ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని యాపిల్ ఇంక్ సిఇఒ శ్రీ టిమ్ కుక్ ఈ రోజు కలుసుకొన్నారు.
ఇటీవలి ఎన్నికల ఫలితాలను పురస్కరించుకొని ప్రధాన మంత్రికి శ్రీ కుక్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో తన పర్యటనను గురించి శ్రీ కుక్ ప్రస్తావిస్తూ, తనకు సాదర స్వాగతం లభించినట్లు చెప్పారు. దేశంలో పలు ప్రాంతాలను తాను సందర్శించినట్లు, యువతీయువకులు, వ్యాపార వేత్తలు, చలనచిత్ర నటులు వంటి వారితో తాను భేటీ అయినట్లు ఆయన వివరించారు. మరీ ముఖ్యంగా ముంబయ్ లోని సిద్ధి వినాయక ఆలయ దర్శనం గురించి, ఒక క్రికెట్ మ్యాచ్ వీక్షణం గురించి ఆయన ప్రస్తావించారు. శ్రీ కుక్ ను ప్రధాన మంత్రి అభినందిస్తూ, భారతదేశంలో “చూడడమంటే నమ్మడం” అని, ఈ పర్యటన అనుభవాలు శ్రీ కుక్ వ్యాపార నిర్ణయాలను తప్పనిసరిగా ఉపయోగపడగలవని పేర్కొన్నారు.
భారతదేశంలో యాపిల్ భవిష్యత్ ప్రణాళికలను గురించి శ్రీ కుక్ ప్రధాన మంత్రికి చెప్పుకొచ్చారు. భారతదేశంలో తయారీ, రిటైలింగ్ కార్యకలాపాలకు ఉన్న అవకాశాలను గురించి ఆయన మాట్లాడారు. భారతదేశంలో యువ ప్రతిభ విస్తారంగా ఉన్నదని, వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉన్నాయని, ఆ నైపుణ్యాలను యాపిల్ ఉపయోగించుకోవాలనుకుంటున్నదని తెలియజేశారు. ప్రధానంగా ఈ దేశంలో “యాప్ అభివృద్ధి”కి అపారమైన సామర్థ్యం ఉన్నట్లు శ్రీ కుక్ చెప్పారు. హైదరాబాద్ లో యాపిల్ ఇంక్ ఏర్పాటు చేస్తున్న మ్యాప్ అభివృద్ధి కేంద్రం గురించి కూడా ఆయన ప్రధాన మంత్రికి వివరించారు. ‘వ్యాపారం చేయడాన్ని సరళతరం చేసేందుకు’ ప్రధాన మంత్రి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన మెచ్చుకొన్నారు.
పునర్ నవీకరణ యోగ్య శక్తి దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చొరవలను కూడా శ్రీ కుక్ ప్రశంసించారు. యాపిల్ 93 శాతం కార్యకలాపాలను పునర్ నవీకరణ యోగ్య శక్తి మీదే నడుపుతుందని, యాపిల్ కు చెందిన మొత్తం సప్లై చెయిన్ ను పునర్ నవీకరణ యోగ్య శక్తి ఆధారిత మార్గానికే మళ్లించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. శ్రీ కుక్ వెంట వచ్చిన ప్రతినిధి బృందం సభ్యులు కూడా రాజస్థాన్ లోని గ్రామాలలో తమ పర్యటన అనుభవాలను గురించి చెప్పారు. రాజస్థాన్ లోని అనేక గ్రామాలలో ఇటీవలే విద్యుత్తు సౌకర్యం కల్పించారు. మహిళలకు సౌర శక్తి ఆధారిత సామగ్రిని అసెంబుల్ చేసే, వాటిని నిర్వహించేందుకు సంబంధించిన శిక్షణను ఇస్తున్నారు. యాప్ ల అభివృద్ధి, పునర్ నవీకరణ యోగ్య శక్తి లకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికుల విశిష్ట గాథలలో కొన్నింటిని శ్రీ కుక్, ప్రధాన మంత్రి ఒకరికి మరొకరు తెలియజేసుకొన్నారు.
ప్రధాన మంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి శ్రీ కుక్ కు వివరించారు. ఇ-ఎడ్యుకేషన్, ఆరోగ్యం, వ్యవసాయదారుల ఆదాయాలను పెంచడం.. ఈ అంశాలను డిజిటల్ ఇండియా కు చెందిన మూడు కీలక లక్ష్యాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో యాపిల్ అండదండలు కావాలని ప్రధాన మంత్రి కోరారు.
సైబర్ సెక్యూరిటీ, డాటా ఎన్ క్రిప్షన్ కు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సైబర్ నేరాల సవాళ్లను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజానికి సహాయ సహకారాలను అందించండంటూ శ్రీ కుక్ ను ప్రధాన మంత్రి ఉత్సాహపరిచారు.
“నరేంద్ర మోదీ మొబైల్ యాప్” అప్ డేటెడ్ వెర్షన్ ను ఈ సందర్భంగా శ్రీ కుక్ ఆవిష్కరించారు.
Thank you @tim_cook! Friends, welcome & happy volunteering. Your views & efforts are always enriching. pic.twitter.com/aAu4isv6wM
— Narendra Modi (@narendramodi) May 21, 2016