5 తేదీలలో రెండు రోజుల పాటు కతర్ లో అధికార పర్యటన జరిపారు.

2. గౌరవనీయ కతర్ అమీర్ 5వ తేదిన అమీరీ దివాన్ వద్ద ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి స్వాగతం పలికారు. ఉమ్మడి ప్రయోజనాలు కలిగిన ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుళముఖీన అంశాలపై నేతలు ఇరువురు వారి అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజేసుకొన్నారు. సుహృద్భావపూరితమైన, స్నేహపూర్వక వాతావరణంలో విస్తృత స్ధాయి చర్చలు జరిగాయి.

3. ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన పర్యటనలో భాగంగా కతర్ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి గౌరవనీయులు శ్రీ షేఖ్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థాని తో కూడా భేటీ అయ్యారు.

4. రెండు దేశాల ప్రజల మధ్య తర తరాలుగా నెలకొన్న పరస్పర ప్రయోజనకరం, సంప్రదాయబద్ధంగా సన్నిహితమైన సంబంధాలు చరిత్రాత్మకమైనవని ఇరు పక్షాలు అధికార సమావేశాలలో గుర్తు చేసుకొన్నాయి.

5. ఉభయ దేశాల మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి పర్యటనల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతుండడం పట్ల ఇరు పక్షాల నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కతర్ పర్యటన సందర్భంగా వివిధ ఒప్పందాలు, అవగాహనాపూర్వక ఒప్పంద పత్రాలు కొలిక్కి రావడాన్ని వారు స్వాగతించారు. ఈ ఒప్పందాలతో పాటు ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు భారతదేశం, కతర్ ల మధ్య స్నేహ బంధాన్ని మరింత పటిష్టపరుస్తాయంటూ వారు హర్షం వ్యక్తం చేశారు.

6. వాణిజ్యం, పెట్టుబడులు, విద్యుత్తు, రక్షణ, మానవ శక్తి మొదలైన రంగాలలో ద్వైపాక్షికంగా సంస్థాగతమైన యంత్రాంగం పనిచేస్తున్న తీరును ఇద్దరు నాయకులు ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పటిష్టపరిచేందుకు సంయుక్త కార్యాచరణ బృందాలను తరచుగా సమావేశమవ్వాల్సిన ఆవశ్యకత ఉందని వారు స్పష్టంచేశారు. పరస్పర ప్రయోజనం ఉన్న ద్వైపాక్షికఅంశాలతో పాటు , ప్రాంతీయ, ప్రపంచ అంశాలను క్రమం తప్పక సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సంయుక్త సంఘాన్ని వేయాలని ఉభయ పక్షాలు అంగీకరించాయి.

7. ప్రస్తుతం నెలకొనివున్న సౌహార్దాన్ని గుర్తిస్తూ పరస్పర ప్రయోజనాలతో ఉన్న విభిన్న రంగాలలో ద్వైపాక్షిక కార్యకలాపాలను మరింత విస్తృతపరచాలని, పటిష్టపరచాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఉన్నత స్థాయి రాజకీయ మార్పిడులు, రక్షణ, భద్రతా సహకారం, వాణిజ్యం, ఆర్ధిక సంబంధాలు ప్రజలకూ, ప్రజలకూ మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి వారు అంగీకరించారు. ఈ ప్రాంతంలోనూ, ప్రపంచంలోనూ శాంతి, సుస్థిరత, భద్రతలను పెంపొందించాలన్న తమ బాధ్యతను దృష్టి లో ఉంచుకుని రెండు దేశాల మధ్య 21వ శతాబ్దంలో పటిష్టమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవలసి ఉందని వారు స్పష్టీకరించారు.

8. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను పటిష్టపరిచేందుకు 2008 నవంబరులో రక్షణ సహకారంపై కుదిరిన ఒప్పందం అవసరమైన పని విధానాన్ని ఏర్పాటు చేసిందని అంగీకరిస్తూ, కోస్తాతీరం రక్షణ సహా పదాతి దళం, నావికాదళం, వైమానికదళాలకు మెరుగైన శిక్షణ, సంయుక్త విన్యాసాలు మొదలైన వాటి ద్వారా ఈ సంబంధాలకు మరింత ప్రేరణను కలిగించడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. “మేక్-ఇన్-ఇండియా” కింద అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆసక్తి తో భారతదేశంలో రక్షణ సామగ్రి సంయుక్త ఉత్పత్తి కి కతర్ ముందుకు వచ్చింది.

9. భారతదేశంలో 2016 ఫిబ్రవరి లో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ – అలాగే 2016 మార్చి లో జరిగిన DEFEXPO లో కతర్ పాల్గొనడం పట్ల భారత్ సంతోషం వ్యక్తం చేసింది. అదే విధంగా భారతీయ నావికాదళం, తీరప్రాంత గస్తీదళం లను కతర్ ప్రతినిధి బృందం తరచుగా సందర్శిస్తూ ఉండడం పట్ల కూడా భారత్ హర్షం వెలిబుచ్చింది. 2016 మార్చి DIMDEX లో భారత నావికాదళం కోసం భారతదేశం దేశీయంగా గైడెడ్ మిసైల్ ఫ్రిగిట్ ను రూపొందించడమే కాక భారతదేశం ఉన్నత స్థాయిలోపాల్గొన్నందుకు కతర్ కృతజ్ఞతలు తెలిపింది. అంతే కాకుండా భారతీయ నావికాదళం, కోస్తా తీర రక్షకదళం నౌకలు తరచుగా జరుపుతున్న సౌహార్ద పర్యటనల పట్ల కూడా కతర్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కతర్ సాయుధ దళాలు, తీర ప్రాంత రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి కతర్ లోనూ, ఇండియా లోనూ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి అంగీకరించినందుకు కతర్ అభినందనలు తెలిపింది.

10. ఉభయ దేశాల అభివృద్ధి లక్ష్యంగా గల్ఫ్ లో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సంబంధి భద్రతను పటిష్ట పరచుకోవడం లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకారం తెలిపారు.

11. ప్రపంచంలో అన్ని దేశాలనూ, సమాజాలనూ బెదిరిస్తున్న అంతర్జాతీయ తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ మహమ్మారిని సమూలంగా రూపుమాపడానికి కలసికట్టుగా సహకరించాలని ఇరువురు నాయకులు గట్టిగా తీర్మానించుకొన్నారు. ప్రపంచ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో తీవ్రవాద సంస్థల వ్యాప్తి ప్రాబల్య ప్రభావం అంతర్జాతీయ శాంతి, భద్రతల ప్రాముఖ్యాన్ని క్షీణింపచేస్తున్నాయని, సుస్థిరమైన వృద్ధి, అభివృద్ధి సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలకు అపాయాలను సృష్టిస్తున్నాయని వారు గుర్తించారు.

12. హింసను, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పురికొల్పే అన్ని రకాల చర్యలనూ ఇద్దరు నాయకులు ఖండించారు. దాని ఆశయం ఎటువంటిదైనా ఎట్టి పరిస్థితులలోను ఇటువంటి చర్యలు సమర్ధనీయం కాదన్నారు. తీవ్రవాదానికి ఏ మతం తోనూ, ఏ నాగరికత తోనూ, ఏ జాతి తోనూ సంబంధం ఉండకూడదని వారు పునరుద్ఘాటించారు.

13. తీవ్రవాదానికి సహాయం చేసే వారిని, దానికి మద్దతునిచ్చే వారిని దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదానికి మద్దతు పలికే, ఉగ్రవాదాన్ని ఒక విధానపరమైన సాధనంగా ఉపయోగించే ఎన్ టిటీలన్నింటికీ వ్యతిరేకంగా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

14. ఒక సమగ్ర ప్రణాళిక ద్వారా ఈ అంతర్జాతీయ తీవ్రవాద మహమ్మారిని నిర్మూలించాలని ఇరు పక్షాలూ గుర్తించాయి. హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, తీవ్రవాద ఉద్యమాలను అరికట్టడం, తీవ్రవాదానికి ఆర్ధిక సహాయం అందకుండా అడ్డుకోవడం, విదేశీ తీవ్రవాదుల చొరబాటును నిలువరించడం, తీవ్రవాద నిర్మాణాలను తొలగించడం, ఇంటర్ నెట్ ద్వారా తీవ్రవాద ప్రచారాన్ని నిలిపివేయడం మొదలైన అనేక చర్యలను ఈ ప్రణాళికలో చేర్చాలని ఇరు పక్షాలు పేర్కొన్నాయి.

15. సైబర్ సెక్యూరిటీలో సహకారాన్ని మరింతగా పెంచి పోషించుకొనేందుకు అనుసరించవలసిన విధి విధానాలపైన, ఉగ్రవాద లక్ష్యాల సాధనకు సైబర్ స్పేస్ ను వినియోగించుకోవడాన్ని నిరోధించడం పైన ఇరు వర్గాలు చర్చించాయి. అన్ని మతాలలోను స్వతస్సిద్ధంగా ఉన్న శాంతి, సోదరత్వం, శ్రేయం వంటి విలువల ప్రోత్సహించేందుకు ఇరు దేశాలకు చెందిన మత పండితులు, మేధావుల రాకపోకలు, సంప్రదింపులను కొనసాగుతూ ఉండడాన్ని వారు స్వాగతించారు.

16. తీవ్రవాదాన్ని అరికట్టే చర్యలు, రహస్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం. మంచి చర్యలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం, సామర్ధ్య నిర్మాణం, చట్టం అమలుతో సహకారాన్ని పటిష్టపరచుకోవడం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మొదలైన దేశాల మధ్య సంభవించే ఇతర నేరాలపై చర్య తీసుకోవడానికి కూడా రెండు పక్షాలూ అంగీకరించాయి.

17. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి వీలుగా అంతర్జాతీయ సమాజం ఒక పటిష్టమైన చర్యను అమలుచేయవలసిన అవసరం ఉందని ఇద్దరు నాయకులు నొక్కి చెప్పారు.

18. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒక ధృడమైన బంధమని ఇరు పక్షాలూ అభివర్ణించాయి. ఒకదానితో ఒకటి అత్యుత్తమమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్న రెండు దేశాలు వాణిజ్య లావాదేవీల్లో మంచి వ్యాపారం కొనసాగిస్తున్నాయని గుర్తించిన రెండు పక్షాలూ ఈ బంధాలను – ముఖ్యంగా – వాణిజ్య వస్తువులను విస్తరించడం ద్వారా – మరింత పటిష్టపరచుకోవాల్సి ఉందని అంగీకరించారు. వ్యాపారాభివృద్ధి చర్యలను సులభతరం చేసుకునేందుకు వీలుగా ఒకరి వాణిజ్య సంతలు, ప్రదర్శనల్లో మరొకరు పాల్గొనే విధంగా ప్రోత్సహించుకునేందుకు వారు అంగీకరించారు. భారతదేశం, కతర్ ల కంపెనీలు ఒకరి వ్యాపార పరిధిలో మరొకరు పాల్గొని, వర్ధిల్లుతున్నందుకు రెండు వర్గాలు సంతృప్తిని వెలిబుచ్చాయి. ఇటువంటి పరస్పర ప్రయోజనకర చర్యలను మరింత ప్రోత్సహించుకోవడానికి అంగీకరించాయి. వ్యాపారం నుంచి వ్యాపారం, పర్యాటక అనుసంధానం పెంపొందించేందుకు వీలుగా రెండు దేశాలకు చెందిన వ్యాపారస్తులకు, పర్యాటకులకు త్వరితంగా వీసాలను మంజూరు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని కూడా వారు అంగీకరించారు.

19. ఎఫ్ ఐ ఎఫ్ ఎ 2022 ప్రపంచ కప్ పోటీలకు సన్నాహకంగా కతర్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులలో భారతీయ కంపెనీలు పాల్గొనడాన్ని కతర్ స్వాగతించింది.

20. ప్రస్తుతం ఉన్న నియమాలను సరళీకరించి, వ్యవస్థీకృతం చేయడం, ఇతర అంశాలకు తోడు, రైల్వేలు, రక్షణ, బీమా వంటి కీలకమైన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆంక్షలను సడలించడం ద్వారా సులువుగా వ్యాపారం చేయడానికి భారతదేశ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రోత్సాహకాలను ప్రధాన మంత్రి శ్రీ మోదీ వివరించారు. 100 స్మార్ట్ నగరాలు, 50 నగరాలలో మెట్రో ప్రాజెక్టులు, 500 నగరాల్లో అధునాతన వ్యర్ధ పదార్ధాల యాజమాన్య విధానం, ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఆరోగ్య పరిరక్షణ, 2019 కల్లా అందరికీ అందుబాటు లో పారిశుద్ధ్య వాతావరణం, 2022 కల్లా అందరికీ నివాసం మొదలైన కార్యక్రమాలతో భారతదేశంలో ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పించాలనే ప్రణాళికలను గురించి వెల్లడిస్తూ, భారత వృద్ధి గాధలో ఒక భాగస్వామి కావలసిందిగా కతర్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

21. భారత దేశ వృద్దిని, అభివృద్ది ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలన్న ప్రధాన మంత్రి శ్రీ మోదీ ముందు చూపును గౌరవనీయులు కతర్ అమీర్ అభినందిస్తూ భారతదేశం తప్పక అభివృద్ది చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పటిష్టమైన ఆర్ధికాభివృద్ధి కి భారత ఆర్ధిక వ్యవస్థ గట్టి పునాది వంటిదని గౌరవనీయులు కతర్ అమీర్ పేర్కొంటూ “స్టార్టప్ ఇండియా” , ” మేక్-ఇన్-ఇండియా “, “స్మార్ట్ సిటీ”, “క్లీన్ ఇండియా” లతో సహా ప్రధాన మంత్రి శ్రీ మోదీ చేపట్టిన కొత్త పథకాలను ప్రశంసించారు.

22. ప్రస్తుతం ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థ సామర్ధ్యాన్ని, అధిక వృద్ధి రేటును, భారత వృద్ధి లో భాగస్వామ్య ప్రాధాన్యతను – కతర్ పెట్టుబడి సామర్ధ్యాన్ని గుర్తిస్తూ ఇరు పక్షాలు భారత్ లో కతర్ పెట్టుబడులకు ముఖ్యంగా వివిధ తరగతుల ఆస్తులు, వివిధ మౌలిక సదుపాయాల రంగాలు అలాగే భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలకు అవసరమైన వివిధ మార్గాలు, అవకాశాలపై చర్చించాయి.

23. రెండు దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో తమ వంతు భాగస్వామ్య స్థాయిని పెంపొందించుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. కతర్ పెట్టుబడుల సాధికార సంస్థ భారతదేశ ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ మౌలిక సదుపాయాలు, పెట్టుబడి నిధి మధ్య సహకారం ఆవశ్యకతపై కూడా వారు చర్చలు జరిపారు. జాతీయ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల నిధిలో కతర్ సంస్థాగత పెట్టుబడిదారుల భాగస్వామ్యం కోసం కుదిరిన ఫ్రేంవర్క్ ఒప్పందాన్ని ఇరు నాయకులూ స్వాగతించారు.

24. అందుబాటులో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. కతర్ పెట్టుబడుల సాధికార సంస్థ సంబంధిత భారతీయ అధికారులు, ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థల మధ్య తరచు సమావేశాలు ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని కూడా ఇరు పక్షాలూ గుర్తించాయి.

25. భారతదేశానికి ఎల్ ఎన్ జి, ఎల్ పి జి లను ఎగుమతి చేయడంలో అతి పెద్ద సరఫరాదారైన కతర్ తో ఇంధన రంగంలో పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం పట్ల ఇరు పక్షాలూ సంతృప్తిని వ్యక్తం చేశాయి. భారతదేశ ఇంధన భద్రతకు కతర్ అందిస్తున్న సహకారాన్ని భారతదేశం ప్రశంసించింది.

26. శిక్షణ, మానవవనరుల అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి లో సహకారం, పెట్రో రసాయనాల సంస్థల్లో సంయుక్త సంస్థల అభివృద్ధి , భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ సంయుక్తంగా చమురు అన్వేషణకు సహకారం మొదలైన అంశాల్లో సహకారం పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని ఇరు పక్షాలూ అంగీకరించాయి.

27. కతర్ కు చెందిన ముడిచమురు, సహజ వాయువు వనరులను వినియోగించుకోవడానికి ఇప్పటికే కనుగొన్న చమురు, గ్యాస్ నిక్షేపాలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త క్షేత్రాలను సంయుక్తంగా అన్వేషించడానికి వీలుగా కతర్ పెట్రోలియం కంపెనీలు, ఇతర కంపెనీలతో కతర్ లో పరస్పర అవకాశాలను ఎంచుకొనేందుకు తన ఇంధన కంపెనీలకు ఆసక్తి ఉందని భారతదేశం ప్రముఖంగా ప్రస్తావించింది.

28. కొత్త ”హైడ్రోకార్బన్ అన్వేషణ, లైసెన్సింగ్” విధానం, చిన్న క్షేత్రాల అన్వేషణ విధానం కింద వేలం ద్వారా భారతదేశం లో బ్లాకుల అన్వేషణ కోసం భారతదేశం లోని అన్వేషణ, ఉత్పత్తి రంగంలో పెట్టుబడుల కోసం భారతదేశం కతర్ ను ఆహ్వానించింది.

29. భారతదేశం లో ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక నిల్వల సౌకర్యాల రెండో దశలో పెట్టుబడి పెట్టవలసిందిగా కతర్ ను భారతదేశం ఆహ్వానించింది.

30. బ్యాంకింగ్, బీమా, కేపిటల్ మార్కెట్ సహా ఆర్ధిక సేవల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టపరచుకోవలసిన ఆవశ్యకతపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. రెండు దేశాలకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సంబంధిత సెంట్రల్ బ్యాంకు ల వంటి ఆర్ధిక సంస్థల మధ్య సహకార పరిధిని విస్తరించాలని వారు నిర్ణయించారు.

31. భారతదేశం తక్కువ ధరతో వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలు అందిస్తోందన్న సంగతిని గుర్తిస్తూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందింపచేసుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇందులో ఆరోగ్య సేవలను, ఆరోగ్య సంరక్షక సిబ్బందిని, ఆరోగ్య విద్యను, ఫార్మాస్యూటికల్స్ ను ఒక దేశం నుండి మరొక దేశానికి మార్పిడి చేసుకోవడం వంటివి భాగంగా ఉంటాయి. ఆరోగ్యరంగం లో ద్వైపాక్షిక సహకారంపై కతర్ ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రంపై సంతకాలు జరగడం పట్ల ఇద్దరు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

32. అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్) ఏర్పాటుకు దారితీసిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ చొరవను కతర్ అభినందించింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త సౌర సాంకేతిక పరిజ్ఞానం ముందడుగు వేయడానికి ఈ కూటమి ఎంతో ఉపయోగపడగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

33. ప్రపంచం లో సమతుల్యమైన, ఆరోగ్యవంతమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం కలసి ముందుకు సాగాలన్న అంతర్జాతీయ సమాజం ఆకాంక్ష ను అంతర్జాతీయ యోగా దినం పట్ల వ్యక్తమైన అధిక స్పందన ప్రతిబింబించిందని ఇద్దరు నాయకులూ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకుని కతర్ తపాలా శాఖ స్మారక తపాలా బిళ్ల ను విడుదల చేయడంతో సహా 2015 జూన్ 21న ప్రప్రథమ అంతర్జాతీయ యోగా దినానికి మద్దతు ఇచ్చినందుకు కతర్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

34. భారతదేశం, కతర్ ప్రజలను సన్నిహితం చేయడంలో సాంస్కృతిక మార్పిడి నిర్వహించిన పాత్రను ఇద్దరు నాయకులు కొనియాడారు. ఒక దేశపు సాంస్కృతిక బృందాలు, క్రీడా బృందాలు మరొక దేశం లో తరచుగా పర్యటించడం, చలనచిత్ర రంగంలో కూడా కలసి పనిచేయడం తో పాటు ద్వైపాక్షిక సాంస్కృతిక, క్రీడా సహకారాన్ని విస్తరించుకోడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ‘కతర్- భారత్ సాంస్కృతిక సంవత్సరం-2019’ ని జరుపుకోవాలని నిర్ణయించాయి. కతర్ ప్రదర్శనశాలలను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. కస్టమ్స్ విషయాలలో పరస్పర సహాయం/ సహకారం కోసం ఒప్పందం, పర్యాటక సహకారం పై అవగాహనా పత్రం, యువజన, క్రీడా రంగాలలో అవగాహనా పత్రం కోసం మొట్టమొదటి కార్యాచరణ కార్యక్రమంగా కతర్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.

35. భారతదేశం, కతర్ సంబంధాలకు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలు కేంద్ర బిందువుగా ఉన్నాయని ఇద్దరు నాయకులు గుర్తించారు. ఈ సంబంధాలను మరింతగా పెంచి పోషించుకొనే కృషిని కొన‌సాగించాల‌ని వారు ఆకాంక్షించారు. కతర్ అభివృద్దికి, ప్రగతికి భారతీయ సమాజం చేస్తున్న కృషి ని, పోషిస్తున్న పాత్రను గౌరవనీయులు కతర్ అమీర్ ప్రశంసించారు. కార్మిక చట్టాలలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు, ఇవి కతర్ లో నైపుణ్యం గల కార్మికులతో పాటు నైపుణ్యం లేని కార్మికుల ప్రయోజనాలను కూడా పరిరక్షించడానికి తోడ్పడనున్నట్లు కతర్ అధికారుల బృందం ఈ సందర్భంగా వివరించింది. భారతీయ సమాజానికి ఆతిధ్యమిస్తూ వారి సంక్షేమానికి, భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న కతర్ నాయకత్వానికి ప్రధాన మంత్రి శ్రీ మోదీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి, అర్హతల గుర్తింపు ప్రక్రియలో సహకారం కోసం ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రంపై సంతకాలు జరగడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.

36. పశ్చిమ ఆసియాలో, మధ్య ప్రాచ్యంలో, దక్షిణ ఆసియా లో భద్రత సహా పలు పరస్పర ప్రయోజనాలు ముడి పడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన ఇద్దరు నాయకులు వారి వారి అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొన్నారు. సిరియా, ఇరాక్, లిబియా, యెమెన్ లలో భద్రతా పరిస్థితిపై తీవ్ర ఆందోళన ను వెలిబుచ్చారు. ఈ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని వారు పునరుద్ఘాటించారు.

37. ఐక్య రాజ్య సమితి సంస్కరణల సందర్బంలో ఇద్దరు నేతలు ఒక ప్రభావ వంతమైన బహుపార్శ్వ వ్యవస్థ కు ఎంతైనా ప్రాధాన్యం ఉందని స్పష్టంచేశారు. ఇది ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో ఒక కీలకమైన కారకంగా, సమకాలీన వాస్తవాలపై ఐక్య రాజ్య సమితిని ప్రతిబింబించేదిగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఐక్య రాజ్య సమితిలో సంస్కరణలను చేపట్టవలసిన తక్షణావసరం ఉందని, అలాగే ఐ.రా.స. భద్రత మండలిలో మరిన్ని ఎక్కువ దేశాలకు సభ్యత్వం కల్పించడంతో పాటు దానిని మరింత అధిక విశ్వసనీయత, సామర్థ్యం కలిగినదిగా తీర్చిదిద్ద వలసి ఉన్నదని వారు నొక్కి చెప్పారు.

38. గౌరవనీయులైన కతర్ అమీర్ ఆత్మీయంగా తనకు స్వాగతం పలికినందుకు, అనుగ్రహపూర్ణ ఆతిథ్యాన్ని తనకు అందించినందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశంలో అధికార పర్యటనకు ఇరు వర్గాలకు అనువైన సమయంలో తరలిరావలసిందని గౌరవనీయ కతర్ అమీర్ ను ఆయన ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి గౌరవనీయ కతర్ అమీర్ సహర్షంగా సమ్మతి తెలిపారు.