Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా భారతదేశం- అమెరికా సంయుక్త ప్రకటన

ప్రధాన మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా భారతదేశం- అమెరికా సంయుక్త ప్రకటన

ప్రధాన మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా భారతదేశం- అమెరికా సంయుక్త ప్రకటన


#అమెరికాఅమెరికా, భారత్ : 21వ శతాబ్దపు సహనశీల ప్రపంచ భాగస్వాములు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా శ్రీ మోదీ తో ఈ రోజు వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. మూడో ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు స్వాతంత్ర్య విలువలు, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ మానవ హక్కులు, సహనం, బహుళత్వ వాదం, ప్రజలందరికీ సమాన అవకాశాలు, చట్టం పనితీరు ల వంటి అంశాలపైన వారు చర్చించారు. సమగ్రమైన అభివృద్ధి, ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు కొత్త అవకాశాలు, ఇరు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిభద్రతల విస్తృతి, ప్రజాస్వామ్య పాలన, అంతర్జాతీయ మానవ హక్కులను గౌరవించడం, అందరికీ సంబంధించిన విషయాలపైన ప్రపంచ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపైన పరస్పరం సహకరించుకోవాలని వారు ప్రతిన బూనారు.

వారి పదవీకాలంలో సెప్టెంబర్ 2014లో భారతదేశ ప్రధాన మంత్రి అమెరికా పర్యటన సందర్భంగాను, 2015 జనవరిలో అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపిన ద్వైపాక్షిక సంబంధాలపై కనబడుతున్న స్పష్టమైన పురోగతిని శ్రీ మోదీ, శ్రీ ఒబామా లు ఇరువురూ స్వాగతించారు. ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మక దృష్టికోణం, ఇరు దేశాల భద్రతను, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరింత సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని రూఢిపరచారు.

వాతావరణం, స్వచ్ఛ శక్తి లపై భారత-అమెరికా ప్రపంచ నాయకత్వంలో ముందడుగు

ఈ రెండు దేశాల ప్రభుత్వాలు గత రెండేళ్లలో ఇతర అంశాలతో పాటు పరమాణు బాధ్యత అంశాన్ని పరిష్కరించడం సహా పలు కీలక నిర్ణయాలను భారత- అమెరికా సంప్రదింపుల వర్గం సాయంతో తీసుకొన్నాయి. కన్ వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపన్ సేషన్ ఫర్ న్యూక్లియర్ డేమేజ్ కు భారతదేశం ఆమోదం తెలిపింది. ఇవి భారతదేశంలో పరమాణు విద్యుత్తు ప్లాంటులను నిర్మించడం కోసం అమెరికా మరియు భారతదేశ కంపెనీల మధ్య దీర్ఘ కాలిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేశాయి. దశాబ్ద కాలంగా పౌర అణు ఒప్పందం విషయంలో నెలకొన్న భాగస్వామ్యాన్ని ఒక కొలిక్కి తెస్తూ.. భారతదేశంలోని ఆరు ప్రాంతాల్లో ఎ పి 1000 రియాక్టర్లను వెస్టింగ్‌హౌస్ కంపెనీ ద్వారా నిర్మించేందుకు సన్నాహక పనులను ప్రారంభించడాన్ని వీరిరువురూ స్వాగతించారు. దీంతో పాటు ఈ ప్రాజెక్టుకు ఆకర్షణీయమైన ఆర్థిక సహాయ ప్యాకేజిని అందజేసే విషయంలో యు ఎస్ ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంకు, భారతదేశం చొరవ తీసుకోవడానికి సంసిద్ధం కావడాన్ని నేతలు ఇరువురు పరిశీలనలోకి తీసుకొన్నారు. నిర్మాణం ముగిసిందంటే గనక, ఈ ప్రాజెక్టు ఈ తరహా అతి పెద్ద అణు విద్యుత్ శక్తి కేంద్రాలలో ఒకటి కాగలదు. అప్పుడు భారత, అమెరికా అణు పౌర అణు ఒప్పందానికి న్యాయం జరగడంతో పాటు.. భారత విద్యుత్ అవసరాలను (శిలాజ ఇంధన వినియోగం తగ్గిస్తూ) ఇవి తీర్చనున్నాయి. ఈ అణువిద్యుత్ శక్తి కేంద్రాల ఇంజినీరింగ్, ఇంకా డిజైన్ పని తక్షణం ప్రారంభం అవుతుందని.. 2017 జూన్ కల్లా కంట్రాక్చువల్ అగ్రిమెంట్ ను ఖరారు చేసే దిశగా కసరత్తు చేస్తామంటూ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మరియు వెస్టింగహౌస్ చేసిన ప్రకటను ఇరు వర్గాలు స్వాగతించాయి.

వాతావారణ మార్పులపై పోరాటం, స్వచ్ఛ శక్తి విషయంలో ఒకే అభిప్రాయంతో ఉన్న భారత్-అమెరికా ఈ విషయంలో ఒకదానితో మరొకటి కలసి పనిచేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ లో ప్యారిస్‌లో ప్యారిస్ చారిత్రక ఒడంబడికను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై పోరాటం చేయడంపై భారత్-అమెరికా కలసి మిగిలిన దేశాలను ఒప్పించాయి. వాతావరణ మార్పులపై ప్యారిస్ ఒడంబడికలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కలసి పనిచేయడంలో ఈ రెండు దేశాలు చిత్తశుద్ధితో ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను వీలైనంత త్వరగా అరికట్టాల్సిన విషయాన్ని గుర్తించిన అమెరికా-భారత్ ఒప్పందంలో కీలక విషయాలను చేర్చడంపై పట్టు పట్టాయి. ఈ ఒప్పందంలో వీలైనంత తర్వగా భాగస్వామి కానున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే భారతదేశం ఈ ఒప్పందంలోని అంశాల అమలును ప్రారంభించింది. సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలు కూడా 2020కి ముందే హరిత వాయువుల ఉద్గారాన్ని వీలైనంత తగ్గించుకోవడంతో పాటు.. ఈ దిశగా దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో పాటుగా.. ఇరు దేశాలు దుబాయ్‌లో 2016లో జరిగిన హెచ్ఎఫ్‌సీ (హైడ్రో ఫ్లోరోకార్బన్‌) సవరణను అంగీకరించి.. కలసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా ఓజోన్ పొర మందం తగ్గేందుకు కారణమవుతున్న ఉద్గారాలను దశలవారీగా తగ్గించుకునేందుకు వీలుంటుంది. అంతర్జాతీయ విమానయానం ద్వారా వెలువడుతున్న హరిత వాయువుల ఉద్గారంపై ఓ పరిష్కారం కోసం త్వరలో జరగనున్న అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ సమావేశంలో కలసి పనిచేయాలని ఇరు దేశాల నేతలు నిశ్చయించారు. ఆ తర్వాత జి-20 సమావేశంలో ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా భారీ వాహనాల ప్రమాణాలు, ఇంధన సామర్థ్యంపై తీసుకునే నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారు.

ఇంధన భద్రత, స్వచ్ఛ శక్తి, వాతావరణ మార్పుతో పాటు గ్యాస్ హైడ్రేట్లపై సహకారం పెంపు విషయంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను కూడా ఇరువురు నేతలూ స్వాగతించారు. వన్యప్రాణి సంరక్షణనూ ముఖ్యమైన అభివృద్ధిగా పరిగణించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆలోచనను ప్రతిబింబిస్తూ.. వన్యప్రాణి సంరక్షణ, వన్యప్రాణుల అక్రమ తరలింపుపై పోరాటంలో సహకారానికి ఒప్పందం చేసుకోవటాన్నీ స్వాగతించారు.

స్వచ్ఛ ఇంధనానికి ఆర్థిక సాయం

175 గిగావాట్ల పునరుత్పాదక శక్తి (100 గిగావాట్ల సౌరశక్తిని కలుపుకుని) కేంద్రాలను నిర్మించాలన్న భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక లక్ష్యాని అమెరికా మద్దతు తెలిపింది.

అంతర్జాతీయ సౌర కూటమి (ఐ ఎస్ ఎ) ఏర్పాటును అమెరికా స్వాగతించింది. ఐ ఎస్ ఎ లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా సౌర శక్తిని అభివృద్ధి చేయడం, దీనికి కావాల్సిన మౌలిక వసతులను మోహరించడంలో తన పాత్ర ఎంత కీలకమో గ్రహించింది. ఐ ఎస్ ఎ ను కలసి బలోపేతం చేసేందుకు భారతదేశం, అమెరికా లు సంయుక్తంగా మూడవ ప్రయత్నాన్ని ప్రారంభించనున్నాయి. దీని ద్వారా 2016 సెప్టెంబర్‌లో భారతదేశంతో జరగనున్న ఐ ఎస్‌ ఎ నిర్మాణ సమావేశంలో ఆఫ్-గ్రిడ్ సౌర శక్తిపై దృష్టి సారించేందుకు వీలుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవటంతోపాటు వాతావరణ మార్పుపై కార్యాచరణను ప్రారంభించేందుకు.. అభివృద్ధి చెందిన దేశాలతో కలసి ఏడాదికి 100 బిలియన్ డాలర్లను అందించేందుకు అమెరికా అంగీకరించింది.

ఐ ఎస్ ఎ సభ్య దేశాలకు మార్గదర్శకంగా నిలిచేందుకు.. భారత పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు సాంకేతికంగా సహకరించేందుకు.. ప్రైవేటు రంగంతో కలసి ముందుకు రానున్నట్లు అమెరికా ప్రకటించింది. ముఖ్యంగా భారత్, అమెరికా లు కింది అంశాలను ప్రకటించాయి. ఇరుదేశాలు కలసి సంయుక్తంగా 20 మిలియన్ డాలర్లతో అమెరికా-భారత్ స్వచ్ఛ శక్తి నిధి (యూఎస్ఐసీఈఫ్) ఏర్పాటు. 2020 కల్లా లక్ష ఇళ్లకు స్వచ్ఛమైన పునరుత్పాదక శక్తి అందించే లక్ష్యంతో 400 మిలియన్ డాలర్లను (ఇరు దేశాలు సమానంగా) చేకూర్చటం. అమెరికా ప్రభుత్వ సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు భారత ప్రముఖ సంస్థల సాయంతో అమెరికా-భారత స్వచ్ఛ శక్తి హబ్ ఏర్పాటు. దీని ద్వారా భారత్‌లో స్వచ్ఛ శక్తి ఉత్పాదనకు పెట్టుబడులు పెరుగుతాయి. 40 మిలియన్ డాలర్లతో అమెరికా-భారత్ ఉత్ప్రేరక సౌర ఆర్థిక కార్యక్రమం ద్వారా (ఇరుదేశాల సమాన భాగస్వామ్యం) గ్రిడ్‌కు అనుసంధానం కాని పేద, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నతరహా పునరుత్పాదక శక్తి పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీని ద్వారా ఒక బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను సమీకరించవచ్చు. ఇప్పటికే ఇంటి పైకప్పులపై సౌరపలకల ఏర్పాటు ద్వారా సౌరవిద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్న భారత కంపెనీలకు యు ఎస్ ఎ ఐ డి ‘గ్రీనింగ్ ద గ్రిడ్’ ద్వారా మరింత మద్దతు అందించడం.

ప్యారిస్ సదస్సు సందర్భంగా.. వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛమైన శక్తిపై ప్రయోగానికి పెట్టుబడులను రెట్టింపు చేసుకునేందుకు.. భారత్, అమెరికాలు సంయుక్తంగా ఆవిష్కరించిన మిషన్ ఇన్నొవేషన్ లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. పరిశోధన, అభివృద్ధి విషయంలో సహకారంతో ముందుకెళ్లటంతోపాటు.. స్మార్ట్ గ్రిడ్, గ్రిడ్ నిల్వ విషయంలో 30 మిలియన్ డాలర్లతో ప్రభుత్వ-ప్రైవేటు సంస్థలతో పరిశోధనల విషయంలో సహకరించుకోనున్నట్లు ప్రకటించారు.

ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని బలోపేతం చేయడం

ఇటీవల వాషింగ్ టన్‌ డి సి లో జరిగిన అణు భధ్రత సదస్సు-2016లో క్రియాశీలంగా పాల్గొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి శ్రీ ఒబామా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 2018లో నిర్వహించనున్న భారీ విధ్వంసక ఉగ్రవాదాన్ని అడ్డుకునే ఆయుధాల సదస్సును నిర్వహించేదుకు శ్రీ మోదీ ముందుకు రావడాన్ని శ్రీ ఒబామా స్వాగతించారు. జీవ రసాయనిక, అణు, రేడియో ధార్మిక పధార్థాల ద్వారా దాడులకు పాల్పడతామన్న ఉగ్రవాదుల హెచ్చరికలపై కూడా భారత్-అమెరికా కలిసి పోరాడనున్నాయి.

భారీ విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు, వాటి వినియోగాన్ని నిరోధించేందుకు అణ్వస్త్రవ్యాప్తి నిరోధకతపై తమ చిత్తశుద్ధిని గుర్తుచేసుకుంటూ.. క్షిపణి ప‌రిజ్ఞాన‌ నియంత్రణ వ్యవస్థ (ఎమ్ టి సి ఆర్), పరమాణు సరఫరాదారుల వర్గం (ఎన్‌ ఎస్‌ జి)లో భారత సభ్యత్వానికి ఒబామా మద్దతు ప్రకటించారు. ఎన్‌ ఎస్‌ జి లో భారత్‌కు సభ్యత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతోపాటు ఈ నెలాఖర్లో జరగనున్న ఎన్‌ ఎస్‌ జి సర్వ సభ్య సదస్సులో భారత సభ్యత్వానికి ఈ బృందంలోని సభ్య దేశాలన్నీ మద్దతివ్వాలని ఆయన కోరారు. దీంతోపాటు ఆస్ట్రేలియా బృందం, వాస్సెనార్ ఒడంబడికల్లోనూ భారత సభ్యత్వానికి తమ మద్దతు ఉంటుందన్నారు.

భూ, సముద్ర, వాయు, అంతరిక్ష, సైబర్ రంగాల్లో భద్రత

ఆసియా-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాల వ్యూహాత్మక దృష్టికోణంతో 2015లో రూపొందించిన సహకార ఒప్పందానికి మార్గ సూచీ సిద్ధం అవటంపైనా శ్రీ మోదీ, శ్రీ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇరుదేశాల తోడ్పాటుకు ఇది మార్గదర్శకత్వం చేస్తుంది. ఆసియా-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాలు ఒకదానిని మరొకటి వ్యూహాత్మక భాగస్వామిగా భావించాలని నిర్ణయించారు.

సముద్ర భద్రత చర్చ ప్రారంభోత్సవ సమావేశాన్నీ స్వాగతించారు. సముద్ర భద్రత, సముద్ర ప్రాంత చైతన్యం విషయంలో ఉమ్మడి ఆసక్తిని అనుగుణంగా సముద్ర ‘వైట్ షిప్పింగ్’ సమాచారాన్ని పంచుకునే సాంకేతిక ఏర్పాట్లనూ వీరు స్వాగతించారు.

సముద్ర భద్రతను ప్రోత్సహించడంలో భారత-అమెరికా మధ్య పరస్పర సహకారానికి పునరుద్ఘాటించారు. నావిగేషన్‌కు సంబంధించిన స్వేచ్ఛకు భరోసా కల్పించాల్సిన ప్రాముఖ్యతను గుర్తిస్తూనే విమాన ప్రయాణాలు,అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాలు ప్రకారం సముద్ర గర్భంలో వనరుల వినియోగానికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. దీంతోపాటు సరిహద్దు వివాదాలను శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

ఇరుదేశాల మిలటరీల మధ్య సహకారాన్నీ, మరీ ముఖ్యంగా సంయుక్త విన్యాసాలు, మానవతా సాయం, విపత్తు సహాయంపైనా జరుగుతున్న సహకారాన్నివీరు అభినందించారు. భవిష్యత్తులో రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ ప్రయత్నంలో వ్యూహరచన మార్పిడి ఒప్పం పత్రం (ఎల్ఈఎమ్ఓఏ) రూపకల్పన చివరిదశకు చేరుకోవటాన్ని స్వాగతించారు.

భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యం స్థిరత్వానికి మూలమని.. ఈ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అమెరికాకు భారత్ రక్షణ రంగంలో ప్రధాన భాగస్వామని తెలిపింది.

ఈ ఒప్పందాలు కింది విధంగా ఉన్నాయి..:

అమెరికాకున్న ఇతర సన్నిహితులు, భాగస్వాముల లాగానే.. ఒకే రకమైన లక్షణాలున్న భారత్‌కూ అమెరికానుంచి సాంకేతిక సహకారం కొనసాగుతుంది. ద్వంద్వ వినియోగ సాంకేతికతను అమెరికాతో కలిసి విస్తృతంగా వినియోగించేందుకు భారత్‌కు లైసెన్స్ రహిత ప్రవేశం అందించేందుకు కూడా మోదీ, ఒబామా ఓ ఒప్పందానికి వచ్చారు. ఎగుమతి నియంత్రణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉండటం ఇందుకు కారణం.

భారత ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా.. రక్షణ రంగ పరిశ్రమలు, అంతర్జాతీయ సరఫరాకోసం కావాల్సిన అనుసంధానం, అభివృద్ధికి అమెరికా మద్దతు తెలిపింది. వస్తువులు, సాంకేతికతను ఎగుమతి చేసేందుకు సహాయచేయనుంది. అమెరికా చట్టాలకు లోబడి అమెరికా-భారత రక్షణ రంగ సహకారానికి మద్దతుగా సంయుక్త వేదికల ఏర్పాటుకూ మద్దతు తెలుపుతుంది.

‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా రక్షణ సాంకేతికత, వ్యాపార ప్రోత్సాహం (డి టి టి ఐ)లో భాగంగా సాంకేతికత ఉత్పత్తి, అభివృద్ధిని విస్తరించాలని కూడా శ్రీ మోదీ, శ్రీ ఒబామా నిర్ణయించారు. కొత్త డి టి టి ఐ పని బృందాల ఏర్పాటులో నౌకా, వైమానిక వ్యవస్థలతోపాటు ఇత ఆయుధ వ్యవస్థనూ చేర్చాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. విమాన వాహకనౌక సాంకేతిక సహకారం కోసం ఏర్పాటైన సంయుక్త పని బృందం సమాచార మార్పిడికి సంబంధించిన ఒప్పందం తుదిదశకు చేరుకుందని వీరిద్దరు ప్రకటించారు.

భారత్‌లో రక్షణ పీవోడబ్ల్యూ/ఎమ్ఐఏ అకౌంటింగ్ ఏజెన్సీ (డి పి ఎ ఎ) మిషన్స్‌కు భారత ప్రభుత్వం మద్దతు తెలిపినందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రెండో ప్రపంచయుద్ధంలో అదృశ్య‌మైన‌ అమెరికా సేవా సభ్యుల అవశేషాలను స్వదేశానికి తీసుకెళ్లటం కూడా ఈ మిషన్స్‌లో ఉంది. భవిష్యత్తులో చేపట్టే డీపీఏఏ మిషన్స్‌కు కూడా సహకారం అందించుకోవాలని ప్రకటించారు.

అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశాలుగా.. భారత్-అమెరికాలు అంతరిక్ష ప్రయోగాలను మరింత విస్తృత పరచడంలో మానవ ప్రయత్న సరిహద్దులను చెరిపేసి భూ పరిశీలన, అంగారక గ్రహంపై ప్రయోగాలు, అంతరిక్ష ప్రయోగాలతోపాటు మానవ సహిత అంతరిక్ష నౌక వంటి అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఐఎస్ ఆర్ ఓ (ఇస్రో)- ఎన్ ఎ ఎస్ ఎ (నాసా)ల హీలియో ఫిజిక్స్ పని బృందం ఏర్పాటును స్వాగతించారు. దీంతోపాటు భూపరిశీలన ఉపగ్రహ డాటాను మార్చుకునేందుకు అవగాహనా ఒప్పందం తుదిదశకు చేరడంపైనా హర్షం వ్యక్తం చేశారు.

సైబర్ స్పేస్ వల్ల ఆర్థిక పురోగతి, అభివృద్ధి సాధ్యమవుతుందని వీరు ఉద్ఘాటించారు. భద్రతమైన, నమ్మకమైన ఇంటర్ నెట్‌ను బహుళ వాటా దారుల విధానంలోని ఇంటర్ నెట్ పాలన ద్వారా పరస్పరంమార్చుకునేందుకు అంగీకారం తెలిపారు. సైబర్ భద్రత విషయంలో లోతైన సహకారానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వీరిద్దరు అమెరికా-భారత్ సైబర్ బంధం రూపకల్పన తుదిదశకు చేరుకోవడాన్ని స్వాగతించారు. కీలక మౌలిక వసతులపై సైబర్ భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ద్వారా సైబర్ నేరాలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర వర్గాల ద్వారా జరిగే దురుద్దేశ పూర్వక సైబర్ కార్యక్రమాలు, స్థాయి నిర్మాణం, సైబర్ భద్రతపై పరిశోధన- అభివృద్ధి, సాంకేతికత వ్యాపారం, మార్కెట్‌కు చేరేంతవరకుండే ప్రతి అంశంలోనూ పరస్పర సహకారానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఐ సి ఎ ఎన్ ఎన్, ఐ జి ఎఫ్‌ వంటి పలు ఇంటర్ నెట్ గవర్నెన్స్‌ వేదిక విషయంలోనూ చర్చలు కొనసాగాలని నిర్ణయించారు. ఇందులో ఇరు దేశాల వాటాదారులను కీలకంగా భాగస్వాములను చేయనున్నారు. ఐక్య రాజ్య సమితి ఒప్పందంతోపాటు అంతర్జాతీయ చట్టాలను అనుగుణంగా సైబర్‌ స్పేస్‌లో స్థిరత్వాన్ని ప్రోత్సహించేలా కలసి నడవాలని నిర్ణయించారు. బాధ్యతాయుతమైన రాజ్యంగా శాంతి వాతావరణంలోనూ స్వచ్ఛందంగా నిబంధలను పాటించడం, దేశాల మధ్య విశ్వాసం పెంపొందేలా సహకరించుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా, ఒక దేశం మరోదేశం కీలక మౌలిక వసతులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా నిర్వహించరాదని, ప్రజా సేవలను బలహీన పరిచే కార్యక్రమాలను పాల్పడరాదని నిర్ణయించారు. దీంతోపాటు సైబర్ ఘటనలు జరిగినపుడు ఏ దేశం మరో దేశం జాతీయ కంప్యూటర్ భద్రత సంఘటన ప్రతిస్పందన బృందాలను అడ్డుకోరాదని, అపకారం తలపెట్టేందుకు తన సొంత బృందాలను పంపటం చేయకూడదని కూడా నిర్ణయించారు. ఇందుకు జాతీయ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా సాయం చేయాలి. తన దేశ పరిధిలోనుంచి ఇతర దేశాల్లో విద్రోహపూరిత సైబర్ కార్యక్రమం జరిగినపుడు వాటి కోరిక మేరకు సాయం చేయాలి. ఏ దేశం కూడా పోటీ వాతావరణంలో తమ దేశ కంపెనీలకు లాభం చేసేందుకు.. ఐసీటీ సాయంతో వ్యాపార రహస్యాలు, ఇతర కీలక వ్యాపార సమాచారంతోపాటు మేధో సంపత్తి హక్కులను చోరీ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించరాదు.

ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదానికి వ్యతిరేకంగా కలసి నడవాలి

మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం, ఇటీవలి ప్యారిస్, పఠాన్‌కోట్, బ్రసెల్స్‌, కాబూల్‌ లలో జరిగిన ఉగ్ర ఘటనలు శ్రీ ఒబామా, శ్రీ మోదీ ఖండించారు. ద్వైపాక్షికంగా, ఇతర ఒకే ఆలోచన ఉన్న దేశాలతో కలసి ఉగ్రవాద సమస్య పరిష్కారానికి ప్రయత్నించటంతో పాటు.. ప్రపంచంలో ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న వారికి సరైన శిక్ష వేయాలని నిర్ణయించారు.

21వ శతాబ్దపు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని నిర్వచిస్తూ.. 2015 జనవరిలో భారత్ -అమెరికా సంయుక్త ప్రకటన ఆధారంగా, 2015 సెప్టెంబర్‌లో భారత్-అమెరికా సంయుక్త ఘోషణ ధారంగా భవిష్యత్తులో ఉగ్రవాద హెచ్చరికలను ఎదుర్కునేందుకు లోతైన భాగస్వామ్యానికి అంగీకరించారు.

అల్‌ఖైదా, దాయిష్/ ఐ ఎస్ ఐ ఎల్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, డి కంపెనీ, వీరి అనుచర సంఘాలైన ఉగ్రవాద హెచ్చరికలపై పోరాడేందుకు సహకారాన్ని బలోపేతం చేయాలని వీరు నిర్ణయించారు. ఐక్య రాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాద సంఘాలపై పోరాటంలోనూ కలసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. భారత్- అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సంయుక్త పని బృందం తదుపరి సమావేశంలో చర్చించాల్సిన కొత్త అంశాలను గుర్తించాలని తమ అధికారులను ఆదేశించారు.

భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక భాగస్వామ్యంలో కీలకమైన మైలురాయిని గుర్తు చేసుకుంటూ.. ఉగ్రవాదులను గుర్తించే సమాచారాన్ని మార్చుకునే ఒప్పందం తుదిదశకు చేరటంపై హర్షం వ్యక్తం చేశారు. 2008 ముంబయ్, 2016 పఠాన్‌కోట్ ఘటనలకు బాధ్యులైన ఉగ్రవాదులను అప్పగించాలని పాకిస్తాన్‌కు సూచించారు.

అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్య రాజ్య సమితి సమగ్ర సదస్సుకు పూర్తి సహకారం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దీని ద్వారా అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై దేశాలు పరస్పరం సహకరించుకోవడం, బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుంటుంది.

ఆర్థిక, వాణిజ్య బంధాలకు సాయం

ఇరు దేశాల స్థిరమైన, సమగ్రమైన, సంపూర్ణమైన ఆర్థికాభివృద్ధితో పాటు వినియోగదారుల డిమాండుకు అనుగుణంగా, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి వాటికోసం భారత్-అమెరికా మధ్య బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకోవటంతోపాటు ఆ సంబంధాలను మరింతగా విస్తరించుకోవాలని నిర్ణయించారు.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు వస్తువులు,సేవల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించి కొత్త అవకాశాలను పెంపొందించుకోవడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను చేరేందుకు సంపూర్ణ మద్దతు, ఉద్యోగాలు పెరిగి ఇరు దేశాల్లో ఆర్థిక శ్రేయస్సుకు బాటలు పడాలని నిర్ణయించారు. ఈ దిశగా మరిన్ని అడుగులు వేసేందుకు ఈ ఏడాది తర్వాత భారత్‌లో జరిగే రెండో వార్షిక వ్యూహాత్మక, వాణిజ్య చర్చలకోసం వేచి చూస్తున్నారు. వాణిజ్య విధానాల ఫోరం (టి పి ఎఫ్) కార్యక్రమాల్లో భాగంగా.. వాణిజ్య, పెట్టుబడుల విషయంలో జరుగుతున్న మార్పులపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే టి పి ఎఫ్ వరకు ఇందులో గణనీయమైన మార్పులు కనబడాలని ఆకాంక్షించారు. భారత్‌లో స్మార్ట్‌ సిటీ కార్యక్రమానికి అమెరికా ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు రావడాన్ని స్వాగతించారు.

1.5 బిలియన్ భారతీయులు, అమెరికన్ల మధ్య బలమైన సన్నిహిత సంబంధాలు నెలకొనడంపై హర్షం వ్యక్తం చేసిన మోదీ-ఒబామా.. ఈ బంధాల వల్లే భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టమయ్యాయన్నారు. పర్యాటకం, వ్యాపారం, విద్య కోసం రెండు రోజుల ప్రయాణం కారణంగా ఊహించని పురోగతి కనిపించింది. 2015లో భారత్ నుండి అమెరికాకు, అమెరికా నుండి భారత్‌కు చెరో పదిలక్షల మంది ప్రయాణించారు. నిపుణులు, పెట్టుబడిదారులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రయాణించేలా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయించారు. ప్రజల మధ్య సంబంధాలు పెరిగేలా, సాంకేతిక, ఆర్థిక భాగస్వామ్యం బలపడేలా ఇరు దేశాల్లో పర్యాటకులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాని నిర్ణయించారు. ఇందులో భాగంగా జరిగిన డెవలప్‌మెంట్‌ ఆఫ్ ఏన్ ఇంటర్ నేషనల్ ఎక్స్‌పెడైటెడ్ ట్రావెలర్ ఇనిషియేటివ్ (ప్రపంచ ప్రవేశ కార్యక్రమంగా పరిచయమున్న) ఒప్పందంపై సంతకం చేయటాన్ని వీరిద్దరూ స్వాగతించారు. ప్రపంచ ప్రవేశ కార్యక్రమంలోని భారత్‌ త్వరగా చేరేలా మూడు నెలల్లో విధివిధానాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఆగస్టు 2015, జూన్ 2016లో జరిగిన అమెరికా-భారత్ టోటలైజేషన్ అగ్రిమెంట్ (ఇరుదేశాలో పనిచేస్తున్న తమ ఉద్యోగుల హక్కులను కాపాడటం)లో సానుకూల సమాచార మార్పిడి జరగటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం తర్వాత జరిగే సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.

వ్యాపారవేత్తను, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను వీరు గుర్తించారు. 2017లో ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సును నిర్వహించేందుకు భారత్ ముందుకు రావడాన్ని అమెరికా స్వాగతించింది.

మేధో సంపత్తిపై ఉన్నత స్థాయి బృందం ఆధ్వర్యంలో మేధో సంపత్తి హక్కుల ఒడంబడికనూ వీరు స్వాగతించారు. మేధోసంపత్తి హక్కులపై ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల్లో కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మకతను పెంచుకునేలా ద్వైపాక్షిక సహకారం అందించుకోనున్నారు.

ఆసియా ఎకానమీలో గతిశీలమైన శక్తిగా ఉన్న భారత్ ‘ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంఘం’లో చేరేందుకు ఆసక్తి చూపడాన్నీ అమెరికా స్వాగతించింది.

శాస్త్ర, సాంకేతిక, విద్యారంగాల్లో సహకారం విస్తరణ

ఇరువురు నాయకులు తమదేశాలు శాస్త్ర రంగంలో ప్రాథమిక సూత్రాలను అన్వేషించడంలో పరస్పర సహకారంపై పునరుద్ఘాటించారు. సమీప భవిష్యత్తులో భారత్‌లో లేసర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (ఎల్‌ ఐ జి ఒ) నిర్మాణంలో సహకారంతోపాటు ఎల్‌ ఐ జి ఒ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ, పర్యవేక్షణ కో భారత-అమెరికా సంయుక్త పర్యవేక్షణ బృందం ఏర్పాటును కూడా వీరు స్వాగతించారు.

2016 సెప్టెంబర్లో వాషింగ్టన్ డీసీలో జరిగే ‘అవర్ ఓషిషన్ కాన్ఫరెన్స్’లో భారత్ పాల్గొనాలని ఇరు దేశాల నేతలు భావించారు. దీంతోపాటు ఈ సంవత్సరం తర్వాత జరిగే భారత్ -అమెరికా సముద్ర చర్చల్లో.. సముద్ర శాస్త్రం, సముద్ర శక్తి, సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటం, నిర్వహించటం, సముద్ర కాలుష్యం, సముద్ర వనరుల సమగ్రమైన వినియోగం వంటి అంశాల్లో బలమైన సహకారానికి ఒప్పందం చేసుకున్నారు.

వీరిద్దరూ.. ప్రపంచ ఆరోగ్య భద్రత ఎజెండా, దీని లక్ష్యాల సమయానుకూల అమలుపై తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు. యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్, వ్యాధి నిరోధం వంటి అంశాల పరిశోధనల్లో భారత్ సాధిస్తున్న వృద్ధిని భారత ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో సంయుక్త బాహ్య మూల్యాంకనం పంచుకోవడం, అమెరికా మద్దతును ఆ దేశాధ్యక్షుడు వివరించారు.

మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యుబర్‌క్యులోసిస్ (ఎండీఆర్-టీబీ) ప్రపంచానికి పెను సవాల్‌గా మారటాన్ని వీరు గుర్తించారు. ఈ దిశగా ఒకరికి మరొకరు సహకారం అందించుకుంటూ.. తమ ప్రయోగాల వివరాలను మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు.

అంటువ్యాధులు కాని వాటి ద్వారా పెరుగుతున్న ముప్పు, వాటిపై వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడం, చక్కెర, ఉప్పుల వాడకం తగ్గించడం, పిల్లలు, యువతలో శారీరక వ్యాయామం అవసరాన్ని ప్రోత్సహించడం, పొగాకు వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపైనా చర్చించారు. ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన సమగ్ర చర్యలు, యోగాతో పాటు పురాతన వైద్య విధానాన్ని పెంపొందించేలా సంపూర్ణ విధానంతో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకతనూ విశ్లేషించారు.

‘భారత-అమెరికా వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్’పైనా వీరు చర్చించారు. దీని వల్ల ట్యుబర్‌క్యులోసిస్, డేంగీ, చికున్‌గున్యాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వివిధ వ్యాధులకు వ్యాక్సిన్‌లు రూపొందించటంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేయాలని నిర్ణయించారు.

ప్రపంచ నాయకత్వం

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భద్రత సమస్యలు, అంతర్జాతీయ అభివృద్ధి వంటి అంశాలను పరిష్కరించేందుకు ఐక్య రాజ్య సమితి తీసుకుంటున్న చర్యలు మరింత సమర్థవంతంగా ఉండేందుకు కలసి పనిచేయడంతోపాటు అంతర్జాతీయ సమాజంతో కలసి ముందుకెళ్లాలని వీరిద్దరూ నిర్ణయించారు. 2015 సెప్టెంబరులో స్వీకరించిన ‘స్థిరమైన అభివృద్ధికి 2030 అజెండా’ దేశీయంగా అమలుచేయడంతోపాటు అంతర్జాతీయంగా అమలయ్యేలా చూడడంలో కలసి ప్రయత్నించాలని, తద్వారా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని నిర్ణయించారు.

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం గురించి కూడా చర్చ జరిగింది. అంతర్జాతీయంగా శాంతి నెలకొల్పడంలో ఐక్య రాజ్య సమితి కీలక విభాగంగా భద్రతా మండలిది ఎంతో క్రియాశీలమైన పాత్ర. ఇందుకోసం ఐక్య రాజ్య సమితి అంతర్ ప్రభుత్వ చర్చల్లో భద్రతా మండలిలో సంస్కరణలకు పట్టుబట్టాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణపై నాయకుల సదస్సు విజయవంతం కావడాన్ని వీరు స్వాగతించారు. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ సామర్థ్య నిర్మాణంపై మూడవ ప్రపంచ దేశాలను ఒప్పించడంపైనా చర్చించారు. ఆఫ్రికా భాగస్వామ్య దేశాల కోసం ఈ సంవత్సరం తర్వాత న్యూ ఢిల్లీలో తొలి ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ కోర్సు ఏర్పాటుచేయనున్నారు. ఇందులో 10 ఆఫ్రికా దేశాలు పాల్గొననున్నాయి. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు కావాల్సిన సంస్కరణలపైనా వీరు చర్చించారు.

ఆఫ్రికా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా.. (యూఎస్-ఆఫ్రికా నాయకుల సదస్సు, భారత్-ఆఫ్రికా సదస్సు) ఆఫ్రికాలోని భాగస్వామ్యదేశాలతో కలసి పనిచేయడం, అక్కడ శాంతి నెలకొల్పడం విషయంలో భారత్, అమెరికా ల ఆలోచన విధానం ఒకేలా ఉంది. ఆఫ్రికా దేశాలతో త్రైపాక్షిక సహకారం ద్వారా వ్యవసాయం, ఆరోగ్యం, శక్తి, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో సహకారం అందించుకుంటూ ‘ప్రపంచాభివృద్ధికి త్రికోణ సహకారం’ లోని మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలని నిశ్చయించారు. ఆఫ్రికాతో పాటు ఆసియాలోనూ భారత-అమెరికా ప్రపంచాభివృద్ధి సహకారాన్ని మరింత విస్తరించాలని.. నిర్ణయించారు.

ప్రజల మధ్య బంధాల నిర్మాణం

ఇరు దేశాలు వారి వారి ప్రాంతాల్లో అదనంగా దౌత్యకార్యాలయాలను తెరవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా సియాటెల్‌లో భారత దౌత్య కార్యాలయం ప్రారంభం కానుండగా.. ఇండియాలో ఇరువురి అంగీకారం కుదిరిన చోట అమెరికా దౌత్యకార్యాలయం తెరవనున్నారు.

2017లో అమెరికా-భారత్‌లు ప్రయాణ, పర్యాటక భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఇరు దేశాల ప్రజలకు వీసాలు అందజేయనున్నారు.

ఇరు దేశాల మధ్యనున్న బలమైన విద్య, సాంస్కృతిక‌ బంధాల కారణంగా అమెరికాలో చదువుకునేందుకు వచ్చే భారత విద్యార్థుల సంఖ్యను పెరగటనాని స్వాగతించారు. 2014-15లో 1,33,000 మంది భారతీయ విద్యార్థుల అమెరికా వచ్చారు. దాదాపు 29 శాతం వృద్ధి కనిపించింది. దీంతోపాటు భారత్‌లో అమెరికా విద్యార్థులకు అవకాశాలు పెంచనున్నారు. వాతావరణ మార్పులపై పనిచేసే శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇరు ప్రభుత్వాలు సంయుక్తంగా ‘ఫుల్‌బ్రైట్-కలాం క్లైమేట్ ఫెలోషిప్’ ఇవ్వాలని నిర్ణయించటంపై మోదీ ఒబామా హర్షం వ్యక్తం చేశారు.

ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించారు. విదేశీయుడిని పెళ్లాడటం, విడాకులు, పిల్లల రక్షణ బాధ్యత వంటి విషయాల్లో ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించేలా చొరవతీసుకోనున్నారు.

భారత ప్రాచీన కళాఖండాలను అమెరికా తిరిగివ్వటంపై ప్రధాని మోదీ స్వాగతించారు. సాంస్కృతిక‌ కళాఖండాల చోరీ, అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు.

తనను ఆహ్వానించటంతోపాటు చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒబామాకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వీలు చూసుకుని భారత్‌కు రావాలని శ్రీ ఒబామాను శ్రీ మోదీ ఆహ్వానించారు.