Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్వెన్ ల మధ్య దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం జరగనుంది


ఇది, 2015 నుండి ఇరువురు నాయకుల మధ్య జరుగుతున్న ఐదవ ద్వైపాక్షిక సదస్సు.  ప్రథమ భారత – ఉత్తర దేశాల సదస్సు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2018 ఏప్రిల్ నెలలో, స్టాక్-‌హోమ్ సందర్శించారు.  ప్రత్యేకమైన “మేక్-ఇన్-ఇండియా” వారోత్సవాల్లో పాల్గొనడం కోసం, స్వీడన్ ప్రధానమంత్రి గౌరవనీయులు స్టీఫన్ లోఫ్వెన్, 2016, ఫిబ్రవరి నెలలో భారతదేశాన్ని సందర్శించారు.  అంతకుముందు, 2015, సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో, ఇరువురు నాయకులు సమావేశమయ్యారు.  కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితిపై చర్చించడానికి, ఇద్దరు ప్రధానమంత్రులు, 2020 ఏప్రిల్ నెలలో, టెలిఫోను ద్వారా సంభాషించారు.  అలాగే, గౌరవనీయులు స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్టాఫ్ మరియు గౌరవనీయులు స్వీడన్ రాణి సిల్వియా 2019 డిసెంబర్ నెలలో భారతదేశాన్ని సందర్శించారు.

ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, బహుత్వవాదంతో పాటు, నియమాల ఆధారిత అంతర్జాతీయ విధానం యొక్క భాగస్వామ్య విలువల ఆధారంగా, భారతదేశం మరియు స్వీడన్ దేశాలు, మంచి స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి.  వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశోధన, అభివృద్ధి రంగాలలో ఇరు దేశాలూ, చాలా సన్నిహిత సహకారం కలిగి ఉన్నాయి.  ఆరోగ్యం, జీవ శాస్త్రాలు, ఆటో పరిశ్రమ, క్లీన్ టెక్నాలజీ, రక్షణ, భారీ యంత్రాలు, పరికరాలు వంటి వివిధ రంగాలకు చెందిన 250 మంది స్వీడన్ కంపెనీలు భారతదేశంలో చురుకుగా పనిచేస్తున్నాయి.  స్వీడన్ ‌లో కూడా భారతదేశానికి చెందిన 75 భారతీయ కంపెనీలు చురుకుగా పనిచేస్తున్నాయి.

ఈ సమావేశంలో, ఇరువురు నాయకులు, మొత్తం ద్వైపాక్షిక సంబంధాల గురించి సమగ్ర చర్చలు జరపనున్నారు. మరియు కోవిడ్ అనంతర కాలంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు.

*****