1. రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఆహ్వానం మేరకు భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి మాన్య శ్రీ శ్రీ నరేంద్ర మోదీ 2019 సెప్టెంబర్ 4వ, 5వ తేదీల లో రష్యా లో ఆధికారిక పర్యటన జరిపారు. భారతదేశం– రష్యా 20వ వార్షిక శిఖర సమ్మేళనాన్ని వ్లాదివోస్తోక్ లో నిర్వహించడమైంది. 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో మాన్య శ్రీ నరేంద్ర మోదీ కూడా ముఖ్య అతిథి గా పాలు పంచుకొన్నారు.
2. భారతదేశం, రష్యా ల మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిశీల రీతి న అభివృద్ధి చెందినట్లు 20వ వార్షిక శిఖర సమ్మేళనం లో ఇరువురు నేతలు గుర్తించారు. ఈ సంబంధాలు సహకారానికి వీలు ఉన్న అన్ని రంగాల లో స్వభావ రీత్యా పరస్పర ప్రయోజనకరం గాను, విశిష్టమైనవిగాను, నమ్మకాన్ని ఉంచేవి గాను కొనసాగుతున్నాయి. అవి అభివృద్ధి కి, ఆర్ధిక ప్రగతి కి సంబంధించిన ప్రాథమిక సమస్యల పై ఒకే రకమైన నాగరిక విలువలు, కాలానుగుణమైన స్నేహం, పరస్పర అవగాహన, నమ్మకం, ఉమ్మడి ప్రయోజనాలు, విధానాల లో సామీప్యం మొదలైన అంశాల పైన ఆధారపడి ఉన్నాయి. వివిధ అంతర్జాతీయ వేదికల పైన మరియు అన్ని స్థాయిల లో ద్వైపాక్షిక పరిచయాల తో పెరుగుతున్న సంబంధాల తో సహా దేశాధినేతల మధ్య సాధారణం గా జరిగే సమావేశాలు ఈ భాగస్వామ్యాని కి ఒక స్పష్టమైన రుజువు గా నిలుస్తున్నాయి.
3. సమకాలీన ప్రపంచం లోని అల్లకల్లోలమైన యథార్థ స్థితిగతులను భారత, రష్యా సంబంధాలు విజయవంతం గా ఎదుర్కొంటున్నాయి. అవి ఇంతవరకు బాహ్య ప్రభావాల కు గురి కాలేదు, ఇక ముందు కావు. భారతదేశం- రష్యా సంబంధాల యావత్తు పరిధి ని అభివృద్ధి పరచాలన్నదే ఇరు దేశాల విదేశీ విధానం యొక్క ప్రాథమ్యం గా ఉంది. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు గల అన్ని అవకాశాల ను అన్వేషిస్తూ, దీని ప్రత్యేకమైన, విశేష స్వభావాన్ని- ఏదయితే ఒక సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితి లో ఒక నిలకడతనం కలిగినటువంటి లంగరు గా ఆవిర్భవించిందో- కళ్ల కు కడుతూ, సాధ్యమైనటువంటి అన్ని విధాలు గాను ఆవిష్కరించడానికి ఉభయ నేత లు అంగీకరించారు.
4. రెండు దేశాల పార్లమెంటు ల మధ్య నెలకొన్న బలమైన సహకారాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. ద్వైపాక్షిక సంబంధాల కు ఒక విలువైన అంశం గా నిలచిన పార్లమెంటు ల మధ్య పరస్పర చర్చ ల ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. 2018వ సంవత్సరం డిసెంబర్ లో భారతదేశాన్ని స్టేట్ డ్యూమా చైర్ మన్ సందర్శించడాన్ని వారు ప్రముఖం గా పేర్కొన్నారు. అదే విధం గా ఈ ఏడాది లో లోక్ సభ స్పీకర్ రష్యా పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
5. భారతదేశం, రష్యా ల సంబంధాల పరిధి ని మరింతగా పెంపొందించేందుకు పునాది గా నిలచేటటువంటి పటిష్టమైన, బహుళ పార్శ్విక వాణిజ్య, ఆర్ధిక సహకారా నికి ఇరు పక్షాలు ప్రాధాన్యాన్ని ఇచ్చాయి.
6. వివిధ రంగాల లో ద్వైపాక్షిక సహకారం ప్రగతిశీల అభివృద్ధి కి దోహదపడే వాణిజ్య, ఆర్ధిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సంబంధ సహకారం అంశం లో ఇండియా- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిశన్ చేస్తున్న కృషి ని నాయకులు విశేషం గా ప్రశంసించారు.
7. రెండు దేశాల్లోనూ మొత్తం వ్యాపారం విలువ స్థిరం గా వృద్ధి చెందుతుండడం పట్ల ఇరు పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. 2025వ సంవత్సరం కల్లా దీని ని 30 బిలియన్ అమెరికా డాలర్ కు తీసుకుపోవాలనే లక్ష్యం తో, పారిశ్రామిక సహకారం పెంపొందించి, ముఖ్యం గా అత్యాధునిక, ఉన్నత సాంకేతిక రంగాల లో కొత్త సాంకేతిక, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, కొత్త సహకార మార్గాలను అన్వేషించి, భారతదేశం, రష్యా ల మానవ వనరుల ను, ఇతర వనరుల ను మరింత చురుకు గా పాల్గొనేటట్టు చేయాలని వారు అంగీకరించారు.
8. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమం లో రష్యా వ్యాపార భాగస్వామ్యాన్ని, అలాగే రష్యా లో పెట్టుబడి పథకాల లో భారతదేశ కంపెనీ లు పాలు పంచుకోవడాన్ని విస్తరింపచేసునకోవాలని రెండు పక్షాలు వాటి ఆసక్తి ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భం లో, పెట్టుబడుల ను పెంపొందించుకొని, పెట్టుబడుల ను పరస్పరం ప్రోత్సహించుకోవడం మరియు పరిరక్షించుకోవడం అనే అంశం లో ఇండియా- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ పై సంతకాల కోసం సన్నాహక చర్య లను ముమ్మరం చేయాలని వారు అంగీకరించారు.
9. పరస్పర చర్చ ల ద్వారా నియంత్రణ చర్యల ను మరింత తగ్గించడానికి వీలు గా రక్షణ చర్యలు, కస్టమ్స్ మరియు ఇతర పరిపాలనా సంబంధమైన అవరోధాల తో సహా పరస్పర వాణిజ్యం లోని అడ్డంకుల ను తొలగించడానికి ఉమ్మడి చర్యల ను తీవ్ర తరం చేయాలని రెండు పక్షాలు అంగీకరించాయి. దీని కోసం ఇతర చొరవల తో పాటు యూరేశియన్ ఎకనామిక్ యూనియన్ (ఇఎఇయు) మరియు భారతదేశ గణతంత్రం ల మధ్య ప్రతిపాదిత వ్యాపార ఒప్పందం ద్వారా కూడా వీలు కల్పించడం జరుగుతుంది.
10. వస్తువులు మరియు సేవల తాలూకు వ్యాపార స్వరూపాన్ని, నవ పారిశ్రామికత్వం సంబంధిత కార్యకలాపాల ను, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచాలని, సంబంధిత ఎగుమతి, దిగుమతి విధానాల ను సమన్వయం చేయాలని, సాంకేతిక, శానిటరీ, ఫైటోశానిటరీ అవసరాల ను క్రమబద్ధీకరించి, ప్రామాణీకరించాలని వారు అంగీకరించారు.
11. జాతీయ కరెన్సీల లో పరస్పర చెల్లింపు ల ప్రక్రియలను పూర్తి చేసుకోవడాన్ని ప్రోత్సహించే కసరత్తు ను కొనసాగించనున్నారు.
12. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్ధిక సంబంధాల ను ప్రోత్సహించేందుకు భారతదేశం కోసం ఏర్పాటైన రష్యా వాణిజ్య మిషన్ మరియు రష్యా ఎగుమతుల కేంద్రం సంయుక్తం గా ముంబయి లో రష్యా ఎగుమతి మద్దతు బృందం యొక్క కార్యాలయాన్ని నెలకొల్పడాన్ని రెండు దేశాలు స్వాగతించాయి. ఇన్ వెస్ట్ ఇండియా యొక్క రష్యా ప్లస్ డెస్క్ భారతదేశం లో రష్యా పెట్టుబడుల కు నిరంతరం గా చేస్తున్నటువంటి కృషి ని కూడా రెండు పక్షాలు గుర్తించాయి.
13. వాణిజ్య, ఆర్ధిక, పెట్టుబడుల సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది నిర్వహించిన సెంట్ పీటర్స్ బర్గ్ అంతర్జాతీయ ఆర్ధిక మండలి మరియు భారత, రష్యా వ్యాపార చర్చ ల సందర్భం గా అందించిన తోడ్పాటు ను ఇరు పక్షాలు గమనించాయి.
14. 2వ విడత భారత, రష్యా వ్యూహాత్మక ఆర్ధిక చర్చ లు 2019వ సంవత్సరం లో జులై 10వ తేదీ న న్యూ ఢిల్లీ లో నిర్వహించడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మకమైన, నిరంతర పరస్పర సంప్రదింపుల ద్వారా – ప్రధాన రంగాల లో సమైక్య మరియు పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యం తో ఏర్పాటైన ఒక యంత్రాంగం గా ఈ వ్యూహాత్మక ఆర్థిక చర్చ లు రూపుదిద్దుకొన్నాయి. ఈ చర్చ ల ఫలితం గా, 2018-2019లో ఒక ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్ధిక మరియు పెట్టుబడుల సహకారాన్ని పెంపొందించేందుకు ఒక సమగ్ర కార్యాచరణ వ్యూహాన్ని రూపొందించి, అమలు పరచడమైంది.
15. రష్యా లో దూర ప్రాచ్య ప్రాంత అభివృద్ధి రంగం లో న్యూ ఢిల్లీ, మాస్కో ల మధ్య సహకారం పట్ల నాయకులు సంతృప్తి ని వెలిబుచ్చారు. వజ్రాల కత్తిరింపు రంగం లో వ్లాదివోస్తోక్ లో మెస్సర్స్ కెజికె, బొగ్గు గనుల రంగం లో కృతగొరొవో లో మెస్సర్స్ టాటా పవర్ ల వంటి అనేక భారతీయ కంపెనీ లు, దూర ప్రాచ్య ప్రాంతం లో విజయవంతం గా నెలకొల్పబడ్డాయి. దూర ప్రాచ్య ప్రాంతం లో, సైబీరియా లో తన ఆర్ధిక ఉనికి ని, పెట్టుబడి ఉనికి ని విస్తరించాలన్న భారతదేశం యొక్క ఉద్దేశ్యాన్ని రష్యా పక్షం స్వాగతించింది.
16. రష్యా లోని దూర ప్రాచ్యం తో సహాకారాన్ని పెంపొందించుకొనేందుకు భారతదేశం కృషి చేస్తోంది. ఇందులో మొదటి చర్య గా, నిర్ణయించుకున్న రంగాల లో ద్వైపాక్షిక ఒప్పందాల కు అనువైన మార్గాల అన్వేషణ కోసం, 2019 వ సంవత్సరం ఆగష్టు 12వ, 13వ తేదీల లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నాయకత్వం లో భారతదేశం లోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కూడిన బృందం మొట్ట మొదటి సారి వ్లాదివోస్తోక్ ను సందర్శించింది. భారతదేశం నుండి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కు తాత్కాలిక ఉపాధి కల్పించడం కోసం సహకారాన్ని అన్వేషించాలని కూడా రెండు పక్షాలు ఎదురుచూస్తున్నాయి.
17. ఆర్క్ టిక్ లో రష్యా కు సహకారాన్ని అందించాలని భారతదేశం వేచివున్నది. ఆర్క్ టిక్ ప్రాంతం లో పరిణామాల ను భారతదేశం ఆసక్తి గా గమనిస్తున్నది. ఆర్క్ టిక్ మండలి లో ముఖ్య పాత్ర ను పోషించడానికి కూడా భారతదేశం సిద్ధం గా ఉంది.
18. రష్యా తన వంతు గా, భారతదేశం లో భారీ మౌలిక సదుపాయాల లో మరియు ఇతర ప్రాజెక్టుల లో భాగం పంచుకోడానికి తన సంసిద్ధత ను ప్రకటించింది. ఫార్ ఈస్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఎండ్ ఎక్స్ పోర్ట్ ఏజెన్సీ యొక్క కార్యాలయాన్ని ఇటీవల ముంబయి లో ప్రారంభించడాన్ని రెండు పక్షాలు స్వాగతించాయి. రష్యా లో దూర ప్రాచ్య ప్రాంతాని కి సంబంధించి ద్వైపాక్షిక వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాల అభివృద్ధి కి ఈ కార్యాలయం అందజేసే సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
19. రెండు దేశాల మధ్య పరస్పర చర్చల కు విద్యుత్తు పరిశ్రమ సాంప్రదాయకం గా ఒక ముఖ్యమైన ప్రాంతం గా ఉంది. భారత, రష్యా ఆర్ధిక వ్యవస్థ లు ఒకదానితో మరొకటి ప్రయోజనకరం గా కొనసాగడానికి ఇది ఒక ప్రాంతం గా ఉన్నది. భారతదేశం, రష్యా ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాని కి పౌర పరమాణు సహకారం ఒక ముఖ్యమైన అంశం గా ఉంది. కూడంకుళం లో మొత్తం ఆరు అణు విద్యుత్తు ప్లాంటుల లో మిగిలిన నాలుగు ప్లాంటు ల నిర్మాణం లో సాధించిన పురోగతి వేగాన్ని ఇరు పక్షాలు గుర్తించాయి. రెండో సైట్ పై చర్చల లో ఉభయ పక్షాలు నిమగ్నమై ఉన్నాయి. రష్యా డిజైన్ యొక్క వివిఇఆర్ 1200 పైన మరియు పరికరాలు, ఇంధనం యొక్క సంయుక్త తయారీ పైన కొనసాగుతున్న సాంకేతిక చర్చల ను ఇరు పక్షాలు స్వాగతించాయి.
20. బాంగ్లాదేశ్ లో రూప్పుర్ ఎన్ పిపి నిర్మాణం లో విజయవంతమైన సహకారాన్ని ఇరు పక్షాలు ప్రముఖం గా ప్రస్తావించుకొన్నాయి. తృతీయ దేశాల లో కూడా ఇటువంటి సహకారాన్ని విస్తరించుకోడానికి తమ సన్నద్ధత ను వ్యక్తం చేసుకొన్నాయి.
21. పరమాణుయేతర ఇంధనం మరియు విద్యుత్తు రంగం లో సహకారానికి అపారమైన అవకాశం ఉన్నట్లు నాయకులు గుర్తించారు. వాంకోర్ నెఫ్ట్ మరియు తాస్-యుర్యక్ నెఫ్టిగాజో దొబిచ ప్రాజెక్టు ల అమలు కోసం, అదేవిధం గా నయారా ఎనర్జీ లిమిటెడ్ చమురు శుద్ధి సంస్థ పనులు, గాజ్ ప్రోమ్ మరియు భారతదేశాని కి చెందిన జిఎఐఎల్ (గెయిల్) ఇండియా ల మధ్య కుదిరిన ఒప్పందం కింద సకాలం లో ద్రవరూప సహజ వాయువు సరఫరా తో సహా గత రెండు దశాబ్దాలు గా హైడ్రో కార్బన్ వనరుల ను వెలికి తీయడంలో సహకారం కోసం జె ఎస్ సి రాస్ నెఫ్ట్ ఆయిల్ కంపెనీ మరియు కన్సార్టియమ్ ఆఫ్ ఆయిల్ ఎండ్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ మధ్య సంప్రదింపు లు ఫలప్రదం కావడాన్ని భారతదేశం, రష్యా లు స్వాగతించాయి. వంట కు వినియోగించే బొగ్గు రష్యా నుండి భారతదేశాని కి సరఫరా కావడం లో సహకరించుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
22. రష్యా, భారతదేశం లలో తీర ప్రాంత క్షేత్రాల తో పాటు, చమురు, గ్యాస్ క్షేత్రాల సంయుక్త అభివృద్ధి, భౌగోళిక అన్వేషణ లో సహకరించుకోవాలని నాయకులు నిర్ణయించారు. ఉత్తర సముద్ర మార్గం మరియు గొట్టపు మార్గాన్ని ఉపయోగించుకొనే అవకాశం, రష్యా ముడి చమురు వెలికితీత కు దీర్ఘకాల ఒప్పందం తో పాటు రష్యా నుండి భారతదేశాని కి ఇంధన వనరుల ను పంపిణీ చేసే మార్గాల ను అభివృద్ధి పరచే పని ని వారు కొనసాగిస్తారు. వాదినార్ చమురు శుద్ధి కర్మాగారం లో సామర్ధ్యాన్ని పెంచడం లో నయారా ఎనర్జీ లిమిటెడ్ అవకాశాల ను వారు గుర్తించారు. సాంప్రదాయేతర వనరుల నుండి శక్తి ని ఉత్పత్తి చేసే సదుపాయాల ను రూపొందించి, నిర్మించడం సహా , జలాధారితమైనటువంటి మరియు ఉష్ణ ఆధారితమైనటువంటి విద్యుత్తు, శక్తి సామర్ధ్యాల లో సహకారాన్ని విస్తరించే అవకాశాల ను పరిగణన లోకి తీసుకోవాలని భారత, రష్యా దేశాలు అంగీకరించాయి.
23. ఈ సదస్సు సందర్భం గా 2019-24 నాటి కి హైడ్రో కార్బన్ ల లో సహకారాని కి ఒక ప్రణాళిక పై సంతకాలు చేయడంతో, వచ్చే ఐదు సంవత్సరాల లో ఈ రంగం లో నూతన శిఖరాల ను చేరుకొనే విధం గా ద్వైపాక్షిక సహకారం పెంపొందాలని రెండు పక్షాలు ఆశిస్తున్నాయి.
24. భారతదేశం, రష్యా ల మధ్య వాణిజ్యం, ఆర్ధిక బంధాలు మరింత గా అభివృద్ధి చేయాలని, రవాణా మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేసే పనుల ను చేపట్టాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడోర్ (ఐఎన్ఎస్ టిసి) అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని వారు పేర్కొన్నారు. సరుకు రవాణా ను భద్రపరచడం, రవాణా ను మెరుగు పరచడం, సరుకు రవాణా సేవల ను అందించడం, ధ్రువపత్రాలను సరళీకరించడం, ఇలెక్ట్రానిక్ డాక్యుమెంట్ లు గా మార్చడం, డిజిటల్ టెక్నాలజీ ని ప్రవేశపెట్టడం, రవాణా ప్రక్రియ లో ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటివి ఐఎన్ఎస్ టిసి లో ప్రధానం గా చేపట్టేటటువంటి పనుల లో కలసివున్నాయి.
25. రైల్వేల రంగం లో సహకారం పెంపొందించుకోవడానికి రెండు వైపులా మంచి అవకాశాలు ఉన్నాయి. నాగ్ పుర్, సికింద్రాబాద్ సెక్షన్ లో వేగాన్ని పెంచడానికి గల సాధ్యాసాధ్యాల అధ్యయనం లో నమోదు అవుతున్న పురోగతి పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆ అభివృద్ధి పథకానికి సంబంధించిన ఆచరణ లో పాలు పంచుకోవడానికి రష్యా ప్రభుత్వం యొక్క ఆసక్తి ని వారు గుర్తించారు. ఈ విషయం లో ఇరు పక్షాలు చురుకు గా పని చేయడాన్ని కొనసాగించనున్నాయి.
26. రెండు దేశాలకు చెందిన వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికుల విమాన సర్వీసుల తో పాటు సరుకు రవాణా విమాన సర్వీసుల ను కూడా విస్తరించే అవకాశాల ను సమీక్షించడానికి రెండు పక్షాలు అంగీకరించాయి.
27. రవాణా, విద్య, మౌలిక సదుపాయాల రవాణా ప్రాజెక్టుల కు వృత్తిపరమైన శిక్షణ మరియు శాస్త్రీయ సహకారం కోసం మరింత సహకరించుకోవాలనే ఉద్దేశ్యాన్ని వారు వ్యక్తం చేశారు.
28. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం రంగం లో ఉమ్మడి పరిశోధన కు గల ప్రాముఖ్యాన్ని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి. టెలికమ్యూనికేశన్స్, రోబొటిక్స్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, నానోటెక్నాలజీస్, ఫార్మసీ తదితర రంగాల లో హైటెక్ ఉత్పత్తుల ను అభివృద్ధి పరచడాన్ని తీవ్రతరం చేయడానికి వారు కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు, నూతన ఆవిష్కరణ రంగం లో సహకారం కోసం భారతదేశ గణతంత్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క ఆర్థిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవగాహన పూర్వక ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నాయకులు ప్రశంసించారు.
29. ప్రపంచ పులుల జనాభా లో 75 శాతం అనగా 2967 పులులు భారతదేశం లో ఉన్నాయని వెల్లడి చేసిన 2018 అఖిల భారత పులుల అంచనా నివేదిక పట్ల రష్యా పక్షం హర్షం ప్రకటించింది. 2022వ సంవత్సరం లో అంతర్జాతీయ పులుల సంరక్షణ తాలూకు రెండో ఫోరమ్ ను (దీని ని రెండో టైగర్ సమిట్ అని కూడా పిలుస్తారు; ఒకటో సమిట్ 2010వ సంవత్సరం లో సెంట్ పీటర్స్‌బర్గ్ లో జరిగింది) నిర్వహించడానికి రష్యన్ పక్షం చేసిన ప్రయత్నాన్ని భారతదేశ పక్షం స్వాగతించింది. పులి సంరక్షణ ప్రయత్నాల లో తమ నాయకత్వ పాత్ర ను అంగీకరిస్తూ, పులుల ఉనికి కలిగిన దేశాల కు, పులుల పరిరక్షణ లో భాగస్వామ్యం కలిగిన దేశాల కు మరియు ఇతర సంబంధిత వర్గాల కు ప్రమేయం కల్పిస్తూ ఉన్నత స్థాయి లో ఒక టైగర్ ఫోరమ్ ను 2020వ సంవత్సరం లో భారతదేశం లో నిర్వహించడానికి ఇరు పక్షాలు సమ్మతించాయి.
30. సహకారానికి మరింత ఆస్కారం ఉన్న రంగాల లో విమానయానం మరియు అంతరిక్ష పరిశోధనలు ఉన్నాయి. పౌర విమాన సముదాయాల ను అభివృద్ధి పరచడం మరియు ఉత్పత్తి చేయడం కోసం భారతదేశం లో జాయింట్ వెంచర్లను స్థాపించేందుకు అవకాశాల ను అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
31. మానవ సహిత రోదసి ప్రయాణ కార్యక్రమాలు మరియు ఉపగ్రహ మార్గదర్శనం తో పాటు స్టేట్ స్పేస్ కార్పొరేశన్ “రాస్ కాస్మోస్” మరియు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ కు మధ్య పెరిగిన సహకారాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. వాహక నౌకల ను అభివృద్ధిపరచడం, వాటి నిర్మాణం మరియు వేర్వేరు సేవల కోసం వ్యోమ నౌకల వినియోగం, అలాగే గ్రహాల అన్వేషణ తో సహా బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం లలో భారతదేశం యొక్క మరియు రష్యా యొక్క సామర్థ్యాన్ని అధికంగా ఉపయోగించుకోవడం అవసరమని ఇరు పక్షాలు అంగీకరించాయి.
32. భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత యాత్ర అయిన ‘‘గగన్ యాన్’’ కోసం మద్దతు తెలుపుతూ రష్యా పక్షం సంతకం చేసిన అవగాహనపూర్వక ఒప్పందం పరిధి లో చేపట్టిన చురుకైన పని ని ఉభయ పక్షాలు స్వాగతించాయి.
33. బాహ్య అంతరిక్ష కార్యకలాపాల యొక్క దీర్ఘకాలిక సుస్థిరత కు హామీ ని ఇవ్వడం మరియు “స్పేస్ 2030” కార్యక్రమ పట్టికను మరియు అమలు తాలూకు ప్రణాళిక ను అభివృద్ధి చేయడం తో సహా, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రనయోజనాల కు ఉపయోగించుకోవడం పై ఏర్పాటైన యుఎన్ కమిటీ (యుఎన్ సిఒపియుఎస్)లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి.
34. వజ్రాల పరిశ్రమ లో సహకారాని కి అధిక ప్రాముఖ్యాన్ని కట్టబెట్టడమైంది. భారతదేశం లోని పిజెఎస్ సి ఎఎల్ఆర్ఒఎస్ఎ కార్యాలయం యొక్క ఫలప్రదమైనటువంటి కార్యకలాపాల ను ఇరు పక్షాలు గుర్తించాయి. సహజ వజ్రాల ఈక్విటీ ని పరిరక్షించే లక్ష్యం తో గరుకు వజ్రాల వాణిజ్య వ్యవస్థ ను మెరుగుపరచడం మరియు ఈ రంగం లో నియంత్రణ వాతావరణాన్ని మరింత మెరుగుపరచడానికి మార్గాల ను అన్వేషించడం లో ఇరు పక్షాలు తమ ఆసక్తి ని వెల్లడించాయి.
35. వ్యవసాయ రంగం లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే అవకాశాల ను ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ రంగం లో చట్టపరమైన చట్రాన్ని పెంచడానికి మరియు ఫైటోశానిటరీ ప్రమాణాల కు సామరస్యం కల్పించడానికి, లాజిస్టిక్స్ ను అభివృద్ధి పరచడానికి, మన దేశాల విపణుల లో వ్యవసాయ వస్తువుల ను ప్రోత్సహించడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి, ఇంకా ఒకదానికి మరొకటి సామర్థ్యాల ను మరియు అవసరాల ను మరింత జాగ్రత్త గా అధ్యయనం చేయడానికి నిర్దిష్ట చర్య లు తీసుకోవాలన్న అభిమతాన్ని వ్యక్తం చేశాయి. గమ్యాన్ని చేరుకోక ముందే రెండు కస్టమ్స్ పరిపాలన వ్యవస్థ ల మధ్య సమాచార మార్పిడి జరగాలని గ్రీన్ కారిడోర్ మెకానిజమ్ సూచిస్తున్నది. ఇది మెరుగైన విపత్తు నిర్వహణ ద్వారా, వస్తువుల కు వేగం గా అనుమతుల ను ఇవ్వడం లో తోడ్పడుతుంది. ఇది వాణిజ్యాన్ని గణనీయమైన రీతి లో మెరుగుపరుస్తుంది.
36. సైనిక మరియు సైన్య సంబంధ సాంకేతిక రంగాల లో భారతదేశం- రష్యా ల సన్నిహిత సహకారం ఉభయ పక్షాల మధ్య ప్రత్యేకమైన మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాని కి మూలస్తంభం గా ఉంది. ఇరు దేశాల సాయుధ దళాల మధ్య క్రమం తప్పకుండా సైనిక పరిచయాలు మరియు ఉమ్మడి విన్యాసాల పట్ల ఉభయ పక్షాలు తమ సంతృప్తి ని వ్యక్తం చేశాయి. సైనిక మరియు సాంకేతిక సహకారం కోసం 2011-2020 మధ్య కాలం లో దీర్ఘకాలిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడాన్ని వారు స్వాగతించారు. ఈ రంగం లో సంభాషణ ల యొక్క కొత్త దీర్ఘకాలిక ప్రణాళిక ను వేగవంతం చేయడానికి సమ్మతి తెలిపారు.
37. ఇరు పక్షాలు కూడా సైనిక పరికరాలు, భాగాలు మరియు విడిభాగాల ఉమ్మడి అభివృద్ధి ని మరియు ఉత్పత్తి ని ప్రోత్సహించడం, అమ్మకాల అనంతర సేవ ల వ్యవస్థ ను మెరుగుపరచడం మరియు ఇరు దేశాల సాయుధ దళాల యొక్క ఉమ్మడి విన్యాసాల ను క్రమం తప్పని విధం గా కొనసాగించడం వంటి వాటి రక్షణ రంగ సహకారాన్ని ఉన్నతీకరించుకోవాలన్న తమ నిబద్ధత ను వ్యక్తం చేశాయి.
38. మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం లో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయడం మరియు జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం లో రష్యన్ మూలం ఉన్న ఆయుధాలు మరియు రక్షణ పరికరాల నిర్వహణ కోసం విడిభాగాలు, భాగాలు, శకలాలు కూర్పులు మరియు ఇతర ఉత్పత్తుల యొక్క ఉమ్మడి తయారీ ని ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రక్రియ ను ఇంకా ముందుకు తీసుకు పోవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
39. ఇరు పక్షాలు కూడా తమ సాయుధ దళాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత అభివృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితుల ను సృష్టించాలని ఆకాంక్షించాయి. అదే విధం గా సాయుధ దళాలకు లాజిస్టిక్స్ పరమైన మద్దతు ను మరియు సేవల ను అందించడానికి సంస్థాగత ఏర్పాటు నెలకొనవలసిన అవసరాన్ని గుర్తించాయి. పరస్పర లాజిస్టిక్స్ మద్దతు పై సహకారం కోసం ఒక ఫ్రేంవర్క్ ను సిద్ధం చేయడానికి అంగీకరించాయి.
40. ఇరు పక్షాలు కూడా సైనిక స్థాయి, రాజకీయ స్థాయి సంభాషణలు, సైన్యాల సంయుక్త విన్యాసాలు, సిబ్బంది మధ్య చర్చ లు, పరస్పర సహకారాని కి అంగీకారం కుదిరిన క్షేత్రాల లో ఒక దేశాని కి చెందిన సైనిక సంస్థల లో మరొక దేశాని కి చెందిన సైనికుల కు శిక్షణ ను అందించడం, శిక్షణ ను అందుకోవడం వంటి కార్యకలాపాల ద్వారా సైన్యానికి సైన్యానికి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి వాటి నిబద్ధత ను పునరుద్ఘాటించాయి. ఈ సంవత్సరం, రెండో సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు ‘ఐఎన్ డిఆర్ఎ-2019’ని భారతదేశం లో నిర్వహించనున్న సంగతి ని ఇరు పక్షాలు ఈ సందర్భం లో ప్రస్తావించుకొన్నాయి.
41. రెండు పక్షాలు కూడా తమ ద్వైపాక్షిక సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం అమలు ను ప్రశంసించాయి. ఇది రెండు దేశాల ప్రజల ను ఏకతాటి పైకి తీసుకు రావడానికి నేరు గా సహాయపడుతుంది. భారతదేశం లో రష్యన్ సంస్కృతి మరియు రష్యా లో భారతీయ సంస్కృతి యొక్క పరస్పర ఉత్సవాల ను విజయవంతం గా కొనసాగించడానికి అంగీకారం వ్యక్తం అయింది. అలాగే భారతదేశం లో రష్యన్ చలన చిత్రోత్సవాలు మరియు రష్యా లో భారతీయ చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. 2019వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ నుండి 28 వ తేదీ వరకు, గోవా లో జరగనున్న 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో భాగస్వామి దేశం గా రష్యా ఉండడాన్ని రెండు పక్షాలు స్వాగతించాయి. సాంస్కృతిక మార్పిడి యొక్క భౌగోళిక విస్తరణ మరియు యువత మరియు జానపద కళా సమూహాల యొక్క అధిక ప్రమేయం మరియు భారతదేశం లో రష్యన్ భాష ను మరియు రష్యా లో హిందీ ని సమగ్రం గా ప్రోత్సహించడానికి, సంబంధిత విద్యా సంస్థల మధ్య పరిచయాల ను అభివృద్ధి పరచడం కూడా అవసరమని అంగీకరించడమైంది.
42. విద్య రంగం లో తమ సహకారం తీవ్రతరం కావడాన్ని కూడా ఇరు పక్షాలు స్వాగతించాయి. విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాల ను ప్రోత్సహించడాన్ని ఇరు పక్షాలు కొనసాగిస్తాయి. ఒక దేశ విద్యార్హత ధ్రువపత్రాల కు మరొక దేశం గుర్తింపు ను ఇవ్వడానికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు ఈ దిశ లో ఎంతో ప్రేరణను ఇవ్వగలవు. ఒప్పందాల రూపకల్పన కు సంబంధించిన పనుల ను వేగవంతం చేయాలని కూడా రెండు పక్షాలు అంగీకరించాయి.
43. భారతదేశ గణతంత్రం యొక్క రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క సంస్థ ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యత ను ఇరు పక్షాలు నొక్కిచెప్పాయి మరియు వాటి మంత్రిత్వ శాఖ ల సమన్వయం తో వారి మధ్య ఒక ఫోరమ్ నిర్వహించాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించాయి. భారతదేశ రాష్ట్రాలు మరియు రష్యా ప్రాంతాల మధ్య సాంస్కృతిక మరియు వ్యాపార కార్యకలాపాల మార్పిడి ని ఏర్పాటు చేయడానికి రెండు పక్షాలూ అంగీకరించాయి. ఇప్పటికే ఉన్న సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి మరియు క్రొత్త వాటిని సృష్టించడానికి జంట నగరాల ఫార్మాట్ ను మరింతగా అభివృద్ధిపరచడానికి అంగీకరించడమైంది.
44. భారతదేశం-రష్యా పర్యాటక సంబంధాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాక ప్రత్యేకమైన మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, పరస్పర అవగాహన ను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రంగం లో సహకారాన్ని మరింత గా పెంపొందించుకోవడాన్ని కొనసాగించాలని రెండు పక్షాలూ అంగీకరించాయి.
45. ఇరు పక్షాలూ కూడా వీసా లాంఛనాల యొక్క ప్రగతిశీల సరళీకరణ ను, ప్రత్యేకించి, రష్యన్ పౌరుల కు వ్యాపార ప్రయోజనాలు ఇంకా
పర్యాటక ప్రయోజనాల కోసం ఇ-వీజ సౌకర్యం యొక్క వ్యవధి ని మరింతగా అంటే ఒక సంవత్సరానికి పొడిగించడం మరియు కాలినిన్ గ్రాడ్ ప్రాంతాన్ని, వ్లాదివోస్తోక్ ను సందర్శించడానికి భారతీయ పౌరుల కు ఉచిత ఇలెక్ట్రానిక్ వీజలను ప్రవేశపెట్టడం వంటి చర్య లను స్వాగతించడం జరిగింది. భవిష్యత్తు లో కూడా వీజ ల సరళీకరణ పని ని కొనసాగించడానికి అంగీకరించడమైంది.
46. మన దేశాల మధ్య ఐరాస తో సహా ఉన్నత స్థాయి లో రాజకీయ సంభాషణ లు ఇంకా సహకారం చోటు చేసుకొంటుండడాన్ని రెండు పక్షాలు గుర్తించాయి. ఈ ప్రక్రియ ను మరింత బలోపేతం చేయడానికి అంగీకరించాయి.
47. ప్రపంచ వ్యవహారాల లో ఐక్య రాజ్య సమితి యొక్క కేంద్ర సమన్వయ పాత్ర తో సహా బహుపాక్షికత ను మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్నిఇరు పక్షాలూ నొక్కి చెప్పాయి. అంతర్జాతీయ చట్టం యొక్క ప్రాముఖ్యత ను మరియు సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల లో జోక్యం చేసుకోవటానికి అనుమతించబడక పోవడంతో సహా యుఎన్ చార్టర్ లో పేర్కొన్న ప్రయోజనాలు మరియు సూత్రాల కు వాటి నిబద్ధత ను పునరుద్ఘాటించాయి.
48. స్వచ్ఛం గా అంతర్జాతీయం గా గుర్తించబడిన సూత్రాలు మరియు అంతర్జాతీయ చట్టాల ను మంచి విశ్వాసం తో అమలు చేయడం తో పాటు ద్వంద్వ ప్రమాణాల అభ్యాసాన్ని లేదా కొన్ని దేశాలు తమ ఇష్టాల్ని ఇతర దేశాల పై విధించడాన్ని మినహాయించాలనే అభిప్రాయాన్ని ఇరు పక్షాలు పంచుకొన్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రాతిపదిక గా కాకుండా ఏకపక్షంగా బలవంతపు చర్యల ను విధించడం అనేది ఇటువంటి అభ్యాసాని కి ఒక ఉదాహరణ గా పరిగణిస్తున్నాయి.
49. సమకాలీన ప్రపంచ వాస్తవికతల ను ప్రతిబింబించేలా యుఎన్ఎస్ సి యొక్క సంస్కరణ చోటు చేసుకోవాలని, అది అంతర్జాతీయ శాంతి భద్రత ల సమస్యల తో వ్యవహరించడం లో మరింత ప్రాతినిధ్యం కలిగివుండడం తో పాటు, సమర్థవంతంగా, ప్రావీణ్యం కలిగిందిగా ఉండాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి.
50. సంస్కరణ చోటు చేసుకోవలసివున్న యుఎన్ భద్రత మండలి లో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం అభ్యర్థిత్వాని కి రష్యా తన మద్దతు ను కొనసాగిస్తుంది.
51. బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్)లో బహుళ రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న తమ నిబద్ధత ను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. 2019వ సంవత్సరం నవంబర్ లో బ్రెజిల్ లో జరిగే 11వ బ్రిక్స్ శిఖర సమ్మేళనం విజయవంతం కావడానికి పూర్తి మద్దతు ను అందించడానికి అంగీకారం తెలిపాయి.
52. శంఘాయి సహకార సంస్థ (ఎస్ సిఒ) యొక్క ప్రభావ శీలత ను మరియు గొప్ప సామర్థ్యాన్ని భారతదేశం, రష్యా ఏకగ్రీవం గా గుర్తించాయి. సమానమైనటువంటి మరియు విభజించడానికి వీలు కానటువంటి భద్రత ప్రాతిపదిక గా ఉండే బహుళ ధ్రువ ప్రపంచ క్రమం లో ముఖ్యమైన స్తంభం గా ఈ సంస్థ ను మరింత బలోపేతం చేయడానికి, 2019-2020లో రష్యా యొక్క ఎస్ సిఓ అధ్యక్షత తాలూకు ఫ్రేమ్ వర్క్ తో సహా భారతదేశం, రష్యా తమ పరస్పర చర్యల ను పెంచుతాయి.
53. ఉగ్రవాదం, తీవ్రవాదం, మాదక పదార్థాల రవాణా, సీమాంతర వ్యవస్థీకృత నేరాల నిరోధం తో పాటు సమాచార భద్రత కు ముప్పు ల నివారణ చర్యల ను మరింత ప్రభావవంతం చేయడం పై ప్రత్యేకం గా దృష్టి ని సారించాలని ఉభయ పక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు ముఖ్యం గా శంఘాయి సహకార సంస్థ (ఎస్ సిఒ) ప్రాంతీయ ఉగ్రవాద నిరోధ వ్యవస్థ పనితీరు ను మెరుగుపరచాలని నిశ్చయించాయి.
54. ఎస్ సిఒ లో అంతర్గత ఆర్థిక సహకార విస్తరణ ను ప్రోత్సహించాలని ఉభయ పక్షాలు నిర్ణయించాయి. ప్రధానం గా ప్రయాణ- రవాణా, మౌలిక సదుపాయాలు, శాస్త్ర-సాంకేతిక- నూతన ఆవిష్కరణ రంగాల లో సహకారాన్ని విస్తరించుకోవాలని నిశ్చయించాయి. తద్వారా యూరేశియన్ ప్రాంతం లో మరింత పెద్దదైన, సమానమైన, సార్వత్రికమైన, పరస్పర ప్రయోజనకరం కాగలిగిన సహకారం రూపొందుతుందని ఆశిస్తున్నాయి. అంతేకాకుండా ఎస్ సిఒ లో సాంస్కృతిక, మానవతావాద సంబంధాల ను మరింత ముందుకు తీసుకుపోవడం పై కృత నిశ్చయం తో ఉన్నట్లు ప్రకటించాయి.
55. అంతర్జాతీయ వ్యవహారాల లో ఎస్ సిఒ పాత్ర పెరగాలని ఉభయ పక్షాలు ఆకాంక్షిస్తున్నాయి. అలాగే ఐక్య రాజ్య సమితి, దాని పరిధి లోని ప్రత్యేక సంస్థలు అయినటువంటి సిఎస్ టిఒ, సిఐఎస్, ఏశియాన్ తదితర బహుపాక్షిక సంస్థ ల తో, సంఘాల తో సంబంధాల ను సమగ్రం గా విస్తరించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ సిఒ, యూరేశియన్ ఎకనామిక్ యూనియన్ ల మధ్య అధికార సంబంధాలు నెలకొల్పే ప్రతిపాదన కు ఉభయ పక్షాలు మద్దతు పలికాయి.
56. అంతర్జాతీయ చట్టాల కు కట్టుబాటు, రక్షణాత్మకత విస్తరణ తో పాటు ఏక పక్ష ఆంక్షల నిరోధం, ఉగ్రవాదం పై పోరు, ఇతరత్రా కొత్త ముప్పులు- సవాళ్లపై దృష్టి సారిస్తూ ప్రపంచ, ప్రాంతీయ చర్చనీయాంశాల్లో ప్రధానమైన వాటి పరిష్కారం దిశ గా నిరంతర సామూహిక విధానాల ను ప్రోత్సహించడం సహా ఆర్ఐసి ఫ్రేం వర్క్ పరిధి లో సహకారాన్ని ముమ్మరం చేసేందుకు ఉభయ పక్షాలు సంసిద్ధత ను ప్రకటించాయి. తదనుగుణం గా ఈ పద్ధతి లో దేశాల/ప్రభుత్వాల అధినేత లు, విదేశాంగ మంత్రులు.. అవసరమైతే ఇతర సంస్థ ల అధిపతుల స్థాయి లో నిరంతర సమావేశాల నిర్వహణ ను చేపడతామని పేర్కొన్నాయి.
57. కీలక అంతర్జాతీయ సమస్యల సత్వర పరిష్కారాని కి వీలు కల్పిస్తూ జి-20 దేశాల కూటమి లోనే కాకుండా ఇతర అంతర్జాతీయ వేదికలలోనూ సమన్వయం పెంపునకు తాము అంగీకరించినట్లు దేశాధినేతలు పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ, పరస్పర ప్రయోజనాల కు సంబంధించిన అంశాల పై జి-20 కూటమి తో పాటు అంతర్జాతీయ వేదికలలోనూ సహకార విస్తృతి కి తమ కట్టుబాటు ను ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి.
58. ప్రపంచవ్యాప్తం గా అన్ని రూపాలలో గల ఉగ్రవాదాన్ని దేశాధినేతలు ఇరువురు తీవ్రం గా ఖండించారు. ఈ పీడ ను నిర్మూలించడం కోసం అంతర్జాతీయ సమాజం ఐక్యవేదిక ను రూపొందించాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిరోధం, నిర్మూలన లకై సకల చర్య లు తీసుకోవడం లో తమ కట్టుబాటు ను పునరుద్ఘాటించారు. బిశ్కెక్ లో ఎస్ సిఒ దేశాధినేతల మండలి సమావేశం సందర్భం గా చేసిన తీర్మానం పై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం లో ద్వంద్వ ప్రమాణాల తో పాటు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద బృందాల ను వాడుకోవడం ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధం పై అంతర్జాతీయ సహకారం ఫ్రేంవర్క్ పరిధి లో అన్ని దేశాల మధ్య సమన్వయం పెరగాలని దేశాధినేతలు ఇద్దరూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లో భాగం గా సమాచార- వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగ నిరోధం దిశ గానూ పోరు బలోపేతం చేయాలని కోరారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక రూపాల లో ఉగ్రవాద నిరోధాని కి తమ సహకారాన్ని మరింత పెంచడానికి వారు అంగీకారం తెలిపారు. దీనికి అనుగుణం గా అంతర్జాతీయ ఉగ్రవాదం పై సమగ్ర తీర్మానాన్ని సత్వరం ఖరారు చేయాలని కోరారు. మూడు ఐక్య రాజ్య సమితి తీర్మానాల నిర్దేశాలు ప్రాతిపదిక గా రూపొందిన ప్రస్తుత అంతర-దేశ మాదకద్రవ్య నియంత్రణ వ్యవస్థను కట్టుదిట్టం చేయడంపై పరస్పర కట్టుబాటు ను వారు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం పడగ నీడ పడని దేశం నేడు ప్రపంచం లో ఏదీ లేదని స్పష్టం గా ప్రకటించారు. ఉగ్రవాద నిరోధాని కి తమ కృషి ని భారతదేశం, రష్యా లు ఏకీకృతం చేయవలసివుందని అంగీకరించారు. ఈ నేపథ్యం లో అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ఏర్పాటు కు భారతదేశం ప్రతిపాదన ను రష్యా సమర్థించింది.
59. ప్రధానం గా ఐక్య రాజ్య సమితి సహా బహుపాక్షిక, ప్రత్యేక బహుపాక్షిక వేదికల మీద సమాచారం, సాంకేతిక విజ్ఞానాల (ఐసిటి) వినియోగం లో భద్రత దిశ గా సహకారం పై మన దేశాల మధ్య పరస్పర సంభాషణల స్థాయి ని ఉభయపక్షాలు ప్రశంసించాయి. 2018వ సంవత్సరం డిసెంబరు లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 73వ సమావేశం చర్చల కు అనుగుణం గా ఆయా దేశాల బాధ్యతాయుత వ్యవహార శైలి పై కొన్ని అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు, పద్ధతుల తో కూడిన విధానం ఆమోదించినట్లు గుర్తుచేశాయి. దీని పై విస్తృత చర్చల అనంతరం నేరపూరిత చర్యల కు ఐసిటి ల వినియోగాన్ని నిరోధించడం సహా భద్రత దిశ గా తీసుకోవలసిన చర్య లు శ్రీకారం చుట్టుకున్నాయి.
60. ఐసిటి ల వినియోగం లో భద్రత రంగాని కి సంబంధించి బ్రిక్స్ దేశాల మధ్య సహకార ఫ్రేంవర్క్ ఏర్పాటు అవసరాన్ని ఉభయపక్షాలు నొక్కి పలికాయి. సభ్యత్వ దేశాల్లోని సంఘాల మధ్య అంతరప్రభుత్వ ఒప్పందాల సత్వర ఖరారు కూడా ఇందులో భాగం కావాలని ఆకాంక్షించాయి.
61. ఐసిటి ల వినియోగానికి భద్రత కల్పన లో రెండు దేశాల విధానాల్లో పోలిక ను ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. అదే సమయం లో ఐసిటి ల వినియోగం లో భద్రత పై భారతదేశం, రష్యా అంతరప్రభుత్వ ఒప్పందం అమలు ద్వారా అంతర-సంస్థల మధ్య ద్వైపాక్షిక ఆచరణాత్మక సహకారం బలోపేతాని కి సంసిద్ధత ప్రకటించాయి.
62. ఐసిటి ల వినియోగం లో భద్రత పై 2019-20 సంవత్సరానికిగాను భారతదేశం, రష్యా ల మధ్య సహకారం లో ప్రధాన నిర్దేశాల అమలు ప్రణాళిక కు తగినట్లు ద్వైపాక్షిక సహకార విస్తృతి కి అనుగుణమైన చర్యల ను తీసుకోవాలని వారు నిశ్చయించారు. అంతర్జాతీయ భద్రత పర్యావరణం మెరుగుదలకు ఉద్దేశించిన కృషి ని కొనసాగించవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు నొక్కిపలికాయి. అలాగే ప్రపంచ దేశాల ప్రయోజనాల ను, సమస్యల ను పరిగణన లోకి తీసుకుంటూ, అన్నిటికీ సమాన- అవిభాజ్య భద్రత సూత్రం ప్రాతిపదిక న నిరంతర శాంతి స్థాపన కు భరోసా ఇచ్చేలా అంతర్జాతీయ-ప్రాంతీయ సుస్థిరత ను, దేశాల మధ్య పరస్పర విశ్వాస స్థాయి ని పెంచడంపై దృష్టి సారించి నిరంతరాయం గా కృషి చేస్తామని ప్రకటించాయి.
63. జాతీయ భద్రత మండలి సచివాలయాని కి, రష్యా సమాఖ్య భద్రత మండలి కి మధ్య అన్నిస్థాయి ల భద్రత సమస్యల పై సమన్వయం కోసం ముమ్మర సంప్రదింపుల కు ఉభయ పక్షాలు అంగీకారాని కి వచ్చాయి.
64. అంతరిక్షం లో ఆయుధ పోటీ పెచ్చరిల్లే అవకాశాలు ఉన్నందున అంతరిక్షం కూడా ఒక సైనిక ఘర్షణ ల రంగం గా మారిపోగలదని ఉభయ పక్షాలు ఆందోళన ను వ్యక్తం చేశాయి. అంతరిక్షం లో ఆయుధ పోటీ నిరోధం (పిఎఆర్ఒఎస్) ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రత లకు గల అత్యంత ప్రమాదకర ముప్పు ను తప్పించవచ్చునని, ఈ దిశ గా తమ కృషి ని కొనసాగించాలని నిర్ణయించామని పునరుద్ఘాటించాయి. శాంతియుత ప్రయోజనాల కు అంతరిక్ష వినియోగంపై అంతర్జాతీయ చట్టబద్ధ ఒప్పందాల కు కఠినం గా కట్టుబడటానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఉభయ పక్షాలు నొక్కి పలికాయి. అదే కాలం లో అంతర్జాతీయ శాంతి కి, సుస్థిరత కు చేయూతసహా అంతర్జాతీయ సహకారాని కి ప్రోత్సాహం, పరస్పర అవగాహనల కు తోడ్పడతామని పునరుద్ఘాటించాయి.
65. భూ కక్ష్య లో ఎటువంటి ఆయుధాల ను మోహరించకుండా విశ్వసనీయమైన హామీ ని ఇచ్చేలా బహుపాక్షిక సంప్రదింపుల తో కూడిన చట్టబద్ధమైన ఒప్పందం రూపకల్పన కు మద్దతిస్తామని ఉభయ పక్షాలు ప్రకటించాయి. అంతరిక్షం లో ఆయుధ పోటీ ని అన్న విధాలా నిరోధించే దిశ గా అంతర్జాతీయ ఒప్పందం (లేక ఒప్పందాలు) కుదుర్చుకోవడంపై బహుపాక్షిక సంప్రదింపులు చేపట్టగల ఏకైక వేదిక నిరాయుధీకరణ సదస్సేనని కూడా పునరుద్ఘాటించాయి.
66. అంతరిక్షం లో ఆయుధ పోటీ నిరోధం (పిఎఆర్ఒఎస్)లో చట్టబద్ధ కట్టుబాటు దిశ గా సార్వత్రిక, విచక్షణరహిత, ఆచరణాత్మక పారదర్శక, విశ్వాస కల్పన చర్యలు సహాయక పాత్ర పోషించడం పై ఉభయపక్షాలు అంగీకారానికి వచ్చాయి.
67. జీవ, విష ఆయుధాలపై సదస్సు (బిటిడబ్ల్యుసి) ఒడంబడిక ను బలోపేతం చేసే ప్రతిపాదన ను ఉభయ పక్షాలు సమర్థించాయి. అలాగే దీనికి అనుగుణం గా అంతర్జాతీయ, విచక్షణ రహిత, ప్రభావవంతమైన తనిఖీ యంత్రాంగం ఏర్పాటు పై తీర్మానాన్ని చేపట్టాలని ఆకాంక్షించాయి. అయితే, ఐక్య రాజ్య సమితి భద్రత మండలి కి ఆందోళన కలిగించే చర్యలుసహా బిటిడబ్ల్యుసి విధుల ను సంబంధిత యంత్రాంగాలు ఏవీ అనుసరించ కూడదని పునరుద్ఘాటించాయి.
68. రసాయన ఆయుధ సదస్సు (సిడబ్ల్యుసి) తీర్మాన నిబంధనల ను ప్రభావ వంతం గా అమలు చేయడం లో రసాయన ఆయుధ నిషేధ సంస్థ (ఒపిసిడబ్ల్యు) ఇప్పటిదాకా చేసిన కృషి ని అభినందిస్తూ సదరు సంస్థ కు ఉభయ పక్షాలు మద్దతు ను పునరుద్ఘాటించాయి. అంతేకాకుండా సిడబ్ల్యుసి పాత్ర ను సంరక్షించే కృషి ని, చర్యల ను సమర్థించడం లో, ఒపిసిడబ్ల్యు కార్యకలాపాల పై రాజకీయాల నిరోధం లో తమ దృఢ నిశ్చయాన్ని కూడా పునరుద్ఘాటించాయి. సిడబ్ల్యుసి సదస్సు పవిత్రత, సమగ్రత ల పరిరక్షణ కోసం ఏకాభిప్రాయ స్ఫూర్తి ని కొనసాగించేనిర్మాణాత్మక చర్చలు, సంప్రదింపుల విషయం లో సిడబ్ల్యుసి లోని సభ్యత్వ దేశాలు ఏకతాటి పైన నిలవాలని పిలుపునిచ్చాయి.
69. రసాయనిక ఆయుధాల, జీవాయుధాల ఉగ్రవాదపు ముప్పు ను ఎదుర్కొనడం లో భాగంగా అటువంటి దుశ్చర్య ల అణచివేత పై నిరాయుధీకరణ సదస్సు లో అంతర్జాతీయ తీర్మానం చేయడం గురించి బహుపాక్షిక సంప్రదింపుల ను చేపట్టవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు స్పష్టీకరించాయి.
70. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని మరింత బలోపేతం చేయడం పై తమ కట్టుబాటు ను ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. అదే కాలం లో పరమాణు సరఫరా దేశాల కూటమి లో భారతదేశం సభ్యత్వం ప్రతిపాదన కు బలమైన మద్దతునిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
71. అఫ్గానిస్తాన్ లో సార్వజనీన శాంతి సాధన కోసం అఫ్గాన్ నేతృత్వాన, అఫ్గాన్ స్వీయ సమన్వయానికి సాగే కృషి కి భారతదేశం, రష్యా మద్దతు ప్రకటించాయి. అఫ్గానిస్తాన్ సమస్య కు సత్వర శాంతియుత పరిష్కారం దిశ గా తమ కట్టుబాటు ను ఉభయ పక్షాలు స్పష్టం గా వెల్లడించాయి. ఎస్ సిఒ- అఫ్గానిస్తాన్ సంప్రదింపుల బృందం, ఇతర అంతర్జాతీయ గుర్తింపు గల విధానాల కు నిరంతర సహకారం ద్వారా ఈ లక్ష్య సాధన కు నిరంతర సహకారాన్ని అందిస్తామని దృఢ నిశ్చయాన్ని ప్రకటించాయి. అదే విధం గా 2019 ఫిబ్రవరి లో మాస్కో లో మొదలైన అఫ్గాన్ అంతర్గత చర్చల కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నాయి. తదనుగుణం గా అఫ్గానిస్తాన్ పై ముమ్మర సంప్రదింపులు కొనసాగిస్తామని ప్రకటించాయి. అఫ్గానిస్తాన్ లో విస్తృత ప్రాతిపదిక న శాంతి ప్రక్రియ కు, రాజ్యంగ క్రమం పరిరక్షణ కు, నిరంతర శాంతి సాధన కు, తద్వారా అఫ్గానిస్తాన్ ను శాంతియుత, సురక్షిత, సుస్థిర, స్వతంత్ర దేశం గా రూపుదిద్దడానికి తమ వంతు కృషి చేయడం లో ఆసక్తి చూపుతున్న దేశాలన్నిటినీ ప్రోత్సహిస్తామని ప్రకటించాయి. ఏది ఏమైనా ఆ దేశం లో హింస కు తక్షణం స్వస్తి పలకాలని భారతదేశం, రష్యా పిలుపునిచ్చాయి.
72. సిరియా లో పరిస్థితులు స్థిరత్వం దిశ గా మెరుగుపడటంపై ఉభయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భం గా సిరియా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రత ను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణించాయి. తదనుగుణం గా సిరియా సంక్షోభాన్ని, విశేషించి రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించడానికి కృషి సాగాలని అభిలషించాయి.
73. ఐక్య రాజ్య సమితి నిర్వచనాని కి అనుగుణం గా సిరియా లోని ఉగ్రవాద సంస్థ ల నిర్మూలన పోరాటానికి గల ప్రాముఖ్యాన్ని ఉభయ పక్షాలు నొక్కి పలికాయి. ఆ మేరకు శరణార్థుల, తాత్కాలిక నిరాశ్రయుల పునరాగమనానికి అనువైన పరిస్థితుల కల్పన సహా దేశ పునర్నిర్మాణం కోసం సిరియా కు అందిస్తున్న సహయాన్ని మరింత పెంచేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. అదే కాలం లో అంతర్జాతీయ మానవతావాద సహాయం పై ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశ తీర్మానం 46/182 నిర్దేశిస్తున్న సూత్రావళి కి కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి. మానవతావాద సహాయాని కి నిర్దేశించిన పరామితుల నిర్దేశం సందర్భం గా బాధిత దేశ సార్వభౌమాధికారాని కి సముచిత గౌరవం లభించేలా ఈ తీర్మానం కీలక పాత్ర ను పోషిస్తుంది.
74. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రత, సుస్థిరతల కు భరోసా కల్పించవలసిన నేపథ్యం లో ఇరాన్ పరమాణు కార్యక్రమం పై సంయుక్త-సమగ్ర కార్యాచారణ ప్రణాళిక (జెసిపిఒఎ)ను సంపూర్ణం గా, ప్రభావవంతం గా అమలు చేయడానికి గల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. ఇందులో భాగం గా ఐక్య రాజ్య సమితి భద్రత మండలి తీర్మానం 2231కి తమ పూర్తి స్థాయి కట్టుబాటు ను పునరుద్ఘాటించాయి. సంబంధిత సమస్యలన్నిటినీ చర్చల ద్వారా శాంతియుతం గా పరిష్కరించవలసి ఉందని స్పష్టం చేశాయి. అలాగే ఇరాన్ తో పరస్పర ప్రయోజనం, చట్టబద్ధత గల ఆర్థిక-వాణిజ్య సహకారాన్ని కొనసాగిస్తామంటూ ఉభయ పక్షాలలు కృత నిశ్చయాన్ని ప్రకటించాయి.
75. పరమాణు ఆయుధ రహిత కొరియా ద్వీపకల్పం లో శాశ్వత శాంతి-సుస్థిరత సాధన ను అభిలషించే అన్ని దేశాల మధ్య నిరంతర శాంతియుత చర్చలకు గల ప్రాముఖ్యం గురించి ఉభయ పక్షాలు నొక్కి పలికాయి. ఈ లక్ష్యాన్ని అందుకునే విధం గా అన్ని పక్షాలు కలసికట్టు గా కృషి చేయాలని విజ్ఞప్తి చేశాయి.
76. తృతీయ ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి మధ్య, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంత దేశాల లో పరస్పర సహకారం, ప్రయోజనాల లబ్ధి కి వీలు ఉన్న రంగాల పై అన్వేషణ కు ఉభయ పక్షాలు అంగీకరించాయి.
77. పారదర్శకమూన, విచక్షణరహితమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పరిరక్షణ లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) పాత్ర ను బలోపేతం చేయడం తో పాటు పరిరక్షించుకోవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. ఆ మేరకు సముచిత, సార్వత్రిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను రూపొందించేందుకు కలసి పనిచేయాలని రెండు పక్షాలు నిర్ణయించాయి.
78. సుస్థిర సామాజిక- ఆర్థిక ప్రగతి సాధన, 2030 కార్యాచరణ ప్రణాళిక అమలు దిశ గా ప్రాంతీయ సహకార విస్తరణ కు గల ప్రాముఖ్యాన్ని ఉభయ పక్షాలు నొక్కి పలికాయి. ఐక్య రాజ్య సమితి ఆసియా-పసిఫిక్ ప్రాంత ఆర్థిక-సామాజిక కమిషన్ చట్రం పరిధి లో రవాణా, ఇంధనం, వాణిజ్యం ల వంటి కీలక రంగాల పురోగమనానికి సహకారాన్ని విస్తరించుకోవడం కూడా ఇందులో భాగం గా ఉంటుంది.
79. ఆసియా-పసిఫిక్ ప్రాంతం లో సమాన, అవిభాజ్య భద్రత వ్యవస్థ రూపకల్పన పై ఉభయ పక్షాలు వాటి కట్టుబాటు ను పునరుద్ఘాటించాయి. ఈ అంశం పై తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ఇతర ప్రాంతీయ వేదికలు రూపొందించిన చట్రం పరిధి లో బహుళపక్ష చర్చల ను ప్రోత్సహించడానికి మద్దతు ప్రకటించాయి. ప్రాంతీయ వ్యవస్థ బలోపేతానికి ఉద్దేశించిన కార్యక్రమాలు బహుపాక్షికత, నిష్కాపట్యం, సార్వజనీనత, పరస్పర గౌరవం వంటి సూత్రావళి ప్రాతిపదిక గా ఉండటం తో పాటు ఏ దేశాని కి కూడాను వ్యతిరేకం కారాదన్న విషయం లో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ విషయం లో భాగస్వాములు గా బృహత్ యూరేశియా సహా హిందూ- పసిఫిక్ మహాసముద్ర ప్రాంత దేశాల సమగ్రత, అభివృద్ధి కార్యకలాపాల పరిపూర్ణత పై చర్చలు ముమ్మరం చేయడానికి భారతదేశం, రష్యా అంగీకరించాయి.
80. విదేశాంగ విధాన ప్రాథమ్యాల లో రెండు దేశాల మధ్య గణనీయ సారూప్యం పై ఉభయ పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. ఆ మేరకు ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాల తో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కార కృషి నేపథ్యం లో భారతదేశం, రష్యా ల ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి గల ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. భారతదేశం, రష్యా ల ప్రజల ప్రయోజనార్థం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, విస్తరణ పై పరస్పర ఆసక్తి ని ప్రకటించాయి.
81. వ్లాదివోస్తోక్ లో తనకు, తన ప్రతినిధి బృందాని కి అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే సంవత్సరం లో భారతదేశం- రష్యా 21వ వార్షిక శిఖర సమ్మేళనం లో పాల్గొనేందుకు భారతదేశానికి రావలసిందంటూ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ను శ్రీ మోదీ ఆహ్వానించారు.
*************